బిజినెస్

పౌల్ట్రీ పరిశ్రమకు వేసవి తాపం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 8: పౌల్ట్రీ పరిశ్రమ వేసవి కష్టాలను ఎదుర్కొంటోంది. మాంసం కోసం ఉపయోగించే బ్రాయిలర్ కోళ్లు బరువు తగ్గడం, ఉష్ణోగ్రత తీవ్రతకు చనిపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మరోపక్క గుడ్లు కోసం నిర్వహించే లేయర్ ఫారం కోళ్లు సైతం చనిపోతుండటం, దిగుబడి తగ్గడం, దాణా ధరలు పెరిగిపోవడం వంటి సమస్యలు చుట్టుముడుతున్నాయి. రాష్ట్రంలో రోజుకు 5 కోట్ల నుండి 6 కోట్ల వరకు గుడ్లు ఉత్పత్తవుతాయి. ఈ ఉత్పత్తిలో 40 శాతం తెలుగు రాష్ట్రాల్లోనే వినియోగమవుతుంటే, మిగిలిన 60 శాతం గుడ్లు అసోం, ఒడిస్సా, బీహార్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. ప్రస్తుతం గుడ్డు ధర రూ.3.30 లభిస్తున్నప్పటికీ, 20 నుండి 30 శాతం పెరిగిన దాణా ధరలతో నష్టాలు చుట్టుముడుతున్నాయి. బ్రాయిల్ కోళ్ల విషయానికొస్తే వేసవి తాపానికి కోళ్లు అల్లాడిపోతున్నాయి. వేడిగాలుల తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. కోళ్లు బరువు తగ్గడం, మృత్యువాత పడటంతో తీవ్ర నష్టాలను చవి చూస్తున్నామని రైతులు వాపోతున్నారు. రాష్టవ్య్రాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సరాసరిగా గత వారం రోజుల నుంచి 44 నుండి 46 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకోవడంతో బ్రాయిలర్ కోళ్లు విలవిల్లాడుతున్నాయి. వేసవి తాపానికి మేత తినలేకపోవడంతో కోళ్ల బరువులో తగ్గుదల కన్పిస్తుందని రైతులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో 2.5 కిలోల బరువుండే కోడి ప్రస్తుతం సుమారు 1.5 కిలోలు మాత్రమే తూగుతోందని రైతులు చెబుతున్నారు. దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు. సాధారణంగా 10వేల కోడి పిల్లలను 40 రోజులు పెంచితే, కోత దశకు చేరుకుంటాయి. ఇలా పెంచడానికి రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఖర్చవుతుంది. ఇంత పెట్టుబడి పెట్టలేని రైతులు స్నేహ, శ్రీనివాస, ఎస్‌కబ్, సుగుణ వంటి కంపెనీలను ఆశ్రయిస్తున్నారు. ఈ కంపెనీలు కోడి పిల్లలతో పాటు దాణా కూడా అందిస్తాయి. ఆయా ఫారాల్లో కోళ్లు రెండు నుంచి రెండున్నర కిలోలు పెరిగిన తర్వాత కంపెనీలు కొనుగోలు చేస్తుంటాయి. కోడి కిలోకు రూ.5 వంతున చెల్లించి ఈ కంపెనీలు కొనుగోలు చేస్తుంటాయని తెలుస్తోంది. కోళ్ల బరువు తగ్గిపోవడంవల్ల నష్టం భారీగా ఉంటోందని రైతులు వాపోతున్నారు. కాగా కంపెనీల సాయం లేకుండా సొంతంగా ఫారాలు నిర్వహించే రైతులు వేసవిలో కోళ్లు మృతిచెందడంవల్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తగిన రక్షణ చర్యలు చేపట్టినప్పటికీ రేకు షెడ్లలో వున్న కోళ్లు మృత్యువాత పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. కోళ్ల ఫారాల్లో రూ.లక్షల ఖర్చుచేసి స్ప్రింక్లర్లు తదితరాలతో చల్లదనం సృష్టిస్తున్నా ఆశించిన ఫలితం దక్కడం లేదని వాపోతున్నారు.
మరోవైపు గుడ్డు ధర కూడా రైతులకు లాభదాయకంగా లేదు. పౌల్ట్రీ రైతులకు ప్రస్తుతం రూ.3.30 ధర లభిస్తున్నప్పటికీ, దాణా ధరల్లో వచ్చిన విపరీతమైన పెరుగుదల కారణంగా కనీసం రూ.3.50 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ వేసవిలో కోళ్ల ఫారాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించి ఆదుకోవాల్సి వుందని, గుడ్డు ధర పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోళ్ల ఫారాల రైతులు అభిప్రాయ పడుతున్నారు.

ప.గో. జిల్లాలో వేసవి తాపానికి చనిపోయిన కోళ్లు (ఫైల్ ఫొటో)