రాష్ట్రీయం

చత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, నవంబర్ 28: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్లో ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టు పీఎల్‌జీఏ వారోత్సవాలను దృష్టిలో ఉంచుకుని బస్తర్ ఐజీ కల్లూరి నేతృత్వంలో సుక్మా, బీజాపూర్, దంతెవాడ, నారాయణ్‌పూర్ జిల్లాల్లో వరుసగా పోలీసు బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. మాడ్ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలకు జహ్రా దళం తారసపడింది. బేడమట్ట-గట్టకల్ మధ్య అటవీప్రాంతంలో సుమారు 2 గంటలపాటు హోరాహోరీగా కాల్పులు జరిగాయి. నేల్‌నాల్ ఎల్‌ఓఎస్ దళ సభ్యుడు రెంగూతో పాటు మరో ఇద్దరు నక్సల్స్ చనిపోయారు. ఇద్దరు మహిళా నక్సలైట్లు సతారో, నీలాలను అరెస్ట్ చేశారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని బస్తర్ ఐజీ కల్లూరి వెల్లడించారు. మరో వైపు సుక్మా జిల్లా చింతలనార్ వారపు సంతలో మావోయిస్టులు మందుపాతర పేల్చి కాల్పులు జరిపిన సంఘటనలో సీఆర్‌పీఎఫ్ జవాన్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఇదే జిల్లాలో ముర్‌ఈగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కుత్తూరు అటవీప్రాంతంలో కూంబింగ్ బలగాలు 8 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నాయి. దంతెవాడ జిల్లా అరణ్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 111 సీఆర్‌పీఎఫ్ బెటాలియన్‌కు చెందిన బలగాలు 5 కిలోల మందుపాతరను గుర్తించి నిర్వీర్యం చేశాయి.

పిబిసి కెనాల్‌కు తాగునీరు విడుదల
నూజెండ్ల, నవంబర్ 28: గుంటూరు జిల్లా నూజెండ్ల మండలంలోని పిబిసి కెనాల్‌కు సాగర జలాలను విడుదల చేయించేందుకు శనివారం ఎన్‌ఎస్పీ అధికారులు, రైతులతో కలసి జిల్లా టిడిపి కన్వీనర్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రకాశం జిల్లా, కురిచేడు సమీపంలోని బయ్యారం రెగ్యులేటర్‌ను పరిశీలించారు. గుంటూరు-ప్రకాశం జిల్లాల ఎన్‌ఎస్పీ అధికారులతో ఎమ్మెల్యే చర్చలు జరిపారు. ఒకానొక దశలో ఇరు జిల్లాల అధికారులు వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి పిబిసి కెనాల్‌కు నీటిని విడుదల చేయించారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ తాగునీటికోసం పిబిసి కెనాల్‌కు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉందన్నారు. మెయిన్ కాల్వలకు కేవలం 120 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తుండటంతో ప్రకాశం జిల్లా రామతీర్థానికి నీరందే పరిస్థితి లేనందున, 85వ మైలు రాయి వద్ద 1000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. విడుదలైన నీటి నుండి పిబిసి కాల్వకు విడుదల కావాల్సిన వాటా ప్రకారం 300 క్యూసెక్కుల నీటిని 24గంటల పాటు విడుదల చేయాలని ప్రకాశం జిల్లా అధికారులకు సూచించారు.

పెట్రోల్ తాగి బాలుడు మృతి
కూనవరం, నవంబర్ 28: అభం శుభం తెలియని 18 నెలల చిన్నారి శనివారం పెట్రోల్ తాగి మృతిచెందాడు. తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం పల్లూరు గ్రామానికి చెందిన ఆవుల నవీన్‌కు చెందిన 18 నెలల కుమారుడు మనోజ్‌కుమార్ పెట్రోలు తాగి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పొలంలోకి పురుగుల మందు కొట్టేందుకు పెట్రోల్, డీజిల్ కలిపిన సీసాను ఇంట్లో ఉంచారు. మనోజ్ ఆడుకుంటూ వెళ్లి సీసా మూత తెరిచి తాగుతుండగా, దీనిని గమనించిన తల్లి హుటాహుటిన కూనవరంలోని ఒక ప్రైవేటు వైద్యశాలకు తరలించించింది. అక్కడి నుండి ఉదయం 11 గంటలకు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు ప్రభుత్వ వైద్యశాలలోనే చికిత్స చేసి, ఆ తరువాత మెరుగైన వైద్యంకోసం భద్రాచలంకు రిఫర్ చేశారు. మనోజ్‌ను 108లో భద్రాచలం తీసుకువెళ్లారు. అక్కడ ఒక ప్రైవేటు వైద్యశాలకు బాలుడిని తీసుకెళ్లిన మరుక్షణమే బాలుడు మృతిచెందాడని తండ్రి నవీన్ విలపిస్తూ చెప్పారు. ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మనోజ్ మృతి చెందాడని నవీన్ ఆరోపించారు.

