సెంటర్ స్పెషల్

మహావిజేత 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జరిగింది చెప్పాము కదా ప్రభూ! ఎక్కడో చేరరాజ్యం నుంచీ గూఢచారులు ఇక్కడకు రాలేరని భావించిన తరువాత ఆ రాత్రికి రాత్రే కరదలో వున్న నా శిష్యులు దొడ్డణ్ణ, హాలప్పలకు ‘పావురాయి సందేశము’ పంపాము. ఈ ఆగంతకుల గురించిన వివరాలు అప్పటికప్పుడే తెలిశాయి. చేరరాజు ఉదయుల వారు వీరశివుడి సహాయాన్ని కోరారు. వీరశివుడు చంద్రహాసుని అంతమొందించేందుకు సహాయపడితే, ఆ తర్వాత వారు - వీరశివుడు కళింద్రనే ముట్టడించటానికి సహకరించే విధంగా వౌఖికమైన ఒప్పందం జరిగింది. ఈ పథకంలోని తొలి సగాన్ని నిర్వీర్యం చేయగలిగాము. కానీ అనంతర పరిణామాల్ని మొగ్గలోనే తుంచి వేయవలసిన అవసరం ఉంది. ‘పక్కలో బల్లెంగా తయారైన శత్రువు పీడని వదిలించుకోవటానికి మన చూపు శత్రువు ఆయువు పట్టు మీదే ఉండాలి. అప్పుడే ఆ పీడ విరగడ అయి, అనుకున్న కార్యం సఫలం అవుతుంది’ అన్నాడు అడివప్ప.
‘దానికి మేము ముగ్గురమూ ప్రణాళికను సిద్ధం చేశాము’ అని ఆగి క్షణం తర్వాత చెప్పసాగాడు చంద్రహాసుడు. ‘అవును ప్రభూ! పరిమిత సంఖ్యలో ఆశ్విక సైన్యాన్ని ఇవ్వండి. విడిగా పది అశ్వాలు చాలు. వాటి మీద గురువుగారూ, వారి విశ్వాసపాత్రులైన వీరులూ వస్తారు. వారు రాత్రిపూట యుద్ధం చేయడంలో నిపుణులు. ఆ మీదటి వ్యూహం నేను చూసుకుంటాను’
‘అవును. మేము ముగ్గురమూ ఈ కార్యాన్ని సాధిస్తాం’ అమితోత్సాహంతో అన్నాడు అక్షయుడు. అతని కుడి పిడికిలి అప్పటికప్పుడే ధట్టీలోని చంద్రహాసం పిడిమీద బిగిసి ఉంది.
కుళిందకుడు పుత్రుని వైపు చూపు సారించాడు.
ప్రభువు అంతరంగాన్ని చదివిన వాడు చంద్రహాసుడు. ‘అక్షయునికి క్షేమానికి నా ప్రాణమే రక్ష’ చంద్రహాసుడు స్ఫుటంగా స్పష్టీకరించాడు.
తన మనసులోని ఆందోళనని ఇట్టే పసిగట్టి మాట్లాడుతున్న అతని పలుకుల్లోని ధైర్యం, విశ్వాసం, కంఠస్వరంలోని ఆత్మస్థైర్యం కుళిందకునికి ఆశ్చర్యానందాల్ని కలిగించాయి.
భ్రుకుటి ముడివేస్తూ సాలోచనగా అన్నాడు ప్రభువు - ‘మీరు చెప్పే విషయాలనలా ఉంచండి. ముందు ఈ పరిస్థితుల్ని కుంతల దేశాధిపతికి తెలియజేయాలి కదా. మనం వారి సామంతులము కదా! వారి అనుమతి అవసరం కదా!’
అడివప్ప, అక్షయుడూ చంద్రహాసుని వైపు ప్రశ్నార్థకంగా చూశారు.
‘నిజమే. రక్షణ, విదేశీ వ్యవహారాల విషయంలో మనం స్వతంత్రంగా వ్యవహరించకూడదు కదా’ అడివప్ప ప్రభువుల ఆలోచనకు శ్రుతి కలిపాడు.
క్షణమాత్రం ఆలోచించి అన్నాడు చంద్రహాసుడు.
‘మీరు చెప్పింది నిజమే. అయితే, చిన్న సవరణని ఆలోచించండి. ఈ దాడి వ్యవహారం వలన, మన విజయంతో కరద మండలం మన కళింద్ర మహామండలంలో కలుస్తుంది. దీనివలన కుంతల సామ్రాజ్య విస్తరణ జరుగుతుంది. ఒకవేళ’ - అని ఆగాడు. ప్రభువు వైపు చూస్తూ ‘మనం మన ప్రయత్నంలో విఫలమైనా కుంతల ప్రభువులకు నష్టమేముంది? యథాస్థితి కొనసాగుతుంది’
‘అవును. చంద్రహాసుడు చెప్పింది సమంజసంగానే ఉంది ప్రభూ!’ అన్నాడు అడివప్ప. అక్షయుడు సమర్థించాడు.
‘మరొక్క మనవి ప్రభూ. ఈ వ్యవహారమంతా అతి రహస్యంగా జరిగిపోవాలి. మంత్రి చేతనులకూ, సింగన్న వారికీ మాత్రమే తెలియాలి. రేపు రాత్రికే బయలుదేర వలసి ఉంటుంది.
గోప్యత పాటించవలసిన ఆవశ్యకత గురించి ప్రభువులు తగిన హెచ్చరికని చేయగలరు. మీదటి కార్యం మీ అనుజ్ఞ’ అన్నాడు చంద్రహాసుడు.
కుళిందకుడు చంద్రహాసునే పరికిస్తూ కూర్చున్నాడు. ఎంత సదసద్వివేకం, ఆలోచనా చతురత, వ్యూహరచన! అన్నింటికీ మించి భావి క్షేమం! వయసును మించిన సాహసం, అక్షయుని పట్ల గల స్నేహ సౌహార్దాలు - అన్నీ ముచ్చట గొలుపుతున్నాయి. కర్మణా ఇది తొలి అడుగు. దీనిలో సాధించనున్న విజయం అతని పురోగతికి ప్రథమ సోపానం అనుకున్నాడు. చిరుదరహాసం విరిసింది. ‘బాగుంది. చంద్రహాసుని ఆలోచన అనేక విధాలుగా ఆచరణాత్మకంగా ఉంది. మీరు మీ పనుల నన్నింటినీ ముగించుకుని సిద్ధంకండి’
అందరి ముఖాలలోనూ సంతృప్తి. సమధి కోత్సాహం. అంతేకాదు సమరోత్సుకత ఉరకలు వేస్తోంది.
‘ప్రభువుల రాత్రి విందుకు కాలాతీతమయింది. మరి మేము సెలవు తీసుకుంటాము’ అంటూ లేచాడు అడివప్ప.
చంద్రహాసుడూ, అక్షయుడూ కూడా తమ పీఠాల నుంచీ లేచారు.
వారు ముగ్గురూ కదలబోతుంటే, లిప్తమాత్రంలో ‘ఒక్కమాట’ అన్నాడు కుళిందకుడు.
ఆగేరు...
‘అక్షయా! మన రక్షణ వ్యవస్థలోనూ, సమాచార వ్యవస్థలోనూ ఎక్కడో చిన్న లొసుగు ఉంది. దాని గురించి సైన్యాధిపతినీ, ఉపసైన్యాధిపతినీ హెచ్చరించాను నేను. ప్రత్యేకించి నీవూ తగు జాగ్రత్తలో ఉండటం అవసరం’
ఒక్కసారిగా ఉలిక్కిపడి, సంభ్రమించి, ఆ వెంటనే ‘అలాగే ప్రభూ’ అని కదిలాడు అక్షయుడు.
అడివప్ప అర్థం కానట్లుగా చూసి బయటకు నడిచాడు.
