సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

7

చెప్పండి...’ తన గదిలోకి వచ్చిన నలుగురు పెద్ద మనుషుల్ని అడిగేడు యుగంధర్.
అది పెందుర్తి పోలీసుస్టేషన్‌లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రూమ్. అతను చార్జి తీసుకుని నాలుగు రోజులు అయింది. పెందుర్తి పోలీసుస్టేషన్ పరిధిలోని ప్రాంతం చూడటానికి, క్రైం గురించి తెలుసుకోవడానికి అంతవరకూ సరిపోయింది. సిబ్బంది కూడా తన వంక భయంగా చూడటం గమనించి నవ్వుకున్నాడతను.
‘అధిక ధరలకు నిరసనగా రేపు బంద్ చేస్తున్నాం. ఆ విషయం మీకు చెప్పి వెళదామని వచ్చాం’ చెప్పాడు ఓ నాయకుడు.
‘బంద్ ఎలా చేస్తారు?’ అడిగేడు యుగంధర్.
ఆ నలుగురు నాయకులు అతన్ని చిత్రంగా చూసేరు. బంద్ అంటే ఏమిటో తెలియకుండా ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం ఎలా చేస్తున్నాడో అర్థంకాక.
‘షాపులు మొత్తం మూయిస్తాం..’ చెప్పాడు ఆ నాయకుడు.
‘దౌర్జన్యంగానా..?’
అతను గుటకలు మింగాడు.
‘దౌర్జన్యం ఏమీ ఉండదు. ఎప్పటిలాగే ప్రశాంతంగా జరిగిపోతుంది. మీ సిబ్బందికి మా గురించి తెలుసు’ చెప్పాడు మరో నాయకుడు.
‘మీ పిలుపునకు స్పందించి షాపులు మొత్తం మూసేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. మీ కార్యకర్తలు గుంపులు గుంపులుగా బయలుదేరి షాపుల్ని బలవంతంగా మూయించినా, రాళ్లు విసిరి ప్రైవేట్, గవర్నమెంట్ ఆస్తులకు నష్టం కలిగించినా ఊరుకోను. పొద్దున్న అరెస్ట్ చేసి సాయంకాలం వదలడమంటూ ఉండదు. కేసు కట్టి రిమాండ్‌కి పంపుతాను. ఈ సంగతి గుర్తు పెట్టుకుని మీ కార్యక్రమాలు చెయ్యండి’ చెప్పాడు యుగంధర్.
‘ఎప్పుడూ లేని కొత్త రూల్స్ పెడుతున్నారు మీరు. గతంలో పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఇక్కడ పనిచేసిన పోలీస్ ఆఫీసర్స్ మాకు సహకరించారు. అలాగే మేమూ వారికి ఉపయోగపడ్డాం’
‘రూల్స్ ప్రకారం మీ పనులు చేసుకుంటే నేను అడ్డురాను. ప్రజల దైనందిన జీవితానికి ఆటంకం కలిగిస్తే ఊరుకోలేను. క్రమశిక్షణ పాటించి మాకు సహకరించండి’ శాంతంగా అన్నాడు యుగంధర్.
‘ఓ సంవత్సరంలో ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు మా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఆలోచించుకోండి..’ కోపంగా అన్నాడు ఓ నాయకుడు.
చిన్నగా నవ్వేడు యుగంధర్.
‘అధికారంలోకి ఎవరొస్తారో, ఎవరు పోతారో నాకనవసరం. నా స్టేషన్ పరిధిలోని శాంతిభద్రతలు ముఖ్యం నాకు. వాటిని ఖాతరు చెయ్యకుండా ఎవరు ప్రవర్తించినా ఊరుకోను. దయచేసి ఇక మీరు వెళ్లొచ్చు’
ఆ నలుగురు నాయకులు విసురుగా బయటకు నడిచారు. గతంలో పని చేసిన ఇన్‌స్పెక్టర్ ఎలా చెబితే అలా చేసేవాడు. చుట్టుపక్కల కొండల్లో వేటాడి తెచ్చిన అడవి జంతువు మాంసం, లేదంటే డ్యామ్‌లో పట్టిన చేప అతని ఇంటికి ప్రతీ వారం పంపేవారు. ఏదైనా కేసులో ఇరుక్కున్న తమ పార్టీ వారిని అడిగిన వెంటనే విడిచిపెట్టేవాడు. ఈ అనుబంధం ఆధారంగానే అతని ట్రాన్స్‌ఫర్‌కి తమ ఎం.పీతో రికమెండ్ చేయించారు. ఆ స్థానంలో కొరకరాని కొయ్యలాంటి వాడు వచ్చాడు.
