సినీ ప్రస్థానంలో తెలంగాణ వైభవం నాందీ ప్రస్తావన (ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని ఎలుగెత్తి చాటారు సుప్రసిద్ధ కవి దాశరధి రామకృష్ణమాచార్య. ఆ వీణలో ఒక తీగెగా తెలంగాణ సినీ ప్రముఖుల ప్రస్థానం వుండి తీరుతుంది. సామాన్య జనానికి అందుబాటులో వుండి ప్రభావితం చేసే ముఖ్య అంశం చలనచిత్రం. తెలంగాణ గడ్డపై జన్మించి వివిధ శాఖలలో సినీ పరిశ్రమకు విశిష్ట సేవలందించిన ప్రముఖులను రేఖామాత్రంగా పరిచయం చేసే ప్రయత్నమే ఈ వ్యాసం.
చిత్ర నిర్మాణం పూర్తయిన తర్వాత దానిని ప్రజల వద్దకు చేర్చే ప్రయత్నంలో పంపిణీ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తుంది. దీనినే డిస్ట్రిబ్యూషన్ అంటాం. తెలుగు సినిమాకు ఈ విభాగంలో మూడు ముఖ్య కేంద్రాలు. ఒకటి విజయవాడ, రెండు గుంతకల్లు, మూడు సికిందరాబాద్. ప్రముఖ పంపిణీ సంస్థల (విజయ, పూర్ణా, నవయుగ) కార్యాలయాల బ్రాంచీలు సికిందరాబాద్ కేంద్రంగా పనిచేసేవి. ఇక షూటింగ్‌లకు సంబంధించి హైదరాబాద్ వాతావరణం ఉత్తమమైనదిగా భావించేవారు. ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు షూటింగ్ జరుపుకునేందుకు ఇక్కడి ప్రకృతి వాతావరణం దోహదం చేసేది. గడ్డం ధరించి వేసవిలో షూటింగ్‌లో పాల్గొనాలంటే మాకు నరకం కనిపించేది. హైదరాబాద్‌లో చెమట పట్టదు, హాయిగా వుంటుంది అన్నారు గుమ్మడి వెంకటేశ్వరరావు. ‘ఆ వంక జూబిలీ హాలు, ఈవంక అసెంబ్లీ హాలు, కళకళలాడే హుసేన్‌సాగర్, దాటితే సికిందరాబాద్’ అని అభివర్ణించారు సి.నారాయణరెడ్డి. టాంక్‌బండ్, బుద్ధవిగ్రహం, వరంగల్‌లోని రామప్ప దేవాలయం - ఇవన్నీ చిత్రీకరణకు అవసరమైన సుందర ప్రదేశాలే. వసతి సౌకర్యాలు కూడా బడ్జెట్‌కు తగ్గట్టుగా జంటనగరాల్లో లాడ్జీలు ఉన్నాయి.
ప్రత్యేక అంశం
లకిడీకాపూల్ బ్రిడ్జి దాటాక ఆస్మాన్ మహల్ అనే భవంతి ఉండేది. ప్రముఖ రచయిత కె.ఎ.అబ్బాస్ అదే పేరుతో 1965 ప్రాంతాల్లో ఒక చిత్రం నిర్మించారు. పూర్తి ఇండోర్‌లో సహజమైన
వాతావరణంలో షూటింగ్ అంతా అస్మాన్ మహల్‌లోనే జరిగింది. ఆ చిత్రంలో పృధ్వీరాజ్ కపూర్, దిలీప్ రాజ్ (పైడి జయరాజ్ కుమారుడు) ప్రధాన పాత్రలు పోషించారు. ‘కార్లొవీ’ చిత్రోత్సవంలో పృధ్వీరాజ్ కపూర్ నటనకు పురస్కారం లభించింది. హైదరాబాదీయులు నిర్మించిన స్టూడియోలు సదరన్ మూవీటోన్ (తర్వాత జహనామాగా పేరు మార్చారు). అజంతా స్టూడియోలో చిత్రాలు నిర్మించారు. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో తెలుగు చిత్రాలతో బాటు హిందీ, తమిళ చిత్రాలు కూడా రూపుదిద్దుకోవడం చెప్పుకోదగ్గ అంశం.
