హారర్.. గుండె బేజార్?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినీ పరిశ్రమ హారర్ హవాను అరగదీసేసింది. కొత్తగా దర్శకుడి అవతారం ఎత్తాలనుకున్న పదిమందిలో ఐదారుగురు హారర్ స్క్రిప్ట్ బౌండ్ చంకలో పెట్టుకుని నిర్మాతలను వెతుకులాడటం పరిపాటిగా మారుతోంది. కథతో నిర్మాతను భయపెట్టగలిగితే -చాన్స్ దెయ్యం పట్టినట్టు పట్టేసినట్టే. సినిమా నిర్మాణంలో అత్యంత కష్టమైన జోనర్ హారర్ అన్న పరిస్థితి నుంచి -డెవిల్ చుట్టూ కథల్లుకుంటే డైరెక్ట్‌గా డైరెక్టర్ అయిపోవచ్చన్న పరిస్థితి కనిపించింది. ఒకవిధంగా హారర్ జోనర్ కొత్త దర్శకులకు సేఫ్ జోనరైంది. అలా ప్రేక్షకుడికి హారర్ చిత్రాలు అందించడంలో ఆరితేరిపోయిన తెలుగు పరిశ్రమ -చింత చెట్టుమీద నుంచి కిందకు దిగడం లేదు.
ఆడియన్స్ హారర్ రుచి మరిగిన విషయాన్ని అర్థం చేసుకున్న నిర్మాతలు, దర్శకుడు -సరైన ప్రయత్నంతో డెవిల్‌నే ధనలక్ష్మిని చేసుకోగలిగారు. తరువాత సీన్ మారింది. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు -హారర్‌పై సరైన అవగాహన లేకుండా, తగిన సాంకేతిక వర్గాన్ని సిద్ధం చేసుకోకుండా దెయ్యాన్ని అమ్ముకోవాలనుకున్న చాలామంది కెరీర్ శ్మశానమైపోయింది. గత ఐదారేళ్లలో ఆడియన్స్‌ను భయపెట్టేందుకు హారర్ చాత్రాలు లెక్కలేనన్ని వచ్చేశాయి. అలవాటైన దెయ్యాలు, పిశాచాలనో చూడ్డానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడంతో ‘హారర్’ జోనర్ సీన్ రివర్సైంది. రమ్యకృష్ణ, సుమన్ నటించిన ‘నీలాంబరి’ డబ్బింగ్ సినిమా విజయంతో హారర్ హవా ఊపందుకుంది. అంతకుముందు కొద్దో గొప్పో విజయం సాధించినా, హారర్ బేస్ట్ కథలు అల్లుకోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఓ మైగాడ్, ఆదివారం అమావాస్య, సాహసం సేయరా ఢింబకా, అడివి, పిశాచి, వసుధైక, ఆనందిని, త్రిపుర, దెయ్యాల రాత్రి, మోక్ష, కల్పనా గెస్ట్‌హౌస్, అత్తారిల్లు, హిస్‌స్‌స్..., 12వ అంతస్తు, ఉసురు, దెయ్యాలవీధి లాంటి చిత్రాలకేకాక మరెన్నో చిత్రాలు ప్రేక్షకులకు హారర్ రుచిని చూపించే ప్రయత్నం చేశాయి. కొద్దో గొప్పో భయపెడుతూ హాస్యాన్ని రంగరించి మారుతి రూపొందించిన ప్రేమకథా చిత్రం హిట్టవ్వడంతో, ఆ జోనర్‌వైపు అందరూ మారారు. హారర్‌లో కామెడీ మిక్స్ చేసి రూపొందించిన కథనం అద్భుతంగా పేలడంతో అటువంటి కథలనే అందరూ రాసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఏడాదీ హౌస్, హారర్ లవ్‌స్టోరీ, లంక, దెయ్యాలమేడ, చిత్రాంగద, ఉసురు, అవంతిక, ఇదేం