బిజినెస్

అంపశయ్యపై జిసిసి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, అక్టోబర్ 20: వరుస విభజనలతో గిరిజన సహకార సంస్థ చిక్కి శల్యవౌతోంది. రాష్ట్ర విభజన జరిగి మూడేళ్లు గడుస్తున్నా కనీసం తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సహకార సంస్థకు రిజిస్ట్రేషన్ చేయకపోవడం గమనార్హం. దీనివల్ల గిరిజన రైతులకు ఏటా ఇచ్చే వ్యవసాయ రుణాలు గత మూడేళ్లుగా అందడం లేదు. దీంతో వ్యవసాయ రుణాలు అందక గిరిజన రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఇటీవల తెలంగాణ సర్కారు చేపట్టిన జిల్లాల పునర్విభజన ఫలితంగా మరికొన్ని సొసైటీలు పక్క జిల్లాలకు తరలి భద్రాచలం డివిజన్ చిన్నదిగా మారిపోయింది. అనేక ఒడిదుడుకులు, వ్యాపారాలు లేక ఒకరకంగా జిసిసి (గిరిజన సహకార సంస్థ) అంపశయ్యపైకి చేరింది.
తగ్గిపోయిన డిపోలు, సబ్‌డిపోలు
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న భద్రాచలం గిరిజన సహకార సంస్థ డివిజనల్ కార్యాలయం పరిధిలో 8 సొసైటీలు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ఆర్డినెన్స్ కారణంగా ముంపు మండలాలు ఆంధ్రాలో కలిసిపోవడంతో కుక్కునూరు, చింతూరు సొసైటీలు వారికే వెళ్లిపోయాయి. దీంతో 189 ఉన్న జిసిసి డిపోలు, సబ్‌డిపోల సంఖ్య 164కు పడిపోయింది. తాజాగా తెలంగాణ సర్కారు జిల్లాల పునర్విభజన పేరుతో భద్రాచలం డివిజన్‌లోని వాజేడు, వెంకటాపురం మండలాలను ప్రొఫెసర్ జయశంకర్ భూపాల్‌పల్లి జిల్లాలో విలీనం చేశారు. ఇక ఇల్లెందు సొసైటీ పరిధిలోని గార్ల, బయ్యారంలు కూడా మహబూబ్‌బాద్ జిల్లాలో కలిపేశారు. ఇటు దమ్మపేట సొసైటీ నుంచి సత్తుపల్లిని ఖమ్మం జిల్లాలో కలిపారు. వెంకటాపురం సొసైటీ పక్క జిల్లాలో కలుస్తుండగా ఇల్లెందు, దమ్మపేట సొసైటీల పరిధిలోని జిసిసి డిపోలు, సబ్‌డిపోలు ఖమ్మం జిల్లాకు వెళ్తున్నాయి. దీంతో తాజాగా భద్రాద్రి జిల్లాలో ఉన్న భద్రాచలం డివిజనల్ కార్యాలయం పరిధిలోని జిసిసి సొసైటీలు నికరంగా 5కు చేరాయి. జిల్లాల పునర్విభజనతో 25 డిపోలు, సబ్‌డిపోలు వెళ్లిపోయాయి. ఇపుడు అవి కాస్తా 139కి పడిపోయాయి. అసలే వ్యాపారాలు అంతంత మాత్రం. నష్టాల్లో కూరుకుపోయి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు తంటాలు పడుతున్న జిసిసిపై వరుస విభజనలు మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది.
రిజిస్ట్రేషన్‌కే దిక్కులేదు..
తెలుగు రాష్ట్రాలు విడిపోయాక తెలంగాణాకు మారిన భద్రాచలం డివిజన్ సొసైటీకి నేటికీ రిజిస్ట్రేషన్ చేయించలేదు. ఫలితంగా పథకాల అమలు నిలిచిపోయింది. గిరిజన రైతులు వ్యవసాయం చేసేందుకు జిసిసినే ఏటా పంట రుణాలు ఇస్తుంది. మిరప, వరి పంటలకు ఎకరాకు రూ.10వేలు చొప్పున 2వేల మంది రైతులు ప్రతీ సంవత్సరం జిసిసి నుంచి వ్యవసాయ రుణాలు తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ లేదని జిసిసి అధికారులు గత మూడేళ్ల నుంచి రుణాలు ఇవ్వడం లేదు. ఈ ప్రక్రియపై నేటికీ ఒక స్పష్టత రాలేదు. దీంతో జిసిసి మనుగడపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.9.50కోట్ల అటవీఫలసాయాల కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్న జిసిసికి అడుగడుగునా ప్రతిబంధకాలే ఎదురౌతున్నాయి. అటవీఫలసాయాలు కొనే పరిస్థితి లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో జిగురు ఇతర ప్రాంతాల నుంచి వస్తుండటంతో 400క్వింటాళ్ల జిగురు కొనే నాథుడు లేక గోదాముల్లో మూలుగుతోంది. హైదరాబాదు, ముంబై నుంచి వచ్చే వ్యాపారులు రావడం లేదు. దీంతో ఈ ఏడాది జిగురును కొనడం జిసిసి నిలిపివేసింది. మొత్తం మీద రూ.45కోట్ల వ్యాపారానికి గండిపడింది. మిగిలిన అటవీఫలసాయాలు విప్పపువ్వు, చింతపండు, ముష్టిగింజలు, తేనె సేకరణ కూడా గిరిజనుల నుంచి తగ్గింది. కేవలం నిత్యావసర వస్తువులు, ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లకు సరఫరాపైనే జిసిసి నడుస్తోంది. అంపశయ్యపై ఉన్న జిసిసికి తక్షణం చికిత్స అవసరం. ప్రభుత్వం చొరవ తీసుకోకపోతే జిసిసి తెరమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. అదేగనుక జరిగితే గిరిజనుల మనుగడే ప్రశ్నార్ధకంగా మారే అవకాశం ఉంది.

చిత్రం..భద్రాచలంలోని గిరిజన సహకార సంస్థ కార్యాలయం