అక్షర

చెంచుల జీవనం ‘మరణం అంచున’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరణం అంచున
-వర్ధెల్లి వెంకటేశ్వర్లు
పేజీలు: 110,వెల: రు.75/-
ప్రచురణ: అడుగుజాడలు పబ్లికేషన్స్, హైదరాబాద్
అన్ని పెద్ద పుస్తక షాపుల్లో లభ్యం.

నల్లమల అడవిలో వందలాది ఏళ్లుగా జీవనం సాగిస్తున్న చెంచులను ఆధునికత, అభివృద్ధి పేరిట ప్రభుత్వాలు బలి తీసుకుంటున్న వైనాన్ని సవివరంగా తెలిపిన పుస్తకం ‘మరణం అంచున’
రచయిత వర్ధెల్లి వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా పాత్రికేయుడు. పర్యటన, పరిశోధన ఆయన ఇష్ట నైపుణ్యాలు. ఆ క్రమంలో ఆయన నల్లమలను పలుసార్లు సందర్శించి ప్రజలతో స్నేహ సంబంధాలు పెంచుకుని, చెంచుల మూలాల్లోంచి పరిశోధన గావించి సమగ్ర సమాచారాన్ని సేకరించి ఈ పుస్తకంలో నిక్షిప్తం చేసారు. ఈ కార్యాచరణను అంతా ఆయన తన వృత్తి ధర్మానికి న్యాయం చేసిన లెక్కలో వేయవచ్చు.
చెంచుల పుట్టుక, వ్యవసాయం-పద్ధతులు, ఆహారపు అలవాట్లు, కుటుంబాలు-ఆచారాలు, సంస్కృతి- దేవుళ్లు, పండుగలు వివాహాది ఆచారాలు ఇలా అంశాల వారీగా జీవన సర్వస్వాన్ని చాయా చిత్రాలతో సోదాహరణంగా రచయిత ఇందులో పేర్కొన్నారు.
చెంచుల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు పథకాలు రచిస్తున్నట్టు నటిస్తూ మోసకారి మాటలతో, దొంగ లెక్కలతో వారిని సమూలంగా మట్టుపెట్టే కుట్రలను ఈ పుస్తకం బట్టబయలు చేస్తుంది.
చెంచులకు ఆధునిక వ్యవసాయం పరిచయం చేసినట్టు, విద్య, వైద్యం సదుపాయాలు కల్పించినట్టు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. కానీ అసలు లెక్కంతా వేరేవుంది. రచయిత తన క్షేత్ర పర్యటన ద్వారా ఆ నివేదికల డొల్లతనాన్ని కోట్లాది రూపాయల దుర్వినియోగాన్ని బహిర్గతపరిచారు.
నిజానికి చెంచులకు సొంత జీవన విధానం ఉంది. అటవీ ఉత్పత్తుల్లోంచి వారి ఆహారాన్ని, వైద్యాన్ని, ఇతర జీవన వసతులను సమకూర్చుకుంటూ బయటి ప్రపంచానికి దూరంగా, ఆ సమాజానిపై ఏమాత్రం ఆధారపడకుండా జీవనం సాగిస్తున్నారు.వీలైతే ప్రభుత్వాలు వారి అవసరాలను తెలుసుకుని క్రమంగా మెల్లమెల్లగా ఎలాంటి వత్తిడి చేయకుండా, వారి అభీష్టానికి అనుగుణంగా మార్పు తీసుకురావచ్చు. ఆ అవసరం, ఓపిక ప్రభుత్వాలకు లేవు. వారికి కావాల్సింది బహుళజాతి సంస్థల ప్రయోజనం. నయానో, భయానో చెంచులను ఖాళీ చేయించి తవ్వకాలు ఆరంభించి, నల్లమలను బొందల గడ్డగా చేయడమే దాని సంకల్పం. ఇదివరకే పలుమార్లు చెంచులను మైదాన ప్రాంతాలకు తరలించారు. అడవిని వదిలి తాము బతకలేమని మొత్తుకున్నా ఇది అటవీ భూమి అంటూ చెంచులను బయటకు లాగి గుడిసెలకు నిప్పుపెట్టారు. ఇలాంటి ప్రతి సందర్భంలోను కొత్త వాతావరణంలో ఇమడలేక చెంచులు కుప్పలు తెప్పలుగా చనిపోయారని రచయిత లెక్కలతో సహా వివరించారు.
దాదాపు 15 ఏళ్లుగా చెంచు జీవన విధానాన్ని, వారికి జరుగుతున్న నష్టాన్ని, జీవన విధ్వంసాన్ని పరిశీలిస్తున్న రచయిత-‘‘ఏ పెంట కదిపినా కన్నీటి వ్యధలే. ఏ చెంచు గుడిసె చూసినా చావు కథలే. ఈ మరణాలను వెలికి తీసి బయటి ప్రపంచానికి తెలిపే ప్రయత్నమే ఈ ‘మరణం అంచున’ పుస్తకం’’ అంటారు.
‘మరణం అంచున’ ఉన్న చెంచుల జీవితం మరణం తప్పిపోయే ప్రయత్నం కన్నా మరణమే తథ్యమనే దిశగా సాగుతుందని రచయిత పరిశోధన సూచిస్తుంది. ఒక పాత్రికేయుడిగా రచయిత వెంకటేశ్వర్లు తన గురుతర బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తించారు. చీకటి కోణాన్ని బయటి ప్రపంచానికి తెలియజేయడంలో ఆయన కృతార్థుడయ్యాడు. ఇందులోని సమాచారమంతా ఎంతో ఆందోళనకు గురి చేస్తుంది. పౌర సమాజం, హక్కులు, సంఘాలు, ప్రజాస్వామిక సంస్థలు తమ కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని ఆ పుస్తకం ఘోషిస్తున్నది.
చెంచుల జీవితంపై తక్కువ పేజీలలో నిర్దిష్టమైన సమాచారాన్ని సులభరీతిలో సరళ భాషలో వివరించిన రచయితకు అభినందన చిన్నమాట.

-బి.నర్సన్