బిజినెస్

రూ. 6,630 కోట్ల ఆస్తుల జప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) కొరడా ఝుళిపించింది. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయల రుణాలను తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేక విదేశాలకు మాల్యా పారిపోయినది తెలిసిందే. ఈ క్రమంలో బకాయిలను రాబట్టడంలో భాగంగా ఇడి శనివారం ఏకంగా 6,630 కోట్ల రూపాయల విలువైన మాల్యా ఆస్తులను అటాచ్ చేసింది. ముంబయి, బెంగళూరుల్లోని ఫామ్‌హౌజ్, ఫ్లాట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డి)ను ఇడి సీజ్ చేసింది. ఇక ఇది రెండో అటాచ్‌మెంట్ ఆదేశమవగా, ఇంతకుముందు కూడా 1,411 కోట్ల రూపాయల ఆస్తులను ఇడి జప్తు చేసింది. దీంతో ఇడి జప్తు చేసిన మొత్తం ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 8,041 కోట్ల రూపాయలకు చేరింది. కాగా, ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల నుంచి మాల్యా సారథ్యంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 6,027 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుంది. వడ్డీలు చెల్లించకపోవడంతో ఇది కాస్తా 9,000 కోట్ల రూపాయలకుపైగా చేరింది. వడ్డీలపై వడ్డీలు లేకుండా రుణాలు చెల్లించే అవకాశాన్ని కూడా బ్యాంకులు మాల్యాకు ఇవ్వగా, అది కూడా కుదరకపోవడంతో తనఖా పెట్టిన ఆస్తులను బ్యాంకర్లు వేలం వేస్తున్నది తెలిసిందే. అయితే వీటికీ తగినంత ఆదరణ లేకపోవడంతో బ్యాంకులు అయోమయంలో పడ్డాయి. కోర్టులను ఆశ్రయించిన ఫలితం శూన్యం. ఈ క్రమంలో బ్యాంకింగ్ రంగాన్ని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకుల ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న మొండి బకాయిలను సీరియస్‌గా తీసుకున్న మోదీ సర్కారు.. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని వాటిని ఎగ్గొడుతున్నవారికి బలమైన సంకేతాలు అందించేలా ముందుకెళ్ళాలన్న సూచనతోనే ఇడి తాజా అటాచ్‌మెంట్ అని సమాచారం. మరోవైపు మాల్యా, ఆయన అసోసియేట్లకు వ్యతిరేకంగా నమోదైన మనీ లాండరింగ్ కేసులో కూడా ఈ చర్యతో ఇడి పైచేయి సాధించినట్లైంది. తాజా అటాచ్‌మెంట్‌లో 565 కోట్ల రూపాయల విలువైన బెంగళూరులోని కింగ్‌ఫిషర్ టవర్‌లోగల ఫ్లాట్లు, ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యుఎస్‌ఎల్) పేరిట ఉన్న 10 కోట్ల రూపాయల విలువైన ఎఫ్‌డీలు, 25 కోట్ల రూపాయల విలువైన అలీబాగ్‌లోగల మండ్వాలోని ఫామ్‌హౌజ్ ఉన్నాయి. అలాగే 3,635 కోట్ల రూపాయల విలువైన యుఎస్‌ఎల్, యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్, మెక్‌డౌల్ హోల్డింగ్ కంపెనీ, యుబిహెచ్‌ఎల్, ఇతర మాల్యా నేతృత్వంలోని సంస్థల షేర్లనూ ఇడి అటాచ్ చేసింది. అయితే 2010లో వీటికి ఉన్న విలువ ఆధారంగా ఇడి జప్తు చేయగా, 4,234.84 కోట్ల రూపాయలుగా ఇడి పేర్కొంది. అయితే ప్రస్తుతం వీటి మార్కెట్ విలువ 6,630 కోట్ల రూపాయలుగా ఉంది. ఇదిలావుంటే ముంబయి న్యాయస్థానం మాల్యాకు నాన్-బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసినట్లు తెలుస్తోంది. వెయ్యి కోట్ల రూపాయల సేవా పన్ను ఎగవేత కేసులో కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది.