పాటకు దాసుడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్నమైన స్వరధారతో భక్తిని, అనురక్తిని మేళవించి పాటపాడి శ్రోతల మనసులను రంజింప చేసిన ఏసుదాసు నిజంగానే పాటకు, సంగీతానికి దాసుడు. భక్తిపాటకు ఆధ్యాత్మిక సౌరభాన్ని అందించడంలో, సినిమా పాటకు పరిమళాన్ని, శాస్ర్తియ సంగీతానికి గమక సౌందర్యాన్ని అద్ది హృదయాన్ని పులకింప చేయడంలో ఆయనది ప్రత్యేక శైలి.

‘హరివరాసనమ్ విశ్వమోహనం
హరిదధీశ్వరమ్ ఆరాధ్య పాదుకమ్
అరివి మర్దనమ్ నిత్యనర్తనమ్
హరిహరాత్మజమ్ దేవమాశ్రయే’ అంటూ ఆయన ఆలపించిన పాట అయ్యప్ప భక్తులకేకాక ప్రతిఒక్కరి నోటా మంత్రమైపోయింది. షిరిడీ సాయిపై ఆయన పాడినన్ని పాటలు మరొక గాయకుడు పాడలేదు. కర్నాటక సంగీతంలో ప్రావీణ్యం ఉన్న ఏసుదాసు శాస్ర్తియ సంగీతంతో కూడిన పాటలకూ తన గాత్రంతో ప్రాణం పోశాడు.

