రిస్క్ అవసరమా అంటారు! - నాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాలు కొత్తగా రావడంలేదని మనమే చాలాసార్లు అనుకుంటాం. అలాంటి కొత్త కథ వస్తే ఎందుకు మనమే ఎంకరేజ్ చేయకూడదు అనే ఆలోచనతో చేసిన సినిమా ‘అ!’. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నిజంగా కొత్తగా వుందని ఫీల్ అవుతారని అంటున్నాడు నిర్మాతగా మారిన నాని. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని, నాచురల్ స్టార్‌గా తనదైన సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే డబుల్ హ్యట్రిక్ విజయాలను అందుకున్న నాని, ‘అ!’ సినిమాతో నిర్మాతగా మారాడు. కొత్త దర్శకుడు ప్రశాంత్ వర్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం నేడు విడుదలవుతున్న సందర్భంగా నానితో ఇంటర్వ్యూ..
* నిర్మాతగా మారారు, టెన్షన్ పడుతున్నారా?
- తప్పదు. ఏ నిర్మాతకైనా, హీరోకైనా సినిమా విడుదల ముందు టెన్షన్లు ఉంటాయి. నిర్మాతకైతే ఇంకొన్ని బాధ్యతలు ఎక్కువ. ప్రతీ విషయంలోనూ మనమీద వున్న బాధ్యత అందరితో మనం సృష్టించుకున్న పేరు లాంటివన్నీ పెడుతున్నాం కాబట్టి రిస్కే.
* ఇంత రిస్క్ అవసరమా అని అన్పించిందా?
- తప్పకుండా ఉంటుంది. ఒక్కోసారి చేస్తున్న విషయంలో ఆ యాంగిల్ తప్పదు. హీరోగా బాగానే ఉన్నాడు కదా, ఎందుకు వీడికి అవసరమా అని కూడా అనుకుంటారు. ఈ సినిమా చేయడం నాకు నచ్చింది. ఎందుకంటే పరిశ్రమలో కొత్త తరహా సినిమాలు రావడంలేదు అనుకునేవారికి ఇది సమాధానం లాంటిది. ఇలాంటి ప్రయత్నాలు వేరెవరో చేస్తారని ఆశించేదానికంటే మనం చేస్తే బెటర్ అనే ఆలోచనతో నేనే మొదలుపెట్టా.
* అటు హీరోగా, ఇటు నిర్మాతగా రెండు బాధ్యతలు ఎలా?
- నిజం చెప్పాలంటే చాలా కష్టతరమైన పని. ఓ వైపు గోవాలో కృష్ణార్జునయుద్ధం షూటింగ్ జరుగుతోంది. ఆ షూటింగ్ చూసుకుంటూనే మధ్యలో ఈ సినిమాకు సంబంధించిన వ్యవహారాలు డీల్ చేయడం, బిజినెస్ లాంటివి చేయడానికి నిద్దరలేని రాత్రుల్ని ఎన్నో గడిపా.
* నిర్మాతలమీద గౌరవం పెరిగిందన్నారు?
- నాకెప్పుడూ నిర్మాతలంటే గౌరవమే. కాకపోతే ఈ సినిమావల్ల వాళ్లు పడే ఇబ్బందులు, చేసే పనులు తెలిశాయి.
* బిజినెస్ పరంగా ఎలా ఉంది?
- మనం సినిమా విషయంలో మరోలా ఆలోచిస్తున్నాం. ప్రతిదీ కూడా కమర్షియల్‌గానే ఉంటుంది తప్ప క్రియేటివిటీ విషయంలో వెనుకబడుతున్నాం. ఉదాహరణకు నచ్చిన పెయింటింగ్‌ను కొనుక్కోవాలి కానీ మనకు నచ్చినట్టు ఆర్టిస్టుతో గీయించుకుంటున్నాం. దానివల్ల ఆ పెయింటర్‌లో వున్న క్రియేటివిటీ పోతోంది. ప్రతి సినిమా విషయంలో కాంబినేషన్లు, బిజినెస్ ఎంత వస్తుంది, ఎంత పోతోంది అంటూ లెక్కలు వేయడంవల్ల ఫలితాలు తారుమారు అవుతున్నాయి. కానీ ఈ సినిమా విషయంలో నేను నమ్మినదాన్ని తీశా.
* ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు?
- తప్పకుండా మెచ్చుకుంటారు. అయితే ఇది అందరికీ నచ్చాలని చేసిన సినిమా కాదు. ఏ సినిమా కూడా వంద శాతం నచ్చదు.
* కొత్త దర్శకుడిని ఎలా నమ్మారు?
- తను మణికొండలో కూర్చుని ఇలాంటి అద్భుతమైన కథ రాయగలిగాడంటే, అతని ఆలోచనా విధానం కొత్తగా వుందని అర్థమైంది. తనకు సరైన ఫ్రీడం కల్పిస్తే తప్పకుండా అద్భుతాలు ఆవిష్కరిస్తాడని అన్పించింది. అందుకే నిర్మాతగా మారాను.
* కాజల్, రెజీనా, నిత్యాలు మీకోసం చేశారా?
- వాళ్ళు కూడా కథను బాగా నమ్మారు. ఇందులో వాళ్ళు చేసిన తక్కువ సీనే్ల అయినా ఓ నిర్మాతగా వాళ్ళకు ఇవ్వాల్సింది ఇచ్చేశా. ఎవరు లెక్కలు వాళ్ళకు సరిపోతాయి.
* మీ బ్యానర్‌లో నటిస్తారా?
- ఖచ్చితంగా నటించను. ఎందుకంటే నేను ఈ రోజు ఇంతవాణ్ణి అయ్యానంటే కారణం నిర్మాతలు, దర్శకులు నమ్మి నాతో సినిమాలు చేశారు. అష్టాచమ్మానుంచి మొదలైన నా కెరీర్ ఇలా హ్యాపీగా సాగుతోంది. ఇప్పుడు డబ్బులు వచ్చాయని నా స్వంత బ్యానర్ పెట్టుకుని నేనే సినిమాలు తీసుకుంటే తప్పు. నా బ్యానర్‌లో కొత్త కథ అని నాకు అన్పిస్తే తప్ప సినిమా నిర్మించను.
* అవార్డులకోసం ప్రయత్నిస్తున్నారా?
- కొత్త కథ అని చేస్తున్న ప్రయత్నం ఇది. కొంతమంది అవార్డుల విషయంలో కూడా సలహాలు అందిస్తున్నారు. మా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
* తదుపరి చిత్రాలు?
- కృష్ణార్జునయుద్ధం షూటింగ్ జరుగుతోంది. దాంతోపాటు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా అనుకుంటున్నాం.

- శ్రీ