సాహితి

తడి ఆరని చిరు సంతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడు విడిచిన
పిల్లపిట్టల్ని ఎడబాసి
మోడువారిన
ఎడారి మొఖాల్ని తడిమే
చల్లని చూపుల
చలువ పందిళ్ళై అల్లుకుంటరు

కటిక చీకటి
వాకిట్లో పూసిన
పున్నమి చెట్టుమీద
ఎన్నీలై వాలిపోతరు

నిర్వేదపు అంచుల్ని
పటాపంచలు చేసి
ఆరిపోయిన పెదాలమీద
అనుబంధాల
తేనె బిందువుల్ని వొలికిస్తరు

మూలకుపడ్డ పుస్తకాల్లాంటి
మనుషుల్ని దుమ్ముదులిపి
పేజీలు తెరుస్తరు
కావల్సిన మతలావు తెలిసే దాక
కాలానే్న తిరిగేస్తరు

పెద్దల మధ్య సయోధ్య కూర్చి
ఇగోల అడ్డుగోడల్ని చెరిపేసి
మనసుల ఇరుకు గదుల్ని
విశాలం చేసేస్తరు

గల్మ దుంకినట్టు
గలగల మాటలు
చేద గిరకలెక్క
కిలకిల నవ్వులు

ఉన్న నాలుగు రోజులూ
నట్టింట్లో
నవ్వుల పూల చెట్లై పరుచుకుంటరు

చెరువుల పడ్డ చేపలోలె
తనివి తీరా ఈది
బాధలన్నీ యాది మరిచిపోయిన మాకు
తెల్లారితే
వాళ్ళు వెళ్లిపోతారన్న మనాది

కరిగిపోతున్న నదుల్ని
కండ్లల్ల మోస్తూ
బెయిలు ముగిసిన
జైలుపక్షుల్లా
వీడిపోలేక విలవిల్లడుతరు

మళ్లొచ్చే సెలవులదాకా పైలం
వెళ్లొస్తమంటూ
ఆశల ఊసుల్ని
మా దోసిళ్ళలో పోసి
నీలి మేఘాలై తేలిపోతరు

మనుమలు, మనవరాళ్ళంటే
కురిసిన తొలకరికి
పరిమళించిన మట్టివాసన
ఎడతెరిపి లేని
జ్ఞాపకాల ముసురు
ఎద ఫలకం మీద
ఎప్పటికీ తడి ఆరని
చిరు సంతకాలు

- కొండి మల్లారెడ్డి 9441905525