జ్ఞాపకాల నీడలో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెరవెనుక దాసరి
రచన: పసుపులేటి రామారావు
ప్రతులకు: నవోదయ బుక్‌హౌస్
ఆర్యసమాజ్ మందిర్ ఎదురుగా
కాచిగూడ, హైదరాబాద్
ఫోన్: 040- 24652387
సెల్: 9247471361
పేజీలు: 246, వెల: రూ.300/-
*
ఓ దృశ్యం పండాలంటే..ముందుగా సదరు దర్శకుడు తన మనోఫలకంపై దాన్ని చిత్రించుకోవాలి. పాత్రలు, వాటి స్థాయి బేధాలనూ విశే్లషించుకుంటూ కధానుగుణమైన రీతిలో సన్నివేశ చిత్రీకరణ చేయగలగాలి. అలాంటప్పుడే ఏ సన్నివేశమైనా, ఏ సినిమా అయినా పరిపూర్ణంగా పండుతుంది. ప్రేక్షకుల హృదయాల్లోనూ నిలిచిపోతుంది. అయితే ఇలాంటి దర్శకులు ఉన్నారా? ఉంటారా? ఒకేసారి అనేక సినిమాలు ఒప్పుకున్నప్పుడు అన్నింటికీ న్యాయం చేయగలిగే తీరిక, ఒపిక..అన్నింటికీ మించి తాను అనుకున్న రీతిలో సినిమాను తీయగలిగే పరిస్థితి వారికి ఉంటుందా? ఇలా అష్టావధానాలు చేయడం కొందరికే సాధ్యం..ఆ కొందరిలోనూ బహుకొద్ది కొందరి జాబితాలోకి వచ్చే వ్యక్తే దాసరి నారాయణ రావు. ఆ పేరు వింటే చాలు..పాతిక సంవత్సరాల తెలుగు సినిమా తిరిగిన మలుపులు కళ్లల్లో మెదులుతాయి. కథలో కొత్తదనం, పాత్రల్లో నవ్యత, చిత్రీకరణలో అసాధారణ ప్రజ్ఞాపాటవాలు దాసరి సొంతం. తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఎందరో..ఎందరెందరో దర్శకులు వచ్చారు. వారు తామెంచుకున్న సినిమాకో..లేదా కథకో పరిమితమయ్యేవారు. కానీ, దాసరిలాగా ‘మల్టీ టాస్కింగ్’ జోలికి వెళ్లేవారు కాదు. ఇక్కడే దాసరి గొప్పతనం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుంది. ఆయనకు కథే హీరో..నాయకుడు కాదు. కీలక భూమిక పోషించేది ఎన్టీయారా, ఏఎన్నారా, కృష్టా, శోభన్ బాబా, కృష్ణంరాజా లేదా రాజబాబా అన్నదానితో ఆయనకు నిమిత్తం లేదు. కథను నమ్ముకున్నారు. ఆ కథనే తాను అనుకున్న రీతిలో నడిపించారు. ఆ విధంగా ఎవరూ ఊహించని, ఎవరి ఊహకూ అందని చిత్రాలు సృష్టించారు. మొదట్లో దాసరిని పట్టించుకోని తెలుగు సినీ పరిశ్రమ ఆయన సంసారం సాగరంతో ఆయనలోని ప్రతిభను గుర్తించింది. దర్శకుడంటే ఇలాగే ఉండాలి..సినిమా అంటే ఇలాగే తీయాలి అన్న రీతిలో దాసరి తన అనంతర సినిమాల ద్వారా బలమైన, తిరుగులేని ముద్రే వేశారు. ఒకప్పుడు సినిమా చుట్టూ తిరిగిన ఆయన ఒకే ఒక్కడుగా సినిమానే తన చుట్టూ తిప్పుకున్నారు. అగ్ర నటులుసైతం దాసరి అడిగితే కాదనే పరిస్థితి కల్పించుకున్నారు. నాటి అగ్ర నటులందికీ దాసరి తిరుగులేని హిట్‌లను అందించారు. వారివారి కెరీర్‌లను మలుపుతిప్పే పాత్రలు తాను స్వయంగా సృష్టించి తెరపైనా రక్తికట్టించారు. ఒక ఒరవడిలో కొట్టుకు పోతున్న సినిమాను దారి మళ్లించి సాంఘికాల బాట పట్టించారు. జనజీవితాలనే ఇతివృత్తాలుగా మార్చుకుని ఎలా సినిమా తీయాలో..ఎలా సక్సెస్ సాధించాలో కూడా నిరూపించారు. అలాంటి దాసరి గురించి ఎంత చెప్పినా తక్కువే..తానే ఓ పరిశ్రమగా మారిన ఆయనతో సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్కరికీ ఎనలేని ఆత్మీయానుబంధం ఉంది. అది సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులతో కావచ్చు..పాత్రికేయులతో కావచ్చు. సినీ కార్మికులతో కావచ్చు. అందరికీ దాసరి తలలో నాలుకే. సినిమాకు కష్టం వచ్చినా..పరిశ్రమకు నష్టం వచ్చినా ముందుండి దాన్ని పరిష్కరించే వరకూ ఊరుకోని, ఊరుకోలేని నైజం దాసరిది. ఆయనతో పెద్ద నిర్మాతలూ సినిమా తీశారు. చిన్న నిర్మాతలూ తీశారు. నిర్మాత ఎవరన్నదానితో కాకుండా కథ ఎలాంటిదన్నదే దాసరి దర్శకత్వ ప్రతిభకు గీటురాయిగా ఉండేది. ఏ వ్యక్తయినా ఒకటి లేదా రెండు మహా అయితే మూడు రంగాల్లో నైపుణ్యం, ప్రావీణ్యం సంపాదించగలుగుతాడు. సృజనకు సంబంధించిన రంగాల్లో విశేషమైన ప్రతిభ ఉంటే తప్ప రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, పాటల రచయితగా రాణించడం, అందరినీ మెప్పించడం సాధ్యం కాదు. కానీ, దాసరి అసాధ్యుడని నిరూపించుకున్నారు. ఆయన గురించిన ఎన్నో ఎనె్నన్నో విషయాలను కూర్చి, ఆసక్తికరంగా మలిచి ‘తెరవెనుక దాసరి’ పేరుతో అందించిన ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి రామారావు చేసిన కృషి అభినందనీయం. కేవలం తన మాటలతోనే కాకుండా అందరి దృష్టిలో దాసరి అన్న ప్రయత్నం ఈ పుస్తక రచనలో కనిపిస్తుంది.

- బి.రాజేశ్వర ప్రసాద్