చంద్రహాసుడు తనలో తాను నవ్వుకుంటూ వారిద్దరినీ అనుసరించాడు. అతని నవ్వుకు అర్థం ఉంది. విదేశీ గూఢచారులు బంధింపబడిన వార్త ఆనాడు రాత్రి అయ్యేసరికీ నగరమంతా పొక్కింది. ప్రభువులకు తమదైన రహస్య సమాచార వార్తా హరులుంటారు. ఆయన వారి ద్వారా అసలు విషయాన్నిన తెలుసుకుని ఉంటారు. ఆ వార్త పొక్కిన మార్గం ఆది మధ్యాంతరాలూ తాను ఊహించాడు. ప్రధాన ద్వారపాలకుడు బూరన్న కుమారుడు పోరన్న అక్షయునికి మిత్రుడు. అత్యుత్సాహంలో అక్షయుడు పోరన్నకు చెప్పి ఉంటాడు. పోరన్న తండ్రికి చెప్పి ఉంటాడు. తనకు ఆనాడే ఈ విషయం స్ఫురించింది. ప్రభువుకీ తెలిసి ఉంటుంది. అందువలననే ఇప్పుడు ప్రత్యేకించి అక్షయునికి అన్యాపదేశంగా హెచ్చరిక చేశారు అనుకున్నాడు చంద్రహాసుడు.
ఇదంతా తెలిసిన అక్షయుడు అపరాధ భావనతో చంద్రహాసుని చూస్తూ తలవంచుకుని ముందుకు కదిలాడు. చంద్రహాసుడు అక్షయుడి భుజం మీద చెయ్యి వేసి అనునయంగా తడుతూ, ‘ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క అనుభవాన్ని నేర్పుతుంది. అయితే ఆ అనుభవం నుంచీ మనం నేర్చుకునే గుణపాఠాలు మనకు బతుకుబాటలై ఉపయోగపడతాయి’ అని ఆగి, అతని కళ్లల్లోకి చూచి, ‘నేనూ గురువుల వద్ద నేర్చుకున్న విద్యలో భాగమే ఇది’ అన్నాడు.
అక్షయుడు చంద్రహాసుని మాటలలోని సారం గ్రహించాడు. చంద్రహాసుడెప్పుడూ ఇలాంటివే చెబుతాడు. ఇంత ఆకళింపు చిన్నతనం నుంచే వున్నదతనికి. చంద్రహాసుని చూస్తున్నకొద్దీ విస్మయం కలుగుతోంది. ఆ భావనతోనే ముందడుగు వేశాడు.
16
శుక్ల చతుర్దశి, రాత్రి రెండవ జాము.
ముందుగా అనుకున్న ప్రకారం పదిమంది ఆశ్వికులు, వేరే అశ్వాల మీద చంద్రహాసుడు, అడివప్ప, దక్షణ్ణ, అడివప్ప శిష్యులు, కాకలు తీరిన యుద్ధ నిపుణులు ఇద్దరు సిద్ధమైనారు.
ధనుర్బాణాలు, చురకత్తులు, పట్టాకత్తులు, మోకులు, కొరడాలు - ఎవరికి కావలసినవి వారు తెచ్చుకున్నారు. ప్రతివారి ధట్టీకి చుట్టిన ఇనుప పట్టెడలు.
ఈ బృందంలో అక్షయుడు లేడు.
ముందుగా చంద్రహాసుడు ఏకాంతంలో కుళిందక ప్రభువుని కలిశాడు. తన నిర్ణయం చెప్పబోతూండగా మేధావినీ దేవీ, అక్షయుడూ ఇద్దరూ ఆ మందిరంలోకి ప్రవేశించారు.
‘యువరాజు ఏకంగా ఒకేసారి యుద్ధ రంగంలోకి ప్రవేశించకూడదు. కొంతకాలం మా వెనుకగా ఉంటూనే మమ్మల్ని నడిపించాలి. నాయకత్వ లక్షణాలలో ఇదీ ముఖ్యమైనదే. మమ్మల్ని ప్రోత్సహించాలి. నాకు మిగతా అన్నింటికంటే అక్షయుని శ్రేయస్సు ముఖ్యం’ అన్నాడు చంద్రహాసుడు.
ఈ మాటలు వింటూనే మేధావినీదేవి ఉద్వేగానికి లోనైంది. కళ్లు చెమర్చాయి. పెదవులు కంపించాయి. చంద్రహాసుని దగ్గరగా వచ్చి వౌనంగా తన సంతృప్తిని తెలియజేస్తూ మూర్ధాఘ్రాణం చేసింది.
కుళిందకుని పరిస్థితీ అలాగే ఉంది. చంద్రహాసుని దగ్గరించి భావోద్వేగంతో అతని భుజాన్ని తట్టాడు. ‘సాహో’ అన్నాడు.
