సెంటర్ స్పెషల్

మహావిజేత 16

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

39
దుష్టబుద్ధి మనఃక్లేశంతో సతమతమవుతున్నాడు. అదొక అంతర్గత సంకట స్థితి. దానికి కారణం. ఆయన పథకాలన్నీ చంద్రహాసుని ప్రతిభా సామర్థ్యాల ముందు వమ్మయి పోవడమే. తన ఓటమి తనను పరిహసిస్తున్నదన్న భావన ఆయనని కుంగదీస్తున్నది. శంబరుడినే బంధించి పారేశాడు! చెరసాలలో వాడు ప్రసేనుని పేరునీ, తన పేరునీ బయటపెట్టలేదనే దానికి రుజువేదీ? తమ పన్నాగం తెలిసీ ఉపేక్షిస్తున్నారా - కళింద్రవారు? లేక వారికి వేరే ఆలోచనలున్నాయా?
మదనుడూ విషయా తండ్రి మందిరంలోకి ప్రవేశించారు. తండ్రికి అభివాదం చేసి కూర్చున్నారు.
మదనుడు అమాత్యుల ముందున్న పీఠం పైని సంబారంపై తన దృష్టిని కేంద్రీకరించి, విచారగ్రస్తమైన మోముతో అన్నాడు. ‘తమకు చెప్పేటంతటి వాళ్లం కాము. కానీ, తమరి ఆరోగ్యం గురించి..’ అని అర్థోక్తిలో ఆపాడు.
విషయ అందుకున్నది. ‘నేను పదేపదే మనవి చేస్తూనే ఉన్నాను’ అని.
దుష్టబుద్ధి ‘పోనిద్దుర... ఎవరిని ఉద్ధరించటానికి నేను నా ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి’ అని నిర్వేదంతో నిట్టూర్పు విడిచాడు.
ఎదుటనున్న ఇరువురూ నివ్వెరబోయారు. తండ్రి ఏదో తీవ్రమైన నిరాశతో, ఆశాభంగంలో ఉన్నట్లు అర్థం చేసుకోగలిగారు. కానీ, వివరాలు అడగలేక మిన్నకున్నారు.
క్షణం తర్వాత మదనుడే, ‘తమరు పరాక్రమవంతులు, పండితులు. కుంతల మహాసామ్రాజ్యంలో ఎవరినైనా, దేనినైనా శాసించగల అర్హతా, పెద్దరికమూ, గౌరవ మన్ననలూ కలిగిన మహామాత్యులు మీరు. మహారాజు తరువాత అంతటి వారు’ అన్నాడు.
‘తమ వంటి వారే ఇలాంటి నిర్వేదానికి లోనయితే, అల్పజ్ఞులం మా పరిస్థితి ఏమిటి?’ అన్నది విషయ.
పిల్లలిద్దరూ చూపిన మర్యాదా, చేసిన అభిజాత్య ప్రశంసా ఆర్ద్రంగా తగిలాయి దుష్టబుద్ధి హృదయానికి. ఉత్తముడైన పుత్రుడు మదనుడు. ధర్మపరుడు, విద్యావినయ వివేకాలు కలిగినవాడు. ఇక - విషయ యుక్తాయుక్త విచక్షణ కలిగిన పిల్ల. తల్లిలేని సంతానాన్ని లేప్రాయంలోనే గురుకులంలో వుంచాడు. తానంటే గాలవులకు అంతగా సదభిప్రాయం లేదని తనకు తెలిసికూడా; ఆయన శిష్య వాత్సల్యం, సదుపదేశ నిబద్ధతా మొక్కవోనివనే నమ్మకంతో - పిల్లల్ని వచ్చీరాని వయస్సు నుంచీ గాలవుల వారి శిక్షణకు పంపాడు. చంపకమలినితో సమంగా ఆదరింపబడినారీ యిద్దరూ కూడా. అందువల్లనే ఇటు చదువుసంధ్యలలోనూ అటు యుద్ధ విద్యలలోనూ ఉన్నత వ్యక్తిత్వాలను సముపార్జించుకున్నారు. అందునా, మదనుడు ఒక వాసి ఎక్కువే!
