బిజినెస్

పాల సరఫరా ధర పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పాడిరైతులను ఆదుకోవాలనే సదుద్దేశంతో పాటు రాష్ట్రంలో నిర్వీర్యమైన సహకార రంగ డెయిరీలకు పూర్వ వైభవం తెచ్చేందుకు తమ ప్రభుత్వం బాట వేసిందని రాష్ట్ర మత్స్యశాఖ, మార్కెటింగ్, పశుసంవర్థకశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు స్పష్టం చేశారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లో శనివారం తన ఛాంబర్‌లో ప్రవేశించిన సందర్భంగా మంత్రి మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ కేబినెట్‌లో పనిచేయటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. పశుసంవర్థక, మత్స్య, మార్కెటింగ్ శాఖలు ప్రభుత్వంలో అత్యంత కీలకమైన విభాగాలని చెప్తూ ఇవి సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లక్షలాది మంది పశు సంపదపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు.
రాష్ట్రంలో 9 లక్షల మందికిపైగా సన్న, చిన్నకారు రైతుల కుటుంబాలు దీనిపై జీవనం సాగిస్తున్నాయని వివరించారు. వారు సరఫరా చేసే పాలపైనే సహకార రంగ డెయిరీల మనుగడ ఆధారపడి ఉందన్నారు. గిట్టుబాటు ధరలేక పాడిరైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాదయాత్ర సందర్భంగా జగన్ ఈ విషయాన్ని గుర్తించి రైతులకు వెసులుబాటు కల్పించారన్నారు. ఇందులో భాగంగా లీటరు పాల సరఫరా ధరకు రూ. 4 అదనంగా చెల్లించాలని నిర్ణయించారని చెప్పారు. దీనివల్ల ప్రభుత్వంపై రూ. 220 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నా సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు. గొర్రెలు, మేకల పెంపకం రైతులకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి కూడా తొలి కేబినెట్ సమావేశంలో చర్చించామన్నారు. గొర్రెలు మృతి చెందినప్పుడు ఇన్సూరెన్స్ చెల్లింపులో నిబంధనల సాకు చూపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని మృతి చెందిన గొర్రెలకు రూ. 6 వేల చొప్పున చెల్లించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు గుర్తుచేశారు. దీనివల్ల లక్షలాది కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో ఆక్వారంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందన్నారు.
విదేశీ మారకద్రవ్యం అత్యధికంగా సమకూరే ఈ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. చేపలవేట నిషేధకాలంలో మత్స్యకారుల కుటుంబాలకు రూ. 10 వేల భృతి చెల్లిస్తామన్నారు. గత ప్రభుత్వాలు కంటితుడుపు చర్యగా మత్స్యకారులకు నామమాత్రపు భృతి విదిల్చాయని విమర్శించారు. చేపలవేట సమయంలో ప్రమాదవశాత్తు మత్స్యకారుడు మృతిచెందితే ఆ కుటుంబానికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర కల్పించే వరకు నిల్వ చేసుకునేలా గోడౌన్లలో నిల్వ సామర్థ్యాన్ని పెంచనున్నట్లు మంత్రి మోపిదేవి వెల్లడించారు. దీనివల్ల రైతులకు ఆర్థికంగా మేలు జరుగుతుందని చెప్పారు.
సీఎం నిర్ణయాలను పారదర్శకంగా అమలు చేస్తామన్నారు. రూ. 3 వేల కోట్లతో మార్కెట్ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అవినీతి మరక లేని పాలన అందించటమే ప్రభుత్వ లక్ష్యంగా తమ పనితీరు ఉంటుందని స్పష్టం చేశారు.
చిత్రం...బాధ్యతలు స్వీకరిస్తున్న పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