‘పట్టిసం’కు చేరిన మరో నాలుగు మోటార్లు
పోలవరం, నవంబర్ 28: పశ్చిమగోదావరి జిల్లా పట్టిసం ఎత్తిపోతల నిర్మాణ ప్రాంతానికి శనివారం మరో నాలుగు మోటార్లు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ మొత్తం 12 మోటార్లు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నాయి. ఎత్తిపోతల పథకంలో 24 మోటార్లు బిగించవలసి ఉండగా, చైనా నుండి 12, భోపాల్ నుండి 12 మోటార్లు రావలసి ఉన్నాయి. అయితే చైనా నుండి నాలుగు, భోపాల్ నుండి 8 మోటార్లు ఇప్పటికి ఇక్కడకు వచ్చాయి. మోటార్లు వస్తున్న సందర్భంగా పోలవరం నుండి తాళ్లపూడి వెళ్లే వాహనాలను హుకుంపేట మీదుగా మళ్లించారు. అలాగే గూటాల, కొత్త పట్టిసం, పాత పట్టిసం గ్రామాలలో విద్యుత్‌ను నిలిపివేసి మోటార్లు పట్టిసం చేరుకున్న తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఎత్తిపోతల పథకంలో ఇప్పటికే మూడు మోటార్ల ద్వారా రోజుకు వెయ్యి క్యూసెక్కుల గోదావరి నీటిని కృష్ణాకు మళ్లిస్తున్నారు.

నష్టాల తగ్గింపులో ఈపిడిసిఎల్ ఫస్ట్
విశాఖపట్నం, నవంబర్ 28: విద్యుత్ పంపిణీ నష్టాల తగ్గింపులోనూ, మీటర్డ్ సేల్స్‌లోనూ ఈస్ట్రన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ (ఈపిడిసిఎల్) ప్రథమస్థానంలో నిలిచింది. మీటర్ రీడింగ్‌ల ప్రకారం విద్యుత్ అమ్మకాలు (మీటర్డ్ సేల్స్) ఈపిడిసిఎల్ పరిధిలో ఏటా ఒకటి నుంచి మూడు శాతం వరకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం సంస్థ పరిధిలో ఇది 82 శాతంగా ఉంది. 2015-16 సంవత్సరం ముగిసేనాటికి దీనిని 85 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఉన్నట్టు సంస్థ వర్గాలు తెలిపాయి. అధునాతమైన మీటర్ల వాడకం ద్వారా ఇది సాధ్యపడిందని పేర్కొంటున్నాయి. విద్యుత్ పంపిణీ నష్టాలను సైతం సంస్థ గణనీయంగా తగ్గించగలిగింది. 2000-01లో 17.91 శాతం ఉండే పంపిణీ నష్టాలు ప్రస్తుతం 6.32 శాతానికి తగ్గాయి. ఈ విషయాల్లో దేశంలోని 48 విద్యుత్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో సంస్థ ప్రథమస్థానంలో నిలిచింది. అదే విధంగా సంస్థ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలను సైతం 5.83 శాతానికి తగ్గించింది. 2000-01లో 17.79 శాతం వరకు వైఫల్యాల శాతం ఉండగా దీనిని గణనీయంగా తగ్గించగలిగినట్టు సంస్థ అధికారులు చెబుతున్నారు.

పేలుడు పదార్థాలు స్వాధీనం
పాములపాడు, నవంబర్ 28: కర్నూలు జిల్లా పోలీసులు శనివారం పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువువద్ద శుక్రవారం రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా బొలోరో వాహనంలో తరలిస్తున్న పేలుడు పదార్థాలు పట్టుబడినట్లు ఆత్మకూరు డియస్పీ సుప్రజ తెలిపారు. శనివారం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ పేలుడు పదార్థాలు తరలిస్తున్నారన్న సమాచారం మేరకు శుక్రవారం వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామన్నారు. అందులో భాగంగా సిద్దాపురం చెరువు సమీపంలో ఓ బొలోరో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో పేలుడు పదార్థాలు లభించాయన్నారు. వీటికి సంబంధించి ఎలాంటి రసీదులు లేకపోవడంతో డ్రైవర్ రమేష్, మరో వ్యక్తి శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నట్లు డియస్పీ తెలిపారు. వాహనంలోని 30 బస్తా లఅమ్మోనియా, 1260 జిలెటిన్‌స్టిక్స్, 1650 డిటొనేటర్లు, 180 ఎలక్ట్రికల్ బూస్టర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు రూ. 5 లక్షలు ఉంటుందనన్నారు. డ్రైవర్‌ను విచారించగా కర్నూలుకు చెందిన సత్యంరెడ్డి, గిరిబాబుకు చెందిన పేలుడు పదార్థాల గోదాం నుంచి ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన కాంట్రాక్టర్ నరసయ్యకు సరఫరా చేస్తున్నామని చెప్పాడన్నారు. వీరిపై కేసు నమోదుచేసినట్లు డిఎస్పీ తెలిపారు.

దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన
విశాఖపట్నం, నవంబర్ 28: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీనికి ఆనుకుని 3.6 కిలో మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కూడా ఉండడం వలన ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం నుంచి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం శనివారం రాత్రి తెలిపింది. సోమవారం దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.