బిజినెస్

అంతా సక్రమమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: వెనెజులాపై అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ, వాటిని బేఖాతరు చేస్తూ అక్కడి నుంచి చమురును దిగుమతి చేసుకున్నట్టు వచ్చిన ఆరోపణలను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (రిల్) ఖండించింది. ఈ వ్యవహారమంతా సక్రమంగానే జరిగిందని, నిబంధనలను అనుసరించే లావాదేవీలు జరిగాయని స్పష్టం చేసింది. ఈ కొనుగోళ్లపై అమెరికాకు ముందుగానే సమచారం ఇచ్చినట్టు తెలిపింది. వెనెజులాపై అమెరికా విధించిన ఆంక్షలకు భిన్నంగా వ్యవహరించలేదని రిల్ పేర్కొంది. రష్యాకు చెందిన కంపెనీ రోనెఫ్ట్ నుంచి వెనెజులా ముడి చమురును, అమెరికాకు సమాచారం ఇచ్చిన అనంతరమే ముడి చమురు దిగుమతి చేసుకున్నామని వివరించింది. వెనెజులాకు చెందిన పీడీవీఎస్‌ఏకు థర్డ్ పార్టీ ద్వారా నగదు బదిలి చేశామంటూ తమపై వచ్చిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని వ్యాఖ్యానించింది. వెనెజులాపై అమెరికా ఆంక్షలు విధించక ముందే రోనెఫ్ట్‌తో తమ కంపెనీకి ఒప్పందం కుదిరిందని తెలిపింది. ఆంక్షలు విధించిన తర్వాత, వెనెజులా క్రూడ్ ఆయిల్ గొనుగోళ్లపై యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్ (యూఎస్‌డీఓఎస్)కు సమాచారం అందించామని తెలిపింది. ఎంత మొత్తం ముడి చమురును, ఎంత ధరకు కొనుగోలు చేస్తున్నామనే అంశాన్ని కూడా యూఎస్‌డీఓఎస్‌కు తెలిపినట్టు చెప్పింది. ఈ నేపథ్యంలో పీడీవీఎస్‌ఏకు చేసిన చెల్లింపులను అమెరికా ఆంక్షలకు విరుద్ధంగా జరిపినట్టుగా అనుకోవడానికి వీల్లేదని రిల్ తన ప్రకటనలో తెలిపింది. ఇలాంటి ఒప్పందాలన్నింటినీ సదరు కొనుగోలు, అమ్మకందారులకు మధ్య జరిగే వ్యవహారాలుగా అభివర్ణించింది.
అమెరికా ఆంక్షలు విధించిన వెనెజులా నుంచి ముడి చమురు కొనుగోలు చేయబోమని రిల్ గత నెల ప్రకటించింది. ఆంక్షలను అమెరికా ఎత్తివేసే వరకూ వెనెజులాతో ముడి చమురు దిగుమతికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలను జరపబోమని స్పష్టం చేసింది. జాంనగర్ (గుజరాత్)లోని రెండు రిఫైనరీలకు వెనెజులా నుంచి దిగుమతి చేసుకున్న ముడి చమురునే వాడుతున్న కారణంగా, ఆ రెండు యూనిట్లకు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందనే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. క్రూడ్ ఆయిల్ సరఫరాతోనే ఎక్కువ మొత్తంలో ఆదాయాన్ని పొందుతున్న వెనెజులా రాజకీయాలపై అమెరికా దృష్టి పెట్టడంతో, రెండు దేశాల మధ్య సమస్య మొదలైంది. సామ్యవాద ఆలోచనా విధానాలు ఉన్న వెనెజులా దేశాధ్యక్షుడు నికొలాస్ మాడురోను తప్పించాలనే నిర్ణయానికి వచ్చింది. రష్యాకు మాడురో అత్యంత సన్నిహితంగా ఉంటున్నారని అమెరికా అనుమానం. అందుకే, వెనెజులా చమురు ఉత్పత్తులు, ఎగుమతులపై దెబ్బకొట్టడం ద్వారా మాడురోపై ఒత్తిడి పెంచుతున్నది. అతను అధ్యక్ష పదవి నుంచి వైదొలగే వరకూ ముడి చమురు ఎగుమతులపై ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా తేల్చిచెప్పింది.
మొత్తం మీద వెనెజులాపై అమెరికా విధించిన ఆంక్షలు చాలా కంపెనీల మాదిరిగానే రిల్‌ను కూడా ఇబ్బందుల్లోకి నెట్టింది. అయితే, వెనెజులా ప్రభుత్వం ఆధీనంలోని పీడీవీఎస్‌ఏ నుంచి కొనుగోళ్లను అమెరికాలోని తమ అనుబంధ శాఖ పూర్తిగా నిలిపివేసిందని రిల్ తన ప్రకటనలో పేర్కొంది. అమెరికా ఆంక్షలు ఎత్తివేసే వరకూ పీడీవీఎస్‌ఏ నుంచి ఎలాంటి కొనుగోళ్లు జరపబోమని తెలిపింది. అమెరికా నుంచి కొంటున్న చమురు చాలా పలచగా ఉంటుందని, అందుకే గాఢతను పెంచడం ద్వారా పైపుల్లో సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలంటే వెనెజులాకు చెందిన ఒరినొకో బెల్ట్ నుంచి ముడి చమురును కొనుగోలు చేయాల్సి ఉంటుందని రిల్ వివరించింది. అందుకే, నెలలో మూడు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును వెనెజులా కంపెనీ నుంచి కొంటున్నట్టు అమెరికాకు సమాచారం అందించి, ఆతర్వాత లావాదేవీలు పూర్తి చేశామని రిల్ పేర్కొంది. అంతా సక్రమంగా జరిగిన ఈ వ్యవహారాన్ని అమెరికా విధించిన ఆంక్షలకు గండి కొట్టడంగా కొందరు ఆరోపించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే చర్యలకు తాము ఎన్నడూ పాల్పడమని స్పష్టం చేసింది.