అభినయ రంగం
సినిమా అంశాలలో ముందుగా ప్రస్తావించవలసినది నటనా రంగం. నటీనటులే ముందుగా ప్రేక్షకులకు చేరువయ్యేది. ఈ విభాగాల్లో ముందుగా పేర్కొనవలసిన వ్యక్తి పైడి జయరాజ్. 1909లో కరీంనగర్‌లో జన్మించిన జయరాజ్ హైదరాబాద్‌లో నటన నేర్చుకుని 1929లో బొంబాయి చేరి మాతృభూమి, మహాసాగర్, మోతీ వంటి ఓ పది మూకీ చిత్రాల్లో నటించారు. ఆయన నటించిన తొలి టాకీ చిత్రం ‘షికారి’. అల్లాఉద్దీన్, టిప్పుసుల్తాన్ వంటి శతాధిక చిత్రాల్లో నటించిన జయరాజ్‌ను 1981వ సంవత్సరంలో దాదా ఫాల్కే పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. ఆ తరువాత చెప్పుకోదగ్గ వ్యక్తి టి.ఎల్.కాంతారావు. కోదాడ తాలూకాలో 1923లో జన్మించిన తాడిపల్లి లక్ష్మీకాంతారావు ‘నిర్దోషి’ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసి ప్రతిజ్ఞ (1953)లో కథానాయకునిగా రాణించి దాదాపు 400కు పైగా జానపద, పౌరాణిక, సాంఘిక చరిత్రాత్మక చిత్రాల్లో రాణించారు. జానపద బ్రహ్మ విఠలాచార్య తీసిన పలు జానపద చిత్రాల్లో ఆయన్ను కత్తివీరుడుగా గుర్తింపు పొందారు. 15 చిత్రాల్లో నారదునిగా నటించడం ఒక రికార్డు. నిర్మాతగా మారి సప్తస్వరాలు, గండరగండడు, గుండెలు తీసిన మొనగాడు, ప్రేమజీవులు, స్వాతిచినుకులు రూపొందించారు.
హైదరాబాద్‌లోని పారవౌంట్ ధియేటర్‌కు మేనేజర్‌గా పనిచేసిన ఆర్.నాగేశ్వరరావు ఆరడుగుల ఆజానుబాహుడు. ‘సంక్రాంతి’ (1953) సినిమాతో రంగప్రవేశం చేసి రాజు-పేద, అగ్గిరాముడు, దొంగరాముడు వంటి ఓ ముప్పయి చిత్రాల్లో ప్రతిభావంతునిగా రాణించి 1959లో మరణించాడు.
హైదరాబాద్‌లో నాటకాలాడి స్ర్తి పాత్రను పోషించి బూర్గుల రామకృష్ణారావుగారి చేతులమీదుగా వెండి షీల్డును అందుకున్న త్యాగరాజు విలన్‌గాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగాను రాణించారు. మంచి మనిషి చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసిన ఆయన ‘రంగుల రాట్నం’లో ఉదాత్త భూమిక పోషించారు.