షాపులు మూసేయమని చెబితే ఎవరూ మూయరు. కొంతమంది కార్యకర్తల్ని వెంటేసుకుని ఆర్భాటంగా వెళితే తప్ప పని జరగదు. ఓ బస్సు అద్దం పగలగొడితే మిగతా బస్సులు తిరగడం మానేస్తాయి. పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కాబట్టి పార్టీ బలపడాలంటే కార్యక్రమాలు చురుగ్గా చెయ్యాలి. కాని ఈ ఇన్‌స్పెక్టర్ తమకి అడ్డు తగులుతున్నాడు.
ఆ నలుగురు బయటకొచ్చాక వారిలోని ముఖ్య నాయకుడు సెల్ తీశాడు. పోలీసు కమీషనర్‌కి కాల్ చేసి ఇన్‌స్పెక్టర్ గురించి చెప్పాడు.
‘అతని జోలికి వెళ్లకండి. డ్యూటీ పర్‌ఫెక్ట్‌గా చేస్తాడు’ చెప్పాడు కమిషనర్.
ఆ నాయకుడు ముఖం మాడ్చుకుని మిగతా వారితో అక్కడ నుంచి కదిలేడు.
‘కొండ చివర ఓ ఇంటి నుంచి చెడు వాసన వస్తోందని ఒకతను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు సార్!’ రైటర్ లోపలికి వచ్చి చెప్పాడు యుగంధర్‌తో.
‘చెడు వాసన అంటే ఎలాంటిది?’ ఆ వ్యక్తిని అడిగేడు యుగంధర్.
‘కుళ్ళిన కళేబరం నుంచి వచ్చే వాసన సార్?’
‘ఆ ఇంటి సమీపానికి మీరెందుకు వెళ్లారు?’
‘ఆ ప్రాంతంలోని ఒక ఇంట్లో అద్దెకి దిగి పది రోజులు అవుతోంది సార్! మా పెంపుడు కుక్కను తిప్పడానికి అటు తీసుకెళ్లాను’
ఆ వ్యక్తి బైక్ మీద దారి చూపిస్తుంటే ఇద్దరు కానిస్టేబుల్స్‌తో జీపులో అనుసరించేడు యుగంధర్. ప్రధాన రహదారి నుంచి లోపలికి తిరిగి కొంతదూరం వెళ్లాక ఇళ్లు ఒకదానితో ఒకటి సంబంధం లేనట్టు దూరందూరంగా ఉన్నాయి. మనుషుల అలికిడి కూడా అంతగా లేదు. బాగా చివరికి వెళ్లాక కొండ పక్కనున్న డాబా దగ్గర బైక్ ఆపాడతను. జీప్ నుంచి దిగుతూనే అక్కడ గాలిలో కలిసిన చెడు వాసన గుర్తించాడు యుగంధర్.
ఆ డాబా చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి ఉన్నాయి. కాంపౌండ్ వాల్ లోపల నేలమీద పరిచిన నాపరాళ్ల మధ్య కూడా గడ్డి మొలిచింది. ఇంటి గుమ్మానికి ఎదురుగా కాంపౌండ్ వాల్‌కి చిన్న గేటు, లోపలి వైపు తాళంకప్పతో ఉంది. ముందు తలుపుకి తాళం లేదు కాబట్టి లోపల మనుషులు ఉండాలి.
‘ఇంట్లో ఎవరుంటున్నారు?’ ఆ వ్యక్తిని అడిగేడు యుగంధర్.
‘తెలియదండి’ చెప్పాడతను.
‘మీ ఇల్లెక్కడ?’
దూరంగా ఉన్న ఓ ఇంటిని చూపించాడు.
తల పంకించి డాబా మీద దృష్టి సారించేడు యుగంధర్. ఇరవై ఏళ్లు దాటి ఉంటుంది దాన్ని కట్టి. ఓసారి డాబా చుట్టూ తిరిగి చూశాడు. ఎలాంటి జంతు కళేబరం కనిపించలేదు. లోపలి నుంచే దుర్వాసన వస్తున్నట్టు నిశ్చయించుకున్నాడు. ఓ కానిస్టేబుల్ గోడ దూకి లోపలికి వెళ్లాడు. చప్పున ఖర్చ్ఫీ తీసి ముక్కుకి అడ్డు పెట్టుకున్నాడతను. రెండు మూడుసార్లు ఇంటి తలుపు తట్టినా ఎలాంటి స్పందన లేదు.
