సెంటర్ స్పెషల్

మహావిజేత 4

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ నవ్వు చూసి ఉడుక్కుంది పద్మిని. అది కూడా గమనించాడు.
నెమ్మదిగా తల పక్కకు తిప్పుకుని చుట్టూ చూశాడు. ఇంకా కుళిందకుడూ, ఇతర ప్రముఖులూ రాలేదు. ఆవరణంతా మాటల సవ్వడితో సందడిగా ఉంది.
‘పద్మినీ, నీకీ కథ తెలుసా?’ చంద్రహాసుడు అడిగేడు. పద్మిని అతని వైపు చూడగానే, ‘ఒకసారి పంచభూతాలు ‘నేను గొప్ప అంటే నేను గొప్ప’ అని తమలో తాము కలహించుకున్నాయిట. చివరికి తేలిందేమంటే - ఎవరి గొప్ప వారిదే అని! దీన్ని మరో విధంగా కూడా కొంతమంది చెపుతారు. నదీ పర్వత సంవాదం అంటారు. ఆ రెంటిలో ఏది గొప్ప అంటే...’ అని ఆర్థోక్తిలో ఆపాడు.
‘రెండూ గొప్పవే’ చంద్రహాసుని మాటలు విన్న దుర్గి ఉత్సాహంగా అరిచింది.
‘ఎందువలన? చెప్పు’ ఆమె సాలోచనగా చుబుకం మీద చూపుడు వేలు వుంచుకొని దిక్కులు చూడసాగింది.
చంద్రహాసుడు చెప్పాడు. ‘నది స్పర్శతోనే కొండల మీది ఔషధ వృక్షాలు జీవిస్తాయి. కొండల మీద నుంచీ క్రిందికి దూకే నది ఆ కొండల అవరోధంతోనే తన సుడినీ, వొరవడినీ ఓర్చుకుంటుంది’
‘అందువలన నువ్ చేసిన సహాయాన్ని ఎవరూ చులకన చేయలేదు. అయితే, ఒక్క మాట’ అని ఆగి మళ్లీ చెప్పటం మొదలుపెట్టాడు చంద్రహాసుడు. ‘నిన్ను నీవే తక్కువ చేసుకోకూడదు. నువ్వు చేసిన పనిని ఎవ్వరూ గుర్తించలేదనీ, మెచ్చుకోలేదనీ నొచ్చుకోవటం మొదలుపెడితే, మనసు దురాలోచనల్ని స్వాగతిస్తుంది’ అన్నాడు.
పద్మినీ, దుర్గీ, అక్షయుడూ - ముగ్గురూ చంద్రహాసుని ఆరాధనా పూర్వకంగా చూసి కళ్లు చికిలించారు.
వారికి ముందు బండరాళ్ల మీద పెడరెక్కలు విరిచి బంధింపబడివున్న ఇద్దరు వ్యక్తులు - ఒక రాతిస్తంభానికి కట్టివేయబడి ఉన్నారు. వారి కాళ్లకూ బంధాలున్నాయి. బంధింపబడి వున్నా, లోకాన్ని మండిస్తున్న ఎండ చర్మాన్ని బొబ్బలెక్కిస్తున్నా వారిద్దరి ముఖాల్లో విచారం లేదు. కళ్లల్లో మాత్రం కించిత్ భీతి గోచరిస్తోంది. కొట్టి నిలబెట్టిన దుంగల్లా వున్నారు.
జనం ఆశ్చర్యంతో, ఉత్కంఠతో చూస్తున్నారు.
సింగన్న తన కంచు కంఠంతో అడిగాడు. ‘చెప్పండి? ఎక్కడివారు మీరు? ఎందుకు వచ్చారు? మా వారిని ఎందుకు గమనిస్తున్నారు? మా పిల్లల మీద చూపులూ, తూపులూ గురి పెట్టవలసిన అవసరం మీకెందుకు వచ్చింది? చెప్పండి’
ఏ ప్రశ్నకూ సమాధానం లేదు. బండమీది వేడికి కాళ్లు కదల్చుకుంటూ బాధగా, ‘అమ్మా’ అని మాత్రమే గొణిగినట్లుగా అంటున్నారు. అంతే - ఇంక ఏమీ పలకడంలేదు. చేతుల్లో చిల్లకోలలతో ఇద్దరు భటులూ, కొరడాలతో మరో ఇద్దరు భటులూ వారిద్దరికీ చెరొకవైపున నిలబడి వున్నారు.