తెలంగాణ సినీ యవనికపై డాక్టర్ ఎం.ప్రభాకరరెడ్డిది ఒక ప్రత్యేక ప్రకరణం. 1935లో నల్గొండ జిల్లా తుంగతుర్తిలో జన్మించిన ప్రభాకరరెడ్డి నాటక రంగంపై రాణించి రామినీడు దర్శకత్వంలోని ‘చివరకు మిగిలేది’ చిత్రంలో సహజమైన డాక్టర్ పాత్ర పోషించారు. ఆ తరువాత వందలాది చిత్రాల్లో రాణించి కథా రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. సుమారు ఓ పాతిక చిత్రాలకు కథలందించిన (పండంటి కాపురం, కార్తికదీపం మొ.) ప్రభాకరరెడ్డి సుమారు 20 చిత్రాలను నిర్మించి మండలాధీశుడు, గండిపేట రహస్యం, ప్రచండ భారతం వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన వివిధ సంఘాలలో కీలక పదవులు పోషించి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారు. భూపాల్‌రెడ్డి కీలక పాత్ర పోషించిన చిత్రం ‘దాసి’. ఖమ్మం జిల్లాలో జన్మించిన బాబూమోహన్ కొంతకాలం రెవెన్యూ శాఖలో పనిచేసి ఈ వ్యాసకర్త సహాయ దర్శకునిగా పనిచేసిన ‘ఈ ప్రశ్నకు బదులేది?’ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసి శతాధిక చిత్రాల్లో విలక్షణ హాస్య భూమికను పోషించారు. కోదాడలో జన్మించిన వేణుమాధవ్ మిమిక్రీ కళాకారునిగా జీవితం ప్రారంభించి తొలిప్రేమ, పోకిరి వంటి శతాధిక చిత్రాల్లో హాస్యనటునిగా రాణించి హంగామా, భూకైలాస్, ప్రేమాభిషేకం వంటి చిత్రాల్లో కథానాయక పాత్రను పోషించారు. నిజామాబాద్‌లో 1983లో జన్మించిన నితిన్, తేజ తీసిన ‘జయం’ చిత్రం ద్వారా హీరోగా అరంగేట్రం చేసి ఫిలింఫేర్ పురస్కారాన్ని అందుకున్నారు. హైదరాబాద్‌లో 1985లో జన్మించిన నిఖిల్ సిద్దార్థ, స్వామిరారా, హ్యాపీడేస్ చిత్రాల్లో హీరోగా రాణించారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలమూరులో జన్మించిన విజయ్ దేవరకొండ చిత్రాల్లో ఎవడే సుబ్రమణ్యం, జాతీయ స్థాయిలో పురస్కారం పొందిన పెళ్లిచూపులు చెప్పుకోదగ్గవి. ప్రభుత్వ ఉన్నత అధికారిగా, తెలుగు భాషాభిమానిగా సాంస్కృతిక రంగానికి పట్టుగొమ్మగా వినుతికెక్కిన డా. కె.వి.రమణాచారి దేవస్థానం,
సాయిబాబా చిత్రాల్లో నటుడిగా రాణించారు.
దర్శక దర్పణం
చిత్ర నిర్మాణంలో కీలక భూమిక దర్శకునిదే. ఆయన్ని కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. కరీంనగర్‌లో జన్మించిన బి.ఎస్.నారాయణ కొంతకాలం అనుపమ తిలక్ వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సంపాదించి ‘మాంగల్యం’ (1960) చిత్రంతో దర్శకులుగా మారారు. ఆయన దర్శకత్వంలో సుమారు డజను చిత్రాలు రాగా వాటిలో ‘ఊరుమ్మడి బ్రతుకులు’ చిత్రానికి రాష్ట్రం నుంచి, కేంద్రం నుంచి పురస్కారాలు లభించాయి. నిమజ్జనం చిత్రానికి 1984లో కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. నల్గొండలో జన్మించిన జి.