సెంటర్ స్పెషల్

మహావిజేత 20

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే సమయంలో- తమ గదుల్లోని పద్మినికీ, దుర్గికీ కూడా నిద్రపట్టక పానుపుపై మసులుతున్నారు. ముసుగు మనిషి ఎవరు? అతడిని వెంబడించిన ముసుగు వీరుడు ఎవరు? ఈ ప్రశ్నలే వారి మనసులనీ సదమదం చేస్తున్నాయి.
కుంజరుడూ, వివరీ, వజ్రసేనుడూ - ఇలా ఎవరికి వారు తలకు మించిన ఆలోచనలతో సతమతమవుతున్నారు.
ఒక్క దుర్ఘటనానుభవం ఇందరినీ ఊపుతోంది.
వీరందరి ఆందోళనలకు ఆవల -
అక్షయుని నెలవు! చంద్రహాసుడు, అక్షయుడూ!
అక్షయుడు అడిగాడు. ‘పాపశమనిగిరి మీద నుంచీ ఆ ముసుగు వీరుడ్ని వెంబడిస్తుంటే ఏం జరిగింది?’ ‘గిరి వెనుక అంతా దట్టమైన పొదలూ, వృక్షాలూ. అందులోనూ కొన్ని ఆరేడు నిలువుల కటక వృక్షాలు. వాటన్నిటి మధ్యనా పడి తీవ్ర హోరాటగా వాడి పరుగు. వాడి వెనుక నేను. ఒకచోట మొగలీ, జిల్లేళ్లూ దట్టంగా ఉన్నాయి. వాటి పైపై దూకుతూ పోయాము. ఎదురుగా లోయ. తటాలున వాడు లోయలో కాలువగట్టున వేచి ఉన్న గుర్రం మీదికి దూకేశాడు. అది దౌడు తీసింది. నా ప్రయత్నమంతా నిష్ఫలమైంది’ చెప్పాడు చంద్రహాసుడు.
ఇద్దరూ ఎవరి తలపుల్లోకి వారు మునిగారు.
50
మసక చీకటి! తెల్లవారబోతున్నది. అష్ట నిశ్శబ్దంగా ఉంది.
పది రోజుల ఉత్సవ భారం విశ్రాంతిని ఆహ్వానించింది.
విషయ ఒక్కర్తీ - కోట వెనుకనున్న సరస్సుకు పడమటి గట్టున నిలిచి ఉంది. రాత్రంతా నిద్ర లేదు. అలికిడి వినరావడంతో తలయెత్తి చూసింది. ఎదురుగా అశ్వారూఢులై దక్షిణపు గట్టు మీద నుంచీ వస్తున్న నలుగురు యువకుల మీద ఆమె చూపు నిలిచింది. ఉత్సుకతతో చకచకా ఉత్తర దిశగా అడుగులు వేసింది.
వెనుక అంతా అడవి. అక్కడి నుంచీ వారు దక్షిణం వైపు నుంచీ తూర్పుకు వస్తున్నారు. విషయ తూర్పుకు తిరిగింది. వారు సరస్సు గట్టును దిగబోతుండగా వారిని సమీపించింది. ఆమెను చూసి వారు ఒక్క క్షణం ఆగారు. వారిని పోల్చుకోవటానికి నిలబడి తేరిపార చూసింది. అక్షయుడు, కుంజరుడు, వివరి. మరి నాలుగవ వ్యక్తి?
ఆశ్చర్యంతోనే అతని రూపాన్ని వీక్షించింది. ఎరుపూ, నీలం గళ్ల తలపాగా పైన ముత్యాలసరం మెరుస్తోంది. ఒక చెన్ను తరిగినా - తేజోవిలసితమైన వదనం. క్షాత్ర దీప్త ఫాలం మీద చంద్రవంక తిలకం. ఎదుటి వ్యక్తిని కట్టిపడవేసే నిశితదృక్కుల నేత్రద్వయం? అంతే! అంతే గమనించగలిగింది. అతడు తలని పక్కకు తిప్పుకుని వేగంగా వెళ్లిపోయాడు. మిగిలిన వారూ వెళ్లిపోయారు. విషయ అలా చూస్తూనే ఉంది!
51
కుంజరుడి సౌధంలోని ఆంతరంగిక శాల! అతడూ, అక్షయ చంద్రహాసులూ, వివరీ కూర్చుని ఉన్నారు.
చాలా సమయమైంది. అప్పుడు కుంజరుని ఉద్దేశించి చెప్పాడు అక్షయుడు. ‘సరి. విషయం తేలింది. అన్న ఊహ నిజమైంది. నేరస్థుడు -కాళి - దొరికాడు. కాళిని చందనావతికి తరలించే పనిని పూర్తి చేయండి. జాడ తెలియకుండా పారిపోయిన సాహుడి కోసం అనే్వషణ సాగించండి’
‘చిత్తం’ అన్నాడు కుంజరుడు. అలాగే అన్నట్టు తల ఊపాడు వివరి.
