రివ్యూ

నార్కో’ట్రిక్ ప్లే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

** చీకటి రాజ్యం (ఫర్వాలేదు)

తారాగణం:
కమల్‌హాసన్, త్రిష, ప్రకాష్‌రాజ్, కిషోర్, ఆశా శరత్, మధుశాలిని, సంపత్‌రాజ్ తదితరులు
సంగీతం: జిబ్రాన్
నిర్మాతలు:
కమలహాసన్, చంద్రహాసన్
దర్శకత్వం:
రాజేష్ ఎం.సెల్వ

క్రియేటివిటీకి ప్రతి పదార్థం -కమల్. ఏ కథనైనా రొటీన్‌కి భిన్నంగా చూస్తాడు. ఆలోచిస్తాడు. వెరైటీ లేనిదే ఆ కథ జోలికి అస్సలు వెళ్లడు. ప్రేక్షకులదీ ఇదే ధోరణి. కమల్ కేరాఫ్ కొత్త కోణం. దానికోసమే అతడి వెతుకులాట. అది కమర్షియలా? కాంట్రవర్షియలా? ఆర్ట్ ఫిలిమా? అన్నది పక్కనపెడితే -అతడు చూపే ‘కోణం’ డిఫరెంట్‌గా ఉంటుందన్నది జగమెరిగిన సత్యం. అయితే- ‘స్లీప్ లెస్ నైట్’ అనే ఫ్రెంచ్ ఫిలిమ్‌లో ఏ థ్రిల్లింగ్ యాంగిల్ నచ్చిందన్నది ప్రశ్నార్థకం. థ్రిల్లర్ ఓకే గానీ.. సస్పెన్స్ వెతుక్కున్నా దొరకదు. అసలు కథేంటో చూస్తే -నచ్చటం నచ్చకపోవటం వెనుక ఉన్న అంతరార్థం బోధ పడుతుంది.
దివాకర్ (కమల్‌హాసన్) నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్. ఆ డిపార్ట్‌మెంట్‌లోనే వర్క్ చేసే మణి (యుగి సేత్)తో చేతులు కలిపి కొకైన్ స్మగ్లింగ్ చేసే ముఠాపై అటాక్ చేస్తాడు. ఆ అటాక్‌లో కొన్ని కోట్ల విలువచేసే కొకైన్‌ని పట్టుకొంటాడు. కొకైన్‌ని స్మగ్లింగ్ చేస్తూ కోట్లకు అధిపతిగా మారిన క్లబ్ ఓనర్ విఠల్‌రావుకి ఇది కంటగింపు. దీంతో దివాకర్ కొడుకు వాసు (అమల్ అబ్దుల్లా)ని కిడ్నాప్ చేసి.. కొకైన్ ఇస్తేనే వాసుని విడిచిపెడతానని బెదిరిస్తాడు. ఈ నేపథ్యంలో దివాకర్ ఏం చేశాడు? ఈ ఆపరేషన్‌తో మల్లిక (త్రిష)కి ఏమిటి సంబంధం? అన్నది సింపుల్ స్టోరీ.
కథలో ఎటువంటి మలుపులూ ఉండవు. సాదాసీదాగా వెళ్లిపోతుంది. చెప్పాల్సిన సంగతి కొద్దిగా ఉన్నప్పుడు -ఏం చేయాలో కమల్‌కి బాగా తెలుసు. కమల్‌కి ఈ ఫ్రెంచి కథ ఎందుకు నచ్చిందన్నది పక్కనబెడితే, పూర్తిస్థాయిలో స్క్రీన్‌ప్లేపై ఆధారపడ్డాడు. కథ ఏమిటన్న ఆలోచన ప్రేక్షకుడికి కలగనివ్వలేదు. కథ అక్కడక్కడే తిరుగుతూ ‘లొకేషన్’ పక్కకి జరగదేం అన్న ప్రశ్న మెదళ్లలో పుట్టనివ్వలేదు. కథని థ్రిల్లింగ్‌గా చెప్పాలన్న ఆరాటం కనిపిస్తుంది. అంతే! కమల్‌లోని డిఫరెంట్ సైకాలజీ ఇక్కడే బయటపడింది. కాకపోతే- ఫస్ట్ఫాని బ్రహ్మాండంగా లాగించేసి.. సెకండాఫ్‌ని ‘చీకటి’ చేసేశాడు. ఎందుకంటే- కొడుకుని రక్షించుకోవాలని తండ్రిపడే తాపత్రయం తాలూకు ఎమోషన్‌తో కథ ఒక్క అడుగు ముందుకు వేయదు. ఎమోషనల్ బ్లాక్‌లో చెప్పాలంటే -కథే లేదు.