వి.ప్రభాకర్ గిడుతూరి సూర్యం వద్ద పాఠాలు నేర్చుకుని, ఈ వ్యాసకర్త సంభాషణలు వ్రాసిన ‘కలవారి కుటుంబం’ చిత్రానికి 1972లో దర్శకత్వం వహించారు. వీరి మరో చిత్రం అగ్ని సంస్కారం. సికిందరాబాద్‌లో జన్మించిన బి.్భస్కరరావు దర్శకునిగా తొలి చిత్రం మనుషులు - మట్టిబొమ్మలు. దీనికి ఉత్తమ ద్వితీయ చిత్రంగా నంది పురస్కారం లభించింది. తరువాత ప్రభాకర్‌రెడ్డి ప్రోత్సాహంతో పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1951లో హైదరాబాద్‌లో జన్మించిన కె.వాసు (ప్రత్యగాత్మగారి అబ్బాయి) పక్కింటి అమ్మాయి, గోపాలరావుగారి అమ్మాయి, ప్రాణం ఖరీదు వంటి పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌లోని అల్వాల్‌లో 1934లో జన్మించిన శ్యాంబెనగల్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ దర్శకునిగా పలు పురస్కారాలు అందుకున్నారు. ఫిలిం సొసైటీ ఉద్యమ రూపకర్తల్లో ఒకరైన శ్యాం బెనెగల్ రూపొందించిన తెలుగు చిత్రం ‘అనుగ్రహం’ (1978). 1946లో మెదక్ జిల్లాలో పుట్టిన బి.నరసింగరావు, ఫిలిం సొసైటీ ఉద్యమం పట్ల ఆకర్షితులై నిర్మాతగా మారి గౌతమ్ ఘోష్ దర్శకత్వంలో తెలంగాణ భూపోరాటం నేపథ్యంతో ‘మాభూమి’ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రానికి సుద్దాల హనుమంతు, గద్దర్ గీతాలు వ్రాయడం చెప్పుకోదగ్గ విశేషం. తరువాత దర్శకునిగా మారి ప్రధాన పాత్ర పోషించి తీసిన చిత్రం ‘రంగుల కల’. వీరి ఇతర చిత్రాలు దాసి, మట్టిమనుషులు, ఆకృతి, హరివిల్లు. పలు జాతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పలు హోదాలలో పాల్గొన్న నర్సింగరావును 2010 సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం బి.ఎన్.రెడ్డి పురస్కారంతో సత్కరించింది. వరంగల్ జిల్లా రామపల్లిలో జన్మించిన టి.కృష్ణ కొంతకాలం ఆదుర్తి సుబ్బారావు వద్ద దర్శకత్వ శాఖలోనూ, ఎడిటర్‌గాను పనిచేసి 1967లో ‘అపాయంలో ఉపాయం’ చిత్రంతో దర్శకునిగా పరిచయమయ్యారు. ఈయన తీసిన చిత్రాల్లో చెప్పుకోదగ్గది ‘ఖైదీ బాబాయ్’. వరంగల్‌కు చెందిన టి.మాధవరావు కూడా ఆదుర్తి వద్ద పనిచేసి తర్వాత నాలుగు చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిల్లో చెప్పుకోదగ్గది తెలంగాణ నేపథ్యంతో కూడిన ‘చిల్లర దేవుళ్లు’. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పనిచేసిన లక్ష్మీదీపక్ గుత్తా రామిరెడ్డి వద్ద సహాయకునిగా తర్ఫీదు పొంది 1971లో వచ్చిన పచ్చని సంసారం ద్వారా దర్శకునిగా మారారు. వారు తీసిన చిత్రాల్లో ఉదాత్తమైనది ‘పండంటి కాపురం’ (1971). దీనికి ఉత్తమ ప్రాంతీయ చిత్ర పురస్కారం లభించింది. 