‘ఆకాశ దేశానా..ఆషాఢమాసాన
మెరిసేటి ఓ మేఘమా..
విరహహమో, దాహమో
విడలేని మోహమో
వినిపించు నా చెలికీ
మేఘసందేశం...మేఘసందేశం’ అంటూ ఆయన ఆలపించిన పాటలో ఉన్న ఆర్తి, తపన శ్రోతల మనసును తాకుతాయి.
‘ముద్దబంతి పువ్వులో మూగబాసలు
మూసిఉన్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే అవుతుంది అన్నివేళలా’ అంటూ ఆయన పాడిన పాట వింటే మనసు వసంతంలోకి వెళ్లిపోతుంది. శాస్ర్తియ సంగీతమైనా, సినీపాటైనా, భక్తిపదమైనా ఆయన స్వరఝరితో పరిపుష్టమై ఆ సినిమాకో కచేరీకో, నాటకానికో వనె్న తెచ్చిన వైనమే ఎప్పుడూ కళ్లకు కడుతుంది. ‘అసెంబ్లీ రౌడీ’లో ‘అందమైన వెనె్నలలోన..’, ‘పెదరాయుడు’లో ‘కదిలే కాలమా..’ పాటలతో శ్రోత కూడా లీనమైపోవడం ఆయన స్వరం గొప్పతనం. ‘స్వరరాగ గంగాప్రవాహం’ అంటూ ఆయన ఆలపించిన పాటలో ప్రతిఒక్కరూ ఓలలాడిపోయారు. తొలిరోజుల్లో గొంతు బాగోలేదని అవకాశాలే ఇవ్వని సినీరంగంలో అడుగుపెట్టాక, దాదాపు దేశంలో వాడుకలో ఉన్న మూడు తప్ప అన్ని భాషల్లోను, ఐదు విదేశీ భాషల్లోనూ కలపి దాదాపు 50వేల సినీ,్భక్తి గీతాలను ఆలపించారు. ఏసుదాసు ఇంత ఎత్తు ఎదగడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. నటుడిగా, బహుభాషా గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, వ్యాపారవేత్తగా బహుముఖ ప్రజ్ఞకు ప్రతీకగా నిలిచిన ఏసుదాసు ‘నారాయణ గురు’ తత్వంతో ‘అంతా ఒక్కటే, సర్వులూ సమానులే’ అన్న మార్గాన్ని అనుసరిస్తారు.
కేరళలోని ఫోర్ట్ కొచ్చిలో జనవరి 10, 1940లో పుట్టారు. తండ్రికి మలయాళ శాస్ర్తియ సంగీతంపై పట్టు ఉంది. ఆయన రంగస్థల నటుడుకూడా. మధ్యతరగతి కుటుంబం కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. చిన్నప్పటి నుంచి కర్నాటక సంగీతం నేర్చుకోవాలన్న తపన ఉండే ఏసుదాసు ఒకరిద్దరు పెద్దల వద్ద చేరారు. కానీ ఫీజులు చెల్లించలేక మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కొంత కాలం తరువాత ప్రఖ్యాత కర్నాటక సంగీత విద్వాంసులు చెంబై వైద్యనాథన్ భాగవతార్ వద్ద శుశ్రూష చేసి సంగీత సాధన మొదలెట్టారు. 1960లో తొలిపాట ఆలపించారు. సినీ నేపథ్య గాయకుడిగా 1961లో మలయాళంలో ‘జాతిభేదం మతద్వేషం’ అన్న పాట ఆలపించి అరంగేట్రం చేశారు. ఆ మరుసటి సంవత్సరం ‘కాల్పడుకల్’ చిత్రంతో సినిరంగంలో పట్టు సాధించారు. 1967లో మలయాళ సినిమా ‘్భర్య’ పాటలు హిట్ కావడంతో ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆయన స్వరంలో గమ్మత్తు ఎందరినో అభిమానులుగా మార్చేసింది. చివరకు 1965లో యుఎస్‌ఎస్‌ఆర్ ప్రభుత్వం ఆయనను సాదరంగా తమ దేశానికి ఆహ్వానించి కార్యక్రమాలు నిర్వహించి సన్మానించింది. సంస్కృతం, మలయ్, అరబిక్, రష్యన్, లాటిన్, ఇంగ్లీషు భాషల్లో ఎన్నో పాటలు పాడిన ఏసుదాసు దాదాపు 10 హిందీ సినిమాల్లో నటించారు. ప్రేమ్‌నజీర్‌తో కలసి ‘అనార్కలి’లో నటించిన ఆయన తాన్‌సేన్ పాత్రలో జీవించారు. ‘చిత్‌చోర్’లో ఆయన పాటలు ఉత్తరాది సినీ ప్రేక్షకులను రంజింపజేశాయి. దేశీయ భాషల్లో అస్సామీ, కాశ్మీరీ, కొంకణి మినహా అన్నింటా పాటలు ఆలపించారు. 1980లో త్రివేండ్రంలో ‘తరంగిణి’ సంగీత సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఆ తరువాత ఆ మ్యూజిక్ స్టూడియోను చెన్నైకు 1992లో తరలించారు. 1998లో అమెరికాలోనూ దాని శాఖను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ వ్యాపార సంస్థలూ నిర్వహిస్తున్నారు. భార్య ప్రభ, తనయులు వినోద్, విజయ్, విశాల్‌తో కూడిన కుటుంబం ఆయనది. వీరిలో విజయ్ సినీ నేపథ్య గాయకుడిగా రాణిస్తున్నాడు.
అవార్డులకు వనె్న
సినీనేపథ్య గాయకుడిగా రంగ ప్రవేశం చేసిన ఏసుదాసును పదేళ్లకే జాతీయ పురస్కారం వరించింది. ఇప్పటివరకు ఆయనకు ఏడుసార్లు జాతీయ ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డులు దక్కాయి. 1972లో తొలిసారిగా మలయాళ సినిమా ‘అచనుమ్ బట్టయమ్’లో పాటకు గాను జాతీయ అవార్డు వచ్చింది. ‘గాయత్రి’ (మలయాళం-1973), చిత్‌చోర్ (1976-హిందీ), మేఘసందేశం (తెలుగు-1982), ఉన్నికలె ఒరు కథ పరయం (1987-మలయాళం), భారతం (మలయాళం-1991), సోపానం (మలయాళం-1993)లలో పాటలకు ఆయనను జాతీయ అవార్డులతో భారత ప్రభుత్వ సత్కరించింది. ఇక ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు అందించిన అవార్డుల సంఖ్య 43. వీటిలో తెలుగులో నంది అవార్డులు నాలుగుసార్లు ఆయనను వరించాయి. 1982లో ‘మేఘసందేశం’లో ‘సిగలో’ పాటకు తొలి నంది అవార్డు దక్కగా 1988లో ‘జీవనజ్యోతి’ సినిమాలో పాటకు, 1990లో ‘అల్లుడుగారు’ చిత్రంలోని ‘ముద్దబంతి పువ్వులో’ పాటకు, 2006లో ‘గంగ’ సినిమాలోని ‘వెళ్లిపోతున్నావా’ పాటకు నంది పురస్కారం లభించింది. ఇక ఐదుసార్లు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకున్న ఏసుదాసుకు శాస్ర్తియ సంగీత కచేరీలు, సన్మానాలు లెక్కకుమిక్కిలే. ఆయన ‘పాట’కు పరవశించిన ప్రభుత్వం 1975లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు ‘పద్మవిభూషణ్’గా ప్రస్తుతించింది.

- రవళి