దెయ్యం, నాగభైరవి, పిశాచి, దృశ్యకావ్యం, రాక్షసి, సైతాన్‌లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఈ చిత్రాల్లో అందాల నాయిక రాశి సెకండ్ ఇన్నింగ్స్‌గా చేసిన లంక చిత్రంపై అంచనాలు ఉండేవి. అలాంటిది ఆ చిత్రానికీ ఆదరణ కరవైంది. అలాగే అంజలి నటించిన గీతాంజలి సినిమా హిట్ అవ్వడంతో అదే రేంజ్‌లో చిత్రాంగద నిర్మించారు. ఇదీ ప్రేక్షకులకు రుచించలేదు. పూర్ణ నటించిన అవంతిక అదే దారిలో మాయమైపోయింది. అవును సీరీస్‌లో వచ్చిన చిత్రాల్లో ఒకింత వైవిధ్యమైన కథనం ఉండటంతో, ప్రేక్షకులు ఓకే అనేశారు. అలాగే రాజుగారి గది చిత్రాన్నీ వైవిధ్యంగా రూపొందించడంతో ఆదరించారు. అదే, సీక్వెల్‌గా రాజుగారి గది-2 నిర్మాణానికి కారణమైంది. ఇందులో నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తుండడంతో విశేషం సంతరించుకుంది.
హారర్‌కు ఆటుపోట్లు ఎదురవుతున్నా -తెలుగు సినిమా పరిశ్రమ దెయ్యాన్ని పట్టుకుని వీడటం లేదు. రాఘవ లారెన్స్ రూపొందించిన హారర్ సీరీస్ ముని, కాంచన, ముని-2 లాంటి చిత్రాలు విజయవంతం కావడమే ఇందుకు కారణం. రాజుగారి గది, అవును లాంటి చిత్రాలు కలెక్షన్లు రాబట్టడం కూడా దీనికి కారణం. ఈ సినిమాల విజయానికి, చాలా సినిమాలు పడిపోడానికి కారణమేంటి? అన్నది ఆలోచిస్తే స్క్రిప్టే ప్రధాన సమస్య అంటున్నారు నిపుణులు. హారర్ పేరిట కథలు రాస్తున్నారే తప్ప, అందులో ఆ జోనర్ సన్నివేశాలూ ఒక్కటీ ఉండటం లేదన్నది ఆలోచించాల్సిన విషయం. కేవలం టైటిల్స్‌తో థియేటర్‌లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, కథలపై కసరత్తు చేయడం లేదన్నది మరో ముఖ్యాంశం. హారర్ జోనర్ చిత్రాలకు కథ ఒక ఎత్తు, దాన్ని స్క్రీన్‌పై ఆవిష్కరించడం మరో ఎత్తు. ఎలాంటి అనుభవం లేకుండానే హారర్ జోనర్‌ను టచ్ చేసి, కొత్త దర్శకులు దెబ్బతింటున్నారన్న వాదన పరిశ్రమలో వినిపిస్తోంది. దీంతో చాలా హారర్ చిత్రాలు -మార్నింగ్ షో నుంచే ముగిసిపోతున్నాయి. హారర్‌లో ఏదోక వైవిధ్యాన్ని చూపిస్తే తప్ప, ప్రేక్షకుడు మళ్లీ సంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితిలో లేడు. ఈ పరిస్థితుల్లో రొటీన్‌కు భిన్నమైన కథలు తెచ్చుకుని సాంకేతిక విలువలపై దృష్టిపెట్టడం వినా, హారర్ చిత్రాల హిట్టుకు మరో మార్గం లేదన్నది వాస్తవం. మరీ ప్రధానంగా పాతిక లక్షలు పట్టుకుంటే హారర్ సినిమా తీసేయొచ్చన్న ఆలోచనల్లో మార్పొస్తేనే -దెయ్యం మళ్లీ బతికి బట్టకట్టేది.

-శేఖర్