వాన వెలిసినంత హాయిగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగుంది *** అల.. వైకుంఠపురములో
***
తారాగణం: అల్లు అర్జున్, పూజా హెగ్దె, టబు, జయరాం, సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజు, సముద్రఖని, బ్రహ్మానందం, సునీల్, రాజేంద్రప్రసాద్, బ్రహ్మాజీ, మురళీశర్మ, సచిన్ ఖేడ్కర్, రోహిణి, రాహుల్ రామకృష్ణ, వెనె్నల కిషోర్, అజయ్, తనికెళ్ల భరణి
సంగీతం: ఎస్‌ఎస్ థమన్
సినిమాటోగ్రఫీ: పిఎస్ వినోద్
ఎడిటింగ్: నవీన్ నూలి
నిర్మాతలు: ఎస్ రాధాకృష్ణ, అల్లు అరవింద్
దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
***
2002లో-
నాగార్జున ‘మన్మథుడు’ కోసం కథ, సంభాషణలు అందించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. బ్రహ్మానందం ఇంట్రో ఎపిసోడ్‌లో -‘ఇది పారిస్. ఇండియాను టేప్ రికార్డర్‌లో పెట్టి 50 సంవత్సరాలు ఫాస్ట్ఫార్వార్డ్ నొక్కితే ఎలా ఉంటుందో, అలా ఉంటుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి’ అంటూ డైలాగ్ చెప్పించాడు.
2020లో-
అల్లు అర్జున్‌కి హ్యాట్రిక్ హిట్టివ్వడం కోసం కథ, సంభాషణలతోపాటు దర్శకత్వం వహించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడి మదిలో -‘ఇదీ వైకుంఠపురం. ఎన్టీఆర్ ‘ఇంటిగుట్టు’ను 60 ఏళ్లు మళ్లీ మళ్లీ మళ్లీ మళ్లీ చూస్తే ఎలాగుంటుందో, ‘అల’గుంటుంది. కొంచెం కేర్‌ఫుల్‌గా మళ్లీచూడండి’ అనుకునేలా చేశాడు. ‘ఆ’ కథనుంచి ‘అల’.. కథకు చేరేసరికి కొన్ని లేయర్లు చేరాయంతే. పాత్రల ప్లేస్‌మెంట్లు మారాయంతే. పాత బంగారానికి తావినద్ది, డిజిటల్ సొబగులిచ్చాడంతే. ఇక్కడ మరో విచిత్రం -అప్పటి ‘ఇంటిగుట్టు’కు ఆకెళ్ల శాస్ర్తీ నిర్మాత. ఇప్పటి ‘వైకుంఠపురం’ గట్టుకు ఆకెళ్ల నాగ శ్రీనివాస శర్మ (త్రివిక్రమ్ శ్రీనివాస్) దర్శకుడు. ఒకింత సరదా సినిమా సమీక్షకు ముందు -జస్ట్.. బుల్లి రిలీఫ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది.
***
1958లో -సంగీత ఫిల్మ్స్ బ్యానర్‌పై వేదాంతం రాఘవయ్య తెరకెక్కించిన ‘ఇంటిగుట్టు’ను క్లుప్తంగా చెప్పుకుంటే.. -జమీందారు గుమ్మడి భార్య పుష్పవల్లి, చెల్లెలు సూర్యకాంతం ఒకే సమయంలో మగబిడ్డల్ని ప్రసవిస్తారు. తన కొడుకు గొప్పింటివాడు కావాలన్న సూర్యకాంతం అత్యాశకు -బిడ్డల స్థానాలు మారిపోతాయి. తరువాత.. జమీందారు ఇంట పెరిగిన చెల్లెలి కొడుకు దొంగవుతాడు. జమీకి దూరమైన వారసుడు -తనకు తెలీకుండానే ఆశ్రమంలోని తల్లి సంరక్షణలో పెరిగి పోలీసవుతాడు. ఓ పోలీస్ అసైన్‌మెంట్ కారణంగా -జమీందారు ఇంటికి డ్రైవర్ వేషంలో వచ్చిన అసలు వారసుడు.. అక్కడి అస్తవ్యస్త వ్యవహారాలను ఎలా చక్కదిద్దాడన్నది మూల కథ.