‘అయితే అంతేనా?’ నెమ్మదిగా అన్నాడు అక్షయుడు.
‘అంతే మరి’ దరహాసంతో అన్నాడు ప్రభువు.
నిరాశ చెందినా ప్రభువాజ్ఞకీ, చంద్రహాసుని తర్కానికీ తలఒగ్గి ‘అన్నకు విజయోస్తు’ అన్నాడు. ‘తథాస్తు’ అన్నారు రాణీ, ప్రభువూ. ప్రభువుకీ, దేవికీ అంజలి ఘటించి, అక్షయుని కౌగిలించుకుని బయలుదేరాడు - చంద్రహాసుడు.
వేగంగా బయటకి వచ్చి, తన బృందాన్ని కలిశాడు. అందరూ ఒకచోట నిలిచి వ్యూహాన్ని స్థూలంగా పునశ్చరణ చేసుకుని ముందుకు కదిలారు.
రాచనగరు ప్రాంగణాల్ని గడచి, కోట ప్రాకారం అధిగమించి, అగడ్తను దాటుతుండగా కోట గోడలకు అక్కడక్కడా బీటలు పడినట్లు గమనించాడు. అగడ్తలో వున్న నీటి లోతు కూడా అంతంత మాత్రంగానే ఉన్నట్లు గ్రహించాడు. తల పంకించి ముందుకు సాగాడు.
-దట్టమైన అడవి. చిమ్మచీకటి. కీచురాళ్లు రొద పెడ్తున్నాయ. ఏ మూలనుంచో గావురు గావురుమని గర్జిస్తున్నది బెబ్బులి.
విశాలమైన సెలయేటికి ఆవలివొడ్డున గున్న ఏనుగుల గుంపు. ఛాయామాత్రంగా కనిపిస్తోంది.
అడివప్ప, చంద్రహాసుడూ ప్రక్కప్రక్కగా సమవేగంతో గుర్రాలను నడిపిస్తున్నారు.
చంద్రహాసుడి అశ్వం ‘ఆజానేయం’, అడివప్ప ‘జవనం’ మీద వున్నాడు. ఈ రెండూ వేగానికి పెట్టింది పేరు. వెనుకనున్న వారంతా వివిధాశ్వాల మీద వస్తున్నారు. చివరి ఇద్దరూ ‘స్థౌరీ’ అనే అశ్వాల మీద ఉన్నారు. ఆ గుర్రాలు అమితమైన వీపు సత్తువ కలిగినవి. వాటి మీద అవసరమయిన సంభారాలు వున్నై.
దారిలో గుర్రాల వేగానికి వాటి కాళ్ల కింద పడి నేల మీది ఎండుటాకులూ, పుల్లలూ గలగలలాడుతున్నాయి.
కొంతదూరం సాగారు.
‘ఇక్కడి నుంచీ మనం ఈ కొండని ఎక్కి దిగితే వీరశివుని రాజధానే. జాగ్రత్తగా సాగండి’ అన్నాడు అడివప్ప. అతనీ ప్రాంతంతో పూర్వ పరిచయమున్నవాడే.
చలిగాలి వీస్తోంది.
దూరంగా కొండ జాతుల వారి గుడిసెలున్నట్లున్నాయి. దీపాలు మినుకుమినుకు మంటున్నై.
సరిగ్గా అప్పుడు-
పదివిల్లుల దూరంలో ఒక పెద్దపులి దారికి అడ్డంగా పడుకుని గుర్రుగుర్రుగా చూస్తోంది.
బృందంలోని ఇద్దరు కాగడాలు పట్టుకుని వస్తున్నారు.
గాండ్రింపు శబ్దాన్నిబట్టి దూరం నుంచే అది పులి అని పసిగట్టాడు చంద్రహాసుడు.
కాగడాల వెలుగులో దూరంగా రెండు కళ్లు మెరవడం గమనించాడు.
చేసైగతో అడివప్పనీ, బృందాన్నీ ఆపి ఎదురుగా చూడమన్నట్లు సంజ్ఞ చేశాడు.