1962లో మెదక్ జిల్లాలో జన్మించిన అల్లాణి శ్రీధర్ - బి.నర్సింగరావు, దాసరి నారాయణరావు వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసి తొలిసారిగా తెలంగాణ పోరాట యోధుడు కొమురం భీమ్ జీవిత చరిత్రను అదే పేరుతో చిత్రాన్ని రూపొందించారు. ఆ చిత్రానికి జాతీయ సమైక్యతా పురస్కారం లభించింది. ప్రస్తుతం ‘నేను సరోజ’ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. 1965లో నల్గొండలో జన్మించిన ఎన్.శంకర్ 1997లో కృష్ణ ప్రధాన పాత్ర పోషించిన ‘ఎన్‌కౌంటర్’ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమయ్యారు. వీరి ఇతర చిత్రాలు శ్రీరాములయ్య, యమజాతకుడు, జయం మనదేరా, భద్రాచలం, ఆయుధం, తెలంగాణ ప్రధానాంశంగా రూపొందిన ‘జై బోలో తెలంగాణ’ చిత్రానికి ఉత్తమ దర్శకునిగా నంది పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం సునీల్ హీరోగా 2 కంట్రీస్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేసిన శేఖర్ కమ్ముల అమెరికాలో సినిమా టెక్నిక్స్ నేర్చుకుని రూపొందించిన చిత్రం ‘డాలర్ డ్రీమ్స్’. తెలుగులో వీరి తొలి చిత్రం ‘ఆనంద్’. ఆ తరువాత గోదావరి, లీడర్, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ వంటి చిత్రాలు అందించారు. కథానాయిక చేత తెలంగాణ మాండలికంలో సంభాషణలు పలికించిన ‘్ఫదా’ చిత్రం ప్రేక్షకుల్ని ఫిదా చేసింది. ఖమ్మంకు చెందిన దశరథ్ విద్యాధికుడు. యండమూరి వీరేంద్రనాథ్ వద్ద రచనలో మెళకువలు గ్రహించి నాగార్జున హీరోగా ‘సంతోషం’ సినిమాతో దర్శకునిగా అరంగేట్రం చేసి హిట్ కొట్టారు. నంది పురస్కారం అందుకున్నారు. ఉప్పలపాటి నారాయణరావు వద్ద పనిచేసిన హైదరాబాద్ వాసి చంద్ర సిద్దార్థ దర్శకత్వంలో రూపొందిన ప్రయోజనాత్మక చిత్రం ‘ఆ నలుగురు’. మహబూబ్‌నగర్ వాసి మద్దాలి వెంకటేశ్వర్‌రావు స్వీయ దర్శకత్వంలో రూపొందించిన తొలి చిత్రం ‘చదువుకోవాలి’.
సాహితీ విన్యాసం: తొలి తెలుగు టాకీ చిత్రం ‘్భక్తప్రహ్లాద’కు రచన చేసిన కేశవదాసు తెలంగాణలోని జక్కేపల్లి గ్రామంలో జన్మించారు. నాటక రచనలో పేరొందిన కేశవదాసు రాసిన గీతాలు శ్రీకృష్ణ తులాభారం, సతీసక్కుబాయి వంటి చిత్రాలలో ఉపయోగించుకున్నారు. వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించిన దాశరథి రంగాచార్య, తెలంగాణ గ్రామీణ జీవితానికి అద్దం పట్టిన ‘చిల్లర దేవుళ్లు’ అనే నవలను చలనచిత్రంగా టి.మాధవరావు దర్శకత్వంలో రూపొందించారు. వీరి సోదరుడు దాశరథి కృష్ణమాచార్య వ్రాసిన లలితగీతాలు (వెలిగించవే చిన్ని వలపుదీపం, తలనిండ పూదండ) ఘంటసాల నోట పల్లవించాయి. వీరు వ్రాసిన ‘అగ్నిధార, గాలిబ్ గీతాలు’ ఎంతో ప్రాచుర్యం పొందాయి. 