కృష్ణ

‘కాల్’యముళ్లపై పోలీసుల ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వడ్డీ వ్యాపారుల ఇళ్లపై కొనసాగుతున్న దాడులు
* కాల్‌మనీ వ్యాపారుల్లో ప్రభుత్వ ఉద్యోగులు!
* దురాగతాలపై ధైర్యంగా ఫిర్యాదు చేయండి
* ‘ఆంధ్రభూమి’తో ఎస్పీ వినయ్ కుమార్
మచిలీపట్నం, డిసెంబర్ 17: జిల్లాలో బడుగుల రక్తాన్ని పీలుస్తున్న ‘కాల్’యముళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కాల్‌మనీ వ్యాపారాలు చేస్తున్న వారిపై పోలీసులు నిర్వహిస్తున్న దాడులు గురువారం కూడా కొనసాగాయి. పోలీసుల దాడుల్లో కొన్ని ఆసక్తికరమైన అంశాలు వెలుగుచూస్తున్నాయి. రాజకీయ నాయకులతో పాటు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాల్‌మనీ వ్యాపారాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. జిల్లాలో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా కాల్‌మనీ వ్యాపారాలు సాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నెలనెలా వేలాది రూపాయల జీతాలు తీసుకుంటున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఆ డబ్బును కాల్‌మనీ వ్యాపారానికి వినియోగిస్తూ కోట్లు సంపాదిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా దృష్టి సారించారు. మచిలీపట్నం, పెడన ప్రాంతాల్లో కాల్‌మనీ వ్యాపారాలు చేస్తున్న కొందరు ప్రభుత్వ ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలావుంటే, అధిక వడ్డీ వ్యాపారాలు సాగిస్తున్న వ్యాపారుల ఇళ్లలో పోలీసుల సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రం మచిలీపట్నం ఇనగుదురు పోలీసు స్టేషన్‌లో గురువారం ఒక కేసు నమోదు కాగా ముగ్గురు వ్యాపారులను పోలీసులు అరెస్టు చేశారు. జవ్వారుపేటకు చెందిన సన్నాల రమాదేవి 2013లో గొడుగుపేటకు చెందిన చలవాది సుబ్రహ్మణ్యం వద్ద రూ.5లక్షలు అప్పుగా తీసుకుంది. రూ.5లక్షలు అప్పు ఇవ్వాలంటే నాగపోతరావు సెంటరులో తనకున్న భవంతిని రూ.16లక్షలకు తనఖా పెట్టాలని సదరు వ్యాపారి డిమాండ్ చేశాడు. చేసేదిలేక రూ.16లక్షలకు తన భవంతిని తనఖా పెట్టగా తీసుకున్న రూ.5లక్షల అప్పుకు రూ.2లక్షలు వడ్డీ వేసి చెల్లించేందుకు వెళ్లింది. అయితే తనఖా పెట్టిన రూ.16లక్షలు, దానికి అసలు కట్టాల్సిందేనని సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశాడు. సుబ్రహ్మణ్యంతో పాటు వర్రేగూడెంకు చెందిన సయ్యద్ అన్వర్ హుస్సేన్, రాజుపేటకు చెందిన పామర్తి తిరుపతయ్యపై కూడా ఆమె ఫిర్యాదు చేసింది. నిందితులు ముగ్గురిని ఇనగుదురుపేట ఎస్‌ఐలు ఎల్ రమేష్, దుర్గామహేశ్వరరావు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.
ధైర్యంగా ఫిర్యాదు చేయండి
కాల్‌మనీ వ్యాపారుల ఆగడాలపై బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి తమకు ఫిర్యాదు చేయాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జి వినయ్‌కుమార్ పిలుపిచ్చారు. గురువారం రాత్రి ఆయన ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 25 కేసుల వరకు నమోదు చేసి కాల్‌మనీ వ్యాపారులను కోర్టులో హాజరుపర్చినట్లు తెలిపారు. బాధితులు ఫిర్యాదు చేస్తే సత్వరమే సంబంధిత వ్యాపారుల ఇళ్లపై దాడులు చేసి అరెస్టు చేస్తామన్నారు. వ్యాపారులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ఎస్పీ వినయ్ కుమార్ స్పష్టం చేశారు.

