మెదక్

8న కేంద్ర కరవు బృందం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, డిసెంబర్ 4: మెదక్ జిల్లాలో ప్రకటించిన 46 మండలాల కరవు ప్రాంతాలను కేంద్ర బృందం ఈ నెల 8న మెదక్ జిల్లాలో పర్యటించనుందని మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. శుక్రవారం నాడు డిఎఫ్‌ఓ ఫారెస్ట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడారు. కరువులో పంటల నష్టాన్ని అంచననా వేయడానికి సర్వే టీములు ముమ్మరంగా పనిచేస్త్తున్నాయని ఆయన తెలిపారు. రైతుల వారీగా, పంటల వారీగా వ్యవసాయ శాఖ అధికారులు, తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, విఆర్‌ఓల ఆధ్వర్యంలో పంటల నష్టాన్ని సర్వే ద్వారా నివేధించబోతున్నట్లు ఆయన తెలిపారు. దీంతో పాటు తాగునీటి సమస్య కూడా జిల్లాలో తీవ్రంగా ఏర్పడిందని కలెక్టర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. ఉపాది హామీ పనులను జిల్లాలో వంద రోజుల నుంచి 150 రోజులకు పెంచడం జరిగిందని ఆయన తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం హ్యాబిటేషన్ వారిగా ప్రణాళిక తయారు చేస్తున్నట్ల ఆయన తెలిపారు. ఇప్పటికే 17 కోట్లు నాన్ సిఆర్‌ఎఫ్ క్రింద ఆ నిధులను జూలై వరకు పనులు నిర్వహించడానికి కెటాయించారని తెలిపారు. మంచినీటి ప్రాంతాలను గుర్తించి పనులు చేపట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. సంగారెడ్డికి మంజీర నుండి పంపింగ్ చేయబోతున్నట్లు కూడా తెలిపారు. కం గ్టికి రుద్రారం ప్రాజెక్ట్ నుంచి మంచినీటి వసతులు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. బ్యారేజి కైలాసనాళ నుంచి 7 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మించబోతున్నట్లు కలెక్టర్ తెలిపారు. మన జిల్లాలో ఎక్కువగా వరిపంట, చెరుకు పంట ఉందన్నారు. రబీ సీజన్‌లో ఆరుతడి పంటలకు మాత్రమే రైతులు మెగ్గుచుపాలని, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామగ్రామాణ సభలు, సమావేశాలు నిర్వహించి ప్రచారాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. సింగూర్‌లో నీళ్లు లేవు, తాగునీరుకే ఇబ్బందిగా ఉంది. సింగూర్ నుండి హైదరాబాద్‌కు తరలించే నీటిని నిలిపివేశామని కలెక్టర్ రోనాల్డ్ రాస్ వెల్లడించారు. సంగారెడ్డి, కొండాపూర్, గజ్వెల్ ప్రాంతంలోని 135 గ్రామాలకు, పశువులకు పాండ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ బోర్లను హైరింగ్ తీసుకొని మంచినీటి ఎద్దడి ప్రాంతాలకు ట్రాన్స్‌పోర్ట్ ద్వారా ప్రజల దప్పిక తీర్చుతామని ఆయన వెల్లడించారు. వలసలు నిలిపివేసేందుకు మెదక్ జిల్లాలో అత్యవసర చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఎన్‌ఆర్‌జిఎస్‌లో 1065 గ్రామాలకు 845 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయన్నారు. గిరిజన తండాలను కూడా తాను పర్యటించానని కలెక్టర్ తెలిపారు. తనతో గిరిజనులు మాట్లాడుతూ చెరుకు కటింగ్‌కు అగ్రిమెంట్ చేసుకొని అడ్వాన్స్‌గా 3 లక్షల రుపాయలు రైతులు చెల్లించారని, ఈ డబ్బును ప్రభుత్వం ఇస్తుందా అని తనతో ఆ గిరిజనులు ప్రశ్నించారని కలెక్టర్ తెలిపారు. గిరిజనుల ప్రశ్నకు తనవద్ద సమాధానం లేకుండా పోయిందన్నారు. హరితహారం క్రింద రెండు కోట్ల మొక్కలు ఉన్న నర్సరీలు జిల్లాలో ఉన్నట్లు తెలిపారు. అయితే వర్షాభావ పరిస్థితి కారణంగా హరితహారం పనులను అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయామని కలెక్టర్ తెలిపారు. వచ్చే సంవత్సరం సీజన్‌కు హరితహారంకు 5.30 కోట్ల మొక్కలను సిద్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరం ఒక కోటి 18 వేల మొక్కలను హరితహారం క్రింద నాటడం జరిగిందన్నారు. అంటే 30 శాతం మాత్రమే హరితహారం సాధించగలిగామన్నారు. 2016 అక్టోబర్ వరకు ప్రణాళికను ఓడిఎఫ్ మెదక్ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌జిఎఫ్ క్రింద మరుగుదొడ్లను అక్టోబర్ 2 వరకు పూర్తి చేస్తామని కలెక్టర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. రెండున్నర లక్షలు మెదక్ జిల్లాలో ఇంకుడు గుంతలు నిర్మాణం చేయాలనే్న లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు 30 వేల ఇంకుడు గుంతలకు ఎస్టిమెట్ వేయడం జరిగిందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల విషయంలో పేమెంట్లలో ఆలస్యం జరుగుతుందని వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి ఇస్తుందని కలెక్టర్ ప్రకటించారు. పారిశుద్య పనులలో ప్రతి గ్రామానికి ట్రై సైకిళు ఇస్తామన్నారు. ట్రై సైకిళ్ల ద్వారా చెత్తను సేకరించి హెల్త్ అండ్ శానిటేషన్‌గా మెదక్ జిల్లాను తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో క్వాలిటి ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి నెల 7 నుండి 11 వరకు పారిశుద్య ప్రభుత్వ స్కూల్స్‌గా పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి స్కూల్‌లో టాయిలెట్ లేకుండా చుస్తామని, నీటి వసతులు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడ కూడా నీటి వసతి లేకుంటే గ్రామపంచాయితీల ద్వారా ట్రాన్స్‌పోర్టులో ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట ఐఎఫ్‌ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓఎస్‌డి తెలంగాణ హరితహారం ఆఫీసర్ ప్రియాంకవర్గీస్, డిఎఫ్‌ఓ శివాని డోగ్రా, ఆర్డీఓ మెంచు నగేష్, తహశీల్దార్ రాథోడ్ విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

ఆరుతడి పంటలతోనే లబ్ధి
ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరక్టర్ రామలక్ష్మి
సిద్దిపేట, డిసెంబర్ 4: రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకొని లబ్ధి పొందాలని ఉద్యానవన శాఖ డిప్యూటి డైరక్టర్ రామలక్ష్మి అన్నారు. స్థానిక పశుసంవర్దక శాఖ కార్యాలయంలో మామిడితోటల, యాజమాన్య పద్దతుల పై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కూరగాయల సాగు పై ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందన్నారు. కూరగాయల పంటలు సాగు చేసుకొని రైతులు లబ్దిపొందాలన్నారు. ప్రభుత్వం టమాట విత్తనాలు, బాక్స్‌లను రాయితీ పై ప్రభుత్వం అందిస్తుందన్నారు. పందిరిసాగు లాభదాయకంగా ఉంటుందని, రైతులు పందిరిసాగు ద్వారా పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందించిన రాయితీలను రైతులకు వివరించారు. ఈ క్రమంలో రైతులు కరవు పరిస్థితులు నెలకొన్నాయని, విత్తనాలు వందశాతం రాయితీ మీద ఇవ్వాలని సూచించారు. 30,40శాతం ప్రభుత్వం ఇస్తున్నారని చెప్తున్నారన్నారు. ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా ఆదుకుంటుందని, నిజానికి క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరుగా ఉందన్నారు. ఏడి మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకపోతానని హామినిచ్చారు. ఏడి సురేష్ మాట్లాడుతూ మామిడి రైతులకు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాలీ హౌజ్‌లకు ప్రభుత్వం 75శాతం సబ్సిడి ఇస్తుందన్నారు. రైతులందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫల పరిశోధన కేంద్రం శాస్తవ్రేత్త కిరణ్‌కుమార్ మామిడి పూత, యాజమాన్య పద్దతుల పై అవగాహన కల్పించారు. పూతదశలో ఎరువులు, సస్యరక్షణ, నీటి యాజమాన్య పద్దతుల పై అవగాహన కల్పించారు. పూత తర్వాత వచ్చే చీడపీడల నివారణ పై రైతులు తీసుకోవాల్సిన చర్యల పై అవగాహన కల్పించారు.