సింగన్న మళ్లీ గద్దించాడు. వౌనమే వారి సమాధానం అయింది. అతని ముఖం మీద కోపం, విసుగు చెఱచెఱ లాడాయి. కనుసైగ చేశాడు. వెంటనే బంధితుల దేహాల మీద కొరడాలు తాండవం చేయసాగాయి. ఆ దెబ్బల్ని కూడా నోటి నుండి శబ్దాన్ని బయటకు రానీయకుండా భరించసాగారు వాళ్లు.
ఇదంతా చూస్తున్న చంద్రహాసునికి ఈ పద్ధతి బాగా లేదనిపించింది. వెంటనే సింగన్న ముందుకు వచ్చాడు.
‘దళపతిగారు మన్నించాలి. నాదో విన్నపం. వీరినిలా బహిరంగంగా హింసించి ప్రయోజనం లేదు. ఇందరి ముందు వారు తమ రహస్యాలను బయటపెడతారని ఊహించలేను. ఆ సంగతి అనుభవజ్ఞులైన తమకు తెలుసు. ప్రాణాలకు తెగించి గూఢచర్యానికి వొడిగట్టేవారు - ఇలాంటి శిక్షలకు లొంగరు. పైగా మనం చేస్తున్న చర్య అంత సబబుగా అనిపించడంలేదు. వద్దు, వీరిని చెఱసాలలోనే ఉంచి ప్రభువుల సమక్షంలో విచారిస్తే బాగుంటుందని నా అభిప్రాయం’ అన్నాడు.
అందరూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సింగన్న అస్థిమితంగా మసిలాడు. అసహనంగా తల విదిలించుకున్నాడు. క్షణంసేపు ఆలోచించాడు. అక్కడ గుమిగూడిన ప్రజల వైపు చూశాడు. వారంతా తమలో తాము గుసగుసలు పోతున్నారు.
చంద్రహాసుడు నెమ్మదిగా మాట్లాడినందున అతని మాటల వివరం ఎవ్వరికీ తెలియదు. అందుకని దెబ్బల శిక్ష కొనసాగుతూనే ఉంది.
సింగన్న ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తల పంకించాడు. వెంటనే లేచి, ‘ఆపండి. వీరిద్దరినీ కోట బహిఃద్వారానికి ఆవల వున్న చెఱసాల ప్రాంగణానికి తీసుకువెళ్లండి. రాజుగారి అనుమతి మేర తదుపరి విచారణ జరుగుతుంది’ అంటూ కదిలేడు.
క్షణాల్లో - పంగలగుట్ట నిర్జనమయింది.
జనం కళింద్ర మహా మండలంలో మునె్నన్నడూ వినని, ఎరుగని ఈ గూఢచర్యం ఏమిటా అని తర్కించుకుంటూ సాగిపోయారు.
అక్కడ - రాజప్రాసాదంలో మంత్రి చేతనుడు, పురుషోత్తముడు వీరి సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
9
రాజప్రాసాదం. ఏకాంత మందిరం. కుళిందకుడూ, భార్య మేధావినీదేవీ-
జరుగుతున్న సంఘటనల్ని గురించే మాట్లాడుకుంటున్నారు.
‘ఈ సంఘటన మనందరిలోనూ ఆందోళన కలిగిస్తున్న మాట నిజమే. కానీ, ఇది మన పొరుగున ఉన్న కరదమండలాధిపతి పని గానీ, లేదా కొండ్ర తెగల వారి పని గానీ అయి ఉండవచ్చునేమో అనిపిస్తోంది. కేవలం ఇది నా ఊహ మాత్రమే. కళింద్ర మహామండలం సుఖసౌభాగ్యాలతో వర్థిల్లడం వారికెప్పుడూ కంట్లో నలుసుగానే ఉంటోంది కదా!’
క్షణం తర్వాత - ఈ తలపుల నుండీ విడివడి ప్రస్తుతానికి వచ్చేడు ప్రభువు. ‘మీ అనుమానం కూడా యధార్థమే అయివుండవచ్చు. కానీ ఈ బందితులిరువురూ దృఢకాయులు. గిరిజన తెగలకు చెందినవారుగానూ కనిపించటంలేదు. ఏదో మైదాన ప్రదేశం నుంచీ వచ్చినట్లుగా వున్నారు. వారి వేషభాషలు కూడా అదే వాస్తవాన్ని ఎఱుక పరుస్తున్నట్లున్నాయి.’