‘అవునూ మీరు వచ్చిన పని..?’ ప్రస్తుతానికొచ్చి ఇద్దరినీ చూస్తూ అడిగాడు.
‘పెద్దగా విశేషమేమీ లేదుగానీ, మీరెందుకిలా ఉంటున్నారో చెప్పండి?’ అన్నది విషయ.
‘చేసిన కృషి కలసిరాక పోవటం కంటే ధీరులకి దుఃఖం వేరే ఉంటుందా?’ సౌమ్యతని నూరిపోసుకుంటూ అన్నాడు.
కొంత సమయం వౌనంలోనే గడిచింది. అప్పుడు నోరు విప్పాడు మదనుడు. ‘మీరు కూడా కరదకూ, అష్టకూ వస్తే బాగుంటుంది. మాకు పెద్ద దిక్కుగా ఉంటారు. అటు సామంతులను కలిసినట్లూ ఉంటుంది’
ఒక్క క్షణం ఆలోచించి ‘ఆలోచన బాగానే ఉంది. కానీ.. ప్రభువుల వారి అస్వస్థత..?’ అన్నాడు. మళ్లీ తనే ‘చూద్దాం. కానీయండి’ అన్నాడు.
‘మీకు కొంత గాలి మార్పుగా ఉంటుంది నాన్నగారూ. ప్రశాంతంగా కొన్ని రోజులు గడపవచ్చు’ అన్నది విషయ.
మరి కొంతసేపు అవీ, ఇవీ - ముచ్చటించి, మదనుడూ, విషయా సెలవు తీసుకున్నారు.
మళ్లీ ముందటి ఆలోచనలలోకి వెళ్లాడు దుష్టబుద్ధి. ప్రశ్నార్థకంగా చంద్రహాసుని రూపం ఎదుట నిలిచింది, అసంకల్పంగా అంతటి దుష్టబుద్ధి గుండే తత్తరిల్లింది!
40
అక్షయ, చంద్రహాసులు తమ అష్ట ప్రయాణంలో సగం దూరం వచ్చారు.
అక్కడ,
బాటకు పక్కగా చిన్న జనావాసం కనిపించింది. పొలిమేరలో ఆగారు. పక్కగా ఒక గున్నమామిడి. మామిడి కొమ్మ మీద కూర్చుని ఎవరో యువకుడు మురళి శ్రుతి చేయటం మొదలెట్టాడు.
స్తబ్దుగా ఉన్న వాతావరణం సర్వమూ మేల్కొన్నది. క్షణాలలోనే ఒక మధుర మహాగీతిక ప్రస్తారం ఆరంభమైంది.
జనపదం నుంచీ వస్తున్న వ్యక్తులు ఆగి వింటున్నారా గానాన్ని.
ఆ యువకుడు నిమీలిత నేత్రుడై రాగాన్ని తారస్థాయిలో జనరంజకం చేస్తున్నాడు. ఉన్నట్టుండి కళ్లు తెరచి చూశాడా యువకుడు.
చుట్టూ శ్రోతలు!
అందరినీ చూస్తున్న అతని చూపులు అక్షయ చంద్రహాసుల మీదికి ప్రసరించగానే - రౌద్రం కమ్మేసిందతన్ని. గానాన్ని ఆపేశాడు చేతనున్న మురళిని అంగీలో దోపుకున్నాడు.
ఒక్క ఉదుటున కొమ్మ మీద నుంచీ అక్షయుడి మీదికి దూకేశాడు!
ఒడుపుగా బలమైన తన బాహువులతో అతన్ని చుట్టేసి నేల మీద పడేశాడు. అక్షయుడు నిశే్చష్టుడయినాడు. లిప్తమాత్రలో తెప్పరిల్లి అతనితో తలపడ్డాడు.
అప్రతిభుడైనాడు చంద్రహాసుడు. క్షణాల వ్యవధిలో ఆ ఇరువురి మధ్యకూ దూకి, ఆ యువకుడిని తన దగ్గరున్న పాశంతో బంధించి పక్కన నిలబెట్టాడు.
