బూతు.. కామెడీ అయిపోయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రస్తుతం నిర్మిస్తున్న చిత్రాలలో భారతీయత, మన సంస్కృతి ఎక్కడా కనబడడంలేదు. దర్శక నిర్మాతలందరూ ఓ గిరి గీసుకొని కూర్చున్నారు. మన సంస్కృతిమీద ఆధారపడి బతుకుతున్నవారు ఎందరో వున్నారు. అలాగే సినిమా పరిశ్రమపై ఆధారపడినవారు ఎంతోమంది వున్నారు. సినిమాల ప్రభావం పాత్రలపై పడుతున్నాయి. దానితో ప్రేక్షకులు కూడా ఏదో అర్ధంకాని మత్తులో సినిమాలు చూస్తున్నారు అనిపిస్తోందిది నాకు’ అంటున్నారు అలనాటి అభినేత్రి వాణిశ్రీ. ఇటీవల తమిళనాడులో ఆమెకు అంజలీదేవి అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు తెలిపారు.
శోకరసంలో అంజలి టాప్
చిన్నప్పటినుండి అంజలీదేవి సినిమాలు చూస్తూ పెరిగా. 5వ తరగతిలో ఉన్నప్పుడైతే అంజలీదేవి, జమునల ముఖాలు ఎలా వుంటాయో తెలియదు. కేవలం వారు నటించిన చిత్రాల పాటలను వింటూ పెరిగాను. ఈనాడు అంజలీదేవి అవార్డు నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా వుంది. సువర్ణసుందరి సినిమా వచ్చినపుడు నాకు ఐదేళ్ళు ఉంటాయి. మాయాబజార్‌లో సావిత్రి చేసిన అహనా పెళ్లంట పాట కూడా అప్పుడే విన్నాను. ఇద్దరు బిడ్డల తల్లి అయినా అంజలీదేవి సువర్ణసుందరిగా చేసినా, సీతమ్మగా నటించినా ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి ఆర్టిస్టులు అరుదుగా దొరుకుతారు. ఆ రోజుల్లో ఆమె పెద్ద స్టార్. అంజలీ పిక్చర్స్ పతాకంపై సంవత్సరానికి రెండు సినిమాలు నిర్మించేవారు. ఓ పాత్రలో నటిస్తున్నప్పుడు ఆ పాత్రలో లీనమై చివరి అంచులదాకావెళ్లి నటించి, మళ్లీ మామూలు మనిషి కాగల గొప్ప నటి ఆమె. ముఖ్యంగా శోకరసంలో నటించేటప్పుడు ఆమె వాయిస్‌లో వినిపించే బేస్, మాడ్యులేషన్ ఇప్పటి తరంలో ఎవ్వరికీ లేదు. రంగులరాట్నం చిత్రంలో చివరలో వచ్చే సన్నివేశమే అందుకు ఉదాహరణ. ఆమెలో భారతీయ స్ర్తి ఔన్నత్యం ఉట్టిపడేది.
నా సీనియర్స్
ఇప్పుడు టీవీలలో అనేక పాత పాటలు వస్తుంటే చూస్తాను. అంజలిదేవిగారు ఎంత గొప్ప నటో, దేవిక కూడా అంత గొప్ప నటి. ముఖ్యంగా పాటల్లో ఆమె చూపే హావభావాలు ఎవ్వరూ చూపలేరు. జి.వరలక్ష్మి వాంప్‌గా నటించేది, చంద్రమతిగాను చేసి చూపించేది. ఆమెను ఇమిటేట్ చేయడం చాలా కష్టం. సావిత్రి నటన అనుకరణకు ఈజీగా వుండేది. ఏ సన్నివేశమైనా ఆమె ముఖంపైనే కెమెరా ఉంచేవారు. ఆమె పెదాలు, కళ్ళు, కనుపాపలు మాట్లాడే భాషలను కెమెరాలో బంధించడానికి ప్రయత్నించేవారు. సావిత్రితో నాకు ప్రత్యేకమైన పరిచయం లేకపోయినా దూరం నుండి చూసి నమస్కరించి వెళ్లేదాన్ని. అమ్మమాట, పూజ లాంటి చిత్రాలలో ఆమెతో నటించాను. సావిత్రి సినిమాల్లో నచ్చినట్లుగా బయట నాకు నచ్చేది కాదు. ప్రొఫెషనిజం లేకుండా ఎలాబడితే అలా జడలు వేసుకొని పూలు పెట్టుకొని నటించేసేది. ఆమెకు ఇలా వుండాలి, అలా వుండాలి అని ఎవరూ చెప్పలేదు. వైజయంతిమాల నటన, సావిత్రి డైలాగ్ మాడ్యులేషన్, జి.వరలక్ష్మి విధానం, కన్నాంబ డైలాగ్ మాడ్యులేషన్ లాంటి అనేక విషయాలను నేను పరిశీలించి నా పద్ధతిలో నటిస్తూ వెళ్లాను.
గౌరవమైన ప్రొఫెషన్
నటనని దైవంగా భావించి చేశాను. ముఖ్యంగా ప్రేమించాను. నటీనటులు ఖాళీ సమయాల్లో ఏవేవో మాట్లాడుకుంటూ కూర్చుంటారు. నేను అలా చేయలేదు. ఏదో పుస్తకం చదువుకుంటూ వుండేదాన్ని. మాతృభాష అంటే ప్రాణం.