‘అవునేమో మరి’ అని ఊరుకుంది మేధావినీదేవి.
కుళిందకుడు సాలోచనగా ఆమెనే చూస్తూ కూర్చున్నాడు.
మేధావినీ దేవి దేహచ్ఛాయ నీలవర్ణం. ఆమె శరీర సౌష్ఠవం, అంగీభంగీ విశేషాలు సాక్షాత్తూ నృత్య గౌరీ విలాసాల వలె గోచరిస్తూ ఉన్నాయి. నిడుపైన కురుల సిగ, సిగపైని అర్ధచంద్రాకారంలో అమర్చిన కొండమల్లెల పూదండ. కంఠాభరణాలకు ఉన్నతిని కూరుస్తున్న వక్షస్సౌందర్యం, వనంలో వివిధ యుద్ధ క్రీడాభ్యాసాలతో గడించిన శారీరక దారుఢ్యంతో, రాజస సాత్వికత ఉట్టిపడే ముఖవర్ఛస్సుతో మూర్త్భీవత్ సౌందర్యంలా మహారాజును రాగ తన్మయుణ్ణి చేస్తోంది.
భర్తని తానూ తేరిపార చూస్తోంది మేధావినీదేవి. రాతి విగ్రహంలాగా కదలకుండా కూర్చుని ఉన్నాడాయన. భద్రమూర్తిలాగా కళ్లల్లో కారుణ్యం, ఆ కారుణ్యపు టంచుల్లో వజ్ర కాఠిన్యాన్ని సూచిస్తూ రాగరంజితమైన దృక్‌రేఖలు, వెడదయురం, మోకాళ్ల నంటుతున్న బాహువులు - పరమేశ్వరుని జటాజూటంలాగా సిగ, కంఠాభరణాలూ, భుజకీర్తులూ, కరత్రాణాలూ! మధ్య వయస్సు దాటినా ధీర గాంభీర్యాల్ని నింపుకున్న శరీర శోభ - స్ర్తి సొబగుల్ని హేళన చేస్తున్నట్లుగా ఉంది.
‘అమాత్యులవారు తమ దర్శనాన్ని కోరుతున్నారు’ అన్నాడు కంచుకి. ప్రభువూ, రాణీ ప్రస్తుతంలోకి వచ్చారు.
‘రమ్మనండి’ ఆనతిచ్చాడు ప్రభువు.
మంత్రి చేతనుడు, ఆయనను అనుసరిస్తూ దండనాథుడు సింగన్న లోనికి ప్రవేశించారు.
మేధావినీదేవి కూడా సెలవు తీసుకోకుండా ప్రక్కగా కూర్చుంది. ‘చెప్పండి’ అన్నాడు కుళిందుడు వారికి ఆసనాలు చూపిస్తూ.
ఆసీనులయిన తర్వాత, చేతనుడు ప్రారంభించాడు. ‘ప్రభూ! మరొక ఆందోళనకరమైన వార్త చేరింది. నగర పశ్చిమ ద్వారానికి అరక్రోసు దూరంలో మరో ఇరువురు ఆగంతకుల్ని మన రక్షక దళం వారు బంధించారు. వీరు కూడా మొన్న మన అక్షయ చంద్రహాసులు బంధించి తెచ్చిన వారిలాగానే ఉన్నారు. బహుశ నలుగురూ కలిసే వచ్చి ఉంటారనిపిస్తోంది. దండనాథులూ అదే అభిప్రాయంలో ఉన్నారు.’
‘అవును ప్రభూ! వారి వాలకాన్నిబట్టి ఊహించటమే కాదు, కొంత సమాచారం కూడా రాబట్టగలిగాము. ఈ రాత్రికి ఈ రహస్యాన్ని ఛేదించి రేపు వివరాలను మీకు విన్నవించుకోగలం’ అన్నాడు సింగన్న.
ఆలోచనలో పడ్డాడు కుళిందకుడు.
ఆ తర్వాత కొంతసేపు మంత్రీ, దండనాథుడూ ఇతర రాచకార్యాలనీ ప్రస్తావించి తగిన ఆజ్ఞలతో సెలవు తీసుకున్నారు. వాళ్లిద్దరూ వెళ్లిన తరువాత మేధావినీదేవి ‘పశ్చిమం నుంచే పర్వతశ్రేణి మీదుగా వచ్చి ఉంటారు’ అంది. కుళిందకుడు మిన్నకున్నాడు.
