బిజినెస్

బీఎస్‌ఈలో సీఆర్‌డీఏ బాండ్ల లిస్టింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : రాజధాని అమరావతి అభివృద్ధి పనుల కోసం జారీ చేయనున్న సీఆర్‌డీఏ బాండ్లను బొంబాయి స్టాక్ ఏక్సేంజ్ (బీఎస్‌ఈ)లో లిస్టింగ్ చేయనున్నారు. లిస్టింగ్ కార్యక్రమం మంగళవారం జరుగనుంది. వెలగపూడి సచివాలయంలో సీఆర్‌డీఏ అధికారులతో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాండ్ల లిస్టింగ్ ఏర్పాట్ల గురించి సీఎంకు అధికారులు వివరించారు. ఆ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా సీఎంను కోరారు. 10.3 శాతం వడ్డీతో బాండ్లను జారీ చేయనున్నారు. రాజధాని రైతుల భూముల రిజిస్ట్రేషన్లను సజావుగా చేసేందుకు మరో డిప్యూటీ కలెక్టర్‌ను నియమించుకోవాలని సీఎం ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఐఏఎస్, ఇతర అధికారుల నివాసాలకు సంబంధించి ఆరు టవర్ల నిర్మాణం డిసెంబర్‌లోగా పూర్తి కావాలని ఆదేశించారు. టవర్లు ఆకర్షణీయంగా, ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో నిర్మించాలన్నారు. హైకోర్టు న్యాయమూర్తులకు ఒక టవర్‌లో నివాసాలను ఏర్పాటు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ప్రతినెల రాజధాని పనుల ప్రగతి వివరాలను విడుదల చేయాలన్నారు. రాజధాని నిర్మాణం కోసం స్వచ్ఛందంగా అనేక మంది దాతలు ముందుకు వస్తున్నారని, మనం చేసిన పనులు వారికి చూపించి వారికి స్ఫూర్తిని కలిగించాలన్నారు. మరికొన్ని గ్రామాలకు చెందిన రైతులను సింగపూర్ పర్యటనకు పంపేందుకు సీఎం అంగీకరించారు. డిసెంబర్ నాటికి గుంటూరు, విజయవాడలోని అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. ప్రధాన కాలువల చుట్టూ సుందరీకరణ పనులను వేగవంతం చేయాలన్నారు.
తిరుపతిలో స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టు
తిరుపతిలో 27 కిలోమీటర్ల ప్రాంతాన్ని స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేయడంపై సీఎం సమీక్షించారు. తిరుపతిలో అలిపిరి నుంచి అత్యంత రద్దీ ప్రాంతాలను కలుపుతూ వివిధ ప్రాంతాలను స్మార్ట్ స్ట్రీట్‌లుగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలను చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న వివరించారు. స్మార్ట్ స్ట్రీట్ ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీపురం నుంచి అలిపిరి వరకూ స్మార్ట్ ఫ్లైఓవర్ నిర్మాణ ప్రతిపాదన ఉందన్నారు. రాష్ట్రంలో ప్రారంభించిన అన్న క్యాంటీన్ల గురించి మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. ఇప్పటికి 66 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయని, మరో 100 క్యాంటీన్లను ఆగస్టు 15 నాటికి ప్రారంభిస్తామని అధికారులు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన గృహ నిర్మాణంపై కూడా సమీక్ష చేశారు. వాటిని అందంగా తీర్చిదిద్దాలని, వాటి వివరాలు ప్రజలకు తెలియచేయాలన్నారు. సమీక్షలో మంత్రి నారాయణ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సీఆర్‌డీఏపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు