బిజినెస్

సుస్థిర వాణిజ్యానికి లాజిస్టిక్ రంగం కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 9: పారిశ్రామిక ప్రగతి, సుస్థిర వాణిజ్యంలో లాజిస్టిక్ రంగానిదే కీలకపాత్రగా వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయపడ్డారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) విశాఖ చాప్టర్ ఆధ్వర్యాన విశాఖలో శనివారం జరిగిన లాజిస్టిక్స్ 2019 కాన్ఫరెన్స్‌లో విశాఖ పోర్టు ట్రస్టు డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరనాథ్ మాట్లాడారు. భారత్‌లో రోడ్డు రవాణా కీలక భూమిక పోషిస్తోందని, ఇదే తరుణంలో తక్కువ ఖర్చుతో పర్యావరణ హితంగా జలరవాణాను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టుకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. దీనిలో భాగంగానే జలరవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు పోర్టుల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందన్నారు. దేశంలో గతేడాది 1200 మిలియన్ టన్నుల సరకు రవాణా జరగగా ప్రభుత్వ రంగ పోర్టుల నుంచి 700 మిలియన్ టన్నులు, ప్రైవేటు పోర్టుల ద్వారా 500 మిలియన్ టన్నుల సరకు రవాణా జరుగుతోందన్నారు. 2025 నాటికి ప్రభుత్వ పోర్టుల ద్వారా సరకు రవాణాను 1100 మిలియన్ టన్నులకు పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. తూర్పు తీరంలో విశాఖ లాజిస్టిక్ హబ్‌గా ఎదుగుతోందన్నారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి ఇనుప ఖనిజం రవాణాలో విశాఖ పోర్టు కీలకంగా ఉందన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు రవాణాలో రైల్ రవాణా కీలకమన్నారు. ధర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో 61 శాతం బొగ్గు ఇదే మార్గంలో రవాణా జరుగుతోందన్నారు.
భవిష్యత్‌లో బొగ్గు దిగుమతులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని, 32 నుంచి 35 శాతానికి పడిపోనుందని హరినాథ్ అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు కోల్‌కతా పోర్టు నుంచి ఈశాన్య ప్రాంతంలోని నేపాల్, భూటాన్ దేశాలకు కంటైనర్ రవాణా జరిగేదని, అప్పట్లో విశాఖ పోర్టు నామమాత్రంగానే కంటైనర్ కార్గో చేపట్టేదన్నారు. రానురాను పరిస్థితుల్లో భారీ మార్పులు రావడంతో విశాఖ నుంచి ఆయా ప్రాంతాలకు సరకు రవాణా పెరిగిందన్నారు. కస్టమ్స్ శాఖ ప్రాంతీయ కమిషనర్ డీకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రధాని సారథ్యంలో పనిచేసే నేషనల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ తీసుకుంటున్న కీలక నిర్ణయాల వల్ల ఎగుమతి, దిగుమతి తదితర అంశాల్లో జాప్యాన్ని పూర్తిగా నియంత్రించగలిగామన్నారు. ఎగుమతి, దిగుమతి అంశాల్లో జరిగే ఆలస్యం వల్ల ఆర్థిక భారం పెరుగుతుందని, ఇది ఉత్పాదక వ్యయంపై పడితే అంతిమంగా వినియోగదారుడే ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోందన్నారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో రవాణా భారం ఎక్కువని తెలిపారు. ప్రపంచ దేశాల్లో ఆరు నుంచి ఎనిమిది శాతం మాత్రమే రవాణా ఖర్చులైతే భారత్‌లో ఇది 14 శాతంగా ఉందన్నారు. జాప్యాన్ని నియంత్రించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అనుమతులన్నింటినీ పారదర్శకంగా, సింగిల్ విండో విధానంలో పూర్తి చేస్తున్నట్టు తెలిపారు. జేఎం భక్షి గ్రూపు చైర్మన్ కృష్ణ కోటక్ మాట్లాడుతూ ఈశాన్య ఆసియా, బంగాళాఖాతం పరిధిలో తూర్పు తీరం సరకు రవాణాకు ముఖద్వారంగా ఉందన్నారు. కంటైనర్ కార్గోలో విశాఖ గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందన్నారు. ఒకప్పుడు కేవలం 2000 కంటైనర్ల సామర్థ్యం ఉన్న నౌకలు మాత్రమే వచ్చేవని, ఇప్పుడు 8000 కంటైనర్ల సామర్థ్యం ఉన్న నౌకలు వస్తున్నాయన్నారు. ఇక సరకు రవాణాలో త్వరితగతిన గమ్యస్థానం చేరుకునేలా ప్రత్యేక రవాణా మార్గాలు ఏర్పాటు కావాల్సిన అవసరం ఉందన్నారు. సీఐఐ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు విజయ్ నాయుడు గల్లా అధ్యక్షత వహించగా, సీఐఐ లాజిస్టిక్ మెరైన్ ప్యానెల్ ప్రతినిధి అనిల్ నారాయణ ప్రసంగించగా, సీఐఐ విశాఖ చాప్టర్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు వందన సమర్పణ చేశారు.

*చిత్రం... సదస్సులో మాట్లాడుతున్న పోర్టు డిప్యూటీ చైర్మన్ పీఎల్ హరనాథ్