నాలుగు రోజుల క్రితం అదృశ్యం..
చెరువులో శవమై తేలిన విద్యార్థి
గన్నవరం, డిసెంబర్ 17: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఓ కార్పొరేట్ కళాశాల విద్యార్థి గురువారం చెరువులో శవమై తేలాడు. గన్నవరం మండలం కేసరపల్లిలో ఈ సంఘటన జరిగింది. మొవ్వ మండలం కాజ గ్రామానికి చెందిన కోదాటి శ్రీనివాసరావు కుమారుడు మనోజ్(16) విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని శ్రీ చైతన్య కాలేజీ రామన్ భవన్-3 క్యాంపస్‌లో మొదటి సంవత్సరం ఎంపిసి చదువుతున్నాడు. ఈ నెల 13న ఆదివారం స్నేహితులతో కలిసి, కళాశాల నుండి బయటికి వెళ్లిన మనోజ్ తిరిగి కళాశాలకు చేరలేదు. ఈమేరకు సోమవారం పటమట పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. కాలేజీ వారి సమాచారం మేరకు నాలుగు రోజులుగా వెదుకుతున్నారు. ఈనేపథ్యంలో గురువారం ఉదయం కేసరపల్లి గ్రామంలో అయిదో నంబరు జాతీయ రహదారి పక్కనున్న ఊరచెరువులో మనోజ్ శవమై కన్పించాడు. సమాచారం అందిన వెంటనే గన్నవరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని, శవపరీక్ష కోసం విద్యార్థి మృతదేహాన్ని గన్నవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డిఆర్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన రంగయ్య
మచిలీపట్నం, డిసెంబర్ 17: జిల్లా రెవెన్యూ అధికారిగా నియమితులైన చెరుకూరి రంగయ్య గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. నూజివీడు ఆర్డీవోగా పనిచేసిన ఆయనను ప్రభుత్వం పదోన్నతిపై జిల్లా రెవెన్యూ అధికారిగా నియమించింది. ఇప్పటివరకు ఇన్‌చార్జ్ ఆర్డీవోగా వ్యవహరించిన బందరు ఆర్డీవో సాయిబాబు నుండి రంగయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా డిఆర్‌ఓ రంగయ్య మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. జిల్లా అధికారులంతా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఉండటం లేదన్న అపవాదు లేకుండా తాను పనిచేస్తానన్నారు. వారంరోజుల్లో స్థానికంగానే నివాసం ఏర్పర్చుకుని కార్యాలయంలో అన్నివేళలా అందుబాటులో ఉంటానని చెప్పారు. 1990లో ఆయన గ్రూప్-2ఎ ద్వారా సర్వీస్‌లోకి వచ్చారు. 1996లో విజయవాడ కో-ఆపరేటివ్ రిజిస్ట్రార్‌గా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, తూర్పు గోదావరి జిల్లాలో తహశీల్దార్‌గా పనిచేశారు. 2010లో శ్రీకాకుళంలో వంశధార ప్రాజెక్టు స్పెషల్ డెప్యూటీ కలెక్టర్‌గా, 2010లో విశాఖపట్నం ఆర్డీవోగా, 2013లో తిరుపతి ఆర్డీవోగా, 2014లో నూజివీడు ఆర్డీవోగా పనిచేశారు. ప్రస్తుతం పదోన్నతిపై జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించడం ఆనందంగా ఉందని రంగయ్య చెప్పారు. డిఆర్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన రంగయ్యను కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్ఛాలతో అభినందించారు. కలెక్టరేట్ ఎఓ సీతారాం, జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్, కలెక్టరేట్ యూనిట్ అధ్యక్షులు విక్టర్ పాల్, నెల్సన్‌పాల్, సాంబశివరావు, వివిధ సెక్షన్‌ల సూపరింటెండెంట్లు, సిబ్బంది డిఆర్‌ఓకు అభినందనలు తెలిపారు.

వైభవంగా షష్ఠి కల్యాణ మహోత్సవాలు
ముదినేపల్లి, డిసెంబర్ 17: జిల్లాలో ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటిగా భాసిల్లుతున్న సింగరాయపాలెం - చెవూరిపాలెం గ్రామాల్లోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి కల్యాణ మహోత్సవాలు గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడుపుగంటి వెంకటరామయ్య తెల్లవారుఝామున పుట్టలో పాలుపోయటంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. మాజీ మంత్రి ఎర్నేని సీతాదేవి, గుడివాడ జూనియర్ సివిల్ జడ్జి కె అరుణకుమారి, మాజీ దేవాదాయ శాఖ మంత్రి కనుమూరి బాపిరాజు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ఎం శారదాకుమారి, ఆలయ సిబ్బంది ఆలయ మర్యాదలతో వీరిని ఆహ్వానించారు. మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారి పుట్టలో పాలుపోశారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించి తమ మొక్కుబడులు తీర్చుకున్నారు. ఆలయ ప్రాంగణంలో బారికేడ్లు నిర్మించి భక్తులు క్యూపద్ధతిలో వెళ్లేలా ఆలయ కమిషనర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. గుడివాడ రూరల్ సిఐ ఎం శివాజీరావు పర్యవేక్షణలో స్థానిక ఎస్‌ఐ ఎవిఎస్ రామకృష్ణ, కైకలూరు, మండవల్లి, కలిదిండి, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల ఎస్‌ఐలు, 80 మంది పోలీసు సిబ్బంది శాంతిభద్రతలను పర్యవేక్షించారు. పరిసర గ్రామాలు, సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వేలాది మంది భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.

20, 21న భారతీ సమితి 70 వసంతాల వేడుకలు
గుడివాడ, డిసెంబర్ 17: భారతీ సమితి 70 వసంతాల సాహితీ పండుగను జయప్రదం చేయాలని సమితి అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కొడాలి సోమసుందరరావు, డాక్టర్ బండారు శ్యామ్‌కుమార్ అన్నారు. గురువారం వారు స్థానిక విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 20న సహకార భవన్, 21న కమ్మవారి కల్యాణ మండపంలో సాహితీ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ డా. తుర్లపాటి కుటుంబరావు, ప్రఖ్యాత చిత్రకారుడు ఎస్‌వి రామారావు, రచయితల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకటసుబ్బయ్య, జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు వస్తున్నారని తెలిపారు.