రివ్యూ

సెంటిమెంట్ డ్రామా! ** గాయత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారాగణం:
మోహన్‌బాబు, మంచు విష్ణు,
శ్రీయాశరన్, నిఖిలావిమల్,
కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి,
అలీ, అనసూయ,
బ్రహ్మానందం తదితరులు.
కెమెరా: సర్వేష్ మురారి
సంగీతం: ఎస్.ఎస్ తమన్
నిర్మాణం: లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్
నిర్మాత: డా.మోహన్‌బాబు ఎమ్.
దర్శకత్వం: ఆర్.ఆర్ మదన్

తెలుగు చిత్రసీమలో విలక్షణ నటుడిగా మోహన్‌బాబుకు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 560 చిత్రాల్లో విభిన్నమైన పాత్రలతో డైలాగ్‌కింగ్‌గా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ స్టయిల్‌ని ఏర్పరచుకున్నారు. వివిధ చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు వేటికవే భిన్నంగా ఉంటూ ప్రేక్షకుల్ని అలరించాయి. కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయన పోషించినన్ని పాత్రలు మరే నటుడూ చేయలేదంటే అతిశయోక్తి కాదేమో! ఏ డైలాగ్‌ను ఎలా పలకాలో, ఎక్కడ పెంచాలో.. ఎక్కడ తుంచాలో తెలిసిన అతికొద్ది మంది నటుల్లో మోహన్‌బాబు ముందు వరుసలో ఉంటారు. నటుడిగానే గాక, నిర్మాతగానూ ఆయన ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. ఆయన నటించిన ‘మామ మంచు అల్లుడు కంచు’ అనే సినిమా 2015లో వచ్చింది. ఆ చిత్రం తర్వాత ఆయన మరో చిత్రంలో నటించలేదు. చాలా కాలం విరామం తర్వాత సొంత నిర్మాణ సంస్థలో ఆయన నటించిన తాజా చిత్రం ‘గాయత్రి’. దీనికి మదన్ దర్శకత్వం వహించారు. ఇందులో మోహన్‌బాబు ద్విపాత్రాభినయం చేయడం.. అందులో ఒకటి శివాజీ అనే పాజిటివ్ క్యారెక్టర్ కాగా, మరొకటి గాయత్రి పటేల్ అనే నెగెటివ్ షేడ్‌తో కూడుకున్నది కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులకు ఆసక్తికలిగింది. విలనిజంలో కొత్త మార్కును క్రియేట్ చేసిన నటుడు మోహన్‌బాబు పూర్తిస్థాయి విలన్‌గా నటించి చాలా కాలం కావడం.. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కావడంతో సహజంగానే సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి సంబంధించి ప్రేక్షకుల ముందుకొచ్చిన టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఆ అంచనాలను ‘గాయత్రి’ అందుకుందా? చాలా కాలం తర్వాత విలనిజాన్ని చూపిస్తూ ద్విపాత్రాభినయం చేసిన మోహన్‌బాబు ఏ విధంగా ఆకట్టుకున్నారు? ‘ఆ నలుగుగు’, ‘పెళ్లయిన కొత్తలో..’ చిత్రాలను తెరకెక్కించిన మదన్ తొలిసారిగా తన స్టయిల్ మార్చి థ్రిల్లర్ జానర్ సినిమాకు దర్శకత్వం వహించారు. మరి ఈ ప్రయత్నం మదన్ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేసిందా? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే...
తన వాళ్లందరినీ కోల్పోయిన శివాజీ (వయసులో ఉన్నప్పుడు విష్ణు, వయసు మళ్లిన తర్వాత మోహన్‌బాబు) రంగస్థల నటుడు. అతడి నటన చూసి ఇష్టపడుతుంది శారద (శ్రీయ). వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అనుకోకుండా శారద మంచాన పడుతుంది. చికిత్స కోసం డబ్బులేక మరోదారిని ఎంచుకొని జైలుపాలవుతాడు శివాజీ. తిరిగి వచ్చేసరికి అతని భార్య చనిపోయిందని, పుట్టిన పాప అనాథాశ్రమానికి చేరుకుందని తెలుస్తుంది. అప్పటి నుంచి దూరమైన కూతురు గాయత్రి (నిఖిలావిమల్) కోసం ఎదురుచూస్తూ కొంత మంది అనాథలను చేరదీసి శారదా సదనం అనే అనాథాశ్రమాన్ని