బిజినెస్

డెబిట్ కార్డులకు ముప్పు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, అక్టోబర్ 20: దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన సుమారు 32 లక్షల డెబిట్ కార్డులకు సంబంధించిన ఆర్థిక సమాచారం చోరీ అయినట్లు గుర్తించడంతో సంబంధిత బ్యాంకులు 32 లక్షలకు పైగా డెబిట్ కార్డులను బ్లాక్ చేయడమో, లేక వాపసు తీసుకోవడమో చేశాయి. ఒక ప్రైవేటు బ్యాంకుకు చెందిన ఎటిఎం సర్వీసులను నిర్వహించే ఒక పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్ వద్ద ఈ సమాచారం లీకయినట్లు తెలుస్తోంది. ఎస్‌బిఐ బ్యాంక్ ఇప్పటికే ఆరులక్షలకు పైగా డెబిట్ కార్డులను రీకాల్ చేయగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆంధ్రాబ్యాంక్ లాంటి మరి కొన్ని బ్యాంకులు ముందు జాగ్రత్త చర్యగా తమ ఖాతాదారులకు కొత్త డెబిట్ కార్డులను మంజూరు చేశాయి. మరో వైపు ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, యెస్ బ్యాంక్‌లాంటి మరికొన్ని బ్యాంకులయితే తమ ఎటిఎం పిన్ నంబర్లను మార్చుకొమ్మని కస్టమర్లకు సలహా ఇస్తున్నాయి. అంతేకాకుండా ఏదయినా లావాదేవీలు జరిపేటప్పుడు తమ బ్యాంక్ ఎటిఎంలనే ఉపయోగించుకోవాలని వారికి సూచిస్తున్నాయి. యెస్ బ్యాంక్‌కు సేవలందించే హిటాచీ పేమెంట్ సర్వీసెస్‌లలోని సిస్టమ్స్‌లోకి మాల్‌వేర్‌ను చొప్పించడం ద్వారా ఈ సమాచారం చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. హిటాచీ యెస్ బ్యాంక్‌కు ఎటిఎం సర్వీసులు, పాయింట్ ఆఫ్ సేల్ సర్వీసులు ఎమర్జింగ్ పేమెంట్ సర్వీసులు, క్యాష్ రీసైక్లింగ్ ఎటిఎంలు, ఆటో పాస్‌బుక్ ఎంట్రీ మిషన్లులాంటి ద్వారా ఎటిఎం సేవలు అందిస్తోంది. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీ ఔట్ సోర్సింగ్ పనులపై మరింత ఎక్కువ నిఘా ఉండాల్సిన అవసరం ఉందని యెస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాణా కపూర్ అంటున్నారు.
ప్రస్తుతం వైరస్ బారిన పడిన 32 లక్షల కార్డుల్లో 26 లక్షలు వీసా, మాస్టర్ కార్డు ప్లాట్‌ఫామ్‌లకు చెందినవి కాగా, మరో 6 లక్షల కార్డులు రూపేకు సంబంధించినవి ఉన్నాయి. డేటాచోరీ కారణంగా కొన్ని కార్డులు రిస్క్‌లో పడే ప్రమాదం ఉందని ఈ సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా సంబంధిత నెట్‌వర్క్‌లు గుర్తించిన కస్టమర్లకు చెందిన కార్డులను బ్లాక్ చేయడం జరిగిందని ఎస్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, డాటా చోరీ మే జూన్ నెలల మధ్యలో జరిగిందని అయితే సెప్టెంబర్‌లో మాత్రమే దీన్ని కనుగొనడం జరిగిందని, ఎస్‌బిఐ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మంజు అగర్వాల్ చెప్పారు. ఫైనాన్షియల్ డేటా చోరీ అయిందని తెలిసిన వెంటనే తమ ఎటిఎం కార్డుల పిన్ నంబర్లను మార్చుకోవాలని కస్టమర్లను కోరడం జరిగిందని, అయితే 7 శాతం మంది కస్టమర్లు మాత్రమే పిన్ నంబర్లు మార్చుకున్నారని, దీంతో కస్టమర్లు రిస్క్‌లో పడకూడదనే ఉద్దేశంతో కార్డులనే రీకాల్ చేయాలని నిర్ణయించామని ఆమె చెప్పారు. అయితే బ్యాంక్ ఎన్ని కార్డులను వెనక్కి తీసుకుందో ఆమె చెప్పలేదు కానీ, ఆరులక్షలదాకా ఉండవచ్చని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, బ్లాక్ చేసిన కార్డుల స్థానంలో కొత్త కార్డులను బ్యాంక్ ఎలాంటి రుసుమూ వసూలు చేయకుండానే సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను, ఇలాంటి సంఘటనలు జరక్కుండా తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను తెలపాల్సిందిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ బ్యాంకులను కోరినట్లు తెలుస్తోంది. తమ అంతర్జాతీయ డెబిట్ కార్డులపై చైనానుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు కొంతమంది కస్టమర్లు తమకు ఫిర్యాదు చేసినట్లు బ్యాంకులు చెబుతున్నాయి. ప్రస్తుతం వీసా భారత్‌లో డొమెస్టిక్ డెబిట్ ఎటిఎం లావాదేవీలను నిర్వహించడం లేదు. కాగా, తమ సిస్టమ్‌లు ఎలాంటి డాటా చోరీకి లోను కాలేదని మాస్టర్ కార్డ్ తెలిపింది. ఒక వేళ కస్టమర్లు ఎవరికయినా తమ ఖాతాలకు సంబంధించి అనుమానాలు వచ్చిన పక్షంలో వెంటనే సంబంధిత బ్యాంకును సంప్రదించాలని కూడా మాస్టర్ కార్డ్ ఒక ప్రకటనలో తెలిపింది.