మిషన్‌కాకతీయ పనులు సత్వర పూర్తి
నర్సాపూర్, డిసెంబర్ 4: మిషన్‌కాకతీయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారంనాడు నర్సాపూర్ మండలంలోని ఇబ్రాహింబాద్ గ్రామంలో గల చెరువును పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన వెంట హరితహారం స్టేట్ ఓఎస్‌డి ప్రయాంక పాల్గొన్నారు. ఈసందర్భంగా చెరువు పనులను పరిశీలించారు. మొదటి విడత మిషన్‌కాకతీయ పనులను పూర్తి మార్చిలోగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో నిర్వహిస్తున్న మిషన్‌కాకతీయ పెండింగ్ పనులను పూర్తి చేయించాలని అన్నారు. గ్రామంలో రైతు శ్రీనివాస్ ఏర్పాటు చేసిన పాలిహౌజ్‌ను పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందించారు. రైతులు ఫాలిహౌజ్‌ల ద్వార మంచి దిగుబడులు సాధించగలరని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడిని ఉపయోగించుకొని నిరుద్యోగ యువకులు ఉపాధి పొందే అవకాశం ఉందని అన్నారు. అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వ పాఠశాలకు చేరుకొని వంటగది లేదా!అని ప్రశ్నించారు. కట్టేలపై ఎందుకు వండుతున్నారు. గ్యాస్ లేదా అని అన్నారు. అనంతరం నర్సాపూర్‌లోని సోషల్‌ఫారెస్టు సర్సరీని పరిశీలించారు. రాబోయే సంవత్సరంలో విరివిగా చెట్ల పెంపకాన్ని చేపట్టేందుకు సమాయత్తం కావాలని అన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ డిప్యూటి ఇఇ వెంకటేశ్వర్లు, వ్యవసాయశాఖ ఎడిఇ దత్తత్రెయ పాల్గొన్నారు.

సారా కిక్కు .. గంజాయి మత్తు తొలగేదెన్నడో?
సిఎం ఇలాకాలో ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
సంగారెడ్డి, డిసెంబర్ 4: ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి మిగిలిన జిల్లాలకు ఆదర్శంగా నిలవాల్సి ఉండగా, ఎక్సైజ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం పరాకాష్టకు చేరుకుంది. గ్రామీణ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న గుడుంబా, నాటుసారాలను వంద శాతం నియంత్రించాలని ప్రభుత్వం ఎక్సైజ్ శాఖకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. గుడుంబాను నియంత్రించడంలో కరీంనగర్, మహబూబ్‌నగర్ లాంటి జిల్లాల ఎక్సైజ్ అధికారులు లక్ష్యాన్ని సాధించి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు. గంజాయి సాగులో జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పెట్టింది పేరు. ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాలను సైతం గంజాయి సాగు కుదిపేసిందంటే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నారాయణఖేడ్ ప్రాంతం పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదే ప్రాంతంలో అనేక గిరిజన తండాలు ఉండటంతో నాటుసారా ఉత్పత్తి జోరుగా సాగుతుంది. నర్సాపూర్, జహీరాబాద్, సదాశివపేట తదితర ప్రాంతాల్లో కూడా నాటు సారా తయారీ ఎక్కువగా ఉంటుంది. ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం నాటుసారాను నియంత్రించడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. జిల్లాలో ఎక్కడెక్కడ నాటుసారాను నియంత్రించారో స్పష్టత లేకపోవడం దురదృష్టకరం. కల్తీ కల్లును నియంత్రిస్తున్నామని చెప్పుకుంటున్నా చిన్నా చితక గీత కార్మికులపై ఎక్సైజ్ అధికారులు ప్రభావం చూపిస్తున్నా పెద్ద పెద్ద డిపోల జోలికి వెళ్లకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ సంక్షేమ పథకాల్లో గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలు ముందుకు దూసుకుపోతూ రాష్ట్రం, దేశ స్థాయిలో తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపును తీసుకువస్తున్నాయి. ముఖ్యమంత్రి సంకల్పించిన గుడుంబా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించాలని చేసిన సూచనలను ఎక్సైజ్ అధికారులు పెడచెవిన పెట్టినట్లు తెలుస్తోంది. గంజాయి సాగు జోరుకు కళ్లెం వేస్తున్నట్లు అడపాదడపా గంజాయిని పట్టుకుంటున్నా పూర్తిస్థాయిలో నిర్మూలించడంలో ఎక్సైజ్ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. ప్రైవేట్ వాహనాలపై అధికారుల దృష్టి ఉంటుందని భావించిన గంజాయి స్మగ్లర్లు ఏకంగా ఆర్టీసి బస్సులను ఉపయోగించుకుంటున్నారని ఇటీవల న్యాల్‌కల్ మండలంలో ఆర్టీసి బస్సులో పట్టుబడ్డ 80 కిలోల ఎండుగంజాయి లభించడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. ఎక్సైజ్ అధికార యంత్రాంగం స్పందించి జిల్లాలో ఎక్కడ కూడా గంజాయికానీ, గుడుంబా తయారీకానీ లేకుండా నిర్మూలించి సారా రహిత జిల్లాగా మెదక్‌కు గుర్తింపు తీసుకురావాలని కోరుకుందాం.

రెవెన్యూ రికార్డులను సరి చేయాలి
* వీడియోకాన్ఫరెన్స్‌లో రేమాండ్ ఫీటర్
సంగారెడ్డి , డిసెంబర్ 4: రెవెన్యూ రికార్డులలో గల తప్పులను సరి దిద్దాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని భూ పరిపాలన ముఖ్య కమీషనర్ రేమాండ్ ఫీటర్ సూచించారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వ్యవసాయ శాఖ కమి షనర్ ప్రియదర్శినితో కలిసి జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులలో గల తప్పుకు సంబంధిత తహసీల్ధార్లు ప్రోసిడింగ్ ఇచ్చి సరి చేయాలన్నారు. గ్రామాల్లో గల రెవెన్యూ రికార్డులను కాపాడాల్సిన బాధ్యత అధికారులైన మనపై ఉందన్నారు. రెవెన్యూకు సంబంధించిన విషయాలపై సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు శిక్షణ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. పహానీలను సరి చేసి పట్టాదారు పాస్ పుస్తకాలను అందించాలని, జమా బంధికి సంబంధించిన ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మ్యూటేషన్లలో దొర్లిన తప్పులను కూడా ప్రోసిడింగ్స్ ద్వారా సరి చేయాలన్నారు. అన్ని వివరాలను వెబ్‌లాండ్‌లో పొందుపర్చాలన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలపై జెసిలు పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి తహసీల్ధార్‌కు ఆధార్ బేస్‌డ్, డిజిటల్ సిగ్నిచర్ కీ ని ఇవ్వడం జరుగుతుందని దీని ద్వారా డాటా ఎంట్రి ఆపరేటర్ ఎలాంటి మార్పులు చేయకుండ అవకాశం ఉంటుందన్నారు. ప్రతి గ్రామ రెవెన్యూ అధికారి గ్రామంలోని పంట వివరాలను సర్వే నంబర్ వారిగా సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామానికి సెత్వార్ డెటా ఉంటుందని ఆ డాటాను గ్రామాలు, సర్వే నంబర్ల వారిగా వెబ్‌లాండ్‌లో నమోదు చేయాలన్నారు. తప్పుల సవరణ అనంతరం రెవెన్యూ రికార్డులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలేత్తవన్నారు. ఆర్డీఓలు డివిజన్ కేంద్రాల్లోనే ఉండాలని ప్రణాళిక బద్ధంగా తమ పరిదిలోని మండలాలను తనిఖీ చేయాలన్నారు. జివో 58,59కి సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాన్ఫరెన్స్‌లో జెసి వెంకట్రామ్‌రెడ్డి, డిఆర్వో దయానంద్, కలెక్టరేట్ ఎఓ వివై గిరి తదితరులు పాల్గొన్నారు.

