సెంటర్ స్పెషల్

ఒక్క తూటా చాలు..11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బైక్ సాఫీగా సాగుతుంటే అతని బుర్రలో మాత్రం ఆలోచనలు ఇష్టం వచ్చినట్లు సంచరిస్తున్నాయి.
భూపతి చిరునామా ఉంది తన దగ్గర. అతని మనుషులు తనను బెదిరించారు కాబట్టి ఆ వ్యక్తి అంత మంచివాడు కాకపోవచ్చు. అయినా కంగారుపడాల్సిన అవసరం లేదు. తనేమీ అతనితో పోరాటానికి వెళ్లడం లేదు. ఏ ఉద్దేశంతో అతని మనుషులు తనని బెదిరించారో కనుక్కోవాలి. అందులో భాగంగా రాసమణి గురించి తెలుసుకోవాలి. తన అంచనా ప్రకారం ఆమె అదే చిరునామాలో ఉండాలి.
రాసమణి చుట్టూ ఇనుప కంచె ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. దాని నుండి ఆమె బయటకు రావాలని కోరుకుంటే తను సాయపడాలి. అప్పుడే శ్రీ్ధర్ కోరిక తీరినట్టు అవుతుంది. ఎవరికైనా మంచి చెయ్యడానికి భయపడాల్సిన అవసరం లేదన్నది అతని అభిప్రాయం.
ఎడమ పక్క పెద్ద ఆర్చి మీద ‘సాగర్‌నగర్’ అనే అక్షరాలు చూసి ఆలోచనలు తెగిపోయాయి. బైక్‌ని లోపలికి పోనిచ్చి సెంటర్‌లో ఆపాడు.
‘భూపతిగారి ఇల్లెక్కడండి?’ అడిగాడు ఓ షాపతన్ని.
భూపతి ఎవరు?’ ఎదురు ప్రశ్నించేడతను.
జేబులోంచి కాగితం తీసి ఇంటి నెంబరు చెప్పాడు.
‘ఆ నెంబరు ఇల్లయితే ఆ సందులోంచి బాగా ముందుకెళ్లండి. ఊరు అంతమయ్యాక దూరంగా పొలాల్లో పెద్ద గేటు కనిపిస్తుంది. దట్టంగా పెరిగిన చెట్లు వల్ల లోపలి బిల్డింగ్ బయటకి కనిపించదు. అదే ఆ నెంబరు ఇల్లు’ చెప్పాడు.
రాజేష్ అతనికి కృతజ్ఞతలు చెప్పి అక్కడ నుంచి కదిలాడు. ఆ సందు చివరికి వెళ్లేసరికి ఊరు మొత్తం వెనక్కి పోయింది. పరిశీలనగా చుట్టూ చూశాడు. ఓ అర కిలోమీటరు దూరంలో కనిపించింది పెద్ద గేటు. పొలాల మధ్య నుంచి కారు వెళ్లేంత వెడల్పు మట్టిరోడ్డు తిన్నగా ఉంది. షాపతను చెప్పినట్టుగానే కాంపౌండ్ వాల్, చెట్లు తప్ప ఇల్లు కనిపించడంలేదు. అక్కడికి వెళ్లడం ప్రమాదమని మనసు హెచ్చరిస్తూ ఉన్నా బైక్ ఆ రోడ్డు వెంట పోనిచ్చాడు.
గేటు దగ్గర బండి ఆపి స్టాండ్ వేశాడు. పదడుగుల ఎత్తున కాంపౌండ్ వాల్‌ని తలెత్తి చూశాడు. చెవులు రిక్కించినా ఎలాంటి అలికిడి వినిపించడం లేదు. గేటు నెట్టి లోపల గడియ పెట్టినట్టు గుర్తించాడు. కాలింగ్ బెల్ ఓ మూల ఉండటం గమనించి నొక్కేడు. రెండు నిమిషాల తర్వాత గేటుకున్న చిన్న తలుపు తెరుచుకుని ఓ ముఖం ప్రత్యక్షమైంది.
‘ఏం కావాలి?’ అడిగాడతను.
‘భూపతి కోసం వచ్చాను’ చెప్పాడు రాజేష్.
‘దేనికి?’ అడిగేడు ఆశ్చర్యంగా.
‘ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి’
‘కనుక్కొస్తా..’ చెప్పి, అదృశ్యమయ్యాడు ఆ వ్యక్తి.
రాజేష్ గేటు సమీపించి తెరిచి ఉన్న చిన్న తలుపు ఖాళీ నుంచి లోపలికి చూశాడు. గేటు నుంచి బిల్డింగ్ వందడుగుల దూరంలో ఉంది. ఆ వ్యక్తి బిల్డింగ్ వైపు నడుస్తున్నాడు. మెట్లు ఎక్కి లోపలికి వెళ్లి కొన్ని క్షణాల తర్వాత తిరిగి రాసాగేడు. చప్పున వెనక్కి జరిగేడు రాజేష్.
