బిజినెస్

మభ్యపెట్టే సెలబ్రిటీలపై నిషేధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: ప్రజలను తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనల్లో పాల్గొంటున్న సెలబ్రిటీలపై నిషేధం విధించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ గురువారం వెల్లడించారు. అయితే ఇటువంటి ప్రకటనల విషయంలో నిందితులుగా తేలిన సెలబ్రిటీలకు జైలు శిక్ష విధించాలని సంబంధిత పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసును అమలు చేస్తారా? లేదా? అనే దానిపై ఆయన ఏమీ చెప్పలేదు. పార్లమెంటరీ స్థారుూ సంఘం చేసిన సిఫారసుల ఆధారంగా సంబంధిత బిల్లుకు సవరణలను ఖరారుచేసే ముందు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో పాల్గొన్న సెలబ్రిటీల విషయంలో విదేశాల్లో అమల్లో ఉన్న చట్టాలను పరిశీలించాలని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల గ్రూపు ఆగస్టు నెలలో వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సూచించింది. ప్రజలను తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్న సెలబ్రిటీలకు 50 లక్షల రూపాయల జరిమానాతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని పార్లమెంటరీ స్థారుూ సంఘం సిఫారసు చేసింది. అయితే తప్పుడు వాణిజ్య ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే సెలబ్రిటీలపై చర్యలు తీసుకుంటామని, ఇందుకు సంబంధించి ప్రస్తుతం ఇతర దేశాల్లో అమల్లో ఉన్న చట్టాలను అధ్యయనం చేశామని పాశ్వాన్ తెలిపారు. తప్పుడు వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్న సెలబ్రిటీలకు కొన్ని దేశాల్లో జరిమానా విధిస్తుండగా, మరికొన్ని దేశాల్లో వారిపై మూడేళ్ల నిషేధం విధించడంతో పాటు అదే నేరం మరోసారి పునరావృతమైతే జీవితకాల నిషేధం విధిస్తున్నారని ఆయన విలేఖర్లకు వివరించారు. ఇటువంటి అంశాలన్నింటినీ గమనంలోకి తీసుకుని త్వరలో ఈ బిల్లును కేంద్ర మంత్రివర్గం ముందుకు తీసుకెళ్తామని పాశ్వాన్ చెప్పారు. అయితే వాణిజ్య ప్రకటనలతో ప్రజలను మోసగించినట్లు తేలిన సెలబ్రిటీలకు జైలు శిక్ష విధించాలని పార్లమెంటరీ స్థారుూ సంఘం చేసిన సిఫారసును తమ శాఖ ఆమోదిస్తుందా? లేదా? అనేదానిపై ఆయన ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి అమల్లో ఉన్న వినియోగదారుల రక్షణ చట్టాన్ని రద్దుచేసి, దాని స్థానంలో సరికొత్త వినియోగదారుల రక్షణ చట్టాన్ని తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు మరికొన్ని సవరణలు చేసేందుకు తమ శాఖ క్యాబినెట్ నోట్‌ను రూపొందింస్తోందని పాశ్వాన్ తెలిపారు. కొత్త చట్టంలో కఠినమైన నిబంధనలను పొందుపర్చామని, రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలను తప్పుదారి పట్టించే వాణిజ్య ప్రకటనల్లో సెలబ్రిటీలు పాల్గొనవద్దని, సదరు ఉత్పత్తులపై ఉన్న వివరాలను ప్రచారం చేసేందుకు మాత్రమే ఒప్పందాలను కుదుర్చుకోవాలని పాశ్వాన్ విజ్ఞప్తి చేశారు.