మంచిని పంచేది సినిమాయే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమాల ద్వారా మాత్రమే జీవితాన్ని చిత్రీకరించి చూపించగలిగే అవకాశం ఉంటుందని, భాషలకు అతీతంగా మంచిని పంచేది సినిమా మాత్రమేనని సినీ సంగీత దర్శకుడు, నటుడు ఆర్‌పీ పట్నాయక్ అన్నారు. ఒక ప్రాంతంలో పుట్టి, పెరిగితే ఆ ప్రాంత ప్రభావం, అక్కడి పరిస్థితులు మాత్రమే పిల్లలకు తెలుస్తుందని, కానీ సినిమాల ద్వారా అన్ని ప్రాంతాల సంస్కృతి, జీవన విధానంపై పిల్లలకు అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలలో భాగంగా బుధవారం వరంగల్ రూరల్ జిల్లా యంత్రాంగం కాజీపేటలోని భవానీ థియేటర్‌లో ఏర్పాటు చేసిన బాలల చలన చిత్రోత్సవాలను సంగీత దర్శకుడు ఆర్.పీ పట్నాయక్, వర్ధమాన నటి హిమాన్షిచౌదరి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడుతూ సినిమాలలో హింసను, చెడును ప్రోత్సహించేలా చూపిస్తున్నారనే అపోహ ప్రజల్లో ఉందని, కానీ చెడును చూస్తేనే మంచితనం తెలుస్తుందని అన్నారు. చెడుపై మంచితనం ఎలా గెలుస్తుందని తెలిపేదే సినిమా సారాంశంగా చెబుతూ సినిమాలలో రాముడు, రావణుడు అనే రెండుపాత్రలు ఉంటాయని, రావణుడిని పక్కన పెట్టి రాముడిని ఆదర్శంగా స్వీకరించాలని ఆయన విద్యార్థులకు సూచించారు. చెడుపై మంచి గెలవడాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ మంచి తాను కావాలనే అభిప్రాయం పిల్లలలో ఏర్పడాలని, ఆ ప్రయత్నం సినిమాలు చేస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు మొదట ముంబైలో జరిగాయని, ఆ తరువాత ఈ చిత్రోత్సవాలు క్రమక్రమంగా దేశంలోని చెన్నై, కోల్‌కత్తా, బెంగళూరు, భువనేశ్వర్, త్రివేండ్రం, ఉదయ్‌పూర్, హైదరాబాద్‌లో వరుసగా జరిగాయని అన్నారు. 1993లో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల వేడుక విజయవంతం అవటంతో 1997 నుంచి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు హైదరాబాద్ శాశ్వత వేదికగా మారిందని చెప్పారు. హైదరాబాద్‌లో జరిగే అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల వేడుకను తెలంగాణ ప్రభుత్వం ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం, పిల్లలను ఈ వేడుకల్లో భాగస్వాములను చేయడం అభినందనీయమని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా జాతీయ, అంతర్జాతీయ ఉత్తమ బాలల చిత్రాలు చూసేందుకు స్థానికంగా పిల్లలకు అవకాశం ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హరిసింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గోలి విఠల్ (ఆంధ్రభూమి బ్యూరో, వరంగల్)