బిజినెస్

దేశీయ మార్కెట్‌లోకి డ్రాగన్ ఫ్రూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 22: దేశీయంగా పండిస్తున్న డ్రాగన్ ఫ్రూట్ త్వరలోనే మార్కెట్‌లో ప్రత్యక్షం కానుంది. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో ప్రయోగాత్మకంగా డ్రాగన్‌ఫ్రూట్ సాగు చేపట్టి ఫలసాయం పొందనున్నారు. రైతులకు అత్యంత లాభదాయకమైన ఈ పంటపై ఇప్పుడిప్పుడే ఉద్యానవన శాఖ దృష్టి సారించి, రైతులను ఆ దిశగా సాగుకు ప్రోత్సహిస్తోంది. మధ్య అమెరికా తదితర ప్రాంతాలకే పరిమితమైన డ్రాగన్ ఫ్రూట్‌ది ఒక ప్రత్యేక స్థానం. అత్యధిక పోషకవిలువలు కలిగిన ఈ పళ్లకు ప్రత్యేకత ఉంది. కాస్త ధర ఎక్కువైనా ఎగువ మధ్యతరగతి ప్రజానీకం వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. సాగు విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఫలసాయం చేతికందే సరికి లాభాల పంట పండుతుంది. అయితే సాగు ప్రారంభంలో ఖర్చు ఎక్కువైనప్పటికీ, మూడేళ్ల తరువాత పూర్తిగా లాభాల పంట పండుతుంది. ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం సాగు ఖర్చులో కొంతమేర సబ్సిడీని అందిస్తోంది. విశాఖ జిల్లాలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్న డ్రాగన్ ఫ్రూట్‌కు సంబంధించి ఉద్యానవన శాఖ అధికారులు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. జిల్లాలో అయిదు హెక్టార్లలో ఈ పంటను ప్రయోగాత్మకంగా పండిస్తున్నారు. ఒక ఎకరాకు పంట వేసేందుకు సుమారు రూ.6 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనిలో ప్రభుత్వ సబ్సిడీ రూ.2 లక్షలు రైతుకు లభిస్తుంది. మొక్క పెరిగేందుకు అనువుగా సిమ్మెంట్ ఫలకాలు, స్తంభాలు అమర్చాల్సి ఉంటుంది. దీనికే ప్రారంభంలో ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తొలి ఏడాది పూర్తిగా సాగుకు అవసరమైన ఏర్పాట్లకే పరిమితమైన రైతు రెండో ఏడాది పంటకు సరైన సస్యరక్షణ చర్యలు చేపడుతూ ఫలసాయం అందుకోవచ్చు. ఎకరా విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ పంట సాగుచేస్తే రెండో ఏడాది రెండు నుంచి రెండున్నర టన్నుల ఫలసాయం లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఒక టన్ను డ్రాగన్ ఫ్రూట్ ధర సుమారు రూ.లక్ష వరకూ పలుకుతోంది. మూడో సంవత్సరం మూడున్నర టన్నుల ఫలసాయం లభిస్తుంది. నాలుగో సంవత్సరం నుంచి సగటున అయిదు టన్నుల ఫలసాయం రైతు సొంతం అవుతుంది. సుమారు పదేళ్ల పాటు డ్రాగన్ పంట ఫలసాయం అందిస్తూనే ఉంటుంది. క్రమంగా దిగుబడి తగ్గినప్పటికీ రైతు తన పెట్టుబడిన మూడో సంవత్సరంలోనే రాబట్టుకోవచ్చు. మిగిలిన కాలం అంతా ఫలసాయం రైతు సొంతం. ప్రస్తుతం ఈ పంటను విస్తృతంగా ప్రోత్సహించేందుకు ఉద్యానవ శాఖ విస్తృత ప్రచారం చేస్తోందని ఉద్యానవ శాఖ అధికారి తెలిపారు. ప్రస్తుతం అనంతగిరిలో ప్రయోగాత్మకంగా సాగు చేస్తుండగా, నర్సీపట్నం డివిజన్‌లో కూడా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు వాణిజ్య పంటలు పండించే ఔత్సాహిక రైతులకు సూచనలు ఇస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వ పరంగా మార్కెటింగ్ సదుపాయంతో పాటు సబ్సిడీ మొత్తాన్ని మరికొంత పెంచితే విశాఖలో ఈ విదేశీ ఫలాల సాగు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.

చిత్రం...అనంతగిరిలో సాగవుతున్న డ్రాగన్ ఫ్రూట్