గ్లామర్ రోల్స్ చేయను... నిహారిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా స్టార్ హీరోల వారసత్వంతో ఎక్కువగా హీరోలు మాత్రమే ఎంట్రీ ఇచ్చే తెలుగు సినీ పరిశ్రమలో మొదటిసారి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది నిహారికా.. ‘మెగా ఫ్యామిలీ’ అన్న బ్రాండ్‌వల్ల నిహారిక నటించిన ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. నిహారిక నాగశౌర్యతో కలిసి నటిస్తున్న చిత్రం.. ‘ఒక మనసు’. రామరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిహారికతో చిట్‌చాట్...
సినిమా విడుదలవుతుంది కదా టెన్షన్‌గా వుందా?
- టెన్షన్ అయితే వుంటుంది. ఈ కథను ఎంతో బలంగా నమ్మి చేశాం. ఫైనల్ ఔట్‌పుట్ ఎలా వుంటుంది? ప్రేక్షకుల ఎలా ఆదరిస్తారు అన్న టెన్షన్ వుంది. తప్పకుండా అందర్నీ ఆకట్టుకుంటామన్న నమ్మకంతో ధీమాగా వున్నా.
మీరు హీరోయిన్‌గా రావడానికి కారణం?
- నాకు చిన్నప్పటి నుండి సినిమా అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే మొదట టీవీ, సినిమా ప్రొడక్షన్‌లోకి దిగాను. నటనపై నాకున్న ఇష్టం కూడా యాంకర్‌గా చేస్తున్నప్పుడే బలపడింది. నేను ఇది చేయగలను, చేస్తాను అన్న నమ్మకం కుదిరాకే ఇంట్లో వాళ్లను సంప్రదించా.
ఇంట్లో వాళ్ల రెస్పాన్స్ ఎలా వుంది?
- నేను చిన్నప్పటినుండి సినిమా వాతావరణంలో పెరిగినదాన్ని కనుక ఇక్కడి పరిస్థితులు ఎలా వుంటాయో తెలుసు. నాన్న, పెదనాన్న, బాబాయి అందరూ ఈ విషయాలే మరోసారి గుర్తుచేశారు. అందరూ నీకిష్టమైతే చెయ్ అని అన్నారు. ఇక నేనన్నీ ఆలోచించి హీరోయిన్‌గా వచ్చాను.
అభిమానులనుండి వ్యతిరేకత వచ్చిందా?
- వ్యతిరేకత కాదు. అభిమానులు మొదట భయపడ్డారు. వాళ్లంతా చిరంజీవి, కళ్యాణ్ బాబాయ్‌ని తమ సొంత వాళ్లుగా భావిస్తారు. అలాంటి కుటుంబం నుండి వస్తుండడంతో నన్ను వాళ్లమ్మాయిలాగే భావించి, హీరోయిన్ అంటే గ్లామర్ అనే భయంతో వద్దన్నారు. ఆ తర్వాత నా ఆలోచనలు తెలుసుకుని అందరూ ఒప్పుకున్నారు.
సినిమా గురించి?
- ఇదొక మెచ్యుర్డ్ లవ్ స్టోరీ. నన్నడిగితే ఇలాంటి ప్రేమలు బయట ఎక్కడో కానీ కనిపించవనే చెబుతా. ఇంత స్వచ్ఛమైన ప్రేమను ఒక అందమైన కథగా దర్శకుడు మలచిన విధానం సినిమాకు హైలెట్‌గా ఉంటుంది. ఇలాంటి కథలు ఎప్పుడో కానీ రావు.
మీ పాత్ర?
- నా పాత్ర ఎలా వుంటుందో పూర్తిగా తెలుసుకునే సినిమా ఒప్పుకున్నా. ఆ పాత్రకు ఎంతగానో కనెక్ట్ అయ్యాను. మొదటి సినిమాకే ఇంత బలమైన పాత్రలో నటించే అవకాశం రావడం నా అదృష్టం.
అయితే గ్లామర్ పాత్రలు?
- నాకు స్వతహాగా గ్లామర్ పాత్రలంటే ఇష్టం లేదు. అసలు అలాంటి పాత్రలు చేయదల్చుకోలేదు. మెగా ఫ్యామిలీ బ్రాండ్ నుండి వచ్చినప్పుడు నాకు ఎలాగూ ఒక గుర్తింపు దక్కుతుంది. ఆ తర్వాత కూడా అది సాగాలంటే నాదంటూ ఒక ప్రత్యేకత నిరూపించుకోవాలి. అందుకోసమే నటిగా గుర్తింపు తెచ్చే పాత్రలే చేయాలనుకుంటున్నా.
నాగశౌర్యతో నటించడం?
- అతను ఎవ్వరితోనూ అంత సులువుగా కలిసిపోడు. కలిశాడంటే మాత్రం సరదాగా బాగా మాట్లాడతాడు. సినిమా పూర్తిగా మా ఇద్దరి పాత్రల చుట్టే తిరుగుతుంది. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు బాగా వచ్చాయి. తను ఎంతో సహకారం అందించాడు.
లిప్‌లాక్‌లు ఉన్నాయా?
- అలాంటివేమీ లేవు. ఇదొక మంచి ఫీల్ వున్న ప్రేమకథ. భవిష్యత్‌లో ఏ సినిమాలో కూడా అలాంటి సీన్స్ చేయను. మా ఫ్యాన్స్, కుటుంబమందరూ గర్వపడేలా మంచి నటిగా మెప్పిస్తూ, మంచి సినిమాలు చేయాలనేదే నా కోరిక.
నెక్స్ట్ ప్రాజెక్ట్?
- లేదు.. ఈ సినిమా తర్వాత చూడాలి.

- శ్రీ