‘లోపలికి వెళ్లండి’ గేటు తెరిచి చెప్పాడు ఆ వ్యక్తి.
రాజేష్ బైక్ అక్కడే వదిలి గేటు దాటి లోపలికి అడుగేశాడు. చాలా విశాలంగా ఉంది బిల్డింగ్. చుట్టూ ఆవరణ, రకరకాల చెట్లతో చిన్న అడవిలా కనిపిస్తోంది. కనీసం రెండెకరాలకి తక్కువ కాకుండా ఉంటుంది లోపలి స్థలం. బిల్డింగ్ మెట్లెక్కి గుమ్మం దగ్గర ఆగాడు.
‘లోపలికొచ్చి కూర్చోండి...’ చెప్పాడు, గుమ్మానికి ఎదురుగా కుర్చీలో కూర్చున్న వ్యక్తి. అతని స్వరం గమ్మత్తుగా ఉంది.
చాలా పెద్దదైన హాలు మధ్య అతనికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు రాజేష్.
‘మీరెవరు? ఏం పని మీద వచ్చారు?’ అతను అడిగేడు.
‘భూపతితో మాట్లాడాలని వచ్చాను. నా పేరు రాజేష్’ చెప్పాడు.
‘దేని గురించి?’ అతని ముఖంలో ఆశ్చర్యం.
‘ఇంతకీ మీరెవరు?’
‘నా ఇంటికొచ్చి మీరెవరని అడిగితే ఏం చెప్పాలి సమాధానం, అసలు భూపతి చిరునామా ఎవరిచ్చారు మీకు?’ ప్రశ్నించేడతను.
‘నా గురించి తెలుసుకోవడానికి భూపతి ప్రయత్నించినట్టే నేనూ ప్రయత్నించి అతని గురించి తెలుసుకున్నాను’
అతను విస్మయంగా చూశాడు రాజేష్ వైపు.
‘వారం క్రితం ఓ రాత్రి భూపతి మనుషులు నన్ను బెదిరించారు’ తిరిగి అన్నాడు.
‘దేనికి?’
‘తెలియదు’
అతను వెంటనే సెల్ అందుకుని కాల్ చేశాడు.
‘వారం క్రితం ఓ కుర్రాడ్ని బెదిరించారా?’
అవతలి వాళ్లు చెబుతున్నది రెండు నిమిషాలు విన్నాక అన్నాడు.
‘మనిషిని చూస్తే తెలియడం లేదూ, డిపార్ట్‌మెంట్ వాడు కాదని. మరెప్పుడూ నాకు తెలియకుండా అలాంటి పనులు చెయ్యకండి’ కాల్ కట్ చేసి రాజేష్‌తో అన్నాడతను, ‘అది పొరపాటు వల్ల జరిగింది. వారి తరఫున నేను క్షమాపణ చెబుతున్నాను’
‘మీరు భూపతా?’
‘కాదు. అతను దుబాయ్‌లో ఉంటాడు. ఎప్పుడో కాని ఇక్కడకు రాడు. అతని వ్యాపారాలు నేను చూసుకుంటాను ఇక్కడ. అసలు మీరెవరు? ఈ చిరునామా ఎవరు చెప్పారు?’ అడిగేడు.
నవ్వేడు రాజేష్.
‘రాసమణి అనే ఆవిడ ఫోన్ నెంబర్ ఆమెతో పరిచయమున్న నా మిత్రుడు సంవత్సరం క్రితం నాకిచ్చాడు. ఆ నెంబరు ద్వారా ఆమె కొత్త నెంబరు తెలుసుకొని కాల్ చేశాను. బీచ్‌లో కలిసి కాసేపు నాతో మాట్లాడి వెళ్లిపోయిందామె. అదే రోజు రాత్రి కొంతమంది నా వివరాల కోసం వచ్చి భూపతి మనుషులమని చెప్పారు. బ్యాంకులో డబ్బు డ్రా చేసిన ఓ చెక్కు ద్వారా ఈ చిరునామా సంపాదించాను’ వివరంగా చెప్పాడు.
అతను దిగ్భ్రాంతికి లోనయ్యాడు. చిన్న సంఘటన ఆధారంగా ఓ వ్యక్తి తన చిరునామా తెలుసుకుని రావడం నమ్మశక్యంగా లేదు. కాని అది నిజం.
‘నా దగ్గర పని చేస్తావా?’ అడిగేడు తేరుకుని.
