బిజినెస్

నగదు లావాదేవీల్లో ఆధార్ చెల్లుబాటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: బ్యాంకుల్లో రూ. 50వేలకు మించి నగదు లావాదేవీలు జరిపేటప్పుడు ఇకనుంచి పాన్ నంబర్‌ను మాత్రమే పేర్కొనవలసిన అవసరం లేదు. దాని స్థానంలో బయోమెట్రిక్ ఐడీ అయిన ఆధార్‌ను కూడా వినియోగించుకోవచ్చు. అంతేకాదు ఇప్పటి వరకు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన పాన్ (పర్మనెంట్ అకౌంట్ నంబర్) ఎక్కడెక్కడ అయితే తప్పనిసరో అక్కడ ఇకనుంచి ఆధార్ కూడా చెల్లుబాటు అవుతుంది. రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే శనివారం ఇక్కడ ఈ విషయం వెల్లడించారు. బ్యాంకులు, ఇతర సంస్థలు ఇప్పటి వరకు ఎక్కడయితే పాన్ తప్పనిసరో ఆ అన్ని చోట్ల ఆధార్‌ను అంగీకరించేందుకు వీలుగా బ్యాకెండ్‌ను అప్‌గ్రేడ్ చేసుకుంటాయని ఆయన వివరించారు. ‘ఇప్పటి వరకు 22 కోట్ల పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం అయ్యాయి. అయితే, 120 కోట్లకు పైగా మంది ప్రజలు ఆధార్‌ను కలిగి ఉన్నారు. ఎవరయినా ఒకరికి పాన్ కావాలనుకుంటే, వారు ఆధార్‌ను ఉపయోగించుకొని పాన్‌ను తీసుకోవలసి ఉంటుంది. తరువాత పాన్‌ను ఉపయోగించుకోవలసి ఉంటుంది. ఇప్పుడు ఆధార్ ఉంటే, దానితోనే పాన్‌తో అయ్యే అన్ని పనులు అవుతాయి. అంటే ఇక పాన్ తీసుకోవలసిన అవసరం ఉండదు. ఇది ప్రజలకు చాలా సౌలభ్యంగా ఉంటుంది’ అని ఆయన వివరించారు. బ్యాంకుల్లో రూ. 50వేలకు మించి నగదును జమ చేయడానికి లేదా ఉపసంహరించుకోవడానికి ఆధార్‌ను ఉపయోగించుకోవచ్చా అని ప్రశ్నించగా, అక్కడ కూడా ఆధార్‌ను ఉపయోగించుకోవచ్చని ఆయన బదులిచ్చారు. అయితే, నల్లధనాన్ని అరికట్టడానికి హోటల్ లేదా ఫారిన్ ట్రావెల్ బిల్స్‌లో మాత్రం రూ. 50వేలకు మించితే పాన్‌ను పేర్కొనడం తప్పనిసరి అని ఆయన వివరించారు. అలాగే, రూ. పది లక్షలకు పైగా విలువ కలిగిన స్థిరాస్తిని కొనుగోలు చేసిన సమయంలో మాత్రం పాన్‌ను పేర్కొనడం తప్పనిసరి అని ఆయన తెలిపారు. అయితే, ఆధార్, పాన్ రెండూ కొనసాగుతాయని ఆయన చెప్పారు.