బిజినెస్

ఆరో పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 11: భారత్ ఫ్రాన్స్‌ను ఏడో స్థానంలోకి నెట్టి ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2017 సంవత్సరానికి ప్రపంచ బ్యాంకు సేకరించిన గణాంకాల ప్రకారం భారత్ ఈ ఘనత సాధించింది. 2017 సంవత్సరాంతం నాటికి భారత్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2.597 ట్రిలియన్ డాలర్లు కాగా, ఫ్రాన్స్ జీడీపీ 2.582 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్థిక విధానాల కారణంగా పలు త్రైమాసికాల పాటు మందగించిన భారత ఆర్థిక వ్యవస్థ 2017 జూలై నుంచి తిరిగి బలంగా పుంజుకుంది. 1.34 బిలియన్ జనాభాతో భారత్ జనాభా రీత్యా ప్రపంచంలోనే అతి పెద్ద దేశంగా అవతరించడానికి చేరువలో ఉండగా, ఫ్రాన్స్‌లో కేవలం 67 మిలియన్ మందే ఉన్నారు. అందువల్ల భారత్ తలసరి జీడీపీతో పోలిస్తే ఫ్రాన్స్ తలసరి జీడీపీ సుమారు 20 రెట్లు ఎక్కువగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2016 చివరలో ప్రధాని నరేంద్ర మోదీ అకస్మాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాటు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను హడావుడిగా గందరగోళం మధ్య ప్రారంభించడం వల్ల మందగించిన భారత ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా వస్తు తయారీ (మాన్యుఫాక్చరింగ్), కన్స్యూమర్ వ్యయాల వల్ల నిరుడు బలంగా పుంజుకుంది. భారత్ జీడీపీ ఒక దశాబ్ద కాలంలో రెండింతలు అయింది. ఆసియా ఖండంలోనే కీలక ఆర్థిక ఇంజన్‌గా ముందుకు సాగే శక్తి భారత్‌కు ఉందని అంచనా. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించినా, భారత ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగుతుందనే భావన నెలకొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ ప్రజల కుటుంబ వ్యయాలు, పన్ను సంస్కరణల కారణంగా ఈ సంవత్సరం 7.4 శాతం, 2019లో 7.8 శాతం వృద్ధి సాధిస్తుంది. అయితే ప్రపంచ సగటు అంచనా వృద్ధి రేటు 3.9 శాతంగా ఉంది. 2017 చివరి నాటికి బ్రిటన్ 2.622 జీడీపీతో ప్రపంచంలో అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. అమెరికా ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుండగా, చైనా, జపాన్, జర్మనీ వరుసగా తరువాత స్థానాలలో ఉన్నాయి.