‘ఇక్కడి వ్యవహారం కూడా చూడాలి మీరు. కుంతల రాచవారినందరినీ జాగ్రత్తగా కుంతలపురికి పంపే ఏర్పాటు చేయండి. ఈ సాయంత్రమే కళింద్రకి మా తిరుగు ప్రయాణం’ అన్నాడు చంద్రహాసుడు. ఇద్దరూ తల వూపారు!
52
కుంతలపురి-
శుద్ధ ఏకాదశి. సాయంత్రం వేళ.
గుండెలో పెద్ద బండరాయి పడిన భయంతో మహామంత్రి ముందు కూర్చుని ఉన్నాడు ప్రసేనుడు. అతని పక్కన చేతులు కట్టుకుని సాహుడు!
ముగ్గురి వదనాలూ విషణ్ణంగానే ఉన్నాయి.
దుష్టబుద్ధి - ఎదుట వున్న ఇద్దరినీ నిశితంగా చూశాడు. ‘అయినా వీడూ, వీడి మిత్రుడూ - వీరెక్కడ దొరికారయ్యా నీకు. బూడిద కుప్పల్లాంటి కళ్లూ, ధూళి ధూసరితంగా తలా, వొళ్లూ, గడకర్రల్లా చేతులూ కాళ్లూ - పనిచేయగల సత్తా ఏదీ?’ అన్నాడు. ‘పైగా రాకుమార్తె మీద హత్యా ప్రయత్నమా?’ అని ఆగి, ‘ప్రసేనా! ఎంత ఉజ్జ్వలమైన చరిత్రయ్యా నీది? ఏమిటీ పతనం? నీకు నేనేం బాసలు చేశాను? రాకుమార్తెని నీ కోడలు చేయాలని గదా నా యోచన. ఆమెని చంపుకుంటావా? ఎటు పోతున్నాయి - ఈ చర్యలు? సరి. ప్రయత్నిస్తానన్నావు. జరిగిందేమిటి? వైఫల్యం. కాళిని బంధించేశాడు చంద్రహాసుడు! వీడు చావుతప్పి కన్నులొట్టపోయి అక్కడ కొడితే ఇక్కడ వాలాడు. మళ్లీ ఒక్కటే ఉపశమనం. ఈ చవటలెవ్వరూ మన పేర్లు బయటపెట్టలేదు. అంతే సంతృప్తి’ అంటూ దీర్ఘ నిశ్వాసాన్ని వదిలాడు.
ప్రసేనునికీ లోపల అంతకంత వెచ్చని ఆవిరే! మాట పెగల్లేదు. కళ్లు చెమ్మగిల్లాయి. గాయం వెనుకటి చరిత్రని తడువుకుంటోంది ఆయన మనస్సు. కళ్లు తుడుచుకున్నాడు. మహామంత్రి హృదయంలోకి చూశాడు. ‘నా మేలుకే గదా ఆయనా బాధపడుతున్నాడు’ అనుకున్నాడు.
‘ఎవరక్కడ?’ అంటూ భటుని పిలిచి ‘వీనిని లోవరిలో మీ దగ్గర ఉంచండి’ అన్నాడు. భటుడు సాహుడిని తీసుకుని కదిలాడు.
-ఇంతలో విషయా, వజ్రసేనుడూ మందిరంలోకి ప్రవేశించారు. వారి వెనగ్గా మదనుడూ వచ్చాడు.
ప్రసేనుని అక్కడ చూచి ముఖం చిట్లించింది విషయ. కూర్చున్న తర్వాత ముక్తసరి కుశల ప్రశ్నలు ఐనవి.
కరదలోని సంఘటనా, అష్టలోని సంభవాలూ పూసగుచ్చినట్లు వివరించింది విషయ. కొంచెం తూలీ, కొంచెం ఊగి, మరి కొంత ఒరిగి విషయాలన్నీ విన్నారిద్దరూ. అంతరంగంలో కొన్నిటిని వారే కర్త అనే విషయం వారిద్దరికీ తెలుసు. అయినా ఎరగనట్లే విన్నారు.
చివరికి విరజా అక్షయుల వధూవర స్నాన ఘటన గురించి బయటపెట్టింది విషయ!
మహామాత్యులూ, సేనాధిపతీ నివ్వెరపోయారు! మనసులు కుతకుత లాడాయి. కళింద్రతో బాంధవ్యం అనే వాస్తవాన్ని వారు పుక్కిలించలేరు. మానవకృతం కాక దైవ కల్పితమైన ఆ అద్భుతాన్ని ఉమియనూ లేరు!!