గ్యాస్ గోదాంను
ప్రారంభించిన ఎమ్మెల్యే
రేగోడ్, డిసెంబర్ 4: గ్యాస్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం అందుబాటులో ఎజెన్సీల ద్వారా కృషి చేస్తుందని ఎమ్మెల్యే బాబుమోహన్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పటేల్ ఇండియన్ గ్యాస్ ఎజెన్సీ గోదాంను ప్రారంభించారు. మండల పరిధిలోని వినియోగదారులకు అందుబాటులో ఉండి సకాలంలో గ్యాస్‌ను సరఫరా చేయాలని సూచించారు. కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు మోహీజ్, మాజీ ఎంపి మానిక్‌రెడ్డి, టిఆర్‌ఎస్ నాయకులు విగ్రం రామాగౌడ్, అరవింద్‌రెడ్డి, వీరారెడ్డి, రాధాకిషన్ పాల్గొన్నారు.

సస్పెన్షన్‌కు గురై మనస్తాపంతో కార్మికుడు మృతి

* మున్సిపల్ కార్యాలయం ముందు
కార్మికుల ఆందోళన
సంగారెడ్డి , డిసెంబర్ 4: సిబ్బందిని క్రమశిక్షణలో పెట్టడానికి తీసుకున్న చర్య ఓ కార్మికుడి మృతికి కారణమైంది. సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపల్ పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల్లో జవాబు దారి పెంచేందుకు కలెక్టర్ రోనాల్ట్ రాస్ 11మందిని రెండు మాసాల క్రితం తొలగించారు. సిఐటియు, కౌన్సిల్ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్మానం చేసిన కమిషనర్ బేఖాతర్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ దృష్టికి కౌన్సిల్ సభ్యులు తీసుకేళ్లగా 6మందిని విధుల్లోకి తీసుకోగా, మరో 5మందిని నెల రోజుల తర్వాత విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించినట్లు సిఐటియు పట్టణ కార్యదర్శి మహబూబ్‌ఖాన్ తెలిపారు. సస్పెన్షకు గురైన ఎర్రోళ్ల కుమార్ శుక్రవారం ఉదయం ఆనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆవేదనకు గురైన తోటి కార్మికులు మున్సిపల్ కార్యాలయం ముందు కమిషనర్ మధుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఉపాధి కోల్పోయానన్న మానసిక వేదనతో కుమార్ మృతి చెందాడని, మరణానికి కారణమైన అధికారులను సస్పెండ్ చేయాలని, లేని పక్షంలో ప్రత్యేక ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. స్పందించిన కౌన్సిల్ చట్టపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని ఇంట్లో ఒకరికి ఉద్యోగం, బెనిఫిట్స్ అందజేస్తామని చైర్ పర్సన్ విజయలక్ష్మి, వైస్ చైర్మన్ గోవర్ధన్ హామి ఇచ్చారు. అంత్యక్రియలకు రూ.10వేల నగదును అందజేశారు. ఆందోళనలో కార్మికులు మహేష్, మోహన్, రాజేశ్వర్, శివరాజ్, సెల్వరాజ్, నర్సింహా, ప్రభాకర్, రాజు, సువర్ణ, అనసూయ, రాములు, దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు.