మణిరత్నం శిష్యురాలిని..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్, రీతికాసింగ్ ప్రధాన తారాగణంగా వైనాట్ స్టూడియోస్ పతాకంపై సుధా కొంగర దర్శకత్వంలో ఎస్.శశికాంత్ రూపొందించిన చిత్రం ‘గురు’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకురాలు సుధా కొంగర చిత్రానికి సంబంధించిన పలు విశేషాలు తెలిపారు.
ఆయనకు నచ్చి..
హిందీ, తమిళ భాషల్లో ఈ సినిమాను మొదట తెరకెక్కించాను. రెండు చిత్రాలకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రాన్ని తెలుగులో చేయాలనుకున్నప్పుడు వెంకటేష్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుందని భావించాను. మొదట ఈ చిత్రాన్ని వెంకటేష్‌తోనే చేయాలనుకున్నా, హిందీ, తమిళ భాషల్లో ముందు చేయడం జరిగింది. రానా ద్వారా వెంకటేష్‌తో మాట్లాడాను. ఆయన సినిమా చూడాలన్నారు. సినిమా చూశాక ఆయనకు బాగా నచ్చింది. రీమేక్ చేయడానికి ఒప్పుకున్నారు. వెంకటేష్ ఈ సినిమా రీమేక్ చేయడానికి ఒప్పుకోకపోతే తమిళ చిత్రమే డబ్బింగ్ రూపంలో వచ్చి ఉండేది.
మేము తెలుగువాళ్ళమే. కానీ చెన్నైలో సెటిల్ అయ్యాం. కొంతకాలం వైజాగ్‌లో విద్యాభ్యాసం చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయాలనుకున్నప్పుడు ముగ్గురు దర్శకుల్లో ఎవరి దగ్గరైనా చేరాలనుకున్నాను. మణిరత్నం చిత్రాలంటే ఇష్టంతో అదృష్టవశాత్తూ ఆయన దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది.
అదే ప్రేరణ
ఓ పేపర్‌లో ఆర్టికల్ చదివి ఈ కథకు ప్రేరణ పొందాను. చెన్నైలోని రాయపురం అనే ప్రాంతంలో తల్లిదండ్రులు పేదవారైనా వారి అమ్మాయిలను బాక్సింగ్ నేర్చుకోవడానికి పంపుతున్నారని ఆ ఆర్టికల్ సారాంశం. ఆ వార్త చదివాక ఏదో ఉద్వేగానికి లోనయ్యాను. 250 రూపాయలుంటే బాక్సింగ్ చేయవచ్చు. బాక్సింగ్ నేర్చుకుంటే క్రీడా కోటాలో ఉద్యోగాలు వస్తాయి. మా జీవితాలు బాగుపడతాయని ఆ తల్లిదండ్రులు భావిస్తారు. ఈ కథ గురించి మరి కొన్ని విశేషాలు సేకరించాను. అనేకమంది బాక్సర్లను, కోచ్‌లను కలిశాను. వారితో మాట్లాడుతుంటే, అనేక వైవిధ్యమైన సంఘటనలు కళ్లముందు కదలాడాయి. అలాంటి నిజమైన సంఘటనలే ఈ చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాను.
ఉద్వేగభరితంగా
మహిళా బాక్సర్లు అంటే సుమో, రెజ్లర్స్ అనే భావం చాలామందికి వుంది. మొదట నాక్కూడా అలాంటి ఆలోచనే వుండేది. కానీ, మహిళా బాక్సర్లపై సినిమా చేస్తానని చెప్పగానే అనేకమంది పెదవి విరిచారు. ఈ కథ గురించి ప్రయత్నం చేస్తుంటే, ఎంతో స్పాన్ వున్నట్లు అనిపించింది. గురు-2, గురు-3 చిత్రాలు చేయడానికి సరిపడినంత సన్నివేశాలు నిజంగా జరిగినవే విన్నాను. వాటి గురించి తెలుసుకుంటూ ఉద్వేగానికి లోనయ్యాను.
ఛాలెంజింగ్‌గా
తమిళంలో మాధవన్‌కు లవర్‌బోయ్, చాక్లెట్ బాయ్ అనే పేర్లు ఉన్నాయి. దాన్ని కాదని ఓ కోచ్‌గా చూపించడం నాకు ఛాలెంజ్ అనిపించింది. తెలుగులో వెంకటేష్ కూడా వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఆయన్ని ఓ రఫ్ యాంగిల్ వున్న కోచ్‌గా చూపించాలనుకోవడం కూడా ఛాలెంజింగ్‌గానే అనిపించింది. నా ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అనేది సినిమా చూసి ప్రేక్షకులే చెబుతారు.
గురు పేరే కరెక్ట్
హిందీలో సాలా ఖద్దూస్ అనే పేరు పెట్టాము. తమిళంలో ‘ఇరుదుసుట్రు’ అనే టైటిల్ పెట్టాం. ఇరుదుసుట్రు అంటే ఫైనల్ రౌండ్ అని అర్థం. అది తమిళ టైటిల్ నెగెటివ్‌గా వుందని వద్దన్నారు. అదే టైటిల్‌తో తమిళంలో విడుదల చేశాం. తెలుగులో మాత్రం గురు అనే పేరే కచ్చితంగా బాగుందనిపించింది.
స్పోర్ట్స్ చిత్రాల అభిమానిగా
స్పోర్ట్స్ ప్రధానాంశంగా వుండే చిత్రాలకు పెద్ద అభిమానిని నేను. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేని అమాయకమైన వ్యక్తులు క్రీడల్లో పాల్గొని విన్నర్‌గా ఎదగడం అనేది ఓ గొప్ప కథాంశం. అది నాకు బాగా నచ్చింది. అందరికీ నచ్చే పాయింటే అని భావిస్తా. భవిష్యత్తులో క్రీడల నేపథ్యంలో కొన్ని సినిమాలు చేయాలని అనుకుంటున్నా. అందులో గురు-2 కూడా వుండవచ్చు.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్
ప్రస్తుతానికి ఏదీ ఫైనల్ కాలేదు. త్వరలో నిర్ణయం జరుగుతుంది అనుకుంటా. తెలుగు, తమిళంలో మంచి పేరున్న హీరోతో సినిమా చేసే ప్రయత్నం చేస్తాను.

-యు