అడివప్ప పిడికిలి బిగిసింది. అప్రయత్నంగా తన దగ్గర వున్న బరిగోలని పైకెత్తింది చెయ్యి. చంద్రహాసుడు వారించాడు. నెమ్మదిగా చెప్పాడు. ‘నాకంటే వయస్సులోనూ, అనుభవంలోనూ పెద్దవారు మీరు. అన్నీ తెలుసు. అయినా చెబుతున్నాను. పులిది చాలా సాత్విక ప్రవర్తన. మనిషి నెత్తురు రుచి మరగని పులి అయినట్లయితే అది మనుషులను ఏమీ చేయదు. దూరంగా వెళ్లిపోతుంది. పులిని గురించిన భయంతో మనిషి దానికి హాని తలపెడుతున్నట్టు పసిగడితే మాత్రం మూడు నాలుగు ధనస్సుల దూరమైనా సరే దూకేయగల సత్తా ఉంటుంది. సాధారణంగా అది పక్కల నుంచే తన ప్రత్యర్థి మీదకు లంఘిస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ముఖాముఖి తలపడదు. అందుకని మనం మెళకువగా సాగుదాం’ అని పులిని గమనిస్తూ, తన బృందాన్ని వెనకగా వుంచుతూనూ, చుట్టుపక్కల కూడా నిశితంగా గమనిస్తున్నాడు చంద్రహాసుడు.
అందరూ అప్రమత్తులైనారు.
దారికి కుడివైపు కేతకి పొదలు దట్టంగా అలముకొని వున్నాయి. వాటితో కలిసి పెరిగి పైకి పైకి నిలిచిన వేణువృక్షాలు ఎత్తుగా ఉన్నాయి. వాటి నుంచీ పొంచి చూస్తోంది మృగం.
త్రుటిలో పులి కదిలింది. ముందుకు దూకబోతోంది. పులికీ, వీరికీ రెండు విల్లుల దూరం ఉంది. గురిచూసి పులి మీదకి, బాణాన్ని వదిలాడు దక్షణ్ణ. ‘బ్లాక్.. బ్లాక్’ అని కుప్పకూలింది. అరచి అరచి, మూలిగి మూలిగి - ఈలిగింది.
ఆశ్వికుడొకడు గుర్రం దిగి వెళ్లి చూసి వచ్చాడు. అది చనిపోయింది! ఆ తర్వాత ప్రయాణం వలసిన హెచ్చరికలతో త్వరత్వరగా సాగింది.
కరదకోటకి తూర్పు దిశ అది.
అక్కడ అడవి పలచబడింది.
అందరినీ ఒకచోట చేర్చాడు చంద్రహాసుడు. అతని వ్యూహాన్ని తెలిపాడు. ‘ఇంకా రెండు జాముల రాత్రి ఉంది. తెల్లవారేసరికి కోట మన వశం కావాలి. అశ్వాలన్నింటినీ ఇక్కడే కొంచెం లోపలగా చెట్ల చాటున విడవండి. మన సంభారాలతో ఆ అశ్వాల మీద వచ్చిన వారినే వాటికి రక్షణగా ఇక్కడ ఉంచుదాం. మిగిలిన వారంతా ఇద్దరిద్దరుగా వేరువేరు దారుల్లో కోట వెనుక భాగానికి చేరాలి.
‘అక్కడ గురువుగారి శిష్యులు దొడ్డణ్ణ, హాలప్ప మిమ్మల్ని కలుస్తారు. వారు ఇక్కడి రాజసేవకులే. వారి సహాయంతో భటులను నిహతులను చేస్తూ అక్కడి కోట ద్వారాన్ని తెరవాలి. ఇదంతా చేయటానికి మీమీ ఆయుధాలను భద్రంగా తీసుకొని పోండి. నేనూ, గురువుగారూ మాత్రం మా పద్ధతిలో మేం కోటలోపలి రాజమందిరంలోనికి ప్రవేశిస్తాం. మేము మా కార్యం పూర్తిచేసేలోగా మీరు రాజమందిర ద్వారం దగ్గరికి చేరాలి. స్థూలంగా ఇదీ పథకం. ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి మీకనువైన నిర్ణయాన్ని మీరు తీసుకోండి. భద్రత ముఖ్యం. లక్ష్యం సిద్ధించాలి. అంతే’
అందరూ సరే అంటే సరే నంటూ చేతులు కలిపారు. ‘జయహో...’ అన్నారు. ‘జయహో శ్రీవిష్ణు’ అని చంద్రహాసుడు అనుకున్నాడు. అప్పటికప్పుడే వారందరూ వేషధారణలను మార్చుకున్నారు.