10
-అర్ధరాత్రి జరుగుతుండగా హఠాత్తుగా ప్రభువుల ప్రత్యేక దర్శనం కోరి వచ్చాడు సింగన్న. వస్తూనే ‘ప్రభూ! ఆగంతకుల విషయం తేలిపోయింది’ అన్నాడు. తల పంకించాడు ప్రభువు.
‘అవును ప్రభూ! వారు నలుగురూ చేరరాజ్యం నుండి వచ్చినవారు. చేర నుండి ముషికపురం మీదుగా మలయ పర్వతం అంచుల మీదుగా కుంతల చేరి, అక్కడ ప్రయత్నించి విఫలురై సహ్యాద్రి శ్రేణిని పయనించి కరద మండలంలో నుండి కళింద్రకు చేరినట్లు వారి నుండే వివరాలు రాబట్టాను. చేర రాజ్యాధిపతి ఉదయుల వారి పనుపున వచ్చారట. కళింద్రలో వారి శత్రువులెవరో వున్నట్లు తెలిసి శత్రుశేషాన్ని హతమొనరించటానికి వచ్చారట. ఆ శత్రువు మన చంద్రహాసుడో, అక్షయుడో అయివుండవచ్చునని నిర్ధారణకు వచ్చి, వారిని లక్ష్యంగా చేసుకున్నారు.’
ఇదంతా విని కుళిందకుడు దిగ్భ్రమ చెందాడు. ఎక్కడ చేర సామ్రాజ్యం - ఎక్కడ కుంతల? అటు నుంచీ కరద మండలం. ఆ మండలం నుండి మహామండలం కళింద్ర. ఇక్కడికి వారు చేరటం, లక్ష్యశుద్ధితో తమ ప్రయత్నానికి పూనుకోవటం - ఆశ్చర్యకరంగా ఉంది!
కుళిందుడు ఈ విస్మయం నుంచీ తేరుకునేలోపే సింగన్న చెప్పాడు. ‘ప్రభూ! మొన్నటి ఇరువురిలో ఒకడు నేరాన్ని అంగీకరిస్తూ ఈ వాస్తవాలను వెల్లడించాడు. ఇనుము కాలి వేడిగా ఉన్నప్పుడే కదా సమ్మెట దెబ్బకు లొంగేది. ఆ విచారణ విధానమే అతని చేత నిజం చెప్పించింది’
సింగన్న ఇలా మాట్లాడుతున్న సమయంలోనే రాజభవనంలో మరోవైపు వివరం తెలియని సవ్వడి వినవచ్చింది. సింగన్న తన కంచుకంఠంతో ‘ఎవరక్కడ? ఏం జరుగుతున్నదో చూసి రండి’ అన్నాడు.
భటులు ‘చిత్తం ప్రభూ’ అంటూ సవ్వడి వినవస్తున్న దిశగా వెళ్లారు.
కుళిందకుడు ‘నడిరాత్రి దాటినట్లుంది. మీరూ వెళ్లవచ్చు కదా’ అన్నాడు.
‘లేదు ప్రభూ, వారు తిరిగి వర్తమానం తెచ్చేవరకూ ఇక్కడే ఉంటాను’ అని వినయపూర్వకంగా తలవంచుకుని నిలబడ్డాడు.
‘సరి’ అంటూ కూర్చోమని సింగన్నకు పీఠాన్ని చూపాడు. సింగన్న కూర్చున్నాడు. చంద్రహాసుని ప్రసక్తిని మరికొంత పొడిగించాలనిపించింది సింగన్నకి. కానీ, తానాతని విషయాన్ని ప్రస్తావిస్తే ప్రభువు ఏ విధంగా భావిస్తాడో అని సందేహించి ఆగిపోయాడు.
ఎవరి ఆలోచనలలో వారు ఉండగానే భటులు వర్తమానం తెచ్చారు.
చంద్రహాస అక్షయులకు శత్రుగూఢచారి చర్య గురించిన వాస్తవాలు తెలిసినాయట. వారిరువురూ రాజప్రాసాదానికి తూర్పున వున్న మామిడితోపు వద్ద కూర్చుని సంభాషిస్తుండగా, భటులు వారిని తమ భవనంలోకి వెళ్లవలసినదిగా కోరుతున్నారు. కానీ వారు వినటం లేదు. రాజఘాంటికులు ఒకరిద్దరు చేరారు. వారి తర్వాత రాజ ఆవేదకులూ చేరారు. వారంతా వీరిద్దరి భద్రత గురించిన ఆందోళనతో వీరికి నచ్చజెబుతున్నారు. ఇదీ సంగతి!’