నడిపిస్తుంటాడు. ఆశ్రమాన్ని నడిపించడానికి కావాల్సిన డబ్బుని సంపాదించడం కోసం వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు కోర్టులో పడే శిక్షలను వారి మారు వేషంలో వెళ్లి అనుభవిస్తుంటాడు. తద్వారా వచ్చిన డబ్బును ఆశ్రమానికి వినియోగిస్తుంటాడు. తన కూతురు ఏదో ఒక అనాథాశ్రమంలో ఉండే ఉంటుందన్న నమ్మకంతో అన్ని అనాథాశ్రమాలకు డబ్బు రూపంలో తనకు తోచిన విధంగా సహకారాన్ని అందిస్తుంటాడు. ఇలా తన జీవితాన్ని గడుపుతున్న శివాజీపై ఓ జర్నలిస్టు శ్రేష్ఠ (అనసూయ)కు అనుమానం వస్తుంది. అతడు మారువేషంలో చేస్తున్న పనిని ఎలాగైనా వెలుగులోకి తెచ్చి అసలు నిజాన్ని బయటపెట్టాలని ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఓ సంఘటన కారణంగా తన కూతురు ఎవరో తెలుస్తుంది. కూతుర్ని కలుసుకునే సమయానికి గాయత్రి పటేల్ (మోహన్‌బాబు ద్విపాత్రాభినయం) అనే నేరస్థుడు శివాజీని కిడ్నాప్ చేస్తాడు. తన బదులుగా శివాజీని ఉరికంభం ఎక్కించాలని ప్లాన్ చేస్తాడు. తన స్థానంలో జైలుకి పంపిస్తాడు. అలా జైలుకి వెళ్లిన శివాజీ తనకు ఉరిశిక్ష పడిందని తెలియక అనుకోకుండా ఇరుక్కుపోతాడు. తనకు బదులుగా శిక్ష అనుభవించడానికి గాయత్రి పటేల్.. శివాజీనే ఎందుకు ఎంచుకున్నాడు? శివాజీ గతం ఏంటీ? శివాజీ కూతురు గాయత్రికి, గాయత్రి పటేల్‌కు సంబంధం ఏమిటి? తండ్రీకూతుళ్లు ఇద్దరూ కలిశారా? ఈ సమస్యల నుంచి శివాజీ ఎలా బయటపడ్డాడు? చివరకు గాయత్రి పటేల్ ఏమయ్యాడు? అన్నదే అసలైన కథ.
తండ్రీకూతుళ్ల నేపథ్యంలో సాగే కథ ఇది. దర్శకుడు మదన్ ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని ఓ కొత్త కథనే ఎంచుకున్నారు. సెంటిమెంట్‌కు తోడు కమర్షియల్ అంశాలు ఉండేలా జాగ్రత్తపడ్డాడు. సినిమా మొదటి భాగం మొత్తం సాదాసీదాగా సాగుతుంది. సెకండాఫ్‌లో అసలు కథ మొదలవుతుంది. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ భావోద్వేగాలతో కూడుకున్నది. కొన్ని పొలిటికల్ డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. మోహన్‌బాబు పోషించిన శివాజీ పాత్ర సాధారణంగానే ఉన్నా, గాయత్రి పటేల్ పాత్ర మాత్రం సినిమాకు ప్లస్ అయింది. విష్ణుతెరపై కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ చక్కటి నటనను కనబరిచాడు. శ్రీయ పాత్ర ఎమోషనల్‌గా ఉంది. జర్నలిస్ట్ పాత్రలో అనసూయ తన పాత్ర పరిధులు దాటకుండా మెప్పించింది. నిఖాలా విమల్ అమాయకపు అమ్మాయిగా చక్కటి నటనను కనబరిచింది. అలీ, బ్రహ్మానందం కామెడీ పండలేదు. జడ్జి పాత్రలో కోట శ్రీనివాసరావు, శివాజీ స్నేహితుడిగా శివప్రసాద్, మినిస్టర్ పృథ్వీ, రాజారవీంద్ర, లాయర్‌గా పోసాని కృష్ణమురళి, జైలర్‌గా నాగినీడు, పోలీస్‌గా సత్యం రాజేష్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. తమన్ అందించిన పాటల్లో ‘ఒక నువ్వు ఒక నేను’ పాట గుర్తుండిపోయేలా వుంది. అవసరం లేకపోయినా ఇరికించిన ఐటమ్‌సాంగ్ కాస్త ఇబ్బంది పెట్టింది.
నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగానే వున్నాయి. కథలో మలుపులు, ఉత్కంఠ, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. మధ్య మధ్యలో మోహన్‌బాబు పలికిన పొలిటికల్ డైలాగులు, నాయకులపై వేసిన సెటైర్లు అభిమానులను ఈలలు వేసేలా చేశాయి. మొత్తం మీద తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ డ్రామా భలేగా వుండి సినిమా ఫర్వాలేదనిపించింది.

-రతన్