హీరోలే విలన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘హీరోయిజం’ నిలబడాలంటే సినిమాలో కచ్చితంగా గట్టి విలన్ ఉండాలి. విలన్ ఎత్తుగడలను చిత్తు చేస్తూ చివరికి విజయం సాధించేవాడే హీరో. అందుకే హీరోలకు మాస్‌లో అంతటి ఫాలోయింగ్ ఉంటుంది. మరి అలాంటి మాస్ హీరోగా రాణించడానికి తన ఇమేజ్‌కు తగ్గ విలన్‌ను ఎంచుకుంటారు హీరోలు. విలన్లు అంటే రాజనాల, నాగభూషణం, ప్రభాకరరెడ్డి, రావుగోపాలరావు, సత్యనారాయణ, ప్రకాష్‌రాజ్, కోట శ్రీనివాసరావు.. ఇలా చాలామంది నటులు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. కొందరు హీరోలు విలన్‌గా టర్న్ తీసుకుని అక్కడ కూడా ‘స్టార్ ఇమేజ్’ తెచ్చుకుంటున్నారు. విలన్ పాత్ర చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. టాలెంట్ చూపించే అవకాశం, పలురకాల హావభావాలను పండించే సౌకర్యం ఉంటుంది. అందుకే ప్రతినాయకుడి పాత్రకు అంత డిమాండ్. ఈమధ్య కాలంలో విలన్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు నిన్నటి హీరో జగపతిబాబు. శోభన్‌బాబు తరువాత ‘ఇద్దరు హీరోయిన్ల హీరో’గా, ఫ్యామిలీ హీరోగా జగపతిబాబు పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ కాస్త వెనకపడటంతో ఏ మాత్రం ఆలోచించకుండా నెగెటివ్ రోల్స్ చేయడానికి ఓకే చెప్పాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోవాలనుకునే టైమ్‌లో బోయపాటి శ్రీను రూపంలో జగపతిబాబును అదృష్టం వరించింది. విలన్‌గా కొత్త అవతారం ఎత్తారు. వరుసగా పరాజయాలు దక్కడం, కొన్ని సినిమాలు విడుదల కాకపోవడంతో ఆయనకు
కష్టకాలం మొదలైంది. అలాంటి సమయంలో తీసుకున్న నిర్ణయం ఆయన నట జీవితాన్ని మార్చేసింది. బాలకృష్ణ నటించిన లెజెండ్‌లో విలన్‌గా నటించడానికి ‘సై’ అన్నాడు. అంతే.. దాంతో జగపతిబాబు రాతే మారిపోయింది. ఆ సినిమాతో ఆయనకు డజనుకుపైగా సినిమాల్లో విలన్ పాత్రలు వరించాయి. ఇప్పుడు జగపతిబాబు తెలుగు చిత్రసీమలో ఖరీదైన క్యారెక్టర్ నటుడు, ప్రతినాయకుడు. తమిళ, మలయాళ చిత్ర సీమల నుంచి కూడా ఆఫర్లు వెల్లువలా వచ్చిపడిపోతున్నాయి.
ఇక హీరోగా టర్న్ తీసుకుందామనుకున్న దగ్గుబాటి రానాకు సోలో హీరోగా వర్కవుట్ కాలేదు. టాలీవుడ్‌లో విలన్‌గా సరికొత్త టర్న్ తీసుకున్నాడు. రాజవౌళి తన ‘బాహుబలి’లో ప్రతినాయకుడిగా రానాను ఎంపిక చేసుకున్నాడు. ‘బాహుబలి’ తర్వాత రానా ప్రఖ్యాతి గాంచిన ప్రతినాయకుడు. మిగతా హీరోలతో మల్టీస్టారర్లకు ఓకే అంటున్న రానా ఇప్పుడు మరో సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించబోతున్నాడని టాక్.