అక్షయుడు లేచి, కోపంతో ఆ యువకుడి చెంపను ఛెళ్లుమనిపించాడు. చంద్రహాసుడు వారించాడు. చూపరులంతా మ్రాన్పడిపోయారు.
ఆ యువకుని వివరాలు అడిగాడు చంద్రహాసుడు.
అతని పేరు చక్రుడు. తల్లిదండ్రులు కృషీవలులు. స్వయంకృషితో లాగాలాపన చేస్తూ మురళీవాదనను నేర్చుకున్నాడు. చిన్నతనం నుంచీ మండలాధిపతి కొలువులో చేరాలని కోరిక. యుక్తవయస్సులో ఆ ప్రయత్నం చేస్తే- కళాకారుడు సైన్యానికీ, సాహసానికీ, సమరానికీ పనికిరాడని హేళన చేసి తరిమేశారు.
అదీ అతని కోపానికి కారణం! రాచవారిపై ద్వేషం అంతరాంతరాలలో సుప్త చేతనలో వున్నది. ఇప్పుడు ఈ ‘రాచవారిని’ చూసేసరికీ, ఆ కోపం, రోషం పడగవిప్పాయి. ఆవేశం తరిమింది. కలబడ్డాడు.
అందర్నీ చూస్తూ చెప్పాడు చంద్రహాసుడు. ‘తెలియక చేసిన తప్పు ఇది. మీరందరూ అష్టలో ఇంకా పూర్వ మండలాధిపతి ఏలుబడే సాగుతున్నదనే భావనలో వున్నారు. అది నిజం కాదు. ప్రజాక్షేమం, ప్రజల ఆశయ సాధన అనే లక్ష్యాన్ని నెరవేర్చటానికి కుళిందకుల పాలన సాగుతోంది’
అందరి వదనాలూ ప్రసన్నమైనై. జయధ్వానాలు ఘోషిల్లినాయి.
వీరెవరో గ్రామీణులకి తెలిసిందిప్పుడు. ఆ యువకుని తల్లీ, తండ్రీ వచ్చారు. క్షమాభిక్షను అర్థించారు. అతని ముఖంలోనూ పశ్చాత్తాప చిహ్నాలు. అక్షయుడి చేతినీ, చక్రుని చేతినీ కలిపాడు చంద్రహాసుడు.
నాలుగు రోజుల తర్వాత అష్టకు వెళ్లి కుంజరుని కలవమని చక్రుడికి చెప్పి ముందుకు సాగారు.
దారిలో - జరిగిన విశేషాలను చర్చిస్తూ, ‘తమ్ముడూ, ఈ అనుభవం చెప్పే పాఠం ఏమిటి?’ అడిగాడు చంద్రహాసుడు. అక్షయుడు ఉలిక్కిపడ్డాడు. ఆలోచించి చివరికి, ‘తీరని కోరికల ప్రతిఫలనం పగగా బహిర్గతమవుతుంది’ అన్నాడు.
చంద్రహాసుడు ‘అవును. బాగా చెప్పావు. కానీ, అంతకంటే ముఖ్యంగా మనం గమనించవలసిన అంశం - చక్రుని వంటి ఎందరు అసంతృప్తులూ, ఎందరు ప్రతిస్పర్థులూ - అక్కడ ఉన్నారో? ఆ విషయం గురించి మనం లోతుగా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి’ అన్నాడు.
అక్షయుడికి మళ్లీ ఏదో కొత్త పాఠం విన్నట్టే తోచింది. ‘యదార్థమే సుమా’ అనుకున్నాడు.
గుర్రాల వేగం పెరిగింది.
అష్టలో కుంజరునీ, వివరినీ - విడివిడిగానూ, ఇతర ముఖ్య అధికారులతో కలిసి, కూర్చునీ చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు. జరుగుతున్న పనులన్నింటినీ స్వయంగా వెళ్లి పర్యవేక్షించారు.
ఆ రాత్రి-
‘ఈరును దువ్వితే గానీ పేను దొరకదు’ అనిపించింది చంద్రహాసునికి. వెంటనే కుంజరునీ, వివరినీ పిలిచి, ఏర్పాట్ల విధుల్లో నియమింపబడిన ప్రతి ఒక్క కర్మకరుని, పర్యవేక్షకుని పుట్టుపూర్వోత్తరాల్ని తెప్పించి - వారి విశ్వసనీయత గురించి ఆలోచనలు సాగించారు.