‘నాకు ఉద్యోగం ఉంది’
‘ఉండనివ్వు. నేనిచ్చే ఉద్యోగం వయసులోని కుర్రాళ్లు కోరుకునేది. నెలకి మూడు నాలుగుసార్లు పని ఉంటుంది. అవసరం కలిగినప్పుడు ఫోన్ చేసి ఓ చిరునామా చెబుతాం. ఆ చిరునామాలోని అందగత్తెని సంతోషపెట్టి రావాలి. నెలకి ఇరవై వేలకి తక్కువ కాకుండా ఆదాయం ఉంటుంది. ఇదంతా గోప్యంగా జరుగుతుంది కాబట్టి ఎలాంటి ఇబ్బందీ ఉండదు’
రాజేష్ ఆశ్చర్యపోయాడు.
‘మీరు చెప్పింది నాకేం అర్థంకాలేదు. అమ్మాయిల్ని సంతోషపెట్టడం ఏమిటి? దానికి మీరు డబ్బివ్వడమేమిటి?’
‘అదంతా నీకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు నా దగ్గర పని చేస్తున్నట్టు మనిద్దరికే తెలుస్తుంది. నీకు రావాల్సిన సొమ్ము నీ అకౌంటులో జమ అవుతుంది కాబట్టి మళ్లీ మనం కలుసుకోవాల్సిన అవసరం ఉండదు. ఏ కంపెనీ కూడా ఇలాంటి ఆఫర్ ఇవ్వదు’ చెప్పి నవ్వేడతను.
‘ఆలోచించుకుని చెబుతాను. ఓసారి రాసమణితో మాట్లాడొచ్చా?’
‘ఏం మాట్లాడతావ్?’ అతని నొసలు ముడిపడింది.
‘ఆమె బాకీ తీర్చాలి’
‘ఎంత తీసుకున్నావ్?’
‘ఆమె నుండి నేనేమీ తీసుకోలేదు. అంత పరిచయం కూడా లేదు మాకు. మా ఇద్దరికీ తెలియకుండానే ఆ బాకీ ఏర్పడింది. దాన్ని ఎలా తీర్చాలో, ఎప్పుడు తీర్చాలో కూడా నాకు తెలియదు. కానీ తీర్చుకుంటాను’ చెప్పాడు రాజేష్.
అతను కొన్ని క్షణాలు రాజేష్ కళ్లల్లోకి చూస్తూ ఉండిపోయాడు. చివరగా భుజాలు ఎగరేసి అన్నాడు.
‘నీ మాటలు చిత్రంగా ఉన్నాయి. రాసమణి లాంటి ఆడదాని కోసం అంత ఎక్కువగా ఆలోచించకు. మనసు, వయసు రెండూ పాడవుతాయి. నా నెంబరు ఫీడ్ చేసుకుని నేను ఆఫర్ చేసిన ఉద్యోగం కావాలో, వద్దో చెప్పు. అవసరం లేకపోతే ఆ విషయం అంతటితో మర్చిపో...’ అని సెల్ నెంబరు చెప్పాడతను.
అది ఫీడ్ చేసుకుని అడిగేడు రాజేష్.
‘మీ పేరు?’
‘గంగోత్రి. ఆత్మీయులు ‘గంగా’ అని పిలుస్తారు. మన మధ్య దగ్గరితనం ఉంటే నువ్వూ అలాగే పిలవొచ్చు..’ నవ్వేడు వంకరగా.
రాజేష్ ఒళ్లు జలదరించింది.
* * *
నలుగురు పెద్ద మనుషుల సమక్షంలో బంగారు నగలకి లెక్కరాసి వారితో సంతకాలు తీసుకున్నాడు యుగంధర్. విరగ్గొట్టిన తలుపు కార్పెంటర్‌తో బాగుచేయించి తాళం వేసి సీలు చేశాడు. అలాగే వెనుక తలుపు కూడా సీలు చేశాక అక్కడి నుంచి బయలుదేరాడు. మొత్తానికి చుట్టుపక్కల నివసించే వారెవరూ చనిపోయిన స్ర్తి గురించి ఏమీ చెప్పలేకపోయారు.
డాక్యుమెంట్ ప్రకారం అది పాతికేళ్ల క్రితం కొన్న ఇల్లు. అంతకాలం నుంచి ఆ ప్రాంతంలో ఉంటున్నవారు లేకపోవడంతో వివరాలు ఏమీ తెలియలేదు. అది సహజ మరణం కాబట్టి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. ప్రాథమిక విచారణలో బంధువులు ఎవరైనా ఉంటే వారికి తెలియజెయ్యాలి. మిగతా లీగల్ వ్యవహారాలు వాళ్లే చూసుకుంటారు.