తొమ్మిది సినిమాలకు ఒకేసారి ముహూర్తపు షాట్‌లతో ఎంట్రీ ఇచ్చి, ఆ తరువాత ఒక్క సినిమాలోనూ నటుడిగా మెప్పించలేకపోయాడు తారకరత్న. కొన్నాళ్లకు రవిబాబు ‘అమరావతి’తో ప్రతినాయకుడిగా మెప్పించి, ఇప్పుడు ‘రాజా చెయ్యివేస్తే’తో విలన్‌గా మెరిశాడు. అందుకే తారకరత్న హీరోగా కాకుండా ప్రతినాయకునిగా అయితే బాగుంటాడని టాక్ వచ్చింది. ‘అమరావతి’ తరువాత విలన్‌గా బోలెడన్ని ఆఫర్స్ అందుకుంటాడని సినీజనాలు అనుకున్నారు. కానీ, ఎందుకో ఆ తరువాత మరే సినిమాలోనూ విలన్‌గా చాన్స్ దక్కలేదు తారకరత్నకు. విలన్ల లిస్టులోకి చేరాడు మరో హీరో ఆది పినిశెట్టి. కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆది పినిశెట్టి ఆ తర్వాత నిలబడలేక కోలీవుడ్‌లో సెటిల్ అయ్యాడు. అక్కడ విభిన్న కథాంశాలతో విలక్షణ నటుడిగా నిలదొక్కుకున్నాడు. ఈమధ్య సరైనోడు చిత్రంతో టాలీవుడ్‌లో మరో గట్టి విలన్ అనిపించుకుంటున్నాడు. ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడిగా చిత్ర పరిశ్రమలోకి ‘ఒక విచిత్రం’ ద్వారా కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన ఆది పినిశెట్టి తెలుగు, తమిళ భాషల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నాడు. గుండెల్లో గోదారి, మలుపు చిత్రాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చాడు. ఇప్పటివరకూ కథానాయకుడిగా, నటుడిగా అలరిస్తూ వచ్చిన ఆయన ఈ ఏడాది ప్రతినాయకుడిగా అదరగొట్టేశాడు.
టాలీవుడ్‌లో తొలుత కథానాయకులుగా మెప్పించి ఆ తరువాత విలన్లుగా నటించిన వారూ ఉన్నారు. అయితే వాళ్ళంతా విలన్‌గా నటించాక ఆ జర్నీని కొనసాగించలేదు. మళ్లీ కథానాయకులుగానే కొనసాగారు. అయితే, ఇప్పుడో హీరో విలన్‌గా ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడి పేరు సుధీర్‌బాబు. శివ మనసులో శృతి, ప్రేమకథా చిత్రమ్ తదితర చిత్రాల్లో కథానాయకుడిగా మెప్పించిన సుధీర్‌బాబు ‘బాఘి’ చిత్రంతో విలన్‌గా మారాడు. సబీర్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టైగర్ ష్రాప్, శ్రద్ధాకపూర్‌లు నటించారు. బాఘి కోసం సుధీర్‌బాబు తన దేహదారుఢ్యాన్ని కూడా మార్చుకున్నాడు. ఒకప్పటి టాలీవుడ్ కథానాయకుడైన సుమన్ ‘శివాజీ’తో విలన్‌గా మారారు. యాక్షన్ కింగ్ అర్జున్ కూడా కడల్ తమిళ సినిమాతో విలన్‌గా మెప్పించాడు. ఒకప్పటి కోలీవుడ్ నటుడు కార్తిక్, కళ్యాణ్‌రామ్ ‘ఓం’ సినిమాలో విలన్లుగా నటించారు. ఇటీవల ‘తనిఒరువన్’ తమిళ సినిమాతో అరవిందస్వామి విలన్‌గా అదరగొట్టేశాడు. దీనికి తెలుగు వెర్షన్‌గా రామ్‌చరణ్ కథానాయకుడిగా వచ్చిన ధృవలో కూడా అరవింద్‌స్వామి అదే పాత్రను పోషించి ఆకట్టుకున్నాడు. ఇక ఈ లిస్టులోకి ఈ ఏడాదితో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవున్నాడు హీరో రాజశేఖర్. గడ్డం గ్యాంగ్ తరువాత రాజశేఖర్ ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. హీరోగా వరుస పరాజయాలతో విసిగిపోయిన రాజశేఖర్ విలన్‌గా చేస్తానని ప్రకటించాడు కూడా. ఇక మరో హీరో శ్రీకాంత్ కూడా విలన్‌గా చేస్తానంటూ చెప్పేశాడు. శ్రీకాంత్ హీరోగా మారకముందు రెండు మూడు సినిమాల్లో విలన్‌గా చేసిన విషయం తెలిసిందే. మరి ఈ ఏడాది ఇంకెంతమంది హీరోలు విలన్లుగా మారతారో చూడాలి.

-శ్రీ