బిజినెస్

డిస్కంలకు రాష్ట్ర ప్రభుత్వాల బకాయిలు రూ. 41,700 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖలు విద్యుత్ సరఫరా సంస్థలకు (పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు) రూ. 41,700 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్ మంగళవారం నాడిక్కడ రాజ్యసభకు తెలిపారు. ఈ బకాయిలను నిర్ణీత కాలవ్యవధిలోగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయన సూచించారు. సరాసరి సాంకేతిక, వాణిజ్య (ఏటీ అండ్ సీ) నష్టాలు 22 శాతం 18 శాతానికి తగ్గాయన్నారు. ఉదయ్ పథకం ఫలితంగా ఈవిషయంలో కొంత అభివృద్ధి చోటుచేసుకుందని, ఇది మరింతగా జరగాల్సివుందన్నారు. డిస్కంలకు వస్తున్న నష్టాలను తగ్గించే విషయంలో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో పనిచేస్తుందన్నారు. ద్రవ్యోల్బణం, పరికరాల ధరల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అనేక డిస్కంలు ధరలను పునర్‌వ్యవస్థీకరించాలని కోరుతున్నాయన్నారు. ఈ విషయంలో ఒకటిరెండు డిస్కంలు మినహా దాదాపు అన్ని డిస్కంలు సమయానికి దరఖాస్తులను సమర్పిస్తున్నాయన్నారు. డిస్కంలలో చోరీలు, బిల్లింగ్, వసూళ్లలో అసమర్థత వంటి కారణాల వల్ల నష్టాలు తలెత్తుతున్నాయని సింగ్ తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో డిస్కంలకు రూ. 27,000 కోట్ల నష్టాలు వచ్చాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వివిద పథకాల ద్వారా కొన్ని వర్గాల ప్రజలకు రాయితీలు (సబ్సిడీలు) కల్పిస్తున్నాయని, ఇందుకు సంబంధించి డిస్కంలకు బకాయిలను సత్వరం చెల్లించాలని మంత్రి సూచించారు. డిస్కంలలో నష్టాలను అదుపుచేయడం కోసం వచ్చే మూడేళ్లలో స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల విధానాన్ని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరామన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇలాంటి మీటర్లు 7.5 లక్షలు ఏర్పాటు చేయగా విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారు. ప్రధానంగా ప్రభుత్వ శాఖల్లో ఈ మీటర్లను వినియోగించాలని సింగ్ సూచించారు.