అంతా సంతృప్తిగా వున్నట్లే అనిపించింది.
ఆరోజు-
మధ్యాహ్నం - తీరా కళింద్రకు బయలుదేరబోతూంటే వార్త వచ్చింది.
రైతులు, పన్నులు వసూలు చేసే సుంకరులు, రాజ్య వ్యవహారులు, కోలగాండ్రు, స్థలకరణాలు వంటి కొందరు ప్రముఖులు - అక్షయ చంద్రహాసులతో మాట్లాడాలనుకుంటున్నారని!
రమ్మన్నారు. వారంతా వచ్చి కూర్చున్నారు. మాటలు సాగాయి.
నీరు పొలాలు, పాడి భూములు, తోటలు, పచ్చికబయళ్ళపై - ధాన్య రూపంలోనూ, ధన రూపంలోనూ చెల్లించే పన్నులు చాలా ఎక్కువగా వున్నాయనీ, రాజ్య వ్యవహారులు కొందరు ఏ ఆదాయమూ లేని పచ్చిక బయళ్లపైన పుల్లరి పన్నును నిర్దాక్షిణ్యంగా వసూలు చేస్తున్నారనీ - ఫిర్యాదులు చేశారు.
వచ్చిన ప్రజల్లో ఇద్దరు యువకులు చాలా దూకుడుగా ప్రభుత్వ వ్యవస్థని దూషించారు. వారి పేర్లు కాళి, సాహుడు.
‘మరి, మీ ఇబ్బందులను రాజ ప్రతినిధులైన కుంజరునికీ, వివరికీ ఎందుకు నివేదించుకోలే’దని ప్రశ్నించాడు అక్షయుడు. దానికి ఆ యువకుడు కఠిన స్వరంతో ‘వారికెప్పుడూ మీ రాచకార్యాలే. మమ్మల్ని పట్టించుకునేంత తీరుబడి లేదు’ అన్నాడు.
కుంజరుడూ, వివరీ నొచ్చుకున్నారు.
‘సరి. మీ సమస్యల నన్నింటినీ వ్రాసి వారికివ్వండి. మేము మహా మండలాధిపతులకు నివేదించి, వీలయినంత త్వరలో పరిష్కరింపబడేలా చూస్తాము’ అన్నాడు అక్షయుడు. వారంతా అలాగేనని నిష్క్రమించారు.
అక్షయుని చొరవకు సంతృప్తి కలిగింది చంద్రహాసునికి. జనపదంలో కలిసిన చక్రుని గురించి ప్రత్యేకించి కుంజరునితో చెప్పి అతన్ని కొలువులోకి తీసుకొనమని కోరాడు.
వివరీ, కుంజరులకు వలసిన సూచనలు చేసి అశ్వాలను కదల్చారు - చంద్రహాస అక్షయులు.
రాత్రి పొద్దుపోయిన తరువాత చందనావతికి చేరారిద్దరూ. ఆ మర్నాడు మహారాజ సముఖంలో -
అష్టలో ఏర్పాట్ల గురించీ, రైతుల సమస్యల గురించీ, కుళిందకునికీ, చేతన మంత్రికీ, సింగన్నకీ తెలిపారు.
‘ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలా అనే ఆలోచనా, ఆచరణా ఇక వారివి’ అనుకున్నాడు చంద్రహాసుడు. అయితే, కాళినీ, సాహుడినీ అసలు రైతులుగానే అంగీకరించలేక పోతోంది అతని మనస్సు.
రాజప్రాసాదం నుంచీ బయటకి వచ్చాడు. ప్రాంగణంలో నడుస్తుంటే - పేరులేని పిట్ట ఏదో కీచుగా అరుస్తూ, అతని శిరస్సు మీదుగా ఎగిరిపోయింది. విభ్రాంతితో ఉలిక్కిపడ్డాడు చంద్రహాసుడు!

(మిగతా వచ్చే సంచికలో)

-విహారి 98480 25600