యువ

నెట్టింట కెరీర్ నిచ్చెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నత చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగానే్వషణలో పడిన వారు సరైన సంస్థలో, మంచి ఉద్యోగంలో కుదురుకోవాలంటే ఒకపుడు ఒక బయోడేటా పంపిస్తేనో, సంస్థ ఇచ్చిన ప్రకటన చూసి దరఖాస్తు చేసుకుంటేనో చాలు, ఇంటర్వ్యూకు వెళ్లి జాక్‌పాట్ కొట్టేసేవారు. కాని నేడు పరిస్థితి మారింది. ఉద్యోగం రాగానే సరికాదు. ప్రతిభానే్వషకులకు దగ్గరగా ఉండాలంటే మనం కూడా మార్కెట్ అవసరాలకు తగ్గట్టు, పరిస్థితులకు అనుగుణంగా తీర్చిదిద్దుకోవడమే కాదు, సన్నద్ధత కూడా అవసరమే. ఈ సన్నద్ధతకు నెట్‌వర్కింగ్ అనేది చాలా ముఖ్యం. నలుగురితో స్పష్టంగా సూటిగా, నిక్కచ్చిగా తన అభిప్రాయాలు, భావాలు, లక్ష్యాలు, అభిరుచులు పంచుకోవడం, నిజాయితీగా, నిర్భీతిగా వ్యవహరించడం ఉన్నత స్థానానికి తీసుకుపోయేందుకు నిచ్చెనలా పనిచేస్తుంది. డిజిటల్ ప్రపంచం ఇంతింతై వటుడింతై అన్నట్టు విశ్వరూపం దాల్చడంతో ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. అంటే అమెరికాలో ఉద్యోగాలే కాదు, ప్రపంచం నలుమూలలా అన్ని దేశాల్లో ఉద్యోగాలు, అక్కడి పరిస్థితులు, అవసరాలు, వాతావరణం, ఆహారం, సంస్కృతి, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులను క్షణాల్లో తెలుసుకునే వీలుకలిగింది. దాంతో రిక్రూటింగ్ సంస్థలు సైతం అంతే వేగంగా స్పందించే ఉద్యోగుల కోసం అనే్వషణ చేస్తున్నాయి. ఇందుకు ఇంటర్‌నెట్ అనేది పెద్ద వేదికగా మారింది.
అనే్వషణ
ముందు తన అర్హతలకు తగ్గ, అభిరుచికి తగ్గ అవకాశాల కోసం కొంత కసరత్తు చేయాలి, ఇందుకోసం ఇంటర్‌నెట్‌లో గూగుల్, లింకిడిన్ వంటి పోర్టల్స్‌లో సమాచారాన్ని పరిశీలించాలి. అవకాశాల కోసం అనే్వషించాలి. మార్కెట్‌పై అవగాహన పెంచుకోవాలి, ఏ ఏ సంస్థలు ఏ తరహా ఉద్యోగులను కోరుకుంటున్నారో, ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌కు ఆ సంస్థలు ఏ అర్హతలు అడుగుతున్నాయో తెలుసుకోవాలి, సివిలు రాయడం, ఇంటర్వ్యూలకు సన్నద్ధత , ఇంటర్వ్యూల్లో అడిగే ప్రశ్నలు, ఇంటర్వ్యూ బోర్డు ముందు చేయాల్సిన, చేయకూడని పనులపై కూడా కొంత అవగాహన ఉంచుకోవాలి. వివిధ సివిలను పరిశీలించాలి. సివి రాయడం, అందులో సహజంగా చేసే తప్పులు, అందర్నీ మెప్పించేలా సివిలు రూపొందించడంపై కూడా దృష్టి పెట్టాలి. ఈ మాత్రం కసరత్తు మీరు చేశారంటే చాలు పావు భాగం మీ ప్రయత్నం పూర్తయినట్టే. ఇక సివి రూపొందించి, వివిధ సంస్థల ప్రతినిధులను ఆకర్షించడమే తరువాయి. అందుకు మీరు సన్నద్ధం అయిపోవాలి.
సరైన పంథా
మీ గురించి, మీ అర్హతల గురించి, మీ లక్ష్యాలు, గమ్యాలు గురించి మీకు స్పష్టమైన అవగాహన రాగానే మీరు చేయాల్సిందల్లా మీ గురించి వివిధ సంస్థల దృష్టికి తీసుకురావడం. దానికి అనేక మార్గాలున్నాయి. ముందు మనం చెప్పుకున్నట్టు ప్రకటనలు వచ్చినపుడు దరఖాస్తు చేయడంతో పాటు చాలా సంస్థలు తమ వెబ్ పోర్టల్స్‌లోనే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు ఇస్తున్నాయి. వాటిని పరిశీలించి దరఖాస్తులు పంపడం కూడా ఒక పద్ధతైతే, ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇ మెయిల్ ద్వారా ఆయా సంస్థలకు చేరుకోవడం మరింత ఉత్తమమైన పద్ధతి.
మీరు ఆయా సంస్థలకు లేఖలు రాసేముందు మీరు దరఖాస్తు చేసిన ఉద్యోగానికి సంబంధించిన అవగాహన ముఖ్యం. దానిపై ఏమైనా అనుమానాలున్నా వాటిని ముందే నివృత్తి చేసుకోవాలి. జీతం, నియమనిబంధనలు, కాంట్రాక్టు ఉంటే ఆ వివరాలు పొందాలి. స్పష్టంగా వివరాలు కోరుతూ ఒక లేఖ రాయాలి. దానిని ఇ మెయిల్ చేయవచ్చు. లేకుంటే మన నెట్‌వర్కులో ఉన్న స్నేహితులకు, లేదా సంబంధిత రంగాల్లో పనిచేస్తున్న వారికి లేఖలు రాసి తెలుసుకోవచ్చు. వారి అనుభవాలను కూడా మీరు పరిశీలించడం వల్ల మున్ముందు ఎదుర్కొనే ఆకస్మిక పరిస్థితులపై స్పష్టత ఉంటుంది.
నిజాయితీ
మీరు ఏ పనిచేసినా నిజాయితీ ముఖ్యం. ఒక అభ్యర్ధి గుణగణాలను నేడు చాలా సంస్థలు వారి ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లను చూసి మరో విశే్లషకుల అభిప్రాయాలతో వారి గురించి తేలిగ్గా తెలుసుకుంటున్నాయి. అంతే కాదు, పేరు, ఫోన్ నెంబర్ కొడితే చాలు గూగుల్‌లో క్షణ కాలంలోనే మొత్తం సమాచారాన్ని సేకరించే సదుపాయాలున్నాయి. కనుక మన సివిలో రాసిన వివరాలకు, వ్యక్తిగతంగా మన నైజానికి పొంతన చాలా ముఖ్యం. అన్ని దశల్లో నిజాయితీగా వ్యవహరించిన వారికే మున్ముందు మంచి రోజులుంటాయి. లేకుంటే వారి పని గోవిందా...

- బి వి ప్రసాద్