2020లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన అల.. వైకుంఠపురములో కథను క్లుప్తంగా చూస్తే -రామచంద్ర (జయరాం), వాల్మీకి (మురళీశర్మ) స్నేహితులు, ఒకేస్థాయి ఉద్యోగులు. కాలం కలిసొచ్చి రామచంద్ర ధనవంతుడవుతాడు. వైకుంఠపురానికి అల్లుడవుతాడు. వాల్మీకి మిడిల్ క్లాస్‌లోనే ఉండిపోతాడు. వైకుంఠపురానికి అసిస్టెంట్ అవుతాడు. ఓ వర్షం కురిసిన రాత్రి -ఇద్దరి భార్యలు (టబు, రోహిణి) ఒకేసారి మగబిడ్డల్ని ప్రసవిస్తారు. జయరాం అదృష్టంపై అసూయపడే వాల్మీకిలో -తన కొడుకూ గొప్పగా ఎదగాలన్న అత్యాశ పుడుతుంది. కలిసొచ్చిన కాలాన్ని వాడేసి, వద్దని వారించిన నర్సుని గెంటేసి.. బిడ్డల్ని మార్చేస్తాడు. అల -యజమాని కొడుకు మిడిల్ క్లాస్ బంటు (అల్లు అర్జున్)గా, మిడిల్‌క్లాస్ కుర్రోడు గొప్పింటి రాజ్ (సుశాంత్)గా ఎదుగుతారు. పాతికేళ్ల తరువాత చూస్తే అసలు కథలో -రహస్యం ఎలా బయటకుపొక్కింది. జాతక కాలంలో బంటు రాజయ్యాడా? అమ్మానాన్నలను కలిశాడా? బంటును ప్రేమించి రాణి అయిన అమూల్య (పూజా హెగ్దె) ఎవరు? సంబంధం లేని కథలోకి ప్రతినాయకుడిగా అప్పలనాయుడు (సముద్రఖని) ఎందుకొచ్చాడు? అల.. వైకుంఠపురానికి నేనే రాజని తెలుసుకున్న బంటు -అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్ది ఎలా రాజయ్యాడు? లాంటి ప్రశ్నలకు సమాధానం స్క్రీన్‌మీదే చూడాలి.
**
బన్నీ-త్రివిక్రమ్ నుంచి వస్తోన్న ఫెస్టివ్ కాంబో ప్యాక్ కనుక ఆదినుంచీ -అంచనాలు అల్లంత’పైనే ఉన్నాయి. అందుక్కారణం ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ చిత్రాలు. రెండూ బాక్సాఫీస్‌ని ఊపేశాయి కనుక -ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏమాత్రం దిగలేదు. ‘ఓ సరదా సినిమా ఇస్తున్నాం’ అంటూ చెప్పుకొచ్చిన బన్నీ -త్రివిక్రమ్ కూడా ఆ అంచనాలను కిందకు దిగనివ్వలేదు. ‘గ్యాప్ ఇవ్వలేదు, వచ్చింది’ అంటూ ఆఫ్‌స్క్రీన్, ఆన్‌స్క్రీన్‌లో చెప్పుకొచ్చిన బన్నీ -కామెడీతో రెట్టించిన వినోదాన్ని ఇవ్వడానికే ఈ గ్యాప్ అన్న విషయాన్ని స్క్రీన్‌మీద చూపించాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే -గత రెండు చిత్రాల మాదిరిగానే ఈసారీ మేజిక్ వర్కౌటైంది. ‘్థయేటర్‌నుంచి బయటికొచ్చే ప్రేక్షకుడు -వినోదం నిండిన గుండెతో నవ్వుకుంటూ ఇంటికెళ్తే చాలు’ అని చెప్పుకొచ్చిన త్రివిక్రమ్.. ఆడియన్స్‌ని అలానే బయటకు వదిలాడు. ఒక్కముక్కలో చెప్పాలంటే -స్వర్ణయుగంనాటి సినిమా కథను డిజిటల్ ఫ్రేమ్స్‌లో చూపిస్తూ వినోదాన్ని మూటగట్టి ఇచ్చారనటంలో సందేహం లేదు.
సంక్రాంతి సినిమాల రేసులో ‘అల..’ హైటెంత? అన్న ప్రశ్నను కాసేపు పక్కనపెడితే -మ్యాజిక్, మ్యూజిక్‌ను మిక్స్‌చేసి సక్సెస్‌ను అందుకోడానికి త్రివిక్రమ్, బన్నీ ఒకరికొకరు పోటీపడినట్టే అనిపిస్తుంది. గత ఏడాది అరవింద సమేతలాంటి సీరియస్ సినిమాతో సాహసమే చేసిన త్రివిక్రమ్, ఈసారి తనదైన పాత స్టైల్లో పంచ్‌కామెడీతో పరమాన్నం వండేశాడు. కథాసారం పురాతనమే అయినా, తనదైన రసాన్ని జోడించి పొందికగా చెప్పిన విధానం బాగుంది. మామూలు కుటుంబ కథనే.. స్థానం మారినా స్థాయి మారదన్న అప్లికేషన్‌తో అల్లుకోవడం -అల..కు ప్లస్సైంది. లెక్కలేనన్ని పాత్రలు తెరపైకొస్తున్నా -ప్రతి పాత్రకూ ప్రాధాన్యతనిచ్చి గుర్తుపెట్టుకునేలా తీర్చిదిద్దడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
ఫస్ట్ఫాని మధ్యతరగతి మురళీశర్మ ఇంటికి పరిమితం చేసి -అల్లు అర్జున్ కోణంలో మధ్య తరగతి కష్టాలు, కుర్రాళ్లుపడే ఇబ్బందులు, ఆయా కుటుంబాల్లోని పెద్దా చిన్నా పాత్రల మనస్తత్వాలను హాయిగా నవ్వుకునేలా చూపించాడు. మూమూలు కుర్రాడి కెరీర్ లైఫ్‌లోకి ఓ అందగత్తె(పూజా హెగ్దె)ను తీసుకొచ్చి.. ఆశలు, కలలు, మైమర్చే దృశ్యాలను చూపిస్తూ -శృతిమించీ మించని రొమాన్స్‌తో కథను నడిపించాడు. బంటుకు నచ్చిన మగువను -మారు పెంపకంలోని రాజుకు దగ్గరచేసి కథకొక ట్విస్ట్ ఇవ్వడం బావుంది. అదే టైంలో -జయరాం ఆస్తిపై కనే్నసిన అప్పలనాయుడు కంపెనీలో వాటా డిమాండ్ చేస్తూ సీన్‌లోకి ఎంటరవ్వడంతో కథలో సీరియస్‌నెస్ వస్తుంది. ఈ క్రమంలోనే జయరాం తన తండ్రి అని తెలుసుకున్న బంటు -అల వైకుంఠపురమలోకి ఎంటరవ్వడంతో కథ ఆసక్తికరంగా మారుతుంది. ‘నేను గెలవడం కంటే.. మీరు కలవడం ఇంపార్టెంట్’.. ‘ఎప్పుడూ పిల్లలు బాగుండాలని అమ్మానాన్నా అనుకోవాలా? అమ్మానాన్న బాగుండాలని పిల్లలు అనుకోరా’లాంటి బలమైన డైలాగులతో కథను రక్తికట్టించాడు దర్శకుడు. క్లైమాక్స్ ట్విస్ట్‌లో ఇచ్చిన ఎమోషనల్ కంటెంట్ త్రివిక్రమ్ పనితనాన్ని రుచి చూపించింది. చివరకు -వైకుంఠపురం చేరిన బంటు ఏం చేశాడో తెలుసుకోవాలంటే.. త్రివిక్రమ్ మ్యాజిక్‌ని తెరపై చూడాలి.
అల్లు అర్జున్ -పూర్తిస్థాయిలో చేసిన ఫస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అల.. వైకుంఠపురములో. ఆ ఉత్సాహాన్ని కామెడీ టైమింగ్‌లో చూపించాడు.
