యువ

సడలని దీక్షతో ‘శిఖర’ స్థాయికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పందొమ్మిదేళ్ల ప్రాయంలోనే లడఖ్‌లోని అత్యంత ఎత్తయిన ‘ఖర్దంగ్ లా’ శిఖరంపైకి మోటార్ బైక్‌పై చేరుకున్న తొలి యువతిగా రియా యాదవ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. దిల్లీలోని ఓ ప్రముఖ కళాశాలలో పొలిటికల్ సైన్స్ (ఆనర్స్) చదువుతున్న ఆమె గత నెల 17న తన ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350’ బైక్‌పై బయలుదేరి ‘ఖర్దంగ్ లా’ శిఖరంపై కాలుమోపి, తిరిగి ఈనెల 1న ఇంటికి చేరుకుంది. ఇటీవలి కాలం వరకూ తనకు బైక్ నడపడం రాదని, ఏడునెలల క్రితం తన తండ్రి ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ను బహుమతిగా ఇచ్చారని ఆమె గుర్తు చేస్తోంది. సోదరుడి సాయంతో బైక్ నడపడం నేర్చుకుని దిల్లీ సమీప ప్రాంతాలకు సరాదాగా వెళ్లేదాన్నని చెబుతోంది. తన తండ్రి బైక్‌ను బహుమతిగా ఇవ్వకపోతే- ‘ఖర్దంగ్ లా’ శిఖరాన్ని అధిరోహించిన ఘనత తనకు దక్కేదికాదని రియా వివరిస్తోంది. లడఖ్‌లోని ఎత్తయిన ‘ఖర్దంగ్ లా’ శిఖరానికి ఎలా చేరుకోవాలన్న సమాచారాన్ని ‘ఫేస్‌బుక్’ ద్వారా సేకరించానని, అనామ్ హషీమ్ అనే 20 ఏళ్ల యువతి ఈ శిఖరానికి గతంలో చేరుకుందని ఆమె తెలిపింది. 18,379 అడుగుల ఎత్తు ఉన్న ‘ఖర్దంగ్ లా’ శిఖరాన్ని బైక్‌పై చేరుకోవడం కష్టసాధ్యమని తెలిసినా, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో తాను అనుకున్నది సాధించానని ఆమె అంటోంది. ‘ఖర్దంగ్ లా’ చేరుకున్న పిన్న వయస్కురాలిగా ఇపుడు తాను సరికొత్త రికార్డును నెలకొల్పానని రియా చెబుతోంది.
‘ఖర్దంగ్ లా’కు బైక్‌పై వెళతానని తాను చెప్పగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు చాలా తేలిగ్గా తీసుకున్నారని, ఆ తర్వాత వారు తన తపనను గుర్తించి అండగా నిలిచారని రియా తెలిపింది. పదమూడు రోజుల పాటు జరిగిన బైక్ యాత్రను తన జీవితంలో మరచిపోలేనని ఆమె ఆనందం వ్యక్తం చేస్తోంది. మనాలి ప్రాంతానికి చేరుకున్నాక టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్ పూర్తిగా పనిచేయకపోవడంతో సెల్‌ఫోన్‌లో పేరెంట్స్‌తో, స్నేహితులతో మాట్లాడేందుకు అవకాశం లేకుండా పోయిందని, ఆ సమయంలో తాను ఏ మాత్రం అధైర్యపడలేదని ఆమె తన అనుభవాలను వివరిస్తోంది. తల్లిదండ్రులను, స్నేహితులను వదిలి తాను ఇంతవరకూ ఎప్పుడూ ఒంటరిగా ఎక్కడికీ వెళ్లలేదని రియా గుర్తుచేస్తోంది. తొమ్మిదో తరగతి చదువుతుండగా ఎన్‌సిసి క్యాంప్‌కు వెళ్లిన అనుభవం తనకు ఇపుడు బాగా ఉపయోగపడిందని అంటోంది. ఎన్‌సిసి క్యాంప్‌కు వెళ్లినపుడు ఒంటరితనంతో తాను ఏడ్చేశానని, అయితే ఇపుడు బైక్ యాత్ర సందర్భంగా ఎక్కడ లేని మనోధైర్యం వచ్చిందని వివరిస్తోంది. ఎత్తయిన శిఖరంపైకి బైక్ మీద వెళ్లడం మరచిపోలేనని, ఇది తన జీవితకాలంలో మధురానుభూతిగా నిలిచిపోతుందని ఆమె అభివర్ణించింది.
మహిళలు ఒంటరిగా బైక్ యాత్ర చేయడం అంత సులువు కాదని, అందులోనూ ఇటీవలే డ్రైవింగ్ నేర్చుకున్న తనకు దారి పొడవునా ట్రాఫిక్ అడ్డంకులు ఎదురయ్యాయని రియా తెలిపింది. ఎన్ని సవాళ్లు ఎదురైనా ‘శిఖరం’పైకి చేరుకోవాలన్న సంకల్ప బలమే తనను ముందుకు నడిపించిందని చెబుతోంది. శిఖరంపైకి వెళుతున్న కొద్దీ శ్వాస సంబంధ సమస్యలు ఎదురైనట్లు, రోజుల తరబడి శిరోజాలకు సంరక్షణ కరవైందని రియా గుర్తుచేస్తోంది. లక్ష్యాన్ని చేరాలనుకున్నపుడు ఇలాంటి ఇబ్బందులు అడ్డంకి కావని ఆమె తెలిపింది. విజయవంతంగా బైక్ యాత్రను పూర్తి చేసి దిల్లీ చేరుకున్నాక సహచర విద్యార్థులు, తమ కళాశాల ప్రిన్సిపాల్ అభినందనల్లో ముంచెత్తడంతో తాను పడ్డ కష్టాన్ని మరచిపోయానంటోంది. ప్రస్తుతం దిల్లీ శివారులోని గుర్గావ్‌లో ఉంటున్న ఆమె వచ్చే ఏడాది బైక్‌పై హిమాలయాల శిఖరాలను చేరుకోవాలని భావిస్తోంది. ఇందుకు ఇప్పటి నుంచే నిరంతర శిక్షణ అవసరమని చెబుతోంది. మొదట్లో తన సోదరుడు బైక్ నడపడంలో మెళకువలు నేర్పించాడని, ఇపుడు తానే అన్నీ తెలుసుకుంటున్నానని రియా తెలిపింది. బైక్ నడపడంలో అబ్బాయిల కంటే అమ్మాయిలు ఏ మాత్రం తీసిపోరని, భవిష్యత్‌లో బైక్‌లు నడిపే యువతుల సంఖ్య కచ్చితంగా పెరుగుతుందని చెబుతోంది. 19 ఏళ్ల వయసులోనే ‘ఖర్దంగ్ లా’ శిఖరాన్ని తాను చేరుకున్నట్లు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్సు నుంచి కొద్దిరోజుల్లో గుర్తింపు లభిస్తుందని రియా తెలిపింది.

చిత్రం.. రియా యాదవ్