ముందుగా అనుకున్న విధంగా ఎటువారు అటు వివిధ దిశలలో సాగిపోయారు. అడివప్ప, చంద్రహాసుడు దక్షణ్ణ వడివడిగా అడవిని దాటి నగరంలోకి వచ్చేశారు.
మరీ ఎత్తుగా పెరగని ఒక గున్నమామిడి కింద నిలిచారు. కొమ్మలు క్రిందుగానే ఉండటంతో వాటి నీడతో మరుగుగా ఉందా స్థలం.
కోట ముఖద్వారం దూరంగా కనిపిస్తోంది. అది తూర్పు వైపుది. వీరు నిలిచిన ప్రదేశానికీ, కోటకూ మధ్య విశాలమైన రాచబాట. ఎక్కువమంది సైనికులు రాత్రి బరాబరిలో నిమగ్నులై ఉన్నారు. ఆగ్నేయ మూలకు జరిగి దక్షిణ ద్వారాన్ని పరికించారు.
అదిగో - అప్పుడు గమనించాడు చంద్రహాసుడు.
దక్షిణం వైపు ద్వారం దగ్గర కేవలం ఇద్దరు సైనికులు మాత్రం ఉన్నారు. ఎదురెదురుగా కూర్చుని ఏదో చేస్తున్నారు. వారిని లక్ష్యం చేసుకున్నాడు చంద్రహాసుడు. కళ్లతోనే అడివప్పకు, దక్షణ్ణకు సైగ చేశాడు.
‘ఓహో’ అని ఒకసారి వేషధారణలను సరిజూసుకుని, చేతులు కలుపుకున్నారు.
అనంతరం కుడిచేతుల్లో ఉన్న బల్లేలను ఒడిసిపట్టుకుని తాము కూడా కరద మండలం సైనికుల్లాగా నటిస్తూ పెద్దపెద్ద అంగలతో ముందుకు సాగారు.
లక్ష్యం సమీపిస్తుండగా అడుగుల వేగం తగ్గించారు. ఒకరు ఒకవైపునకు, మరొకరు మరో వైపునకు సర్దుకున్నారు. సవ్వడికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చాటుచాటుగా నడుస్తూ - కూర్చుని ఉన్న సైనికులను దగ్గరించారు. ఆ సైనికులు ఇరువురూ పులిజూదం ఆటలో ఎత్తుకు పైఎత్తుల దీర్ఘాలోచనలో ఏమరుపాటుగా ఉన్నారు.
బాగా చలిగా ఉంది. చలి నుండి రక్షణ కోసం కవచం శిరస్త్రాణం ధరించినట్లుగా అనిపించేలా చంద్రహాసుడూ మిగిలిన ఇద్దరూ పూర్తిగా కరద సైనికుల్లాగానే ఉన్నారు.
మెరుపు వేగంతో ఆ ఇద్దరు సైనికుల వెనక్కి చేరి, వారు గ్రహించేలోపే వారి నోరు నొక్కేశారు. వారిని పట్టుకుని దూరంగా చెట్ల వెనకాల పడేసి వచ్చారు. మళ్లీ ద్వారం దగ్గరికి చేరారు. చంద్రహాసుడు ఎదురుగా చూశాడు.
తమ ముందు దుర్బేధ్యమైన ద్వారం. దాన్ని తాము ఏమీ చేయలేరు. ఆలోచిస్తూనే తల ఎత్తి పైకి చూశాడు. రెండు నిలువుల ఎతె్తైన కోటగోడ. మూలల మీద పెద్ద బురుజులు. వాటిలో కాపలా వారు ఉండి ఉండాలి. కానీ, ఎవ్వరూ ఉన్నట్లుగా అనిపించటంలేదు.
ముగ్గురూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఒకరినొకరు వౌన ప్రశ్నలు వేసుకున్నారు. సమాధానాలూ చెప్పుకున్నారు.

మిగతా వచ్చేవారం

-విహారి 98480 25600