జంథ్యాల ట్రెండ్
జంథ్యాల ఓ మంచి ట్రెండ్‌ను సృష్టించి వెళ్లారు. ఆయన హాస్య చిత్రాలు నవ్విస్తూనే వుంటాయి. అయితే ఆ తరువాత అనేకమంది ఆయన పంథాలో నడుస్తున్నామంటూ బూతు కామెడీ చిత్రాలు చేస్తున్నారు. సన్నివేశంలో మాటలు వినపడవు. కేవలం బూతులే వినపడతాయి. అది విని మనం నవ్వుకోవాలన్నమాట. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, చింపేశాడు, అంత సీన్ లేదు, అబ్బో సుత్తి, అమ్మో రంపం లాంటి మాటలు ఇప్పుడు బాగా వినిపిస్తున్నాయి. ఇవన్నీ తెలుగు భాషను ఏం చేయబోతున్నాయో అని భయమేస్తుంది.
బాధ్యత లేదా?
అప్పటి దర్శక నిర్మాతలకు సినిమా రూపొందించడంలో ఓ బాధ్యత వుండేది. ఈ సినిమాను వేలమంది చూస్తారని, కనుక వారికి ఓ మంచి చెప్పాలని ఆలోచించేవారు. ఇప్పుడు అలాంటి పద్ధతి ఏదీ కనబడటంలేదు. విస్తర్లు వేసేవారు వేస్తున్నారు, తీసేవారు తీసేస్తున్నారు. మధ్యలో ప్రజలు భోంచేశారా లేదా అని ఎవరూ చూడ్డంలేదు. చక్రవాకం షూటింగ్ సమయంలో మార్కస్ బారట్లే నా ముఖంపై వ్యూఫైండర్ పెట్టి చూస్తున్నారు. ఆయన ఓకె అనేదాకా నేను అక్కడినుంచి కదల్లేదు. పర్లేదు, వెళ్లి కూర్చోమన్నా ఒప్పుకోలేదు. అందుకే వర్క్ పట్ల డెడికేట్‌గా వున్నానని అందరూ భావించేవారు.
అలాంటి దర్శకులు
ఎంతోమంది గొప్ప దర్శకుల దగ్గర పనిచేసే అదృష్టం దొరికింది. కె.బాలచందర్, పుట్టన్న కణగాల్ లాంటివాళ్లతోపాటు నన్ను బాగా ప్రోత్సహించిన బి.విఠలాచార్య లాంటి వాళ్ళు తీర్చిదిద్దిన బొమ్మను నేను. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో విచిత్రబంధంలో నటించాను. ఆయన ఓ సన్నివేశాన్ని ఇలా చెప్పారు. ‘నీకిప్పుడు హీరోమీద చాలా కోపం వుంది. ఆయన రేప్ చేశాడు. నువ్వు అతన్ని చంపేసేయాలన్న కోపంతో వున్నావు. కానీ నీ వయసు రీత్యా ఉన్న కోరికతో అతన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టలేవు. ఆయనపై నీకు ఇష్టం వుంది. అలా నీ ఎక్స్‌ప్రెషన్ వుండాలి’’ అని వివరించి చెప్పారు. అలా చెప్పగల దర్శకులు ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పటివాళ్ళంతా నేను చేయి కదిపితే అలా అవుతుంది, కాలు కదిపితే ఇలా అవుతుందని బీరాలు పలికేవాళ్ళే కనిపిస్తున్నారు.
గోరంతదీపం, అనుగ్రహం
ఈ రెండు చిత్రాల్లో ఓ రకంగా డీగ్లామర్ పాత్రలో నటించాను. దర్శకుడు బాపు భక్తకన్నప్ప చిత్రం తరువాత నా డెడికేషన్ నచ్చి, ‘గోరంతదీపం’ తీస్తే నాతోనే తీస్తానన్నారు. బాపు-రమణలు నా రెమ్యూనరేషన్ ఎక్కువని భయపడినా అలాంటిదేం లేదని చెప్పి నేను నటించాను. కెమెరామెన్ ఇషాన్‌ఆర్య మేకప్ లేకుండా చక్కగా తీయగలడని చెప్పడంతో ఒప్పుకున్నాను.
సేవా కార్యక్రమాలు
నెల్లూరు దగ్గర ఓ హైస్కూల్ నిర్మించి ప్రభుత్వానికి అందించాను. 400 మంది విద్యార్థులు హాస్టల్‌లో వుంటూ చదువుకునేలా ఏర్పాటు చేశాను. జలగం వెంగళరావు వూరు ఖమ్మం జిల్లా బయ్యన్నగూడెంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించాను. కొన్ని చెప్పకుండా చేస్తూనే ఉంటా.
మళ్లీ నటన
ముందే చెప్పాను గదా! ప్రస్తుతం వున్న పరిస్థితుల దృష్ట్యా నాకు అంత ఓపిక లేదు అనిపిస్తుంది. స్వర్ణయుగంలో అడుగుపెట్టాను. స్వర్ణయుగం దాటిపోతున్న కాలంలో రీఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు ఆ పద్ధతులు లేవు, ఆ మనుషులూ లేరు అంటూ ముగించారు.

-శేఖర్