బిజినెస్

తీవ్ర ఇక్కట్లలో వాహన రంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: దేశీయ వాహన రంగం తీవ్ర ఇక్కట్లలో కూరుకుపోతోంది. గడచిన జూలై మాసంలో 19 ఏళ్ల కనిష్టానికి ఈ రంగంలో విక్రయాలు చేరడం ఉద్యోగుల ఉనికికి సైతం విఘాతంగా మారింది. జూలై విక్రయాల్లో 18.71 శాతం తగ్గుదల నెలకొంది. మూడు నెల్ల కాలంగా పరిస్థితి అద్వాన్నంగా మారడంతో దాదాపు 15 వేల మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయారు. ‘సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్’ (సియామ్) మంగళవారం ఈమేరకు ఇక్కడ నివేదిక విడుదల చేసింది. ఆ గణాంకాల మేరకు గడచిన జూలై మాసంలో అన్ని కేటగిరీల వాహనాలు కలిపి 18,25,148 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత 2018 జూలైలో జరిగిన 22,45.223 యూనిట్లతో పోలిస్తే ఇది అత్యంత స్వల్ప స్థాయి. గతంలో 2000వ సంవత్సరం డిసెంబర్ మాసంలో విక్రయాలు 21.81 శాతం పడిపోయి అత్యల్ప రికార్డు స్థాయిగా నమోదైంది. ఇది 19 ఏళ్ల కనిష్ట స్థాయి అని నివేదిక తెలిపింది. అలాగే దేశీయ ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 30.98 శాతం తగ్గుదల నెలకొందని, గత ఏడాది 2,90,931 యూనిట్లు అమ్ముడవగా, తాజాగా 2,00.790 యూనిట్లు మాత్రమే విక్రయాలు జరిగాయని ఇదికూడా 19ఏళ్ల కనిష్ట స్థాయేనని వెల్లడించింది. కాగా తాజాగా జూలైలో నెలకొన్న అత్యల్ప స్థాయికి ముందు గడచిన 9 నెలలుగా విక్రయాలు నష్టాల స్థాయిలోనే సాగుతున్నాయని సియామ్ తెలిపింది. అలాగే గడచిన నెలలో దేశీయంగా కార్ల విక్రయాలు 35.95 శాతం తగ్గాయి. 2018లో ఇదే నెలలో 1,91,979 కార్లు అమ్ముడుపోగా, గడచిన నెలలో 1,22,956 కార్లు మాత్రమే విక్రయించినట్టు నివేదిక స్పష్టం చేసింది. అలాగే వాణిజ్య వాహనాల విక్రయాల్లో 25.71 శాతం తగ్గుదల చోటు చేసుకుంది.
ప్రభుత్వ చేయూత అవశ్యం
వాహన రంగాన్ని పునరుద్ధరించేందుకు ప్రభుత్వం వెంటనే తగిన ప్యాకేజీతో ముందుకు రావాలని ‘సియామ్’ డైరెక్టర్ జనరల్ విష్ణుమాధుర్ మంగళవారం నాడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. విక్రయాలు పెంచుకునేందుకు తమ సంఘం శత విధాల కృషి చేస్తోందన్నారు. ప్రస్తుత దారుణ పరిస్థితి ప్రధానంగా తాత్కాలిక, దినసరి వేతన ప్రాతిపదికన పనిచేస్తున్న వేలాది మంది కార్మికులకు ఉపాధి కోల్పోయేలా చేస్తోందన్నారు. ఆటోమొబైల్ పరికరాల తయారీ కంపెనీల్లో దాదాపు మిలియన్ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వివరించారు. ప్రస్తుతం తగ్గిన విక్రయాలతో సుమారు 300 డీలర్‌షిప్‌లు నష్టాల్లో కూరుకుపోయి మూసివేతకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇదే జరిగితే సుమారు రెండు లక్షల మంది ఉపాధికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా వాహన రంగానికి జీఎస్‌టీ రేట్లు తగ్గించాలని, వాహన స్క్రాపేజీ విధానాన్ని తేవాలని, ఎన్‌బీఎఫ్‌సీ రంగాన్ని పునరుద్ధరించాలని కోరారు. ఆర్థికపరమైన, వాహన విక్రయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లు పెరిగేలా చేసేందుకు ఎన్‌బీఎఫ్‌సీ దోహదం చేస్తుందని మాథుర్ గుర్తు చేశారు.