తమతో వచ్చిన వ్యక్తితో సుత్తి తెప్పించాడు యుగంధర్. దాన్ని ఉపయోగించి గేటు తాళం పగలగొట్టాడు లోపల ఉన్న కానిస్టేబుల్. అందరూ లోపలికి వెళ్లారు. ముందు తలుపు నెట్టి చూశాడు యుగంధర్. ఏ మాత్రం కదలకపోవటంతో లోపల అడ్డు గడియ పెట్టి ఉండవచ్చని ఊహించాడు. కిటికీలన్నీ మూసి ఉండటంతోపాటు వెనుక తలుపు కూడా కదల్లేదు.
ముందు తలుపు కాని, వెనుక తలుపు కాని పగలకొడితే తప్ప లోపలికి వెళ్లడం సాధ్యం కాదని అర్థమైంది. జీప్‌తో వెళ్లి ఓ కార్పెంటర్ని తీసుకొచ్చాడు కానిస్టేబుల్. యుగంధర్ సూచన ప్రకారం ఓ పక్కబందులు తప్పించాడతను. తలుపు తెరుచుకోవడంతో ఒక్కసారిగా గుప్పున కొట్టింది దుర్వాసన. అంతా ముక్కులు మూసుకున్నారు. పది నిమిషాలు ఆగి లోపలికి నడిచాడు యుగంధర్.
గుమ్మానికి ఎదురుగా ఉన్న హాలులో చెప్పుకోదగ్గ సామాను లేదు. ఆ హాలుకి ఎదురెదురుగా రెండు గదులు. వాటి తలుపులు తెరిచి ఉండటంతో ఓ గదివైపు నడిచాడు. ముక్కుకి ఖర్చ్ఫీ అడ్డు పెట్టుకున్నా ఊపిరి పీల్చడం కష్టంగా ఉంది. గుమ్మం సమీపించి గదిలోకి చూసి కొయ్యబారినట్టు ఉండిపోయాడు. చప్పున వెనక్కి తిరిగి గబగబా బయటకొచ్చి ఆ ఇంటికి కాస్త దూరం వెళ్లి ముక్కుకి అడ్డుగా ఉంచిన ఖర్చ్ఫీ తొలగించి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు. తల తిరిగినట్టుగా అనిపించి జీప్‌లోని వాటర్ బాటిల్ అందుకుని ముఖం కడుక్కుని కొద్దిగా నీళ్లు తాగాడు.
ఓ పావుగంట తర్వాత ఫినాయిల్ తీసుకొచ్చి ఇల్లంతా చల్లాడు కానిస్టేబుల్. దానితో వాసన తీవ్రత తగ్గింది. అందరూ ఆ గది దగ్గరకు వెళ్లారు. లోపల గోడ పక్క ఒక మంచం ఉంది. దాని మీద ఓ మానవ ఆకారం పురుగులు పట్టి కనిపిస్తోంది. ఒళ్లు జలదరించే దృశ్యం.
రెండో గది ఖాళీగా ఉండటం గమనించేడు యుగంధర్. ఆ గదిలోనే బాత్‌రూమ్ టాయిలెట్‌తో ఉంది. హాలు దాటాక వంటగది కనిపించింది. గ్యాస్ స్టౌ, రెండు సిలెండర్లు, కొద్దిపాటి పాత్రలు, పైన ర్యాక్‌లో ఏవో డబ్బాలు ఉన్నాయి. ఓ పక్క నాలుగు ఉల్లిపాయలు, ఎండిన పచ్చిమిర్చి, చింతపండు, సీసాతో ఆయిలు కనిపించాయి. ఓట్స్ పేకెట్ అందుకుని మూడు నెలల క్రితం తయారైనట్టు గమనించాడు.
ఆలోచిస్తూ బయటకొచ్చాడు యుగంధర్.
కానిస్టేబుల్స్ ఇద్దరో చెరోవైపు వెళ్లారు. ఆ ఇంట్లో ఎవరుంటున్నారో, ఎప్పటి నుంచి ఉంటున్నారో చుట్టుపక్కల వారికి తెలియదనే సమాచారం మోసుకొచ్చారు. ఆ ఇంట్లోంచి దుర్వాసన వస్తున్నదనే సమాచారం తెచ్చిన వ్యక్తి గదిలోని శవాన్ని చూసిన మరుక్షణం అక్కడ నుంచి పలాయనం చిత్తగించాడు.
శవం ఎవరిదో తెలుసుకోవాలంటే ఆ గదిలోకి వెళ్లాలి. ఆ గదిలోకి వెళ్లి బీరువా తెరవాలంటే శవాన్ని అక్కడ నుంచి తరలించాలి. అది సహజ మరణమో కాదో డాక్టర్ నిర్థారించాలి. అప్పుడే బాడీని అక్కడ నుంచి కదపగలుగుతారు. అంతవరకూ వెయిట్ చెయ్యాలి. కానిస్టేబుల్స్‌కి అప్పగించి తను అక్కడ నుంచి వెళ్లిపోవడం సమంజసం కాదని అతనికి తెలుసు. అందుకే ఓ కుర్చీ తెప్పించుకుని డాబా ఎదురుగా కూర్చుని డాక్టర్ కోసం వెళ్లిన జీప్ గురించి చూడసాగేడు యుగంధర్.
