బిజినెస్

డిపాజిట్లపై రైస్ మిల్లర్ల అసంతృప్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, అక్టోబర్ 24: ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం సేకరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండటంతో ఈ ఏడాదైనా డిపాజిట్ల సేకరణ యోచన విరమించుకోవాలని రైస్ మిల్లర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. నిరుడు మిల్లర్ల నుండి భారీ ఎత్తున డిపాజిట్లను వసూలు చేయడంతో చిన్న తరహా మిల్లర్లు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సీజన్‌లో డిపాజిట్ల భారం నుండి విముక్తి కల్పించాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, తూర్పు గోదావరి జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావులకు ఇటీవల తూర్పు గోదావరి జిల్లా మిల్లర్లు విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రులు హామీ ఇవ్వడంతో, అధికారిక ఉత్తర్వుల కోసం మిల్లర్లు ఎదురుచూస్తున్నారు. గత సంవత్సరం ధాన్యం సేకరణ సామర్థ్యం మేరకు ఒక్కొక్క మిల్లర్ 12 లక్షల నుండి రెండు కోట్ల రూపాయల వరకు డిపాజిట్ చేయాల్సి వచ్చింది. ధాన్యం సేకరణ ప్రక్రియకు ముందు ప్రభుత్వానికి హామీగా డిపాజిట్లను అధికారులు సేకరించారు. సీజన్ ముగిసిన తరువాత మిల్లర్లకు డిపాజిట్లను తిరిగి వెనక్కి ఇచ్చేశారు. అయతే నిరుడు ఎక్కడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరణ ప్రక్రియను విజయవంతం చేశామని, తమపై పూర్తి నమ్మకాన్ని ఉంచి, ఈ ఏడాది డిపాజిట్లు సేకరించరాదని మిల్లర్లు ప్రభుత్వాన్ని కోరారు. డిపాజిట్‌ను తప్పనిసరి చేసిన పక్షంలో బడా మిల్లర్లకు సమస్య కాకపోయినా, చిన్న మిల్లర్లకు శిరోభారం తప్పదని పలువురు పేర్కొంటున్నారు. అలాగే గత సంవత్సరం రైతులకు సొమ్ము చెల్లింపులో నిర్లక్ష్యం జరిగిందని, దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవల్సి వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సంవత్సరం రైతులకు సకాలంలో ధాన్యం సొమ్ము (మద్దతు ధర) చెల్లించేలా చర్యలు తీసుకోవాలని మంత్రులకు మిల్లర్లు విజ్ఞప్తి చేశారు. కాగా, తూర్పు గోదావరి జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్‌లో రైతుల నుండి ధాన్యం సేకరణ ప్రక్రియను నవంబర్ మొదటి వారంలో ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోగా అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 2 లక్షల 25 వేల హెక్టార్లలో వరి సాగయ్యింది. దీని ద్వారా 11 లక్షల 50 వేల నుండి 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వరకు ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. ఇందులో మూడో వంతు ధాన్యం జిల్లాలో రైతుల అవసరాలకు పోను మిగిలిన సుమారు 9 లక్షల టన్నుల ధాన్యం విక్రయానికి రానుంది. క్వింటాలుకు గ్రేడ్-ఎ రకానికి రూ. 1,550, సాధారణ రకానికి రూ. 1,470 ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించింది. 75 కేజీల బస్తాకు (గ్రేడ్-ఎ రకం) రూ. 1,132, సాధారణ రకానికి రూ. 1,102 చెల్లిస్తారు.