ఓ నవ్వుల యాత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచు విష్ణుతో ‘దేనికైనా రెడీ’, ‘ఈడోరకం ఆడోరకం’ చిత్రాల్ని తెరకెక్కించిన నాగేశ్వర్‌రెడ్డి మూడోసారి ‘ఆచారి అమెరికా యాత్ర’తో మన ముందుకు రానున్నారు. ఈ చిత్రం త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు జి.నాగేశ్వర్‌రెడ్డి ఈ సినిమా గురించి విషయాలు తెలియజేస్తూ..
ఆచారి యాత్ర..
ఆచారి ఓ పర్సన్ కోసమే అమెరికా వెళ్తాడు.. అదేమిటన్నది తెరపైనే చూడాలి.. ఒక మంచి కథని హాస్య ప్రధానంగా చెప్పే ప్రయత్నమే ఈ చిత్రం. థియేటర్‌కి వెళ్లిన ప్రేక్షకులకు ఒక నవ్వుల యాత్రలాగా వుంటుంది. మల్లాది వెంకట కృష్ణమూర్తి సినిమా కోసమే ఈ కథని రాశారు. దాసరి నారాయణరావు పాతికేళ్ల కిందట వాళ్ల వూళ్లో చూపిన ఒక పాత్రని తీసుకొని ఒక నవలలో రాశారు. ఆ పాత్ర ఆధారంగానే మల్లాది ఈ కథ రాశారు. అది నచ్చి నిర్మాత ఎం.ఎల్.కుమార్ చౌదరి నాకు చెప్పారు. మొదట ఈ కథ నేపథ్యం గురించి తెలిశాక చేయకూడదనుకున్నా. దేనికైనా రెడీ సమయంలో చాలా వివాదాలొచ్చాయి. అందుకే మళ్లీ బ్రాహ్మణుల నేపథ్యంలో సినిమా చేయడం ఎందుకనుకొన్నా. కానీ ఇది అలా ఉండదని చెప్పాకే సినిమా చేయాలని నిర్ణయించుకొన్నా. చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ సినిమా చేశాం.
విష్ణుతో బాగా కుదిరింది..
నాకూ, కామెడీకి మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. అలాగే విష్ణుకి, కామెడీకి మధ్య కూడా మంచి కెమిస్ట్రీ ఉంటుంది. ఈ కథ వినగానే విష్ణు, బ్రహ్మానందం అయితేనే బాగుంటుందనుకొన్నా. విష్ణు, బ్రహ్మానందం మొదలుకొని ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేశారు. రచయిత మల్లాదితో కలిసి పనిచేయడం నా అదృష్టం.
కామెడీ ముద్ర..
కామెడీపై పట్టున్న దర్శకుడనే గుర్తింపు నిజంగా అదృష్టంగా భావిస్తా. కామెడీ లేకుండా నేను సినిమా చేయను. ఇప్పుడు ఏ స్టార్ హీరో చూసినా కామెడీనే చేస్తున్నాను. స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశమొచ్చినా కామెడీకే పెద్ద పీట వేస్తూ సినిమా చేస్తా. అయితే చేసినవన్నీ సక్సెస్ అవుతాయని చెప్పలేం.. ఏ సినిమా చేసినా ఎంచుకొన్న కథ బాగుందా లేదా? నేను బాగా చెప్పానా లేదా? అనేదే ముఖ్యం. దర్శకుడిగా నేను ఏ సినిమా విషయంలోనూ నిరాశపడలేదు.
కామెడీ దర్శకులు..
యాక్షన్, హారర్, థ్రిల్లర్ అయినా, కుటుంబ నేపథ్యంలో సాగినా కామెడీ లేకుండా మాత్రం సినిమా ఉండదు. కాకపోతే పూర్తిస్థాయి కామెడీ సినిమాల సంఖ్యే తగ్గిపోతోంది. అందుకు దర్శకులు లేకపోవడమే కారణం అనుకోను. కథలు, దర్శకులు ఉన్నా, కామెడీ హీరోల సంఖ్యే తగ్గిపోతోంది. యువ కథానయకులంతా ప్రేమ కథలు, యాక్షన్ వైపు దృష్టి పెడుతున్నారు. దర్శకులు కూడా వాళ్ల శైలికి తగ్గట్టుగానే కథలు రాసుకుంటూ వాటిలోనే కామెడీని జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంతే.

- శ్రీనివాస్ ఆర్.రావ్