బిజినెస్

9 ప్రధాన నగరాల్లో.. గృహ నిర్మాణ రంగ విక్రయాల్లో 11 శాతం తగ్గుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ : దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గడచిన త్రైమాసికంలో గృహ నిర్మాణ రంగంలో విక్రయాలు 11 శాతం తగ్గాయి. అయితే దేశ వ్యాప్తంగా పరిస్థితులు ఎలావున్నా హైదరాబాద్ నగరంలో మాత్రం ఈ విక్రయాల్లో 10 శాతం వృద్ధి నమోదవడం గమనార్హం. కాగా ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు తొమ్మిది నగరాల్లో మొత్తం 72వేల యూనిట్లు (వివిధ స్ధాయిల్లో నిర్మించిన గృహాలు) మాత్రమే అమ్ముడయ్యాయి. అయితే కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పడటం, తక్కువ ధరలతో కొనే గృహాలకు కొన్ని పన్ను రాయితీలను ప్రకటించడం వంటి కారణాలతో ఈ విక్రయాల్లో వృద్ధి చోటు చేసుకుంటుందని బ్రోకరేజ్ సంస్థ ’ప్రోప్ టైగర్’ అధ్యయన నివేదిక అంచనా వేసింది. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), నోయిడా, పూనే నగరాల్లో ఈ అధ్యయనం సాగిందని నివేదిక తెలిపింది. గడచిన త్రైమాసికంలో కొత్త గృహ నిర్మాణాల ఆరంభాల్లో, నిర్మించిన గృహాల విక్రయాల్లోనూ తగ్గుదలను గుర్తించామని, అయితే ఈ రంగం తదుపరి పురోగమించే అవకాశాలే అధికంగా ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. కేంద్రంలో ఏర్పాటైన సుస్థిర ప్రభుత్వం వ్యక్తిగత గృహ నిర్మాణాలు, స్థిరాస్తి రంగంలోని గృహ నిర్మాణాలకు ప్రోత్సాహకంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని ఇది ఈ రంగ వృద్ధికి ఊతాన్నిస్తుందని ప్రోప్ టైగర్ గ్రూప్ సీఈవో ధృవ్ అగర్వాల్ తెలిపారు. గృహాల కొనుగోలుకు సంప్రదించేవారి సంఖ్య గత త్రైమాసికంలో అధిక స్ధాయిలోనే ఉన్నప్పటికీ సార్వత్రిక ఎన్నికలు రావడం వల్ల వేచిచూసే దోరణిని అవలంభిస్తున్నారని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం రూ. 3.50 లక్షల వరకు గృహ రుణాలపై పన్ను రాయితీని కల్పిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్బీఐ రెపోరేట్లలో రికార్డు స్థాయిలో కోత విధించిన తర్వాత పలు బ్యాంకులు వడ్డీ శాతాన్ని తగ్గించిన విషయాన్ని అగర్వాల్ గుర్తు చేశారు. ఈ త్రైమాసికంలో గృహ విక్రయాల శాతం గురుగ్రామ్, హైదరాబాద్, కోల్‌కతా, పూనే నగరాల్లో పెరిగిందని, ఐతే మిగతా ఐదు నగరాల్లో మాత్రం బాగా తగ్గుదల చోటుచేసుకుందని ఆయన చెప్పారు. గురుగ్రామ్‌లో ఏకంగా 32 శాతం వృద్ధి జరిగి మొత్తం 4,951 యూనిట్ల విక్రయం జరిగిందని, గడచిన ఏడాది ఇదే త్రైమాసికంలో 3,737 యూనిట్లు ఆ నగరంలో విక్రయించడం జరిగిందని నివేదిక వివరించింది. అలాగే హైదారాబాద్ 6,204 యూనిట్లు, కోల్‌కతాలో 3,481 యూనిట్ల వంతున విక్రయాలు జరిగి ఆ నగరాల్లో సైతం 10 శాతం వృద్ధి నమోదైంది. ఇక పూనేలో 5 శాతం పెరిగిన డిమాండ్‌తో 14,998 యూనిట్ల విక్రయాలు జరిగాయి. ఐతే నోయిడాలో ఈ విక్రయాల్లో ఏకంగా 56 శాతం తగ్గుదల చోటుచేసుకుని 3,304 యూనిట్ల విక్రయాలు మాత్రమే జరిగాయి. అలాగే అహ్మదాబాద్‌లో 36 శాతం తగ్గుదల నమోదుకాగా, బెంగళూరులో 17 శాతం, ముంబయిలో 14 శాతం, చెన్నైలో 2శాతం తగ్గుదల నమోదైంది.