విషయం విన్న కుళిందకుడు సింగన్న వైపు చూసి, ‘రాత్రికి రాత్రే వారికా వార్త ఎలా తెలిసింది? జాగ్రత్త. మన రక్షణ వ్యవస్థలో ఎక్కడో కొన్ని లొసుగులు వున్నట్లుగా తోస్తున్నది. దండనాయకులుగా మీరు జాగరూకతతో ఉండాలి’ అన్నాడు.
‘చిత్తం! నేను విచారించి తగిన చర్యలు తీసుకుంటాను. సెలవు’ అని అక్కడి నుండీ బయలుదేరాడు సింగన్న.
‘ఆ విదేశస్థుల్ని రేపు మా సముఖంలో విచారణ జరిపించండి. ఇప్పుడు మీరుగా వెళ్లి చంద్రహాసునీ, అక్షయునీ వారి ఆవాసాలకు చేర్చండి’ బయటకు కదిలిన దండనాథుని ఆపి అన్నాడు కుళిందకుడు.
‘చిత్తం ప్రభూ’ అని కదిలాడు సింగన్న. అతని మనస్సులో కలత రేగింది. ప్రభువు హెచ్చరిక ఎంతో సమంజసమైనదనిపించింది. అయితే, ‘ఆ వార్తని బయటకి చేరవేసిందెవ్వరు?’ ఆలోచనలో పడ్డాడు.
హజారానికి ఈవలి ప్రాంగణంలో ఐదుసార్లు ఘంటానాదం మ్రోగింది. అక్కడ ఇప్పుడు ప్రతి అర్ధయామానికీ ఘంటను మ్రోగించే నియమం వున్నది. అంటే, నడిరాత్రి గడిచి మరి ఓ అరజాము అయిందన్నమాట!
సింగన్న తలపులు అతని అడుగుల్ని మరింత వేగపరచాయి.
11
ఆ సాయంత్రం-
రాజభవన సముదాయంలోని ఒక చతుశ్శాల, నేర విచారణ స్థలం. చతుశ్శాల అంతా జనసందోహంతో కిటకిటలాడుతోంది. కుళిందకుడు ఇతరులు వచ్చి వారివారి ఆసనాలలో ఉపవిష్టులైనారు. ఉపరికక్ష్యలో రాణీ, ఆమె పరిచారిక గణం చేరారు.
సమయ సూచనగా ఘంటానాదం మోగింది.
బంధితులైన నలుగురు అపరాధుల్నీ ప్రవేశపెట్టారు. లోహ నిర్మిత బోనులలో నిలిచారు వారు. బోను పక్కగా రక్షణ వలయంగా రాజభటులు. ప్రభువు కనుసైగ చేశాడు. విచారణ మొదలుపెట్టారు. ప్రచండుడు లేచి నిలబడి తన గంభీరమైన కంఠస్వరంతో అభియోగాన్ని ప్రతిపాదించాడు. ఆయన రాజ్యన్యాయవాది.
‘రాజకుటుంబీకుల ఎగ్గుకు పూనుకుని మహాపరాధం చేసిన ఈ నలుగురికీ ప్రభువులు తగిన విధంగా కఠిన శిక్షను విధించాల్సిందిగా కోరుతున్నాను’ అని కూర్చున్నాడు.
ఆ వెంటనే చేతనుడు లేచి ‘ప్రభూ! ఆయుధాలున్న గూఢచారులనూ, వన్యమృగాలనూ, నదులనూ ఎప్పుడూ నమ్మకూడదంటుంది నీతిశాస్త్రం. వీరు ఎకాఎకిని రాచవారి మీదనే హత్యాప్రయత్నం చేశారు. చేరరాజ్యం వారికి ఇక్కడ శత్రుశేషం ఉన్నట్లు తెలియడం, దాని నిర్మూలనకు ఇలా ప్రయత్నించడం క్షమించరాని నేరం. మా అభియోగాన్ని నిరూపించే పత్రాలూ, వీరి రాకపోకల కనువైన సూచనలు గల మార్గ చిత్రపటాలూ - ఇవిగో ప్రభూ! కనుక రాజద్రోహానికి వీరికి ఉచితమైన శిక్ష మరణదండనమే - అని మా అభిప్రాయం. ప్రభువులు వీటిని పరిశీలించి నిర్ణయించండి’ అంటూ తన చేతిలోని పత్రాలను ప్రభువుకు అందించి వచ్చి కూర్చున్నాడు.
