బిజినెస్

మొక్కజొన్న దిగుబడిలో ఆంధ్ర అగ్రగామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 25: ప్రపంచవ్యాప్తంగా ఆహారపు అలవాట్లలో మార్పు రావటంతో మొక్కజొన్న వినియోగం పెరిగింది. మొక్కజొన్న దిగుబడిలో ఆంధ్రప్రదేశ్.. దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఎపిలో మొక్కజొన్న హెక్టారుకు సగటు దిగుబడి 6,523 కిలోలు. ఇది జాతీయ సగటు దిగుబడి (2,498 కిలోలు) కంటే 4,025 కిలోలు ఎక్కువ. ఇక హెక్టారుకు 5,564 కిలోల సగటు దిగుబడితో తమిళనాడు ద్వితీయ స్థానంలో, 4,370 కిలోలతో పశ్చిమ బెంగాల్ తృతీయ స్థానంలో ఉన్నాయి. కాగా, ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాలవారీగా పరిశీలిస్తే సగటు దిగుబడి 10,643 కిలోలతో గుంటూరు మొదటి స్థానంలో ఉంది. 2,379 కిలోల దిగుబడితో విశాఖపట్నం జిల్లా చివరి స్థానంతో సరిపెట్టుకుంది. మిగిలిన జిల్లాలను చూస్తే శ్రీకాకుళం 4,595 కిలోలు, విజయనగం 4,720 కిలోలు, తూర్పుగోదావరి 3,532 కిలోలు, పశ్చిమ గోదావరి 8,761 కిలోలు, కృష్ణా 6,582 కిలోలు, కర్నూలు 4,146 కిలోలు, అనంతపురం 3,395 కిలోలు, వైఎస్‌ఆర్ కడప 5,082 కిలోలు, చిత్తూరు జిల్లాలో 3,762 కిలోల మొక్కజొన్న దిగుబడి వచ్చింది.
ప్రపంచంలోని ఏ దేశానికి తీసిపోని విధంగా మన రాష్ట్ర రైతులు మొక్కజొన్న దిగుబడులు సాధిస్తున్నారు. చైనాలో హెక్టారుకు మొక్కజొన్న సగటు దిగుబడి ఆరు టన్నులు మాత్రమే. మన రాష్ట్రంలో రబీలో హెక్టారుకు మొక్కజొన్న సగటు దిగుబడి 7,913 కిలోలు. దిగుబడులు పెంచుకోవడానికి అవకాశం ఉన్న వాటిలో మొక్కజొన్న పంటకు మించినది మరొకటి లేదు. సి-4 తరగతికి చెందిన ఈ పంట సూర్యరశ్మిని, గాలిలో, భూమిలో తేమని, భూసారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని దిగుబడి ఎక్కువగా ఇస్తుంది. అన్ని ప్రాంతాలలో, భిన్న వాతావరణ పరిస్థితులలోనూ తక్కువ నీటితో పండించే పంట ఇది. అంతేగాకుండా ఈ పంట స్వల్పకాలంలో చేతికి వస్తుంది. ప్రొటీన్ మొక్కజొన్న తీపి మొక్కజొన్నలలో మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి. మొక్కజొన్నతో బేబీకార్న్, స్వీట్ కార్న్ తయారు చేస్తారు. దీని పిండిని ఫాస్ట్ఫుడ్‌లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో పీచు పదార్థంతోపాటు పోషక విలువలు ఎక్కువ. తీపి మొక్కజొన్నను ఆల్కాహాల్ తయారీలో వినియోగిస్తారు. మొక్కజొన్నలను తిండి గింజలుగానే కాకుండా పశుగ్రాసం, కోళ్లదాణాగా కూడా వినియోగిస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొక్కజొన్న విస్తీర్ణాన్ని, ఉత్పత్తిని, దిగుబడిని ఇంకా పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రభుత్వం కూడా మొక్కజొన్న పండించే రైతులకు తగిన ప్రోత్సాహకాలు ఇస్తోంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) రాష్ట్రంలో రెండు లక్షల 31 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేశారు. 15 లక్షల పదివేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయింది. ఈసారి (2016-17) సాగు విస్తీర్ణాన్ని మూడు లక్షల మూడు వేల హెక్టార్లకు పెంచాలని ప్రతిపాదించారు. 22 లక్షల 28 వేల మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించారు. లక్ష్యసాధన కోసం రైతులకు తగిన సూచనలను వ్యవసాయ శాఖ ఇస్తుండగా, ప్రభుత్వం పావలా వడ్డీకి, అసలు వడ్డీ లేకుండా కూడా రుణాలు పొందే అవకాశం కల్పించింది.