నిజానికి -హాలీవుడ్ సినిమాల్లో కథేదీ? అనే ప్రశ్నలుండవ్. కారణం -్ఫల్లీ లోడెడ్ యాక్షన్ ఉంటుంది కనుక. లేదూ.. థ్రిల్లింగ్ సీన్లు నడిపించేస్తాయి కనుక. సరిగ్గా ఫ్రెంచి కథలోనూ ఆ థ్రిల్లర్ ‘ఆత్మ’ని పట్టుకొచ్చాడు కమల్ తన స్క్రీన్‌ప్లేతో. కథ పరిధి ఇరవై నాలుగ్గంటలు. ఒక నైట్ క్లబ్‌లోనే అంతా. క్లబ్.. కొకైన్ బ్యాగ్... కిడ్నాపైన కొడుకు -వీరి చుట్టూ తిరిగే దివాకర్. కొకైన్ చుట్టూ తిరిగే విలన్ -ఆ పబ్‌కి వచ్చే కొన్ని పాత్రలు. ఆ రాత్రి ఏం జరిగిందన్న విషయాన్ని ‘ఎస్టాబ్లిష్’ చేసుకుంటూ కథని లాగించేవారు. ఆ ‘చీకటి’లో ఏం జరిగింది? అనే థ్రిల్లర్.
కొకైన్ బ్యాగ్‌ని దివాకర్ తీసుకెళ్లాడన్న సంగతి విఠల్‌రావుకి ఎలా తెలిసింది? సినిమాటిక్‌గా అలా తెలిసిపోతుంటాయా? అదీ వదిలేస్తే -తప్పించుకు పారిపోవాలని అనుకున్న వాడు కారులో సీటు బెల్ట్ పెట్టుకొని మరీ ప్రయాణం చేస్తాడా? లాంటి సిల్లీ క్వొశ్చన్లని ఈజీగా తీసుకొందాం. ఐతే- థ్రిల్లర్‌గా కనిపించే ఈ కథ చిత్రీకరణ సహజత్వానికి మరింత దగ్గరగా ఉంది. ఎవరికీ మేకప్‌లాంటి కోటింగుల్లేవ్. ఫైట్స్ కూడా వీధి రౌడీలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలానే చిత్రీకరించారు. కథానాయకుడు అయినంత మాత్రాన తనకి ‘నొప్పి’లేకుండా ఎవర్నీ కొట్టలేడుగా! ఒకణ్ణి కొడితే చెయ్యి నొప్పి పెట్టడాన్ని చక్కగా చూపించారు. ఏ సినిమాలోనైనా -హీరో హీరోయిన్లు ఫైట్ చేసుకోవటం చూశారా?! కమల్ సినిమాలో చూడొచ్చు. నైట్ క్లబ్ కాబట్టి -ఓ ఐటెం సాంగ్ కోసం తాపత్రయపడలేదు. త్రిషలాంటి గ్లామర్ క్వీన్ ఉంది కాబట్టి -ఓ డ్యూయట్ వేసేద్దాం అనుకోలేదు. యాక్షన్ థ్రిల్లర్ కదా -మరికాసిన్ని ఫైటింగ్ సీన్లు పెట్టేద్దాం అన్న తలంపురాలేదు. కథని కథగా చెప్పారు. లొకేషన్లు అన్న బహువచనం లేదు కనుక -సినిమాటోగ్రాఫర్ తెగ ఇబ్బంది పడుతూనే -కొత్తదనాన్ని చూపెట్టే ప్రయత్నం చేశాడు. దానికి తగ్గట్టు జిబ్రాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది.
కథలో ప్రధాన లోపం -హీరో మిషన్ ఏమిటన్నది అర్థం కాదు. ఆఖరున ఇంతాజేస్తే -ఇందుకా? అన్న ‘వీక్’ థాట్‌తో నిరుత్సాహపడతాడు ప్రేక్షకుడు. సెకెండాఫ్‌కి అసలు సబ్జెక్ట్ అనేదే లేకుండాపోయింది. దీంతో -కొడుకుని రక్షించుకోటానికి కమల్ లాంటి హీరో ఏం చేస్తాడు? అన్న పాయింట్‌లో కొత్తదనం ఆశించలేం.
ఇక -కమల్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పటం అన్నది సిల్లీ ఆన్సర్. తన పరిధిలో తాను సహజత్వానికి ఏనాడూ దూరంగా వెళ్లడు. అందువల్లనే ప్రేక్షకులకు అతడొక ‘లాస్ట్ హీరో’. చాన్నాళ్లకి త్రిష ఓ సరికొత్త పాత్రలో మేకప్ లేకుండా నటించింది, మెప్పించింది కూడా. ప్రకాష్‌రాజ్ గురించి చెప్పనక్కర్లేదు. విలనిజంలోనూ ఫన్నీని ప్రదర్శించాడు. కమల్ కొడుకు పాత్రలో నటించిన అమన్ అబ్దుల్లా చక్కగా నటనను చూపాడు.
మధుశాలిని పాత్ర పరిధి చిన్నదే అయినా -ఒక్క ముద్దు సీన్‌తో ప్రేక్షకుణ్ణి కట్టేసింది. మిగతా పాత్రలన్నీ వచ్చి వెళ్లిపోతూంటాయి. ఎండ్ టైటిల్స్‌లో కమల్ పాడిన థీమ్ సాంగ్ బాగుంది. కథాపరంగా ఆలోచించకుండా -కమల్ సినిమా అనుకొని వెళ్తే సినిమా అద్భుతంగా నచ్చేస్తుంది.

-ప్రనీల్