ఇది పూర్వజన్మ సుకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ ఓ వైపు కమర్షియల్ సినిమాలు చేస్తూ మరోవైపు భిన్నమైన సినిమాలు చేస్తున్నారు. ఈతరం నటుల్లో అటు సాంఘికాలు, ఇటు పౌరాణికాలు చేయగల నటుడిగా ఇమేజ్ తెచ్చుకున్నారు. తాజాగా ఆయన నటించిన మరో చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’.
తెలుగువారి వీరత్వాన్ని దేశవ్యాప్తంగా చాటిన శాలివాహన రాజు కథతో తెరకెక్కిన ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాలతో సంక్రాంతి పోటీలో నిలబడ్డ ఈ చిత్రం ఈనెల 12న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బాలకృష్ణతో ఇంటర్వ్యూ...

* మీ నూరవ సినిమా చారిత్రక నేపథ్యం ఉన్న కథతో చేయడానికి కారణం?
- గౌతమిపుత్ర శాతకర్ణి నేను కావాలని నా వందో సినిమాగా ప్లాన్ చేసింది కాదు. వందో సినిమా అంటే ప్రత్యేకంగా ఉండాలని చాలా కథలు విన్నా. అందులో ఈ కథ బాగా నచ్చింది. ఎవ్వరికీ పెద్దగా తెలియని ఒక గొప్ప వ్యక్తి కథను తీస్తున్నామన్న ఆలోచన రాగానే ఒప్పేసుకున్నా. ఇది నా వందో సినిమా కావడం పూర్వజన్మ సుకృతం.
* చారిత్రక సినిమా అంటే రిస్క్ కాదా?
- లేదు. నేనెప్పుడూ ఇలాంటి కొత్తదనమున్న సినిమాలు తీయడం రిస్క్ అనుకోను. ధైర్యంగా ముందడుగు వేస్తేనే ఏదైనా సాధించగలం. మేమందరం ఈ సినిమాను మొదట్నుంచీ బలంగా నమ్మాం. ఇప్పుడు ఫైనల్ ఔట్‌పుట్ చూశాక విజయంపై నమ్మకంతో ఉన్నాం.
* కథలో మీకు నచ్చిన పాయింట్?
- తెలుగుజాతి గర్వించదగ్గ వ్యక్తుల్లో ఒకరు శాతకర్ణి. అలాంటి వ్యక్తి కథ ఎంతమందికి తెలుసు? అలాంటి వ్యక్తి జీవితంలోని రకరకాల భావోద్వేగాలు.. ఇవన్నీ ఆలోచించడంతోనే నాకు చాలా ఉత్సాహం వచ్చేసింది. నాన్నగారు ప్రసాదించిన వరమో ఏమో తెలియదు కానీ, ఇలాంటి సినిమాలు చేయాలన్న ఆలోచన- ఆయనను తలచుకున్నప్పుడల్లా బలపడుతూ ఉంటుంది.
* ఈ పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చేశారు?
- ప్రత్యేకంగా కసరత్తులు అంటూ ఏమీ లేదు. దర్శకుడు క్రిష్ విజన్, నాన్నగారు ఈ సినిమా చేయాలనుకొని ఉండడం.. ఇవన్నీ నన్ను ముందుకు నడిపించాయి. సినిమా చేస్తున్నంతకాలం ఆయన ఎక్కడో ఓ అదృశ్యశక్తిలా నడిపించారనిపించింది. బహుశా ఆ ప్రేరణ లేకపోతే ఈ సినిమా ఇంత సులువుగా చేసేవాడిని కాదేమో!
* దర్శకుడు క్రిష్ గురించి..
- క్రిష్ అద్భుతమైన దర్శకుడు. ఆయన గతంలో చేసిన ఐదు సినిమాలు వేటికవే ప్రత్యేకమైనవి. నా దగ్గరికి వచ్చే దర్శకులు చాలామంది మూసకథలను పట్టుకొస్తూ వుంటారు. క్రిష్ ఇలాంటి కొత్త కథను తీసుకురావడమే ఉత్సాహాన్నిచ్చింది. స్టీవెన్ స్పీల్‌బర్గ్‌తో క్రిష్‌ను పోల్చవచ్చు.
* ఇంత భారీ సినిమా తక్కువ కాలంలో ఎలా..?
- అదంతా టీమ్ ప్లాన్. వారికే ఆ క్రెడిట్. మంచిపని చేస్తున్నప్పుడు పంచభూతాలు సైతం సహకరిస్తాయన్నట్లుగా ఈ సినిమా షూటింగ్ కోసం జార్జియా, మొరాకో లాంటి ప్రాంతాల్లో మాకు ఏమీ ఇబ్బందీ కలుగలేదు. జార్జియాలో అంతటా వర్షం పడినా షూటింగ్ జరిగే ప్రాంతం మాత్రం మామూలుగా ఉండేది. అవన్నీ మనకు సహకరించేవిగానే చెప్పుకోవాలి.
* యుద్ధ సన్నివేశాల కోసం శిక్షణ ఏమైనా..?
- అలాంటిదేం లేదు. గుర్రపుస్వారీ, కత్తి తిప్పడం లాంటివి నేనెప్పుడూ నేర్చుకోలేదు. ఆదిత్య 369, భైరవద్వీపం సినిమాలు చేసేప్పుడు అవసరం అంటేనే చేశా. అదే ఉత్సాహంతో ఇప్పుడు యుద్ధ సన్నివేశాల కోసం ప్రత్యేక శిక్షణ ఏమీ తీసుకోలేదు.
* హేమామాలిని గురించి?
- ఆమెలాంటి గొప్ప నటి మా చిత్రంలో నటించారంటే గర్వంగా ఉంది. నాన్నతో ఓ సినిమాలో చేశారామె. మళ్లీ ఇనే్నళ్లకు తెలుగులో ఓ బలమైన పాత్రలో మెప్పించనున్నారు. శ్రీయ చాలా తెలివైన నటి. కబీర్ బేడీ విలన్‌గా రాణించారు.
* ఔట్‌పుట్ చూశాక ఎలా అన్పించింది?
- కచ్చితంగా నా వందో సినిమా స్థాయికి తగ్గ చిత్రంగా అనిపించింది. మంచి చిత్రం తీశామన్న నమ్మకంతో విజయంపై ధీమాగా ఉన్నాం.
* పోటీగా ఖైదీ 150 వస్తోంది కదా, మీ ఫీలింగ్?
- సంక్రాంతికి సినిమాల మధ్య పోటీ ఎప్పుడూ ఉండేదే.
చిరంజీవికి, నాకు ఈ రెండు చిత్రాలు ప్రతిష్ఠాత్మకమైనవి. రెండు సినిమాలూ విజయం సాధించాలని కోరుకుంటా. ఆయనకు బెస్ట్ విషెస్ చెబుతున్నా.
* తరువాతి చిత్రాలు?
- కృష్ణవంశీతో రైతు సినిమా చర్చలు జరుగుతున్నాయి. వందో సినిమా తరువాత కెరీర్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేయాలనుకున్నా. రాబోయే సినిమాలో ఓ పాత్ర కోసం అమితాబ్‌ను సంప్రదించాం. ఇకపై వచ్చే నా సినిమాలలో కొత్త బాలకృష్ణను చూస్తారు. మరోమాటగా చెప్పాలంటే బాలకృష్ణ శకం మొదలవుతుంది.
* మీ అబ్బాయి ఎంట్రీ ఎప్పుడు?
- ఆ విషయం గురించి ఇప్పుడు ఏమీ చెప్పను.

-శ్రీ