బిజినెస్

పెరుగుతున్న గోదావరి జలాల పారిశ్రామిక వినియోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 10: కొత్త ప్రభుత్వం గోదావరి జలాల పారిశ్రామిక అవసరాలపై కూడా దృష్టి కేంద్రీకరించింది. పారిశ్రామిక అవసరాలు, గతంలో కేటాయింపు, గోదావరి పారిశ్రామిక అవసరాలు తీర్చడం ద్వారా వచ్చే ఆదాయం, బకాయిలు తదితర అంశాలపై పరిశీలన చేపట్టింది. పోలవరం ఎడమ ప్రధాన కాల్వ ద్వారా త్వరితగతిన పారిశ్రామిక నీటి అవసరాలు తీర్చడంపై కూడా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది.
ఉభయ గోదావరి జిల్లాలతోపాటు విశాఖపట్నంలోని పారిశ్రామిక అవసరాలకు గోదావరి నది ఆధారంగావుంది. ఈ నది నుంచి, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ నుంచి గోదావరి జలాలను వివిధ పరిశ్రమలకు కేటాయించారు. అఖండ గోదావరి నది నుంచి కొన్ని పరిశ్రమలు నీటిని వినియోగించుకుంటుంటే, సామర్లకోట, పిఠాపురం బ్రాంచి కెనాల్, అమలాపురం తదితర కెనాల్స్ నుంచి కూడా పారిశ్రామిక నీటి కేటాయింపులు జరిగాయి. దీనికి తోడు ప్రధానంగా స్పెక్ట్రమ్ వంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో పాటు సామర్లకోట సమీపంలో పలు పరిశ్రమలు, రిలయన్స్ వంటి విద్యుత్ ఉత్పత్తి సంస్థలు, కాకినాడ ప్రాంతంలోని ఎన్‌ఎఫ్‌సీఎల్, జీఎఫ్‌సీఎల్ వంటి సంస్థలు కూడా గోదావరి ముడి జలాలను వినియోగించుకుంటున్నాయి. విశాఖ జిల్లాలోని పలు పరిశ్రమలకు, తాగునీటికి కూడా ఇటు గోదావరి, అటు ఏలేరు నుంచి కూడా ప్రత్యేక పైపులైన్, కెనాల్ ద్వారా గోదావరి జలాలను తరలింపు జరుగుతోంది.
నీటి సదుపాయాన్ని కల్పించడం ద్వారా గత ప్రభుత్వాలు పరిశ్రమలను ప్రోత్సహించాయి.గోదావరి జలాలను నామమాత్రపు ధరకు వివిధ పరిశ్రమలు పొందుతున్నాయి. విశాఖ పారిశ్రామిక అవసరాల నిమిత్తం ధవళేశ్వరం కాటన్ బ్యారేజికి ఎగువన రాజమహేంద్రవరం సమీపంలోని వెంకటనగరం వద్ద నుంచి పైపులైన్ ద్వారా నీటిని కేటాయించారు. మొదట్లో ఈ సంస్థకు ప్రభుత్వం 1000 గ్యాలన్లు ముడి జలాలు కేవలం 33పైసలకు కేటాయించింది. ఆ తదుపరి ఆ ధరను 63 పైసలకు పెంచింది. పైసల్లో కేటాయించిన జలాలకే విస్కో సంస్థ ప్రస్తుతం రూ.కోట్లలో బకాయిపడింది. ప్రతీ ఆరు నెలలకొకసారి ప్రభుత్వానికి వినియోగించుకున్న నీటికి సంబంధించి ఆన్‌లైన్ పద్ధతిలోనే వాటర్ మీటర్ కొలతల ద్వారా బిల్లులు చెల్లిస్తుంది. అయితే విస్కో సంస్థ ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.12 కోట్లు, గోదావరి హెడ్ వర్క్సు విభాగం నుంచి వినియోగించుకునే అంటే రాజమహేంద్రవరం సమీపంలోని వెంకటనగరం ఇన్‌టేక్‌వెల్ పైపులైన్ ద్వారా వినియోగించుకునే జలాలకు ఇదే ఆర్థిక సంవత్సరంలో రూ.3.60 కోట్లు మొత్తం రూ.15.60 కోట్ల వరకు బకాయి పడింది. గోదావరి కాల్వల హెడ్ స్లూయిస్‌ల నుంచి వివిధ పరిశ్రమలకు నీటిని కేటాయిస్తుంటారు. అక్కడే నీటి మీటర్లు ఏర్పాటుచేసి ఎన్ని లక్షల గ్యాలన్లు వినియోగించుకున్నదీ లెక్కకడతారు. హెడ్ స్లూరుూస్ ద్వారా నీటి విడుదలను బట్టి పారిశ్రామిక అవసరాలకు ఎంత కేటాయించినదీ లెక్కకడతారు. ఏలేరు ప్రాజెక్టుపై నిర్మించిన ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి సంస్థ మణిహంస పవర్ ప్రాజెక్టుకు కేటాయించిన జలాలకు కూడా నీటి బకాయివుంది.
గోదావరి తూర్పు డెల్టా పరిధిలో సామర్లకోట గోదావరి కెనాల్ నుంచి పెద్దాపురం వద్ద జీవీకే గౌతమి పవర్, రిలయన్స్ ఎనర్జీ లిమిటెడ్, సామర్లకోట వద్ద నవభారత్ వెంచర్స్ లిమిటెడ్, యు.కొత్తపల్లి వద్ద స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ లిమిటెడ్, కాకినాడ వాకలపూడి వద్ద ప్యారీ ఇండస్ట్రీస్, కాకినాడ సముద్ర తీరంలోని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, కడియం జీవీకే ఇండస్ట్రీస్, మాధవరాయుడుపాలెం ఇంటర్నేషనల్ పేపర్ ఏపీపీ ఎం లిమిటెడ్, గాడిమొగ వద్ద రిలయన్స్ ఇండస్ట్రీస్, తాళ్ళరేవు వద్ద ఓఎన్‌జీసీకి గోదావరి జలాలను కేటాయించారు. గోదావరి హెడ్ వర్క్సు డివిజన్ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లులోని జైపూర్ షుగర్స్ లిమిటెడ్, రాజమహేంద్రవరంలోని ఇంటర్నేషనల్ పేపర్‌మిల్సు లిమిడెట్‌తో పాటు జేగురుపాడులోని జీవీకే ఇండస్ట్రీస్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, వేమగిరి పవర్ జనరేషన్ లిమిటెడ్, జీఎంఆర్ ఎనర్జీ లిమిడెట్ వంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు కూడా గోదావరి జలాలను వినియోగిస్తున్నారు.
గోదావరి జలాలు ఆధారంగా పలు పరిశ్రమలు పనిచేస్తున్నాయి. నీటి అవసరాలు తీర్చుకుంటున్న పారిశ్రామిక సంస్థలు సకాలంలో నీటి బకాయిలు చెల్లించాల్సివుంది. ఏదేమైనప్పటికీ కొత్త ప్రభుత్వం పారిశ్రామిక నీటి కేటాయింపులు, అవసరాలు తదితర అంశాలపై సమగ్ర దృష్టి కేంద్రీకరించింది. ఇందుకు సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే సంబంధిత మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది.