కర్నూల్

కమీషన్ల కోసం కక్కుర్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 22:కమీషన్ల కోసం ఇష్టానుసారంగా ఆరోగ్యశ్రీ నిధులు ఖర్చు చేసిన వైనం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో వెలుగులోకి వచ్చింది. పేరుకు పెద్దాసుపత్రి అయినా వసతులు మాత్రం ఆ స్థాయిలో లేవని చెప్పవచ్చు. ఆరోగ్యశ్రీ నిధులు ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నా ఏడేళ్ల నుంచి ఆడిటింగ్ జరగకపోవడం ఉద్యోగులకు వరంగా మారింది. ఆసుపత్రిలోని ఓ ఉద్యోగి కాంట్రాక్టర్ అవతారమెత్తి దాదాపు రూ. 9 లక్షల విలువైన పనులు చేసినట్లు రికార్డులు చూపుతున్నాయి. హెచ్‌డిఎస్ నిధుల కింద ఖర్చు చేసినట్లు చూపినట్లు తెలుస్తోంది. ఆసుపత్రికి ఒకొక్కటి రూ. 66 వేల చొప్పున ఖర్చు చేసి 14 ఏసిలు కొనుగోలు చేశారు. ఏసిలు అవసరం లేకున్నా ఆరోగ్యశ్రీ కింద వాటాల కోసం కొనుగోలు చేశారన్న విమర్శలు లేకపోలేదు. కేవలం కమీషన్ కోసమే ఏసిలు, వెంటిలేటర్లు తదితర వాటిని కొనుగోలు చేసి లక్షలాది రూపాయలు వృథా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రికి వస్తున్న నిధులను ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారు. అయినా రోగులకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోతున్నారని ప్రజలు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) పథకాన్ని ప్రవేశపెట్టి వాటి ద్వారా వచ్చే నిధులను ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధికి వినియోగించాలని నిర్ధేశించింది. అందుకు భిన్నంగా కర్నూలు పెద్దాసుపత్రిలో నిధులు ఖర్చు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆసుపత్రికి ప్రతి రోజూ దాదాపు 3వేల మంది రోగులు వస్తున్నారు. వారికి కనీసం కూర్చొనేందుకు కుర్చీలు కానరావు, ఆసుపత్రి అభివృద్ధికి జిల్లా ప్రతినిధులు తమ నిధుల నుంచి పైసా ఇవ్వడం లేదు. ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ నుంచి వచ్చే నిధులనే జాగ్రత్తగా ఖర్చు చేయాల్సి ఉంది. అయితే కొందరు అధికారులు వాటాల కోసం, సొంత ప్రయోజనాల కోసం నిధులు దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నిధులపై ఏడేళ్ల నుంచి ఆడిటింగ్ లేకపోవడంతో అధికారులు ఆడింది ఆట.. పాడింది పాటగా మారిందన్న విమర్శలు ఉన్నాయి. 1036 వ్యాధులకు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించుకోవాలి. కర్నూలు పెద్దాసుపత్రిలో 8 ఏళ్ల కాలంలో దాదాపు 35 వేల మంది రోగులకు చికిత్స అందించగా ఆరోగ్యశ్రీ కింద దాదాపు రూ. 78 కోట్లకు పైగా వచ్చిందని రికార్డులు వున్నాయి. ఇందులో 45 శాతం ఆసుపత్రికి, 20 శాతం ఆరోగ్యశ్రీ ట్రస్టుకు, 35 శాతం వైద్యులు, సిబ్బందికి పారితోషికం రూపంలో చెల్లించాలి. 45 శాతం నిధులు అంటే దాదాపు రూ. 27 కోట్ల ఆదాయం ఆసుపత్రికి వచ్చింది. ఈ నిధులతో పాత భవనాల మరమ్మతులు, మందుల కొనుగోలు, కార్డియోథెరాసిక్ సర్జరీ విభాగానికి దాదాపు రూ. 21 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో రూ. 6 కోట్లు మిగలగా రూ. 3 కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులకు వైద్యాధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఏడేళ్లలో ఆసుపత్రికి ఖర్చు చేసిన రూ. 23 కోట్లకు ఎలాంటి ఆడిటింగ్ లేకపోవడం పలు విమర్శలకు దారితీసింది. వైద్యశాలకు వచ్చే చాలా మంది రోగులకు కనీసం వీల్‌చైర్లు, స్ట్రక్చర్లు కనీస సంఖ్యలో లేవు. తప్పని పరిస్థితుల్లో రోగి బంధువులే రోగులను తమ భుజాలపై మోసుకుని రావాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది. మరోవైపు కొందరు సిబ్బంది వీల్‌చైర్లు, స్ట్రక్చర్లను తమ ఆధీనంలో ఉంచుకుని రోగిని తరలించేందుకు ముక్కుపిండి నగదు వసూలు చేస్తున్నారు. మందులు సైతం పూర్థిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో రోగులు నగదు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఇకనైనా కలెక్టర్ స్పందించి పెద్దాసుపత్రిలో జరిగే నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మహిళల చట్టాలపై
అవగాహన పెంచుకోవాలి
* రాష్ట్ర కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం
కర్నూలు, జనవరి 22:మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దౌర్జన్యాలు, హింసను ఎదుర్కొనేందుకు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్ర కమిషన్ చైర్‌పర్సన్ త్రిపురాణ వెంకటరత్నం సూచించారు. మహిళా చట్టాలపై శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఏర్పా టు చేసిన అవగాహన సదస్సును చైర్‌పర్సన్, కలెక్టర్ విజయమోహన్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్‌పర్సన్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను నివారించేందుకు చట్టాలపై అవగాహనను పెంచుకోవాలని సూ చించారు. స్వయం సహాయక సంఘా లు ఏర్పడిన తర్వాత మహిళలు ఆర్థిక సాధికారత సాధించడమే తప్ప సామాజిక, రాజకీయ సాధికారతలో పూర్తిగా వెనుకబడి ఉన్నారన్నారు. ఎన్ని చట్టా లు చేసినా మహిళలు సమాజంలో పురుషులతో సమానమైన హక్కును కోల్పోతున్నారన్నారు. గర్భస్థ పిండం మొదలుకుని శ్మశానం వెళ్లే వరకూ స్ర్తిల మీద దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గౌరవాన్ని కించపరిచే జోగిని వ్యవస్థను సమూలంగా నిర్మూలించేందుకు మ హిళా సంఘాల సభ్యులు కార్యోణ్ముఖులు కావాలని సూచించారు. వివాహ రిజిస్ట్రేషన్ చట్టాల ప్రకారం ప్రతి వివాహానికి సర్ట్ఫికెట్ మంజూరు చేసే విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్ విజయమోహన్ మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘం పటిష్ట రూపకల్పనకు ప్రభుత్వం ఎన్నో ప్రణాళికలు రూపొందించి మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మీ మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరిగే అవగాహన కార్యక్రమంలో చట్టాల గురించి తెలుసుకుని మహిళా సంఘాల పురోగతికి తోడ్పడాలన్నారు. మహిళా సంఘాలకు ముఖ్యమంత్రి ఏదో చేయాలని నిత్యం ఆలోచిస్తూ అభివృద్ధికి ప్రణాళిక చేస్తున్నారన్నారు. పెట్టుబడి కింద ప్రతి మహిళకు రూ. 10 వేలు అందజేస్తామన్నారు. సమావేశంలో జడ్‌పి చైర్మన్ రాజశేఖర్, మహిళా కమిషన్ సభ్యులు ఎల్.్ఫరోజ్‌బేగం, హైకోర్టు న్యాయవాదులు అన్నపూర్ణ, నంద, డిఆర్‌డిఎ పిడి రామకృష్ణ, స్ర్తి శిశు సంక్షేమశాఖ ఇన్‌చార్జి పిడి అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.
జంబ్లింగ్ పద్ధతిలోనే
ఇంటర్ ప్రాక్టికల్స్
* ల్యాబుల్లో కనీస వసతులు కరవు..
* ఆందోళనలో ప్రైవేట్ కళాశాలలు..
కర్నూలు అర్బన్, జనవరి 22:ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఈ ఏడాది నుంచి జంబ్లింగ్ పద్ధతిలోనే నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించడం తో ప్రైవేట్ కళాశాలల్లో ఆందోళన మొ దలైంది. ప్రభుత్వం, ఇంటర్మీడియట్ బోర్డు విద్యార్థులకు సబ్జెక్టు జ్ఞానంతో పాటు ప్రాక్టికల్స్‌పై కూడా పట్టు వుండాలని ప్రవేశపెట్టారు. అయితే ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వం నుంచి అంతం త మాత్రం వచ్చే నిధులతో ప్రయోగశాలను ఆధునీకరించుకుంటూ విద్యార్థులకు దీనిపై తర్ఫీదు ఇస్తున్నారు. కానీ ప్రైవేట్ కళాశాలల్లో కేవలం సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇచ్చి ఎంసెట్, ట్రిపుల్ ఐటి, జిప్‌మెర్ తదితర పరీక్షల్లో సీట్లు సా ధించాలని లక్ష్యంగా పెట్టుకుని ప్రాక్టికల్స్ చేయించకుండా ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల కింద 213 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ సారి ఎంపిసి, బైపిసితో పాటు ఒకేషనల్ కోర్సుల నుంచి మొత్తం 20, 338 మంది విద్యార్థులు ప్రాక్టికల్ పరీక్షలకు హాజరు కానున్నారు. అందుకో సం 59 కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రాక్టికల్ పరీక్షలకు ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులు సిద్ధమయ్యారు. ఇక ప్రైవేట్ విషయానికి వస్తే జంబ్లింగ్ పద్ధతిలో ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండడంతో విద్యార్థుల కంటే యాజమాన్యాల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలను జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించరాదని వారు రెండు రోజుల పాటు చేపట్టిన ఆందోళనలే ఇందుకు నిదర్శనం. ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి వేలాది రూపాయల్లో ఫీజులు వసూలు చేస్తున్నారే తప్ప వారికి కావాల్సిన వసతులు కల్పించలేదన్న ఆరోపణులు వున్నాయి. క్రీడా మైదానం, ప్ర యోగశాల లేకపోయినా కళాశాల తని ఖీ సమయంలో అధికారులను మభ్యపెట్టడం, ప్రయోగశాల పరికరాలను అద్దెకు తీసుకొచ్చి వారికి చూపించడం, కాస్తోకుస్తో రాజకీయ పలుకుబడి వాడి మాముళ్లతో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. విద్యార్థులకు అసలు ప్రయోగశాలలో ఎటువంటి ప్రయోగాలు చేయాలన్న సాధరణ జ్ఞానం లేకుండా పోయింది. ప్రైవేట్ కళాశాలల్లో విద్యార్థులకు ప్రాక్టికల్స్ చేయించకుండా కేవలం ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలే ప్రధాన అంశంగా తీసుకుని వారిని మార్కుల పేరుతో ఒత్తిళ్లకి గురి చేస్తున్నారు. ముఖ్యంగా ఎంపిసి, బైబిసి, ఒకేషనల్ విద్యార్థులకు సబ్జెక్టుతో పాటు ప్రాక్టికల్స్ జ్ఞానం ఉండాలి. కానీ ఇక్కడ కేవలం సబ్జెక్టు తప్ప ప్రాక్టికల్స్‌పై ఎటువంటి జ్ఞానం కానీ, అవగాహన కానీ లేకుండా పోయాయి. పబ్లిక్ పరీక్షలు మాదిరిగానే ప్రాక్టికల్ పరీక్షలను కూడా జంబ్లింగ్ పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం, ఇంటర్ బోర్డు 2008 నుంచి చెబుతూ వస్తున్నాయి. అయితే ప్రైవేట్ కళాశాలలు ధనం, రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తూ జంబ్లింగ్‌ను వాయిదా వేయిస్తూ వచ్చాయి. కానీ ప్రభుత్వం ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో ప్రాక్టికల్స్ జంబ్లింగ్ పద్ధతిలోనే నిర్వహించాలని దృఢ సంకల్పంతో ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు ఏమి చేయాలో.. ఎలా ప్రాక్టికల్స్ చేయించాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి జిల్లాలోని చాలా కళాశాల్లో సరైన ప్రయోగశాలలు, పరికరాలు లేవు. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్ కళాశాలలు ఈసారి కూడా అన్ని విధాలుగా దీన్ని అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది.
వర్శిటీల్లో కుల రాజకీయాలు తగదు
* గాంధీ విగ్రహం వద్ద ఎబివిపి ధర్నా
కర్నూలు అర్బన్, జనవరి 22:విశ్వవిద్యాలయాల్లో కుల రాజకీయాలను ప్రోత్సహిస్తే సహించమని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎస్.సునీల్‌రెడ్డి హెచ్చరించారు. ఎబివిపి నగర సంఘటనా కార్యదర్శి సుమన్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని గాయత్రి ఎస్టేట్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ వున్న గాంధీ విగ్రహం వద్ద కుల రాజకీయా ల దిష్టిబొమ్మను దగ్ధం చేసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని సెంట్ర ల్ యూనివర్శిటీలో రీసెర్చ్ స్కాలర్ రోహిత్ మృతిని అవకాశంగా తీసుకుని అన్ని రాజకీయ పార్టీలు శవ రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. గతంలో నాగార్జున విశ్వవిద్యాలయం లో కూడా విద్యార్థులు మృతి చెందారని అప్పుడు వీరందరికీ విద్యార్థులు ఎందుకు గుర్తు రాలేదని ప్రశ్నించారు. కేవలం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసమే రాజకీయ పార్టీలు రోహిత్ మృతిని కుల, రాజకీయ రం గుతో రాజకీయం చేస్తున్నాయని మం డిపడ్డారు. విద్య, విజ్ఞాన దేవాలయాలుగా వుండే విశ్వవిద్యాలయాల్లో కుల రాజకీయాలను ప్రోత్సహిస్తే ఎబివిపి తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. కొందరు వాస్తవాలు తెలుసుకోకుండా ఎబివిపిని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రోహిత్ మృతికి కారణమైన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో భాగ్ కన్వీనర్ శివ, నగర హాస్టల్ ఇన్‌చార్జి రవి, నగర సహాయ కార్యదర్శులు రాఘవేంద్ర, ఉపాధ్యక్షులు శ్రీరామ్‌నాయక్, సురేష్, ఎల్లయ్య, మల్లి, చంద్, మహేంద్ర, అంజి, సుధాకర్, హరీష్, ప్రశాంత్, నంద, తదితరులు పాల్గొన్నారు.
సీమకు అన్యాయం
* ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి
ఆత్మకూరు, జనవరి 22:రాయలసీమ ప్రజలకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తున్నాయని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నా రు. పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాలులో శుక్రవారం ఆర్పీఎస్ విద్యార్థి ఫెరడేషన్ ఆధ్వర్యంలో ‘కరవులు, వలసలు-రాయలసీమ విద్యార్థి చైతన్యం- విద్యావిధానం-నిరుద్యోగం-రాయలసీమ రాష్ట్రం ఆవశ్యకత’పై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత కూడా రాయలసీమ ప్రాంత ప్రజలు అన్యాయానికి గురవుతున్నా రాజకీయ పార్టీలు పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. జాతి పేరు తో రాయలసీమ తరతరాలుగా మోసపోతూనే ఉందన్నారు. సీమలోని 36 లక్షల ఎకరాల భూమిని సాగు కోసం సస్యశ్యామలం చేసే కృష్టా- పెన్నార్ ప్రాజెక్టు నిర్మాణాన్ని కోస్తా నాయకులు అడ్డుకున్నారన్నారు. అలాగే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వం వద్ద కృష్ణా నదిపై 270 టిఎంసిల నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం గల రిజర్వాయర్ నిలిచిపోయిందన్నారు. దాదాపు 400 టిఎంసిల నీరు రాయలసీమకు దక్కుతాయన్న అక్కసుతో, కోస్తాంధ్ర నాయకులు నాడు రాయలసీమ ప్రాం త ప్రజలపై తమిళనాడు ప్రజల్లో ద్వేషా న్ని రెచ్చగొట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేను రాయలసీమ బిడ్డను కాదా అని సమావేశంలో అడుగుతున్నారని, మొన్న జరిగిన పారిశ్రామిక అభివృద్ధి సమావేశంలో కోస్తాకు రూ. 3,080 లక్షల కోట్ల విలువ గల పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పంద పత్రాలపై పారిశ్రామిక వేత్తలతో సంతకాలు చేయించిన నీవు రాయలసీమలో కేవలం రూ. 1200 కోట్ల విలువ గల పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకోవడం అన్యాయం కాదా అని ప్రశ్నించారు. రాయలసీమ ప్రాంతంలో వజ్రా లు, గ్రానైట్, సున్నపురాయి, సిలికాన్, బెరైటిస్ లాంటి ఖనిజాలు అపారంగా లభిస్తాయని, దీంతో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి చాలా అవకాశాలు ఉన్నా ముఖ్యమంత్రి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అన్ని విధాలుగా మోసపోతున్న రాయలసీమ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో విద్యార్థులే కీలక భూమిక పోషించాలన్నారు. మారుమూల ప్రాంతాలకు వెళ్లి విద్యార్థులు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతను వివరించాలని కోరారు. కార్యక్రమంలో మల్లికార్జున, సాయిబాబా, బాలసుందర్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
రైతుల జీవితాలతో బాబు చెలగాటం
* ఎమ్మెల్యే అఖిలప్రియ
చాగలమర్రి, జనవరి 22: రైతుల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెలగాటం ఆడుకుంటున్నాడని ఆళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఆరోపించారు. మండలంలోని మల్లెవేముల మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో రూ.6.50 లక్షలతో సర్వశిక్ష అభియాన్ నిధులతో నిర్మించిన అదనపు తరగతి గదిని ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో టిడిపి రైతులకు రుణమాఫీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక సక్రమంగా అమలు చేయలేదన్నారు. రుణమాఫీ వల్ల ఎంతమంది రైతులు బాగుపడ్డారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బ్యాంకుల్లో వడ్డీలు పెరిగిపోయి అప్పుల్లో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌టిఆర్ జలసిరి ద్వారా అర్హులైన రైతులకు బోర్లు మంజూరు చేయాలని, జన్మభూమి దరఖాస్తులను చెత్త బుట్ట దాఖలు చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. వైకాపా ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించి ప్రభుత్వం అసెంబ్లీలో తన ఇష్టారాజ్యాంగా వ్యవహించాలన్నదే ప్రభుత్వ కుట్ర అన్నారు. రోహిత్ ఆత్మహత్యపై కేంద్రం ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. మల్లెవేములలో కెసి కాల్వ స్లూయిస్ సక్రమంగా లేక రైతులకు సాగునీరు అందడం లేదని సర్పంచ్ దామోదరమ్మ, వైకాపా నాయకులు బాలిరెడ్డిలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈకార్యక్రమంలో మండల ఉపాధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, ఎంపిటిసి సరోజమ్మ, వైకాపా నాయకులు జగదీశ్వర్‌రెడ్డి, దస్తగిరిరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ప్రతాపరెడ్డి, ఖాదర్‌బాషా, సల్లా నాగరాజు, రఘునాథ్‌రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ నిజాముద్దీన్, మాజీ సర్పంచ్ అన్సర్‌బాషా, సర్పంచులు మస్తాన్‌రెడ్డి, నరసింహరెడ్డి, దేశం రెడ్డి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
వర్శిటీల్లో కుల వ్యవస్థను నిర్మూలించాలి
* డిసిసి అధ్యక్షుడు రామయ్య
కర్నూలు సిటీ, జనవరి 22:యూనివర్శిటీల్లో కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని డిసిసి అధ్యక్షుడు బివై.రామయ్య డిమాండ్ చేశారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీలో పిహెచ్‌డి చదువుతున్న రోహిత్ విసి వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దేశ ప్రధాని మోదీ నిరంతరం విదేశాలు తిరగడమే తప్పా దేశంలో ఏ జరుగుతుందో పట్టించుకోవటం లేదని విమర్శించారు. దేవాలయం లాంటి యూనివర్శిటీల్లో స్వార్థ రాజకీయాల కోసం కులాల చిచ్చురేపుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడటం ఏంటని ప్రశ్నించారు. యూనివర్శిటీని సక్రమంగా నడపలేని విసిని వెంటనే తొలగించాలని, రోహిత్ మృతికి కారణమైన కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీలను వెంటనే బర్తరఫ్ చేయాలని, లేనిపక్షంలో ప్రజలే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు, ఆకెపోగు వెంకటస్వామి, చెరకు అశోకరత్నం, పెద్దారెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, చున్నూమియ్యా, తిప్పన్న, శ్రీనివాసరెడ్డి, శివకుమార్, విజయభాస్కర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మఠంలో వైభవంగా అష్టాక్షరి హోమాలు
మంత్రాలయం, జనవరి 22: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో శుక్రవారం పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో అష్టాక్షరి హోమాలను వైభవంగా నిర్వహించారు. శ్రీమఠం హోమశాలలో అశేష వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ రాఘవేంద్ర స్తోత్ర అష్టోత్తర శత పారాయణం, మం త్ర జపం స్మరిస్తూ హోమాలను నిర్వహించారు. అనంతరం పీఠాధిపతి హోమానికి సిద్ధం చేసిన శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావన చిత్రాన్ని, కళశాలను పరశీలించారు. శుక్రవారవారం నుండి శనివారం వరకు హోమాలు నిర్వహించి చివరి రోజు ఆదివారం నిర్వహించే పుష్యార్క యోగమందు శ్రీ రాఘవేంద్ర స్తోత్ర అష్టోత్తర శత పారాయణం మంత్ర జపం పురస్కరించుకుని శ్రీ రాఘవేంద్ర అష్టాక్షరి మంత్రం అక్షర కోటి సమర్పణ హోమాన్ని నిర్వహిస్తున్నారు. అక్షర కోటి అనగా శ్రీ రాఘవేంద్రాయ నమః అనే ఎనిమిది అక్షరములకు ఒక అక్షరమునకు కోటిగా జపించి అలా ఎనిమిది అక్షరాలను 8 కోట్ల మంత్రం జపంగా హోమాలు చేసి శ్రీ గురురాజల (శ్రీ రాఘవేంద్ర స్వామి) ద్వారా భగవంతునికి సమర్పించు పవిత్ర కార్యంలో భక్తులు పాల్గొని పునీతులు కావాలని పీఠాధిపతి తెలిపారు.
భారతీయ సంస్కృతిని కాపాడండి
* కర్నూలు రేంజి డిఐజి రమణకుమార్
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 22: అంతరంచిపోతున్న భారతీయ సం స్కృతిని కాపాడాలని కర్నూలు రేంజి డిఐజి బివి.రమణకుమార్ పిలుపునిచ్చారు. టిటిడి, హిందూ ధార్మిక ప్రచా ర పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని సి.క్యాంపులోని విజ్ఞాన మందిరంలో జరిగిన కార్యక్రమానికి డిఐజి రమణకుమార్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నారాయణతీర్థుల వారు భక్తితో పాడిన కీర్తనలు కృష్ణలీలలు, నీలమేఘ శ్యామ రచించారన్నారు. నారాయణ తీర్థుల వారి తరంగాలను ఆధారం చేసుకుని వారి శిష్యుడు సిద్దేంద్రయోగి కూచిపూడి రూపొందించారన్నారు. ఈ తరంగాలను మంగళంపల్లి బాల మురళీ కృష్ణ బాగా పాడుతున్నారన్నారు. 1967లో నారాయణతీర్థుల స్వామి పాటలను క్యాసెట్ల రూపంలో తాను కాజా గ్రామంలో పంపిణీ చేశానని తెలిపారు. అలాగే నారాయణ తీర్థుల వారికి అదే గ్రామంలో మందిరం నిర్మించామని తెలిపారు. కీర్తనలను భక్తితో పాడి భావితరాలకు బాటగా నిలవాలన్నారు. భజన బృందాలు తయారు చేసుకుని భగవంతుని సంకల్పంతో దేవుని మార్గంలో నడిచి భావితరాలకు అందించాలన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన మందిరం ఆలయ కమిటీ చైర్మన్ కల్కూర, కార్యదర్శి శశిధర్ శర్మ, కోశాధికారి ఈశ్వర్‌రెడ్డి, టిటిడి ధర్మ ప్రచార మండలి సభ్యులు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, టిటిడి నిర్వహకులు వెంకటరెడ్డి, డిఐజి సిసి నారాయణ, భక్తులు పాల్గొన్నారు.