రాష్ట్రీయం

కాల్‌మనీ అకృత్యాలు.. భగ్గుమంటున్న బెజవాడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న దా‘రుణాలు’
టాస్క్ఫోర్స్ వద్ద క్యూ కడుతున్న బాధితులు
బడా రాజకీయ నేతల ప్రమేయంపై అనుమానాలు
ట్రాన్స్‌కో డిఇఇ సత్యానందం చుట్టూ బిగిస్తున్న ఉచ్చు

విజయవాడ , డిసెంబర్ 12: బెజవాడ ఒక్కసారిగా భగ్గుమంటోంది. రాజకీయ బడా నేతల అండదండలతో ఇప్పటి వరకు చీకటి రాజ్యమేలిన కీచకుల అరాచకాలపై మహిళా సంఘాలతోపాటు, వామపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. కాల్‌మనీ ముసుగులో మహిళలపై సాగించిన దా‘రుణాలు’ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పటివరకు ఈ మాఫియా బారిన పడి జీవితాలు పొగొట్టుకోవడంతోపాటు, ఆస్తులు కోల్పోయి, అవమానాల పాలైన ఎంతోమంది బాధితులు నగరంలోని టాస్క్ఫోర్స్ కార్యాలయం వద్ద క్యూ కడుతున్నారు. ఈ తరహా కీచకుల పీచమణిచేందుకు నడుం బిగించిన విజయవాడ పోలీసు కమిషనర్ దామోదర్ గౌతం సవాంగ్ ఇచ్చిన భరోసాతో ధైర్యంగా బాధితులు తెర మీదకు వస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా తాము నష్టపోయిన వైనాన్ని వెలిబుచ్చుతూ పోలీసు కమిషనర్‌ను ఆశ్రయిస్తున్నారు. కాగా లైంగిక మాఫియా వెనుక బడా రాజకీయ నేతల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ వ్యవహారం వెలుగు చూసిన నాటి నుంచి అధికార పార్టీలో కొనసాగుతున్న పలువురు నేతలు, ప్రజాప్రతినిధులుగా చెలామణి అవుతున్న మరికొందరు వ్యక్తులు భుజాలు తడుముకుంటున్నారు. ఓ రకంగా క్రమేణా ఈ వ్యవహారంపై పార్లమెంటు సభ్యులు, మంత్రులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మరోవైపు కాల్‌మనీ పేరుతో మహిళపై లైంగిక దాడులకు సంబంధించి వెలుగు చూసిన అంశాలను ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ వ్యవహారంపై ఆరా తీసినట్లు సమాచారం. పైగా కొందరు అధికార పార్టీ నేతల ప్రమేయంపై కూడా ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి కేసుకు సంబంధించి రాష్ట్ర డిజిపికి స్పష్టమైన ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. పిల్లల కాలేజీ ఫీజులు, మెడికల్, ఇంజనీరింగ్ సీట్లు, ఇతర ఆర్థిక సంబంధ అవసరాలు ఇలా అప్పు కోసం లక్షల్లో డబ్బు తీసుకుని వడ్డీలు చెల్లించలేని వారి అసమర్థతను ఆసరా చేసుకుంటూ వారి కుటుంబ సభ్యులను, మహిళలైతే వారిని లైంగికంగా వేధింపులకు పాల్పడుతూ చీకటి కార్యకలాపాలు సాగిస్తూ వచ్చిన ఓ బడా మాఫియా గట్టు రట్టయిన విషయం తెలిసిందే. పటమటకు చెందిన యలమంచిలి రామమూర్తి, అలియాస్ రాము గ్యాంగ్ లీడర్ శ్రీరామాంజనేయ ఫైనాన్సియర్స్ పేరుతో నడుస్తున్న ఈ సరికొత్త సెక్స్ రాకెట్ చాలాకాలంగా కొనసాగుతోంది. వీరి బారినపడి నష్టపోయిన బాధితులు శనివారం టాస్క్ఫోర్స్‌కు వచ్చి ఏసిపి ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అయితే చాలామంది పేర్లు చెప్పేందుకు ఇష్ట పడటం లేదు. కాగా.. బాధితుల్లో ఒకరైన అడపా సత్యం కుటుంబ సభ్యులు భోరున విలపిస్తున్నారు. యలమంచిలి రాము గ్యాంగులోని వెనిగళ్ళ శ్రీకాంత్ వద్ద 2012లో రెండుసార్లుగా 11లక్షలు అప్పు తీసుకుని నెలనెలా 99వేల వరకు వడ్డీ చెల్లిస్తూ ఇక కట్టలేని స్థితిలో శ్రీకాంత్ తనను నిర్భంధించి తాడిగడపలో కోటిన్నర విలువ చేసే ఇంటిని బలవంతంగా లాక్కుని తమ పేరుతో రాయించుకున్నారని టాస్క్ఫోర్స్‌కు ఫిర్యాదు చేశాడు. ఇలా ఎంతోమంది బాధితులు ఈ తరహా దౌర్జన్యాలకు బలైన వైనాన్ని వివరించారు. తాజాగా వస్తున్న బాధితుల ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకడైన వెనిగళ్ళ శ్రీకాంత్ ప్రస్తుతం పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో కలిసి విదేశాల్లో విహరిస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు మహిళా సంఘాలు, వామపక్షాలు నగరంలో కాల్‌మనీ కీచకులకు వ్యతిరేకంగా ధర్నాలు, దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. నిందితులను ఆరెస్టు చేయాలని డిమాండు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ట్రాన్స్‌కో డిఇఇ మారంపూడి సత్యానందం పరారీలో ఉండగా అతని చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. కాగా కోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో సత్యానందం ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపధ్యంలో పోలీసులు అతని కార్యకలాపాలపై నిఘా వేశారు.