ప్రభువు శాలనంతా కలియజూశాడు. అపరాధుల్నీ చూశాడు. క్షణకాలం సాలోచనగా ప్రచండుని వైపూ, చేతన మంత్రి వైపూ చూశాడు.
ప్రభువు తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ఉద్యుక్తుడవుతున్న సమయంలో - సభ అంతా నిండు నిశ్శబ్దం ఆవరించి ఉంది. వాతావరణం ప్రభువు నిర్ణయాన్ని గురించిన ఉత్కంఠతో బిగిసిపోయి ఉంది.
ఆ క్షణంలో లేచాడు చంద్రహాసుడు. ‘ప్రభువుల వారు మన్నిస్తే నాదొక మనవి’ అని అవనత వదనంతో కైమోడ్చాడు.
చెప్పమన్నట్లుగా శిరఃకంపం చేశాడు ప్రభువు.
‘ప్రభూ! వీరికి మరణశిక్ష విధించటంకన్నా పాదహస్త చ్ఛేదనం చేయించటం మేలు. జీవచ్ఛవాల్లా పడి ఉంటారు. వీరి రాజ్యానికీ, వీరి ఇతర మద్దతుదార్లకూ కూడా అది హెచ్చరికగా నిలుస్తుంది. మన మండలంలోకి వీరి ప్రవేశం ద్వారా మరికొన్ని ముఖ్యమైన రహస్యాలూ తెలిశాయి మనకు. ఆ విషయాలన్నీ ప్రభువులకు నేనూ, అక్షయుడూ ఆంతరంగికంగా తెలుపుకుంటాము’ ధీర గంభీర స్వరంతో అన్నాడు చంద్రహాసుడు.
చంద్రహాసుని మాటలకు కుళిందకునితోపాటు మంత్రీ, సైన్యాధిపతీ, పురుషోత్తములూ ఇతర ప్రముఖులూ అందరూ విస్తుపోయారు. ముఖముఖాలు చూసుకున్నారు. జనంలోనూ గుసగుసలు వినవచ్చాయి.
అడివప్ప వైపు చూసి చేసైగ చేశారు చంద్రహాస అక్షయులు. ఆయన చిరునవ్వుతో తన సంతోషాన్ని పంచాడు.
చంద్రహాసుని రాజనీతిజ్ఞతకి లోలోపల మురిశాడు ప్రభువు. క్షణాల తర్వాత ‘ఈ నలుగురు నేరస్థులకూ పాదహస్త చ్ఛేదనాన్ని శిక్షగా విధిస్తున్నాం’ అంటూ తన నిర్ణయాన్ని ప్రకటించి లేచాడు.
12
-కుళిందకుడు, మారుతీ వ్యాయామశాలకు చేరేసరికీ అక్కడ యువతీ యువకులు ముమ్మరంగా క్రీడాభ్యాసంలో మునిగితేలుతున్నారు.
అడివప్ప పార్శ్వంలో కర్రసాము, మల్లయుద్ధం, వజ్రముష్ఠి సాధన, మల్లద్వంద్వం సాగుతున్నై.
పురుషోత్తములూ ఈ రోజు వ్యాయామశాలలోనే వున్నారు. ఒక్కొక్కప్పుడు వారి బోధన ఇలా ఇక్కడే జరుగుతూ ఉంటుంది.
వారి పార్శ్వంలో బరిగోల సాధన, ఖడ్గచాలన సాధన, ధనుర్విద్యా సాధన సాగుతున్నై.
ప్రభువును చూసిన ఆచార్యులు, అడివప్ప గౌరవంగా స్వాగతించారు. ఉచితాసనం మీద కూర్చున్నాడు కుళిందకుడు.
శిష్యులంతా స్వేదపూరిత దేహాలతో తమతమ దీక్షా దక్షతల్ని ప్రదర్శిస్తున్నారు. వారిని చూసేసరికి ప్రభువుతో వచ్చిన అంగరక్షకుడూ, సారథీ మల్లయుద్ధ వలయం దగ్గర చేరారు. అడివప్ప శిష్యులకు సూచనలు చేయడానికి వెళ్లాడు.
ఆచార్యుల వారు కొందరు యువకులను తమ ముందు కూర్చోబెట్టుకుని కొన్ని సూత్రాలు బోధిస్తున్నారు. వారిలో చంద్రహాస అక్షయులూ వున్నారు.
***

మిగతా వచ్చేవారం

-విహారి 98480 25600