బిజినెస్

మళ్లీ బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 20: ఐటీ, ఫార్మా షేర్లలో వచ్చిన ర్యాలీతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 145 పాయింట్లు పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ తిరిగి మానసికంగా కీలకమయిన 11,000 పాయింట్ల స్థాయికన్నా ఎగువన ముగిసింది. మదుపరులు.. ప్రతిపక్షాలు లోక్‌సభలో ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మించి దృష్టి సారించారని, శుక్రవారం తాజా కొనుగోళ్లు జరిపారని బ్రోకర్లు చెప్పారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కోలుకోవడం కూడా మార్కెట్ తిరిగి బలపడటానికి దోహదపడింది.
శుక్రవారం ఉదయం పటిష్టమయిన స్థాయి వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ మదుపరులు ఇటీవల ధరలు పడిపోయిన షేర్లను కొనుగోలు చేయడంతో తరువాత మరింత పైకి ఎగబాకుతూ ఇంట్రా-డేలో 36,567.34 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, కొంతసేపటి తరువాత మదుపరులు అధిక విలువ కలిగి ఉన్న షేర్లలో లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల అంతకు ముందు ఆర్జించిన లాభాలను కోల్పోయింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 145.14 పాయింట్ల (0.40 శాతం) ఎగువన 36,496.37 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా శుక్రవారం ఇంట్రా-డేలో 11,030.25 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 53.10 పాయింట్ల (0.48 శాతం) ఎగువన 11,010.20 పాయింట్ల వద్ద ముగిసింది.
అయితే, వారం రీత్యా చూస్తే ఈ రెండు కీలక సూచీలు ఇప్పటి వరకు వరుసగా మూడు వారాలలో మొదటి వారం నష్టపోయాయి. ఈ వారంలో సెనె్సక్స్ 45.26 పాయింట్లు (0.12 శాతం), నిఫ్టీ 8.70 పాయింట్లు (0.08 శాతం) చొప్పున దిగజారాయి. ఇదిలా ఉండగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) గురువారం నికరంగా రూ. 470.02 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 315.69 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు. సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థలలో సన్ ఫార్మా శుక్రవారం అత్యధికంగా 2.72 శాతం లాభపడింది. ఇన్ఫోసిస్ 2.42 శాతం లాభంతో తరువాత స్థానంలో నిలిచింది. బాగా లాభపడిన ఇతర సంస్థలలో రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్, టీసీఎస్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ విలువ 2.23 శాతం పెరిగి, సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి రూ. 1,128.55 వద్ద ముగిసింది. మరోవైపు, బజాజ్ ఆటో అత్యధికంగా 8.73 శాతం నష్టపోయింది. తొలి త్రైమాసికంలో ఆశించిన స్థాయిలో ఆదాయాన్ని ఆర్జించలేకపోవడంతో ఈ కంపెనీ షేర్ విలువ పడిపోయింది. నష్టపోయిన ఇతర సంస్థలలో వేదాంత, హీరో మోటోకార్ప్, ఓఎన్‌జీసీ, కోటక్ బ్యాంక్, యెస్ బ్యాంక్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, పవర్ గ్రిడ్, ఆసియన్ పెయింట్స్ ఉన్నాయి. రంగాల వారీ సూచీలలో బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ అత్యధికంగా 1.51 శాతం పెరిగింది. టెక్ 1.38 శాతం పుంజుకొని తరువాత స్థానంలో నిలిచింది.