‘ఒంటి మీద గాయాలు లేవు. ఏ రాత్రో సడెన్‌గా ప్రాణం పోయి ఉంటుంది. అయినా తలుపులన్నీ మూసి ఉన్నప్పుడు సహజ మరణంకాక ఏమవుతుంది. మీ పని అయ్యాక సర్ట్ఫికెట్ ఇచ్చేవాడిని. చాదస్తం కొద్దీ నన్ను పిలిచారు’ నిష్ఠూరంగా అన్నాడు డాక్టర్, ఓ గంట తర్వాత వచ్చి శవాన్ని పరీక్షించాక.
అక్కడ నుంచి వెళుతున్నప్పుడు కూడా డాక్టర్ ముఖంలో చిరాకు తగ్గలేదు. ఒళ్లు తెలియకుండా తాగిన ఇద్దరు మనుషులు శవాన్ని మూటగట్టి బయటకు తెచ్చారు.
యుగంధర్ లోపలికి నడిచాడు. శవాన్ని తరలించడం వల్ల ఇప్పుడు వాసన బాగా తగ్గింది. బీరువా హేండిల్ పట్టుకుని తిప్పాడు. తాళం వేసి ఉండటంతో అది కదల్లేదు. గదంతా పరిశీలనగా చూసి మంచం మీదున్న దిండు పైకెత్తాడు. తాళాల గుత్తి కనిపించింది. అందులోని పెద్ద తాళం చెవితో బీరువా తెరిచాడు.
లోపల ఎనిమిది అరలున్నాయి. రెండిటిలో చీరలు, జాకెట్లు ఉన్నాయి. ఒక దానిలో మగవాళ్ల బట్టలు, మరో దానిలో ఓ ఫైలు. దాన్ని అందుకుని తెరిచాడు. రకరకాల కాగితాలతోపాటు ఇంటి డాక్యుమెంట్ కూడా ఉంది. పాతికేళ్ల క్రితం సుసర్ల పరంధామయ్య నుండి బలరామ్ సాహు భార్య రాజరాజేశ్వరి కొన్నట్టుగా రాసుంది. బ్యాంక్ పాస్‌బుక్‌లో కూడా అదే పేరు కనిపించింది.
ప్రతి నెలా బ్యాంక్ నుంచి డబ్బు డ్రా చేస్తున్నట్టు పోస్టింగ్స్ ఉన్నాయి. రెండు వారాల క్రితం పదివేలు డ్రా చేసిందామె. ఇంకా అకౌంట్‌లో ఎనిమిది లక్షల చిల్లర బ్యాలెన్స్ ఉంది. మరో పది లక్షలకు ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్లున్నాయి. బీరువాలోని సీక్రెట్ అర తెరవడానికి కొంత సమయం పట్టింది. లోపల సిల్క్‌గుడ్డతో కట్టిన మూట ఒకటి కనిపించింది. దాన్ని బయటకు తీసి ముడివిప్పి తెల్లబోయాడు యుగంధర్.
అవన్నీ బంగారు ఆభరణాలు.
* * *
ఆ రోజు ఆదివారం.
ఎప్పటిలా శనివారం సాయంత్రం ఇంటికి వెళ్లకుండా ఉండిపోయేడు రాజేష్. ఏదైనా అనుకుంటే దాని అంతు చూసేదాకా ఏమీ తోచదతనికి. ఆ రోజు భూపతి సంగతి ఏమిటో తేల్చాలని నిశ్చయించుకున్నాడు. ఉదయం పది గంటలకు రూము నుంచి బయటకొచ్చి బ్రేక్‌ఫాస్ట్ ముగించాడు.
ఈ మధ్యనే తీసుకున్న కొత్త బైక్ మీద బయలుదేరాడు. సాగర్‌నగర్ వెళ్లాలంటే బీచ్ రోడ్డులో సముద్రం పక్కనుంచి వెళ్లాలి. ఆ ఉదయం చల్లగా ఉండటంతో సముద్రం మీద నుంచి వచ్చే గాలి శరీరానికి హాయిగా తగులుతోంది. సాధారణంగా సిటీలో ఉండే ట్రాఫిక్ బీచ్ రోడ్డులో ఉండదు. అందులోనూ ఆదివారం కావడంవల్ల మరింత బోసిగా ఉందా రోడ్డు.

(మిగతా వచ్చేవారం)

-మంజరి 9441571994