జాతీయ వార్తలు

ముందు చట్టం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుర్ర నేరస్థుడి విడుదల ఆపలేం
పిటిషన్ తిరస్కరించిన సుప్రీం
మాకు అన్యాయమే జరిగింది
ప్రభుత్వాల కళ్లు తెరిపిస్తాం
నిర్భయ తల్లి, మహిళా సంఘాల హెచ్చరిక

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: నిర్భయ కేసులో కుర్ర నేరస్థుడి విడుదల నిరోధించేందుకు సుప్రీం కోర్టులో జరిగిన చివరి ప్రయత్నం కూడా విఫలమైంది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం విచారించిన సుప్రీం కోర్టు ఈమేరకు తీర్పు వెలువరించింది. కుర్ర నేరస్థుడి విడుదల ఆపాలంటే ఇందుకు సంబంధించి అత్యంత స్పష్టమైన రీతిలో శాసనపరమైన ఏర్పాటు ఉండాలని న్యాయమూర్తులు ఎకె గోయల్, యుయు లలిత్‌తో కూడిన సుప్రీం కోర్టు సెలవు కాలపు బెంచ్ స్పష్టం చేసింది. ఏం చేయాలన్నా చట్టప్రకారమే చేయాలని, చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ధర్మాసనం తన రూలింగ్‌లో ఉద్ఘాటించింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా అధికారిక హోదాలో ఈ పిటిషన్‌ను మాలివాల్ దాఖలు చేశారు. అసలు పిటిషన్‌ను విచారణకు స్వీకరించడానికికే సుప్రీం కోర్టు నిరాకరించింది. బాల నేరస్తుల చట్టం కింద ఈ నిర్భయ నేరస్థుడిని మరో రెండేళ్లపాటు కస్టడీలో ఉంచి అతడిలో మార్పు తీసుకురావల్సి ఉందన్న పిటిషనర్ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించలేదు. రాజ్యాంగంలోని 21వ ఆధికరణ ప్రకారం ఎవరి జీవన హక్కును హరించే అధికారం తమకులేదని, ఇలా చేయడానికి చట్టంలో ఏరకమైన నిబంధనా లేదని బెంచ్ తెలిపింది. ఈ నేరస్థుడిలో మరింత మార్పు తీసుకురావడానికి సంబంధించి పిటిషన్‌దారు తరఫు న్యాయవాది చేసిన సూచనలపై సుప్రీం కోర్టు ఈవిధంగా ప్రతిస్పందించింది. అసలు బాల నేరస్థుల (సంరక్షణ, రక్షణ) చట్టాలకు సంబంధించి నిబంధనలు పరిగణనలోకి తీసుకోకుండానే ఢిల్లీ హైకోర్టు ఈ నేరగాణ్ని విడుదల చేసిందని న్యాయవాది వాదించారు. ఈ మూడేళ్ల కాలంలో ఈ నేరస్థుడు మరింతగా బరితెగించినట్టు, అతడిలో ఏరకమైన మార్పు రాలేదన్నట్టుగా ఇంటిలిజెన్స్ నివేదిక స్పష్టం చేస్తోందని తెలిపారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ ఢిల్లీ మహిళా కమిషన్ వాదనను సమర్ధించారు. దానిపై తీవ్రంగా ప్రతిస్పందించిన సుప్రీం కోర్టు‘ఇందుకు వీలుకల్పించే చట్టం చేయకుండా మీరు మహిళా కమిషన్ వాదనను బలపరుస్తున్నారు’ అని వ్యాఖ్యానించింది. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి చట్టపరమైన దన్ను ఉండాలన్న ధర్మాసనం ఈ కుర్ర నేరస్థుడి కస్టడీని ఏవిధంగానూ పొడిగించే అవకాశం లేదని తెలిపింది. ‘మీ ఆందోళన మాకు అర్థమైంది. కానీ చట్టపరంగా ఎలాంటి వీలూ లేకుండా తీర్పును ఇవ్వలేం’ అని ధర్మాసనం మరింత స్పష్టంగా పేర్కొంది. మూడేళ్లకుమించి ఎట్టిపరిస్థితుల్లోనూ కస్టడీని పొడిగించే ప్రసక్తిలేదని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో నిర్భయ హంతకుడి విడుదలను ఆపేందుకు ఢిల్లీ మహిళా సంఘం, అనేక ఎన్‌జివో సంస్థలు తీవ్రంగానే ప్రయత్నించాయి. కనీసం సుప్రీం కోర్టులోనైనా తమ వాదనకు బలం చేకూరుతుందని ఆశించినా ఫలితం దక్కలేదు.
ప్రభుత్వాల కళ్లు తెరిపిస్తాం
నిర్భయ హంతకుడి విడుదలను ఆపేందుకు జరిగిన చివరి ప్రయత్నం కూడా విఫలం కావడంతో ఢిల్లీలో సోమవారం మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. సుప్రీం కోర్టు తీర్పుతో తీవ్ర నిరాశకు గురైన నిర్భయ తల్లి ఆశాదేవి దేశవ్యాప్తంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. అటు ప్రభుత్వాలు ఇటు శాసన నిర్మాతల కళ్లు తెరిపిస్తామన్నారు. నిర్భయ కేసులో మిగిలిన హంతకులకైనా మరణశిక్ష అమలయ్యేలా తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని చెప్పారు. కుర్ర నేరస్తుడిని విడుదల చేయవద్దని తాము ఎంతగా ప్రాధేయపడ్డా, ఎంతగా ప్రతిఘటించినా అతడు విడుదలైపోయాడని, ఈ పరిణామం తమకు దిగ్భ్రాంతి కలిగించిందని తెలిపిపారు. ‘ఈ విషయంలో అనేకమందిని ఆశ్రయించాం. ఎక్కడా మాకు న్యాయం జరగలేదు. మా గుండె పగిలిందే తప్ప న్యాయం జరుగుతుందన్న ఆశ చావలేదు’ అని నిర్భయ తల్లి ఆశాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాల్సిందిపోయి, తమ బాధను ఆవేదనను రాజకీయ పార్టీలు ప్రచారం కోసం వాడుకుంటున్నాయని ఆమె అన్నారు. 2012 డిసెంబర్ 16న నిర్భయ హత్య జరిగినప్పటి నుంచీ ఇంతవరకూ ఎలాంటి మార్పూరాలేదని ఆమె ఆందోళన చెందారు. వరుసగా మూడో రోజు కూడా జంతర్ మంతర్ ప్రాంతం కుర్ర నేరస్తుడి విడుదలకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనతో అట్టుడికింది. ఈ ఘాతుకానికి పాల్పడిన వారికి మరణశిక్ష విధించాల్సిందేనన్న డిమాండ్లు వెల్లువెత్తాయి.
మహిళలకు బ్లాక్ డే: మాలివాల్
నిర్భయ హంతకుడి విడుదలను అడ్డుకునేందుకు తాము చేసిన ప్రయత్నం విఫలం కావడం దేశంలో మహిళలకు బ్లాక్ డే వంటిదని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ మాలివాల్ ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించేందుకు ఉద్దేశించి సవరణ చట్టం బిల్లు రాజ్యసభలో ఇంకా పెండింగ్‌లో ఉండడం ఇందుకు కారణమని ఆమె తెలిపారు. (చిత్రం) సుప్రీం కోర్టు బయట మీడియాతో మాట్లాడుతున్న ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మాలివాల్