ఫస్ట్ఫా మొత్తాన్ని త్రివిక్రమ్ తన తెలివితో నడిపించేస్తే -సెకెండాఫ్‌ని బన్నీ తన బలంగా లాగించేశాడు. కంపెనీ బోర్డ్ మీటింగులో -మహేశ్, జూ.ఎన్టీఆర్, పవన్‌కల్యాణ్, చిరంజీవి పాటలతో డిజైన్ చేసిన సీరియస్ సీన్‌కి ఎంటర్‌టైనింగ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో బన్నీ స్టామినా కనిపిస్తుంది. సినిమాలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్‌కీ -కానె్సప్ట్ బేస్డ్ కోటింగ్ ఇవ్వడం వైవిధ్యం అనిపించింది. సెకెండాఫ్ సీన్లలో -త్రివిక్రమ్ డిజైన్ చేసిన పంచ్ కామెడీని బన్నీ పర్ఫెక్ట్‌గా ప్రజెంట్ చేశాడు. విషయం తెలీకముందు మిడిల్ క్లాస్ కుర్రాడిలోని నైరాశ్యం, విషయం తెలిశాక అల వైకుంఠపురానికి తానే రాజునన్న దర్పం -డిఫరెంట్ షేడ్స్‌ని ప్రజెంట్ చేయటంలో బన్నీ బలంగానే కనెక్టయ్యాడు. అల..కు సూపర్‌హిట్ ఆల్బమ్ సెట్టవ్వడంతో ఆమేరకు డ్యాన్స్‌లు, యాక్షన్ సీన్స్‌లో స్టయిల్.. ఫ్యాన్స్‌కి పిచ్చిగా కనెక్టవ్వడం ఖాయం.
డీజేలో బన్నీతో గ్లామర్ రొమాన్స్ చేసిన పూజాహెగ్దె, వైకుంఠపురములో అల’ బుట్టబొమ్మలానే అందంగా కనిపించింది. బన్నీ-పూజా కాంబో సీన్స్ ఫ్లేవర్ బావుంది. పాత్ర పరిధిదాటని పెర్ఫార్మెన్స్ పూజ ఇస్తే, నిడివి తక్కువైనా నివేదా పేతురాజ్ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
సినిమాకు నిజమైన విలనీ హీరో -మురళీశర్మ. మధ్య తరగతి తండ్రిగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హీరోపై ఆడియన్స్‌లో విపరీతమైన సింపతీని పెంచే -విలనీ మనస్తత్వాన్ని ప్రత్యేకమైన మేనరిజమ్‌తో ప్రదర్శించి మెప్పించాడు. సముద్రఖని సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో విలనీ పాత్రకు వైవిధ్యాన్నిస్తే, జయరాం, సుశాంత్, నవదీప్, సునీల్, రాహుల్ రామకృష్ణ, అజయ్, బ్రహ్మాజీ, రోహిణిలు కథకు నిండుదనం తెచ్చారు. సినిమా మొత్తంలో మెప్పించని పాత్రంటూ ఉంటే అది రీఎంట్రీ ఇచ్చిన టబూదే. పర్ఫెక్ట్ క్యారెక్టరైజేషనే అయినా -వాడిపోయినట్టు నీరసంగా కనిపించిన ఆమెను చూసి జాలివేసిందే తప్ప.. పాత్రతో లీనమయ్యే పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది.
తెరవెనుక విభాగాలూ తమవంతు పాత్ర పోషించి -వైకుంఠపురానికి కొత్త శోభను తీసుకొచ్చాయి. ముఖ్యంగా పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీతో రిచ్‌నెస్ తీసుకొస్తే, విడుదలకు ముందే సంగీతంతో థమన్ సినిమాకు ప్రాణం పోశాడు. సామజవరగమన, రాములో రాముల పాటలు ఆడియో ఎంత హిట్టో.. స్క్రీన్‌పైనా అంతే కనువిందు. కొరియోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్, ఓ సరదా సినిమాకు కావాల్సిన నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమా మొదలైనపుడు కరిసిన వాన.. ముగిసేసరికి వెలిసినంత హాయిగా ఉంది -అల.. వైకుంఠపురములో.

-మహాదేవ