పెందుర్తి ఏరియాలో నలభై ఏళ్ల క్రితం ఉడా అప్రూవల్‌తో భూముల్ని ఇళ్ల స్థలాలుగా మార్చడంవల్ల సుజాత నగర్ ఏర్పడింది. అక్కడ ఇల్లు కట్టుకున్న వారిలో సుసర్ల పరంధామయ్య ఒకరు. ఆ తర్వాత తన ఇల్లుని రాజరాజేశ్వరికి అమ్మేశాడు. అతన్ని కలుసుకుంటే కొంత సమాచారం తెలుస్తుంది. అదే ఆలోచనతో సుజాతనగర్‌లో చాలాకాలం నుంచి పచారీ షాపు నడుపుతున్న మనిషి దగ్గరకు వెళ్లాడు యుగంధర్.
‘కూర్చోండి’ చెప్పాడతను కుర్చీ చూపించి.
తన ఇంటి ముందు భాగాన్ని అభివృద్ధి పరచి షాపు నడుపుతున్నాడతను. అది అంత రద్దీ ప్రాంతం కాకపోవడంవల్ల ఉదయం పిల్లలు స్కూళ్లకి, పది తర్వాత పెద్దలు ఉద్యోగాలకి వెళ్లిపోవడంవల్ల మనుషులు అంతగా తిరగడంలేదు.
‘మీరెంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు?’ అడిగేడు యుగంధర్.
‘ముప్పై ఏళ్లు దాటిందండి. నా తండ్రి ఇక్కడ ఇల్లు కట్టేనాటికి ఇరవై ఎనిమిదేళ్లు నాకు. ఈ ఇంట్లోనే నాకు పెళ్లయింది’ జవాబిచ్చాడు.
‘సుసర్ల పరంధామయ్యగారు తెలుసా మీకు?’
‘తెలుసు’
‘ఇప్పుడు ఆయన ఎక్కడుంటున్నారు?’
‘కచ్చితంగా తెలియదండి. పూర్ణా మార్కెట్‌లో ఆయనకి హోల్‌సేల్ పళ్ల దుకాణం ఉందని విన్నాను...’
రెండు క్షణాలు ఆలోచించి అడిగేడు యుగంధర్.
‘పరంధామయ్య తన ఇల్లు ఎవరికి అమ్మేరు?’
‘ఒరిస్సా నుంచి వచ్చిన భార్యాభర్తలు కొన్నారని తెలిసింది. వాళ్లని నేనెప్పుడూ చూడలేదు’
అతని దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు యుగంధర్.
అక్కడ నుంచి టౌన్‌లోని పూర్ణా మార్కెట్ చేరడానికి గంట పట్టింది. ట్రాఫిక్ కానిస్టేబుల్ సెల్యూట్ చేస్తే చిన్నగా తలూపి పళ్ల మార్కెట్ వైపు అడుగులు వేశాడు. మార్కెట్ పక్క సందులో వరుసగా ఉన్నాయి హోల్‌సేల్ పళ్ల దుకాణాలు. రకరకాల అరటి గెలలు షాపుల ముందు పేర్చి ఉన్నాయి. షాపు లోపల బత్తాయిలు, కమలాలు గుట్టలుగా దర్శనమిస్తున్నాయి. ఒకతన్ని అడిగితే పరంధామయ్య షాపు చూపించాడు.
‘పరంధామయ్య గారు ఉన్నారా?’ షాపులో కూర్చున్న వ్యక్తిని అడిగేడు యుగంధర్. అతను తనకి కావాల్సిన వ్యక్తి కాదని మొదటిచూపులోనే గుర్తించి.
‘మీరెవరు?’ ఎదురు ప్రశ్నించేడతను.
‘పోలీసు ఇన్‌స్పెక్టర్ని’
అతను చప్పున లేచి నిలుచుని చెప్పాడు.
‘లోపల ఉన్నారు’
కొద్ది క్షణాల్లో లోపలి గదిలో మడత కుర్చీలోని పరంధామయ్య ఎదురుగా కూర్చున్నాడు యుగంధర్.
‘నాతో పనుండి వచ్చారా?’ అడిగేడు పరంధామయ్య పీలగొంతుతో.
‘అవునండి. పాతికేళ్ల క్రితం సుజాతనగర్‌లోని మీ ఇల్లు అమ్మేశారు. ఆ వివరాలు తెలుసుకుందామని వచ్చాను’
‘ఆ వివరాలు ఇప్పుడెందుకు?’
‘ఆ ఇంట్లో ఒకామె చనిపోయి కనిపించింది’
అప్పటి సంగతులు గుర్తు తెచ్చుకుంటున్నట్టు కళ్లు మూసుకున్నాడు పరంధామయ్య. యుగంధర్ అతని వైపు వౌనంగా చూస్తూ ఉండిపోయేడు. ఓ నిముషం తర్వాత భారంగా కళ్లు తెరిచాడతను.

(మిగతా వచ్చే వారం)

-మంజరి 9441571994