తన కుమార్తెకే ఇలా జరగటం ప్రసేనుడు జీర్ణించుకోలేకపోతున్నాడు!
53
మహారాజు అగ్నివర్మ ఆంతరంగిక మందిరం. గాలవుల వారూ చంపకమాలినీ, దుష్టబుద్ధీ, ప్రసేనులూ సమావేశమైనారు.
‘జరిగిన సంగతులన్నీ తమకు నివేదించాము ప్రభూ! రాజకుమారి పర్యటన విషయంలో కళింద్ర వారి నిర్వాహకం ఎంత గొప్పగా ఉందో విన్నారు తమరు’
‘ఉన్నమాట చెప్పుకోవాలి. కరదలోనూ, అష్టలోనూ మేమంతా ఎన్నో అద్భుతాల్ని చూశాము. ఉత్సవానందాల్నీ పంచుకున్నాము. కళింద్ర వారి ఆత్మీయతనీ చవిచూశాము. మొత్తం మీద ఆ మహామండలంలో ప్రజలు సుఖశాంతులతో సంతోషంగా వున్నారు. మరోమాట. ఇతమిత్థంగా చూడలేక పోయినా, చెప్పలేకపోయినా, ఆపత్తుని అడ్డుకునే శక్తి ఒకటి అక్కడ ఉన్నది అమాత్యా! అంతవరకూ నిజం’ అన్నది చంపకమాలిని.
‘అవును రాకుమారీ. ఆ శక్తే ఈ దుర్ఘటనల్ని సృష్టించి, వాటిని అడ్డుకుని, వ్యూహాత్మకంగా ‘మన’ మెప్పుని పొందుతున్నదేమో? ఎందుకు ఆలోచించరు మీరు?’ దుష్టబుద్ధి తన వాక్యంలో ‘మన’ మాటని వ్యంగ్యాత్మకం చేసి అన్నాడు.
చంపకమాలినికి కోపం వచ్చింది. గాలవుల వారిని చూసింది. ఆయన చూపుతోనే నిగ్రహాన్ని ఉపదేశించాడు.
అయితే, మహారాజు ఆయాసపడుతూ నీరసంగా ‘వ్యంగ్యాలకూ, వెటకారాలకూ సమయమా ఇది? ఆవశ్యకమైనదాన్ని చర్చించండి’ అన్నాడు. ఆయన మాటల్లోని బరువుని అందరూ లక్ష్యపెట్టారు.
కొంతసేపు నిశ్శబ్దం తరువాత చెప్పాడు దుష్టబుద్ధి - ‘కరద అష్ట మండలాలతో కూడి వున్న ఈనాటి సమైక్య కళింద్రలోని పరిస్థితులు ప్రభువులకు సంపూర్ణంగా తెలియటం లేదని మా అభిప్రాయం. బాధ్యతగల సామ్రాజ్య వ్యవహర్తలముగా ఆలోచిస్తే- అక్కడికి వెళ్లి అన్ని రంగాలలోని ఆనుపానుల్ని ప్రత్యక్షంగా గణించవలసిన ఆవశ్యకత వున్నది ప్రభూ!’
‘అయితే, ప్రభువులు అంగీకరిస్తే తమరే కళింద్రకు వెళ్లి రావటం మంచిదేమో అమాత్యా’ ఓరగా చూస్తూ అన్నాడు ప్రసేనుడు.
చంపకమాలిని గాలవుల వారిని చూస్తే, వారు ప్రభువుని చూశారు. ఎంతో సాత్వికమూర్తి అయిన అగ్నివర్మ అస్థిమితంగా లోలోపల కొరకొరలాడాడు. ఉద్రేకాన్ని అణుచుకుంటూ, ‘నిర్వర్తించని కార్యాన్ని నిర్వర్తించటం అవసరమే. అలాగే నెరవేరని కాంక్షల్ని నెరవేర్చుకోదలచటమూ సహజమే’ అని అంటూ ‘మీరు కళింద్రకు ప్రయాణంకండి’ అన్నాడు.
దుష్టబుద్ధీ, ప్రసేనుడూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.
ప్రసేనుడికి మాత్రం మహారాజు చివరి అనుజ్ఞ తప్ప, మొదటి వాక్యాల ఆంతర్యం అర్థం కాలేదు. దుష్టబుద్ధి ప్రసేనుని కంటే నాలుగాకులు ఎక్కువ చదివినవాడు కనుక ఏమీ తొట్రుపడలేదు! ‘చిత్తం’ అని మాత్రం అన్నాడు.
వారిద్దరూ సెలవు తీసుకుని వెళ్లిపోయారు!

-విహారి 98480 25600