1961లో ‘ఇద్దరు మిత్రులు’ చిత్రం ద్వారా గీత రచయితగా సినీ రంగప్రవేశం. దాదాపు 500 సుమధురమైన గీతాలు వ్రాశారు. ఆకాశవాణిలో ఉన్నతోద్యోగం చేసిన వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్థానకవిగా గౌరవాన్ని అందుకున్నారు. 1931 జూలై 29న వేములవాడలోని హన్మాజీపేటలో జన్మించిన మహాకవి సి.నారాయణరెడ్డి తెలుగు సాహిత్యానికి సినీ సాహిత్యానికి విశిష్ట సేవలందించారు. దాదాపు అన్ని సాహిత్య ప్రక్రియలలోనూ (నవల, నాటకం, కథ, గేయం, కవిత, సినీ గీతాలు, గజల్స్) అద్భుత సాహిత్య సృష్టి చేశారు. ‘గులేబకావళి కథ’లో సినీ కవిగా రంగప్రవేశం చేసి రికార్డు స్థాయిలో దాదాపు మూడువేల సినీగీతాలు వ్రాశారు. వీరి రచన ‘విశ్వంభర’కు అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ్ లభించింది. అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతిగా, రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షునిగా, సారస్వత పరిషత్ అధ్యక్షునిగా విశిష్ట సేవలందించడమే గాక రాజ్యసభ సభ్యునిగా ఆరు సంవత్సరాల పాటు పార్లమెంటులో తెలుగువారి వాణిని వినిపించారు. ‘అమాయకుడు’ చిత్రంలో ‘పట్నంలో సాలిబండ’ గీతంతో ప్రాచుర్యం పొందిన వేణుగోపాల్ తెలంగాణవాసి. భువనగిరి తాలూకా యాదాద్రిలో జన్మించిన సుద్దాల అశోక్‌తేజ ఉపాధ్యాయునిగా రాణించి ‘నమస్తే అన్న’ చిత్రం ద్వారా గీత రచయితగా పేరొంది వందలాది గీతాలు వ్రాసి ‘్ఠగూర్’ చిత్రానికి వ్రాసిన ‘నేను సైతం ప్రపంచాగ్నికి’ అనే గీతానికి జాతీయ స్థాయిలో పురస్కారం అందుకున్నారు. వరంగల్‌లో జన్మించిన చంద్రబోస్ వ్రాసిన వందలాది సినీ గీతాల్లో చిరస్మరణీయమైనది ‘వౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది’. వరంగల్ జిల్లాలో జన్మించిన అందెశ్రీ తెలంగాణ ఉద్యమ గీతాలను ‘జైబోలో తెలంగాణ’ వంటి చిత్రాల్లో ఉపయోగించుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించిన గోరటి వెంకన్న శ్రీరాములయ్య, పీపుల్స్‌వార్, బందూక్ వంటి చిత్రాలకు ఉత్తేజపూరితమైన గీతాలు వ్రాశారు. ఇంకా కందికొండ, యశ్‌పాల్, వరంగల్ శ్రీనివాస్, తైదల బాపు, గూడ అంజయ్య, ఎన్.కిశోర్, చిమ్మపూడి శ్రీరామమూర్తి వంటి పలువురు తెలంగాణ రచయితలు సినిమాల పరంగా అద్భుత సాహితీ సృష్టి చేస్తున్నారు. సంగీత సమారాధన హైదరాబాద్‌లో జన్మించిన శంకర్ (అసలు పేరు శంకర్‌సింగ్ రఘువంశీ) బొంబాయి వెళ్లి జైకిషన్‌తో జతకట్టి రాజ్‌కపూర్ ప్రోత్సాహంతో 1948లో ‘ఆగ్’ అనే హిందీ చిత్రానికి సంగీత దర్శకత్వం అందించారు. వరంగల్‌లో జన్మించిన చక్రి పలు చిత్రాలకు సంగీతం అందించి పిన్న వయసులోనే కీర్తిశేషులయ్యారు.
సినీ గ్రంథ రచయితలు
ఆలేరులో జన్మించిన ఎం.డి అబ్దుల్ ఆంధ్రభూమిలో చీఫ్ సబ్-ఎడిటర్‌గా పనిచేస్తూ కీలకమైన వెనె్నల అనుబంధాన్ని నిర్వహించడమేగాక, 2004 సంవత్సరానికి ఉత్తమ ఫిలిం క్రిటిక్‌గా నంది పురస్కారాన్ని అందుకున్నారు. నాగర్ కర్నూల్‌కు చెందిన హెచ్. రమేష్‌బాబు దాదా ఫాల్కే పురస్కార గ్రహీతలు, రఘుపతి వెంకయ్య పురస్కార గ్రహీతలు, నంది పురస్కార విజేతలు వంటి ప్రయోజనాత్మక గ్రంథాలతో బాటు ప్రముఖ దర్శకులు కె.వి.రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు జీవిత చరిత్రలను గ్రంథస్తం చేశారు. కరీంనగర్‌కు చెందిన వారాల ఆనంద్ నవ్యాంధ్ర చిత్ర వైతాళికులు, బాలల చిత్రాలు 24 ఫ్రేమ్స్, బంగారు తెలంగాణలో సినిమా వంటి విలువైన గ్రంథాలను వ్రాశారు. కరీంనగర్‌కు చెందిన మరో ఫిలిం జర్నలిస్టు పొన్నం ప్రభాకర్, తెలుగు సినిమా చరిత్రను సంక్షిప్తంగా నిక్షిప్తం చేసిన గ్రంథం ‘ప్రస్థానం’కు నంది పురస్కారాన్ని అందుకున్నారు.
వరంగల్‌లో జన్మించిన మామిడి హరికృష్ణ ప్రభుత్వ ఉద్యోగం సమర్థవంతంగా నిర్వహిస్తూనే జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రాలను క్షుణ్ణంగా ఆకళింపు చేసుకుని వందలాది సాధికార వ్యాసాలు పలు పత్రికలకు అందించి, ఉత్తమ సినీ విమర్శకునిగా నంది పురస్కారాలు అందుకున్నారు. అలాగే సీనియర్ జర్నలిస్ట్ చల్లా శ్రీనివాస్ కూడా నంది అవార్డును అందుకున్నవారిలోవున్నారు.
ప్రత్యేక అంశాలు
వర్తమాన కాలంలో నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ తెలంగాం ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా వ్యవహరిస్తూ సినిమాటోగ్రఫీ అమాత్యులు తలసాని శ్రీనివాస యాదవ్ గారికి చలనచిత్ర అభివృద్ధికి తగు పథకాలు సూచిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన వ్యక్తి నిర్మాత దిల్‌రాజు. వీరి అసలు పేరు వెంకట రమణారెడ్డి. 1970లో నార్సింగ్‌పల్లిలో జన్మించిన వీరు ఫిలిం డిస్ట్రిబ్యూటరీగా జీవితాన్ని ప్రారంభించి విజయాలు సాధించి నిర్మాతగా మారి ‘దిల్’ చిత్రాన్ని నిర్మించి విజయభేరి మోగించారు. ‘దిల్‌రాజు’గా ప్రాచుర్యం పొందారు. తెలంగాణలో జన్మించి సినీ వైభవానికి కృషి చేసి కీర్తిశేషులైన మహామహులకు నివాళులర్పిస్తూ... ఇంకా శ్రమిస్తున్న ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు.
మనవి: సమాచారం లభ్యంగాక ఎవరినైనా విస్మరిస్తే క్షంతవ్యుణ్ణి.

ఎస్.వి.రామారావు - ఫిలిం జర్నలిస్టుగా వందలాది వ్యాసాలు వ్రాశారు. సినీ చరిత్రకారునిగా 13 గ్రంథాలు వ్రాసి రెండుసార్లు నంది పురస్కారం అందుకున్నారు. వందలాది సినీ ఆధారిత టీవీ కార్యక్రమాలు రూపొందించారు. అసంఖ్యాక సినీ సంగీత విభావరులకు వ్యాఖ్యానం అందించిన వీరిని డా. సి.నారాయణరెడ్డి ‘సినీ విజ్ఞాన విశారద’ బిరుదుతో సత్కరించారు.

-ఎస్.వి.రామారావు